స్టాక్‌హోం : సాహిత్యంలో ప్రతిష్టాత్మక నోబెల్ బహుమతి ఈ ఏడాది అమెరికా కవయిత్రి లూయిస్ గ్లక్‌కు లభించింది. గ్లక్ తన అద్భుత సాహితీ గళంతో తన ఉనికిని విశ్వవ్యాప్తం చేశారని స్వీడిష్ అకాడమీ ఆమెను ప్రశంసించింది. గ్లక్ తన 1992 కలెక్షన్ ది వైల్డ్ ఐరిస్‌కు గాను ప్రతిష్టాత్మక పులిట్జర్ ప్రైజ్ సొంతం చేసుకోగా 2014లో నేషనల్ బుక్ అవార్డును దక్కించుకన్నారు. లూయిస్ గ్లక్ 1943లో న్యూయార్క్‌లో జన్మించారు. కనెక్టికట్ లోని యేల్ యూనివర్సిటీలో ఆంగ్ల ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. చిరుప్రాయంలోనే కవితలు రాసిన గ్లక్ ఆపై అమెరికాలో ప్రముఖ కవయిత్రిగా ఎదిగారు.
కాగా, సాహిత్యంలో నోబెల్ బహుమతిని ఈసారి యూరప్, ఉత్తర అమెరికా వెలుపల ఆఫ్రికా, ఆసియా లేదా కరేబియన్ రచయితకు స్వీడిష్ అకాడమీ అందచేస్తుందని పలువురు భావించినా అమెరికన్ రచయిత్రికే ఈ ప్రతిష్టాత్మక పురస్కారం అందించింది. సాహిత్యంలో నోబెల్ బహుమతులపై ఇటీవల వివాదాలు, కుంభకోణాలు అలుముకోవడంతో పాటు పాశ్చాత్య దేశాలకే ప్రాధాన్యం ఇస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తాయి. ఇక 2018లో స్వీడిష్ అకాడమీని లైంగిక వేధింపుల ఆరోపణలు, ఆర్థిక అవకతవకల కుంభకోణాలు చుట్టుముట్టడంతో సాహిత్యంలో నోబెల్ బహుమతిని ప్రదానం చేయలేదు. ఆ మరుసటి ఏడాది పోలండ్ రచయిత ఓల్గా టకార్జక్‌కు సాహిత్య బహుమతిని అందించారు. చదవండి : నోబెల్ : నూట ఇరవై ఏళ్లలో నలుగురు
Comments
Please login to add a commentAdd a comment