literacher award
-
అమెరికా కవయిత్రికి నోబెల్
స్టాక్‌హోమ్: ఈ ఏడాది సాహిత్యంలో నోబెల్ బహుమతి అమెరికా కవయిత్రి లూయిసీ గ్లుక్(77)కు దక్కింది. ‘ఎటువంటి దాపరికాలు, రాజీలేని గ్లుక్ తన కవితల్లో.. కుటుంబ జీవితంలోని కష్టానష్టాలను సైతం హాస్యం, చమత్కారం కలగలిపి చెప్పారు’అందుకే 2020 సంవత్సరానికి గాను సాహిత్యంలో నోబెల్ పురస్కారానికి ఎంపిక చేస్తున్నట్లు స్టాక్‌హోమ్‌లోని నోబెల్ అవార్డు కమిటీ గురువారం ప్రకటించింది. ‘హృద్యమైన, స్పష్టమైన ఆమె కవితా స్వరం వ్యక్తి ఉనికిని విశ్వవ్యాప్తం చేస్తుంది’అని స్వీడిష్ అకాడమీ శాశ్వత కార్యదర్శి మాట్స్ మామ్ పేర్కొన్నారు. 2006లో గ్లుక్ రచించిన ‘అవెర్నో’కవితా సంకలనం అత్యుత్తమమైందని నోబెల్ సాహిత్య కమిటీ చైర్మన్ ఆండెర్స్ ఒల్సన్ పేర్కొన్నారు. 1901 నుంచి సాహిత్యంలో ఇస్తున్న నోబెల్ బహుమతి ఎక్కువ మంది నవలా రచయితలనే వరించింది.. కాగా, గ్లుక్‌తో కలిపి ఇప్పటి వరకు 16 మంది మహిళలకు మాత్రమే ఈ గౌరవం దక్కింది. స్వీడిష్ అకాడమీ ఈ బహుమానం కింద గ్లుక్‌కు రూ.8.25 కోట్ల (10 మిలియన్ క్రోనార్లు)తోపాటు ప్రశంసా పత్రం అందజేయనుంది. చివరిసారిగా సాహిత్యంలో నోబెల్ గెలుచుకున్న అమెరికన్ బాబ్ డైలాన్(2016). హంగేరియన్–యూదు మూలాలున్న లూయిసీ గ్లుక్ 1943లో న్యూయార్క్‌లో జన్మించారు. కనెక్టికట్‌లోని యేల్ యూనివర్సిటీ ఫ్యాకల్టీగా గ్లుక్ పనిచేస్తున్నారు. ఆమె 1968లో ‘ఫస్ట్‌బోర్న్’ పేరుతో మొట్టమొదటి కవిత రాశారు. అతి తక్కువ కాలంలోనే సమకాలీన అమెరికా సాహిత్యంలో ప్రముఖ కవయిత్రిగా పేరు సంపాదించుకున్నారు. ఆరు దశాబ్దాల్లో డిసెండింగ్ ఫిగర్స్, ది ట్రయంఫ్ ఆఫ్ అచిల్స్, అరారట్ వంటి 12 కవితా సంకలనాలను, రెండు వ్యాస సంకలనాలను ఆమె రచించారు. వివాదాల్లో నోబెల్ ‘సాహిత్యం’ సాహిత్యంలో నోబెల్ బహుమతిని ఈసారి యూరప్, ఉత్తర అమెరికా వెలుపల ఆఫ్రికా, ఆసియా లేదా కరేబియన్ రచయితకు స్వీడిష్ అకాడమీ ప్రకటిస్తుందని చాలా మంది భావించినా అమెరికన్‌కే ప్రకటించింది. సాహిత్యంలో నోబెల్ బహుమతులపై ఇటీవల వివాదాలు, కుంభకోణాలు అలుముకోవడంతో పాటు పాశ్చాత్య దేశాలకే ప్రాధాన్యం ఇస్తున్నారనే విమర్శలు సైతం వెల్లువెత్తాయి. నోబెల్ ఎంపిక కమిటీపై 2018లో లైంగిక వేధింపుల ఆరోపణలు వెల్లువెత్తాయి. కొందరు సభ్యులు కమిటీ నుంచి వైదొలిగారు. దీంతో ఆ ఏడాది నోబెల్ సాహిత్యం పురస్కారాన్ని ప్రకటించలేదు. గత ఏడాది సాహిత్య నోబెల్ అవార్డుల ప్రకటన జరిగింది. 2018వ సంవత్సరానికి గాను పోలండ్‌కు చెందిన ఓల్గా టోకార్జక్‌కు, 2019కి ఆస్ట్రియా రచయిత్రి పీటర్ హాండ్కేకు అవార్డులు అందజేస్తున్నట్లు కమిటీ ప్రకటించింది. కానీ, హాండ్కే ఎంపికపై వివాదం తలెత్తింది. 1990లలో జరిగిన బాల్కన్ యుద్ధాల్లో హాండ్కే సెర్బుల మద్దతుదారుగా ఉన్నారని, సెర్బియా యుద్ధ నేరాలను హాడ్కే సమర్థించారని ఆరోపణలు ఉండటం ఇందుకు కారణం. అల్బేనియా, బోస్నియా, టర్కీ తదితర దేశాలు హాండ్కేకు బహుమతి ఇవ్వడాన్ని నిరసిస్తూ అవార్డుల కార్యక్రమాన్ని బహిష్కరించగా కమిటీ సభ్యుడు ఒకరు తన పదవికి రాజీనామా చేశారు. ఈ వివాదాల నేపథ్యంలో 2020 సాహిత్య నోబెల్ అవార్డు ప్రకటన కొంత ప్రాధాన్యం సంతరించుకుంది. లూయిసీకి దక్కిన పురస్కారాలు ► నేషనల్ హ్యుమానిటీ మెడల్(2015) ► అమెరికన్ అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ లెటర్స్ గోల్డ్ మెడల్ ► ‘ది వైల్డ్ ఐరిస్’కవితకు పులిట్జర్ ప్రైజ్(1993) ► ‘ఫెయిత్ఫుల్ అండ్ విర్చువస్ నైట్’ కవితకు నేషనల్ బుక్ అవార్డు(2014) ► 2003, 2004 సంవత్సరాల్లో ‘యూఎస్ పోయెట్ లారియేట్’ -
అమెరికన్ కవయిత్రికి సాహిత్యంలో నోబెల్
స్టాక్‌హోం : సాహిత్యంలో ప్రతిష్టాత్మక నోబెల్ బహుమతి ఈ ఏడాది అమెరికా కవయిత్రి లూయిస్ గ్లక్‌కు లభించింది. గ్లక్ తన అద్భుత సాహితీ గళంతో తన ఉనికిని విశ్వవ్యాప్తం చేశారని స్వీడిష్ అకాడమీ ఆమెను ప్రశంసించింది. గ్లక్ తన 1992 కలెక్షన్ ది వైల్డ్ ఐరిస్‌కు గాను ప్రతిష్టాత్మక పులిట్జర్ ప్రైజ్ సొంతం చేసుకోగా 2014లో నేషనల్ బుక్ అవార్డును దక్కించుకన్నారు. లూయిస్ గ్లక్ 1943లో న్యూయార్క్‌లో జన్మించారు. కనెక్టికట్ లోని యేల్ యూనివర్సిటీలో ఆంగ్ల ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. చిరుప్రాయంలోనే కవితలు రాసిన గ్లక్ ఆపై అమెరికాలో ప్రముఖ కవయిత్రిగా ఎదిగారు. కాగా, సాహిత్యంలో నోబెల్ బహుమతిని ఈసారి యూరప్, ఉత్తర అమెరికా వెలుపల ఆఫ్రికా, ఆసియా లేదా కరేబియన్ రచయితకు స్వీడిష్ అకాడమీ అందచేస్తుందని పలువురు భావించినా అమెరికన్ రచయిత్రికే ఈ ప్రతిష్టాత్మక పురస్కారం అందించింది. సాహిత్యంలో నోబెల్ బహుమతులపై ఇటీవల వివాదాలు, కుంభకోణాలు అలుముకోవడంతో పాటు పాశ్చాత్య దేశాలకే ప్రాధాన్యం ఇస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తాయి. ఇక 2018లో స్వీడిష్ అకాడమీని లైంగిక వేధింపుల ఆరోపణలు, ఆర్థిక అవకతవకల కుంభకోణాలు చుట్టుముట్టడంతో సాహిత్యంలో నోబెల్ బహుమతిని ప్రదానం చేయలేదు. ఆ మరుసటి ఏడాది పోలండ్ రచయిత ఓల్గా టకార్జక్కు సాహిత్య బహుమతిని అందించారు. చదవండి : నోబెల్ : నూట ఇరవై ఏళ్లలో నలుగురు -
అమితవ్ ఘోష్‌కు జ్ఞాన్‌పీఠ్
న్యూఢిల్లీ: సాహిత్య రంగంలో అత్యున్నత పురస్కారం జ్ఞాన్‌పీఠ్‌ను ఈ ఏడాదికి ప్రముఖ ఆంగ్ల రచయిత అమితవ్ ఘోష్ గెలుచుకున్నారు. ‘వినూత్న రచనలకు పేరొందిన అమితవ్ చారిత్రక విషయాలతో పాటు ఆధునిక యుగంలోని పరిస్థితుల్ని స్పృశించారు. గతాన్ని వర్తమానంతో అనుసంధానించారు’ అని జ్ఞాన్‌పీఠ్ అకాడమీ కొనియాడింది. ప్రముఖ సమకాలీన భారతీయ రచయితల్లో ఒకరైన అమితవ్‌కు షాడో లైన్స్, ది గ్లాస్ ప్యాలెస్, ది హంగ్రీ టైడ్ నవలలు మంచి పేరు తెచ్చాయి. బ్రిటిష్ పాలనలో భారత్, చైనాల మధ్య జరిగిన నల్లమందు వ్యాపార కాలక్రమాన్ని వివరిస్తూ సీ ఆఫ్ పాపీస్, రివర్ ఆఫ్ స్మోక్, ఫ్లడ్ ఆఫ్ ఫైర్ పేరిట వరుసగా మూడు నవలలు రాశారు. జ్ఞాన్‌పీఠ్‌కు ఎంపికవడాన్ని గొప్ప గౌరవంగా భావిస్తున్నానని అమితవ్ అన్నారు. 1956లో కోల్‌కతాలో జన్మించిన అమితవ్.. ఢిల్లీ, ఆక్స్ఫర్డ్, అలెగ్జాండ్రియాలో చదివారు. ఆయన చివరగా రాసిన పుస్తకం ‘ ది గ్రేట్ డిరేంజ్‌మెంట్: క్లైమేట్ చేంజ్ అండ్ అన్‌తింకబుల్’ 2016లో విడుదలైంది. గతంలో అమితవ్‌కు పద్మశ్రీ, సాహిత్య అకాడమీ అవార్డులు లభించాయి. -
'మార్క్' ఆఫ్ ఇండియా!
(త్రిపురనేని గోపీచంద్: 8 సెప్టెంబర్ 1910-2 నవంబర్ 1962- తండ్రి రామస్వామి నుంచి ప్రశ్నించడం నేర్చుకుని సమాధానాన్ని అన్వేషిస్తూ నదిలా అనేక రూపాలు సంతరించుకున్నాడు. హేతువాది, నాస్తికుడు, కమ్యూనిస్ట్, రాయిస్ట్, సోషలిస్ట్, ప్రవాహాలతో సంగమించి అరవిందుడి తాత్వికతలో లీనమైనారు. గోపీచంద్ సాహిత్య పురస్కారాన్ని మార్క్ టుల్లీ స్వీకరిస్తున్న సందర్భంగా-) 'తాము వాడుకునేందుకు ప్రకృతి ఉంది. ఎంత బాగా వాడుకోగలిగితే అంతగా సక్సెస్ అయినట్లు. తమకు ఉపయోగపడనిది ఎందుకూ పనికి రానిదే, అని భావిస్తారు పాశ్చాత్యులు. భారతీయుల దృష్టిలో ప్రకృతి, అమ్మ. తాము సంతానం. సమస్త ప్రాణుల్లో తామొక చిన్న అంశ. ఒక్క మాటలో: పాశ్చాత్యులకు ప్రకృతి భోగ వస్తువు. భారతీయులకు పూజనీయం' అంటారు సర్ విలియమ్ మార్క్ టుల్లీ, విఖ్యాత ఫొటోగ్రాఫర్ రఘురాయ్ పుస్తకానికి రాసిన ముందుమాటలో! ఢిల్లీ నుంచి బీబీసీ బ్యూరో చీఫ్‌గా పనిచేసిన మార్క్ టుల్లీ 'ఇండియా: ద రోడ్ ఎహేడ్'నాన్ స్టాప్ ఇండియా' 'ఇండియాస్ అనెండింగ్ జర్నీ' 'ద హార్ట్ ఆఫ్ ఇండియా' లాంటి పుస్తకాలు రచించారు. ఆయనను రెండు ప్రపంచాలూ గౌరవిస్తాయి. 'తనకు అంగీకారం కానప్పటికీ ఒక అభిప్రాయాన్ని సావధానంగా వినడం సంస్కారి లక్షణం' అన్న అరిస్టాటిల్ సూక్తికి సమకాలీన ప్రపంచంలో మార్క్ టుల్లీ ఒక ఉదాహరణ. అంతటి సంస్కారికి ఒక పదం అంటే ద్వేషం. ఏమిటది? పరదేశీ లేదా ప్రవాసి (ఎక్స్పాట్రియట్)! ఇంగ్లండ్‌లో ఇండియాలో తరచూ తనను 'పరదేశీ' అంటారని ఆయన నొచ్చుకుంటారు. ఇంతకీ ఆయనెవరు? ఈస్టిండియా కంపెనీ హయాంలో ఆయన ముత్తాత బ్రిటిష్ సైన్యంలో పనిచేశాడు. 1857లో భారత తొలి స్వాతంత్య్ర సంగ్రామం నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ నుంచి తప్పించుకుని, గంగాయాన్తో కోల్‌కతా చేరాడు. మాతామహుడు ఇప్పటి బంగ్లాదేశ్ ప్రాంతం నుంచి జనపనార తెచ్చి కోల్‌కతాలో అమ్మేవాడు. ఇండియాలో పుట్టిన తల్లిదండ్రులకు మార్క్ 1935లో టోలీగంజ్‌లో జన్మించాడు. ఆ గ్రామం తర్వాత కోల్‌కతాలో కలసిపోయింది. తన నానమ్మ బెంగాలీ డ్రైవర్‌తో కూడా మాట్లాడనిచ్చేది కాదు. బెంగాలీ సేవకుల భాష అనేది. అప్పట్లో యూరోపియన్ సొసైటీ క్లాస్ సిస్టమ్‌తో విడిపోయి ఉండేది. ఐసీఎస్ అధికారులు బ్రాహ్మణుల్లా ఉన్నతులు. సైన్యంలో పనిచేసేవారు క్షత్రియుల వలె ద్వితీయులు. టుల్లీ కుటుంబం వైశ్యుల వలె తృతీయులు. పదవ ఏట ఇంగ్లండ్ వెళ్లాడు. అక్కడ చదువుకుని, ప్రీస్ట్ అవుదామనుకుని, కాలేక, బీబీసీ కరస్పాండెంట్‌గా తాను పుట్టిన కోల్‌కతాకు వచ్చాడు. ఆ తర్వాత ఢిల్లీకి. అలా భారత దర్శనం మొదలైంది. ఇండియాలో పుట్టి పెరిగిన వ్యక్తిగానే కాదు ఇండియా గురించి కాదనలేని రీతిలో చెప్పగలిగిన ఇండియన్‌గా ప్రపంచం ఆయనను గౌరవిస్తుంది. ఇండియాతో ఆయన సంబంధం 50 ఏండ్లకు పైగా. అల్లుడు భారతీయుడు. కోడలు భారతీయురాలు. బెంగాలీ, హిందీలో మాట్లాడే అసంఖ్యాక స్నేహితులు అతని సంపద. బి.బి.సి పాలసీలో మార్పును తెచ్చినప్పుడు టుల్లీ వ్యతిరేకించాడు. వార్తల గురించి మార్కెటింగ్ నిపుణులు, వ్యూహకర్తలు నిర్ణయాలు తీసుకోవడం సబబు కాదన్నారు. ఎవరు వింటారు? ఇంగ్లండ్ అమెరికా కౌగిలిలోకి పోతోందని, ఫ్రాన్స్ వలె తన సామాజిక, సాంస్కృతిక ప్రత్యేకతలను నిలుపుకోలేకపోతోందని, ఇండియాలో సైతం ఆ ధోరణులు కన్పిస్తున్నాయని చెబుతారు. పాదముద్రలు లేని దారులు, కార్లు చెత్తచెత్తగా నిండిన నగరాలు, పూర్వస్మృతులను సమాధిచేసి వెలసే భవనాలు చూస్తే విచారం వేస్తుందంటారు. తన చిన్నతనంలో రెండు విడిపోయిన జాతులను చూశానని, ఇప్పుడు ఈ రెండు జాతుల మధ్య స్నేహం పెంచడమే తన బాధ్యత అంటాడు మార్క్‌టుల్లీ. పున్నా కృష్ణమూర్తి ఇండిపెండెంట్ జర్నలిస్ట్; 7680950863