Stock Home
-
అమెరికా కవయిత్రికి నోబెల్
స్టాక్‌హోమ్: ఈ ఏడాది సాహిత్యంలో నోబెల్ బహుమతి అమెరికా కవయిత్రి లూయిసీ గ్లుక్(77)కు దక్కింది. ‘ఎటువంటి దాపరికాలు, రాజీలేని గ్లుక్ తన కవితల్లో.. కుటుంబ జీవితంలోని కష్టానష్టాలను సైతం హాస్యం, చమత్కారం కలగలిపి చెప్పారు’అందుకే 2020 సంవత్సరానికి గాను సాహిత్యంలో నోబెల్ పురస్కారానికి ఎంపిక చేస్తున్నట్లు స్టాక్‌హోమ్‌లోని నోబెల్ అవార్డు కమిటీ గురువారం ప్రకటించింది. ‘హృద్యమైన, స్పష్టమైన ఆమె కవితా స్వరం వ్యక్తి ఉనికిని విశ్వవ్యాప్తం చేస్తుంది’అని స్వీడిష్ అకాడమీ శాశ్వత కార్యదర్శి మాట్స్ మామ్ పేర్కొన్నారు. 2006లో గ్లుక్ రచించిన ‘అవెర్నో’కవితా సంకలనం అత్యుత్తమమైందని నోబెల్ సాహిత్య కమిటీ చైర్మన్ ఆండెర్స్ ఒల్సన్ పేర్కొన్నారు. 1901 నుంచి సాహిత్యంలో ఇస్తున్న నోబెల్ బహుమతి ఎక్కువ మంది నవలా రచయితలనే వరించింది.. కాగా, గ్లుక్‌తో కలిపి ఇప్పటి వరకు 16 మంది మహిళలకు మాత్రమే ఈ గౌరవం దక్కింది. స్వీడిష్ అకాడమీ ఈ బహుమానం కింద గ్లుక్‌కు రూ.8.25 కోట్ల (10 మిలియన్ క్రోనార్లు)తోపాటు ప్రశంసా పత్రం అందజేయనుంది. చివరిసారిగా సాహిత్యంలో నోబెల్ గెలుచుకున్న అమెరికన్ బాబ్ డైలాన్(2016). హంగేరియన్–యూదు మూలాలున్న లూయిసీ గ్లుక్ 1943లో న్యూయార్క్‌లో జన్మించారు. కనెక్టికట్‌లోని యేల్ యూనివర్సిటీ ఫ్యాకల్టీగా గ్లుక్ పనిచేస్తున్నారు. ఆమె 1968లో ‘ఫస్ట్‌బోర్న్’ పేరుతో మొట్టమొదటి కవిత రాశారు. అతి తక్కువ కాలంలోనే సమకాలీన అమెరికా సాహిత్యంలో ప్రముఖ కవయిత్రిగా పేరు సంపాదించుకున్నారు. ఆరు దశాబ్దాల్లో డిసెండింగ్ ఫిగర్స్, ది ట్రయంఫ్ ఆఫ్ అచిల్స్, అరారట్ వంటి 12 కవితా సంకలనాలను, రెండు వ్యాస సంకలనాలను ఆమె రచించారు. వివాదాల్లో నోబెల్ ‘సాహిత్యం’ సాహిత్యంలో నోబెల్ బహుమతిని ఈసారి యూరప్, ఉత్తర అమెరికా వెలుపల ఆఫ్రికా, ఆసియా లేదా కరేబియన్ రచయితకు స్వీడిష్ అకాడమీ ప్రకటిస్తుందని చాలా మంది భావించినా అమెరికన్‌కే ప్రకటించింది. సాహిత్యంలో నోబెల్ బహుమతులపై ఇటీవల వివాదాలు, కుంభకోణాలు అలుముకోవడంతో పాటు పాశ్చాత్య దేశాలకే ప్రాధాన్యం ఇస్తున్నారనే విమర్శలు సైతం వెల్లువెత్తాయి. నోబెల్ ఎంపిక కమిటీపై 2018లో లైంగిక వేధింపుల ఆరోపణలు వెల్లువెత్తాయి. కొందరు సభ్యులు కమిటీ నుంచి వైదొలిగారు. దీంతో ఆ ఏడాది నోబెల్ సాహిత్యం పురస్కారాన్ని ప్రకటించలేదు. గత ఏడాది సాహిత్య నోబెల్ అవార్డుల ప్రకటన జరిగింది. 2018వ సంవత్సరానికి గాను పోలండ్‌కు చెందిన ఓల్గా టోకార్జక్‌కు, 2019కి ఆస్ట్రియా రచయిత్రి పీటర్ హాండ్కేకు అవార్డులు అందజేస్తున్నట్లు కమిటీ ప్రకటించింది. కానీ, హాండ్కే ఎంపికపై వివాదం తలెత్తింది. 1990లలో జరిగిన బాల్కన్ యుద్ధాల్లో హాండ్కే సెర్బుల మద్దతుదారుగా ఉన్నారని, సెర్బియా యుద్ధ నేరాలను హాడ్కే సమర్థించారని ఆరోపణలు ఉండటం ఇందుకు కారణం. అల్బేనియా, బోస్నియా, టర్కీ తదితర దేశాలు హాండ్కేకు బహుమతి ఇవ్వడాన్ని నిరసిస్తూ అవార్డుల కార్యక్రమాన్ని బహిష్కరించగా కమిటీ సభ్యుడు ఒకరు తన పదవికి రాజీనామా చేశారు. ఈ వివాదాల నేపథ్యంలో 2020 సాహిత్య నోబెల్ అవార్డు ప్రకటన కొంత ప్రాధాన్యం సంతరించుకుంది. లూయిసీకి దక్కిన పురస్కారాలు ► నేషనల్ హ్యుమానిటీ మెడల్(2015) ► అమెరికన్ అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ లెటర్స్ గోల్డ్ మెడల్ ► ‘ది వైల్డ్ ఐరిస్’కవితకు పులిట్జర్ ప్రైజ్(1993) ► ‘ఫెయిత్ఫుల్ అండ్ విర్చువస్ నైట్’ కవితకు నేషనల్ బుక్ అవార్డు(2014) ► 2003, 2004 సంవత్సరాల్లో ‘యూఎస్ పోయెట్ లారియేట్’ -
జన్యు కత్తెరకు నోబెల్
స్టాక్‌హోమ్: జన్యువులను మనకు అవసరమైన రీతిలో కచ్చితంగా కత్తిరించేందుకు ఓ పద్ధతి(జెనెటిక్ సిజర్స్)ని ఆవిష్కరించిన ఫ్రాన్స్ శాస్త్రవేత్త ఎమ్మాన్యుల్ షార్పెంటైర్ (51), అమెరికన్ శాస్త్రవేత్త జెన్నిఫర్ ఏ డౌడ్నా (56)లకు ఈ ఏడాది రసాయన శాస్త్ర నోబెల్ బహుమతి దక్కింది. రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ బుధవారం స్టాక్‌హోమ్‌లో ఈ విషయాన్ని ప్రకటించింది. జన్యు సంబంధి త వ్యాధుల చికిత్సతోపాటు అనేక ఇతర ప్రయోజనాలు కలిగిన ఈ పద్ధతిని క్రిస్పర్ క్యాస్–9 అని పిలుస్తారు. ‘ఈ జన్యు ఆధారిత పరిజ్ఞానం మౌలిక శాస్త్ర పరిజ్ఞానంలో విప్లవాత్మక మార్పులు తీసుకు రావడమే కాకుండా సరికొత్త చికిత్సలు, అనూహ్యమైన పంటలను అందుబాటులోకి తీసుకురానుందని క్రిస్పర్ క్యాస్–9 గురించి రసాయన శాస్త్ర నోబెల్ కమిటీ అధ్యక్షులు క్లేస్ గుస్తాఫ్సన్ తెలిపారు. షార్పెంటైర్, డౌడ్నాల పరిశోధనల ఫలితంగా జన్యుక్రమంలోని లోపాలను సులువుగా సరిదిద్దవచ్చునని, అయితే ఈ టెక్నాలజీని చాలా జాగరుకతతో ఉపయోగించాల్సి ఉంటుందని హెచ్చరించారు. అవార్డులో భాగంగా ఒక బంగారు పతకం, కోటి క్రోనార్లు (రూ.8.23 కోట్లు) నగదు అందిస్తారు. స్వీడన్‌కు చెందిన ప్రఖ్యాత శాస్త్రవేత్త ఆల్ఫ్రెడ్ నోబెల్ 124 ఏళ్ల క్రితం ఈ అవార్డును ఏర్పాటు చేశారు. అవార్డు ప్రకటించిన సందర్భంగా ఎమ్మాన్యుల్ షార్పెంటైర్ బెర్లిన్ నుంచి ఫోన్ ద్వారా మాట్లాడుతూ ‘‘ఇది చాలా ఉద్వేగభరితమైన క్షణం’’అని వ్యాఖ్యానించారు. క్రిస్పర్ క్యాస్–9 కథ ఇదీ... పరిణామ క్రమంలో వైరస్ల దాడి నుంచి రక్షించుకునేందుకు బ్యాక్టీరియా ఓ శక్తిమంతమైన పరిజ్ఞానాన్ని తన సొంతం చేసుకుంది. దీన్నే క్రిస్పర్ అని పిలుస్తారు. వైరస్ దాడి చేసినప్పుడు దాన్ని జన్యుక్రమంలో బాగా గుర్తించగలిగే కొంత భాగాన్ని బ్యాక్టీరియా తనలో నిక్షిప్తం చేసుకుంటుంది. భవిష్యత్తులో అదే వైరస్ మళ్లీ దాడి చేస్తే.. ఈ ‘మెమరీ కార్డు’ సాయంతో గుర్తించేందుకన్నమాట. ఒకసారి గుర్తించిందనుకోండి.. తనలోని మెమరీ కార్డుకు ఓ ఎంజైమ్ (క్యాస్ 9)ను జత చేసి కొత్తగా దాడి చేసిన వైరస్‌పైకి ప్రయోగిస్తుంది. ఇది కాస్తా... వైరస్ జన్యుక్రమంలోకి చేరిపోవడమే కాకుండా.. దాన్ని ముక్కలుగా కత్తిరిస్తుంది. మనిషికి విపరీతమైన హాని కలిగించే స్ట్రెప్టోకాకస్ పయోజీన్స్ బ్యాక్టీరియాపై పరిశోధనలు చేస్తున్న క్రమంలో ఎమ్మాన్యుల్ షార్పెంటైర్ అందులో అప్పటివరకూ గుర్తించని ఓ అణువు ఉన్నట్లు గుర్తించారు. ఈ ట్రాకర్‌ఆర్‌ఎన్‌ఏ పురాతన బ్యాక్టీరియా రోగ నిరోధక వ్యవస్థలో భాగమని తెలిసింది. దీనిపై 2011లో షార్పెంటైర్ తన పరిశోధన పత్రాన్ని సమర్పించారు. అదే ఏడాది ఆర్ఎన్ఏపై అనుభవమున్న జెన్నిఫర్‌తో కలిసి పరిశోధనలు చేపట్టారు. ఇరువురూ ఆ ప్రక్రియను కృత్రిమంగా అభివృద్ధి చేసే ప్రయత్నం చేసి విజయం సాధించారు. సులువుగా పనిచేసేలా, ఏ రకమైన జన్యుపదార్థంతోనైనా పనిచేసేలా మార్చారు. అవసరమైతే మనుషులతోపాటు జంతువులు, మొక్కల జన్యువుల్లోనూ మార్పులు చేసేలా అన్నమాట. డీఎన్ఏ పోగులను అవసరమైనట్లుగా కత్తిరించడంతోపాటు జోడించే శక్తినీ ఈ పద్ధతికి వీరు చేర్చారు. 2012లో క్రిస్పర్ క్యాస్–9 పద్ధతిని ఈ ఇద్దరు శాస్త్రవేత్తలు ఆవిష్కరించగా.. శాస్త్రవేత్తలు ఇప్పటికే దీనిద్వారా ఎన్నో అద్భుతమైన ఫలితాలు రాబట్టగలిగారు. ప్రయోజనాలు ఇవీ... ► ఎయిడ్స్ తదితర వ్యాధులకు కారణమైన జన్యువులను సులువుగా తొలగించేందుకు ఈ క్రిస్పర్‌క్యాస్–9 ఉపయోగపడుతుంది. ► మలేరియా వంటి వ్యాధులను నిరోధించగల జన్యువులను దోమల్లోకి ప్రవేశపెట్టడం ద్వారా వ్యాధుల వ్యాప్తిని అడ్డుకోవచ్చు. ► చైనాలో పాడిపశువుల్లో కండరాలు, వెంట్రుకల ఎదుగుదలను నిరోధించే జన్యువులను క్రిస్పర్ టెక్నాలజీ ద్వారా తొలగించి ఎక్కువ మాంసం, బొచ్చు పెరిగే గొర్రెలను అభివృద్ధి చేశారు. ► కేన్సర్‌కు సరికొత్త చికిత్స కల్పించేందుకు క్రిస్పర్ క్యాస్–9 పరిజ్ఞానాన్ని వాడుకునే ప్రయత్నం జరుగుతోంది. రోగ నిరోధక వ్యవస్థ తాలూకూ కణాల్లో మార్పులు చేయడం ద్వారా అవి కేన్సర్ కణాలను మరింత సమర్థంగా గుర్తించడంతోపాటు, నాశనం చేసేలా చేసేందుకు పరిశోధనలు జరుగుతున్నాయి. ► కరవు కాటకాలను, చీడపీడలను తట్టుకోగల సరికొత్త వంగడాల సృష్టికి క్రిస్పర్ క్యాస్–9 బాగా ఉపయోగపడుతుంది. ► ఒక రకమైన ఈస్ట్‌లో జన్యుపరమైన మార్పులు చేసి అవి చక్కెరలను హైడ్రోకార్బన్లుగా మార్చేలా చేయవచ్చు. ఈ హైడ్రోకార్బన్లతో ప్లాస్టిక్‌ను తయారు చేయవచ్చు. ► మానవ జన్యుక్రమాల్లోనూ మార్పులు చేసేందుకు ఈ టెక్నాలజీని వాడుకునే అవకాశం ఉన్నప్పటికీ దీనిపై పలు దేశాల్లో నిషేధం కొనసాగుతోంది. యూకేలో మానవ పిండాలపై మాత్రమే ప్రయోగాలు చేయవచ్చు. -
‘ఆప్టికల్ లేజర్’కు నోబెల్
స్టాక్‌హోం: ఆప్టికల్ లేజర్లపై కీలక పరిశోధనలు చేసి కంటి శస్త్రచికిత్సల్లో అధునాతన పరికరాలను ఉపయోగించేందుకు దోహదపడిన ముగ్గురు శాస్త్రవేత్తలకు ఈ ఏడాది నోబెల్ భౌతికశాస్త్ర బహుమతి దక్కింది. అమెరికా శాస్త్రజ్ఞుడు ఆర్థర్ ఆష్కిన్ (96), ఫ్రాన్స్‌కు చెందిన జెరార్డ్ మోరో (74), కెనడా శాస్త్రజ్ఞురాలు డొనా స్ట్రిక్లాండ్ (59)లను ఈ ఏడాది నోబెల్ భౌతిక శాస్త్ర బహుమతికి ఎంపిక చేసినట్లు రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ మంగళవారం ప్రకటించింది. భౌతిక శాస్త్ర నోబెల్‌ను తొలిసారిగా 1901లో ప్రవేశపెట్టగా అప్పటి నుంచి ఈ బహుమతి అందుకున్న మూడో మహిళ, 55 ఏళ్లలో తొలి మహిళ డొనా స్ట్రిక్లాండ్ కావడం విశేషం. అలాగే నోబెల్ బహుమతి పొందిన అత్యంత పెద్ద వయస్కుడిగా ఆర్థర్ ఆష్కిన్ నిలవడం మరో విశేషం. 2007లో అమెరికా ఆర్థికవేత్త లియోనిడ్ హర్విచ్ తనకు 90 ఏళ్ల వయ సులో నోబెల్ పొందగా, ఆర్థర్ ఆష్కిన్ 96 ఏళ్ల వయసులో నోబెల్ గెలుచుకుని రికార్డు నమో దు చేశారు. నోబెల్ బహుమతి మొత్తం విలువ 1.01 మిలియన్ డాలర్లు కాగా, ఇందులో సగాన్ని ఆర్థర్ ఆష్కిన్‌కు, మిగిలిన సగాన్ని మళ్లీ రెండు సమ భాగాలుగా చేసి జెరార్డ్ మోరో, డొనా స్ట్రిక్లాండ్లకు ఇవ్వనున్నారు. ఆప్టికల్ ట్వీజర్ల తయారీకి తగిన గుర్తింపు సూక్ష్మ క్రిములు, అణువులు, పరమాణువులు, ఇతర జీవించి ఉన్న కణాలను లేజర్ బీమ్‌లను ఉపయోగించి పట్టుకునే ఆప్టికల్ ట్వీజర్ల (పట్టుకారు వంటివి)ను తయారుచేసినందుకు ఆర్థర్ ఆష్కిన్‌కు ఈ గౌరవం దక్కింది. ఈ ట్వీజర్ల సాయంతో కాంతి ధార్మిక పీడనాన్ని ఉపయోగించి భౌతిక పదార్థాలను ఆయన కదల్చగలిగారని అకాడమీ తెలిపింది. ఆష్కిన్ 1952 నుంచి 1991 మధ్య కాలంలో అమెరికాలోని ఏటీ అండ్ టీ బెల్ ల్యాబొరేటరీస్‌లో పనిచేస్తున్న కాలంలోనే 1987లో సూక్ష్మజీవులకు హాని చేయకుండానే వాటిని పట్టుకునే ట్వీజర్లను కనుగొన్నారు. ఈ ఆవిష్కరణకుగాను ఆయనకు నోబెల్ ఇస్తున్నట్లు అకాడమీ తెలిపింది. 1991లో పదవీ విరమణ పొందిన ఆష్కిన్, అప్పటి నుంచి తన ఇంట్లోని ప్రయోగశాలలోనే జీవితం గడుపుతున్నారు. మరోవైపు అత్యంత చిన్న ఆప్టికల్ పల్స్‌లను ఉత్పత్తి చేసే విధానాన్ని అభివృద్ధి చేసినందుకు జెరార్డ్ మోరో, డొనా స్ట్రిక్లాండ్లకు నోబెల్ లభించింది. మోరోకు ఫ్రాన్స్‌లోని ఎకోల్ పాలిటెక్నిక్‌తోపాటు అమెరికాలోని మిషిగన్ విశ్వవిద్యాలయంతో అనుబంధం ఉండ గా, డొనా స్ట్రిక్‌ల్యాండ్ ఆయన విద్యార్థినే. ప్రస్తు తం ఆమె కెనడాలోని వాటర్లూ విశ్వవిద్యాలయంలో అధ్యాపకురాలిగా పనిచేస్తున్నారు. వీరు ఉత్పత్తి చేసిన ఆప్టికల్ పల్స్ అత్యంత చిన్నవి, సమర్థవంతమైనవని జ్యూరీ పేర్కొంది. మహిళలు చాలా అరుదు: డొనా స్ట్రిక్లాండ్ నోబెల్ బహుమతిని ప్రకటించిన అనంతరం డొనా అకాడమీతో ఫోన్లో మాట్లాడారు. స్త్రీలకు పెద్దగా దక్కని అవార్డును తాను అందుకోవటం తనను పులకరింపజేస్తోందని ఆమె అన్నారు. ‘మహిళా భౌతిక శాస్త్రవేత్తలు చాలా తక్కువగా ఉన్నారు. కాబట్టి వారు చాలా ప్రత్యేకం. అలాంటి వారిలో నేనొకరిని అయినందుకు గర్వంగా ఉంది’ అంటూ స్ట్రిక్లాండ్ ఆనందం వ్యక్తం చేశారు. స్ట్రిక్లాండ్ కన్నా ముందు 1903లో మేడం క్యూరీకి, 1963లో మరియా గోప్పెర్ట్ మాయెర్కు మాత్రమే భౌతిక శాస్త్ర నోబెల్ బహుమతి దక్కింది. అంటే భౌతిక శాస్త్రంలో నోబెల్ అందుకున్న మూడో మహిళ. మహిళా శాస్త్రవేత్తలకు నోబెల్ బహుమతులు తక్కువగా వస్తుండటంపై అకాడమీ గతంలోనే విచారం వ్యక్తం చేసింది. తామేమీ పురుషుల పట్ల పక్షపాతంతో వ్యవహరించడం లేదనీ, క్షేత్రస్థాయిలో ప్రయోగశాలల తలుపులు మహిళలకు చాలా చోట్ల మూసుకుపోయాయని గతంలో వ్యాఖ్యానించింది. -
బ్రేక్ అనుకుని ఎక్సిలేటర్ పై కాలు.. అంతలో!
స్టాక్‌హోం: కారు నడుపుతున్న మహిళ పొరపాటున బ్రేక్ అనుకుని ఎక్సిలేటర్పై కాలువేయటంతో వేగం పుంజుకుంది. దీంతో ఆ కారు హెల్త్ సెంటర్ లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఓ వృద్ధురాలు చనిపోగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి. స్వీడన్ రాజధాని స్టాక్హోంమ్లో ఈ ఘటన చోటుచేసుకుంది. వార్డ్సెంట్రల్ హొగ్దాలెన్ హెల్త్ సెంటర్ వద్దకు కారులో వచ్చిన మహిళ(80) బ్రేక్ వేయాలనుకుని ఎక్సిలేటర్పై కాలు వేసింది. లోపల ఉన్న 90 ఏళ్ల వృద్ధురాలు తీవ్రంగా గాయపడింది. ఈ ఘటనలో భవనం అద్దాలు ధ్వంసమయ్యాయి. క్షతగాత్రురాలిని వెంటనే హెలికాప్టర్లో ఆస్పత్రికి తరలించారు. అయితే, ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. మిగతా ఇద్దరు కూడా చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన వెనుక ఎలాంటి కుట్రా లేదని పోలీసులు వివరించారు. ఏప్రిల్ 7 వ తేదీన ఓ వ్యక్తి తన ట్రక్‌ను జనాలపైకి నడపటంతో ఐదుగురు చనిపోగా 14 మంది గాయపడ్డారు. ఈ ప్రమాదం వెనుక ముస్లిం తీవ్రవాదుల హస్తం ఉందని తేలింది. అప్పటి నుంచి ఎలాంటి ప్రమాదం జరిగినా తీవ్రవాద హస్తం ఉంటుందని ప్రజలు భయపడుతున్నారు. -
అభివృద్ధి అసమానం
స్టాక్‌హోం: గత పాతికేళ్లలో మానవుడు పలు రంగాల్లో ఎంతో పురోగతి సాధించినా శరణార్థులు, వలసదారులు, మహిళలు ఇంకా వెనకబడి ఉన్నారని ఐక్యరాజ్య సమితి నివేదిక ఒకటి పేర్కొంది. ‘ప్రజలు ఇప్పుడు సుదీర్ఘ కాలం జీవిస్తున్నారు. చాలా మందికి కనీస వసతులన్నీ అందుబాటులోకి వచ్చాయి. అయినా మానవాభివృద్ధి అసమానంగా ఉంది’ అని స్టాక్‌హోంలో విడదలైన ఐరాస అభివృద్ధి కార్యక్రమం(యూఎన్డీపీ) నివేదిక నిగ్గుతేల్చింది. 1990–2015 మధ్య ప్రపంచ జనాభా 200 కోట్లు పెరిగిందని, 100 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని వెల్లడించింది. 210 కోట్ల మందికి మెరుగైన పారిశుద్ధ్యం అందుబాటులోకి వచ్చిందని, 260 కోట్ల మంది సురక్షిత నీటిని పొందుతున్నారని తెలిపింది. 1 శాతం జనాభా చేతిలోనే 46 శాతం సంపద ఉందని పేర్కొంది. -
అద్దం లాంటి కలప
గ్లాస్ ఉడ్ అద్దంలాంటి కలప అంటే నున్నగా పాలిష్ చేసిన కలప అనుకుంటే పొరబడ్డట్లే! ఎంత నున్నగా పాలిష్ చేసినా భౌతిక ధర్మాల రీత్యా కలప అపారదర్శకంగానే ఉంటుంది. అలాగే అద్దం తయారీకి ముడిపదార్థమైన గాజు పారదర్శకంగా ఉంటుంది. స్విస్ శాస్త్రవేత్తలు ఈ భౌతికధర్మాలను తోసిరాజని పారదర్శకమైన కలపకు విజయవంతంగా రూపకల్పన చేశారు. స్టాక్‌హోమ్‌లోని కె.టి.హెచ్.రాయల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన శాస్త్రవేత్తలు ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. తాము రూపొందించిన పారదర్శక కలపను సోలార్ బ్యాటరీల తయారీకి కూడా భేషుగ్గా వినియోగించుకోవచ్చని వారు చెబుతున్నారు. కలపలో ఉండే ‘లినైన్’ అనే పదార్థాన్ని తొలగించి, దానికి యాక్రిలిక్ను జోడించి పారదర్శక కలపను తయారు చేసినట్లు కె.టి.హెచ్.రాయల్ ఇన్స్టిట్యూట్ ప్రొఫెసర్ లార్స్ బెర్గ్లండ్ వివరించారు. పారదర్శకమైన కలపను తక్కువ ఖర్చుతోనే తయారు చేయవచ్చని కూడా ఆయన చెప్పారు. ఇదే గనుక మార్కెట్లో అందుబాటులోకి వస్తే కిటికీలు, తలుపుల అద్దాల స్థానాన్ని పారదర్శక కలప ఆక్రమించగలదని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.