ఫైల్ ఫోటో
స్టాక్‌హోం: కారు నడుపుతున్న మహిళ పొరపాటున బ్రేక్ అనుకుని ఎక్సిలేటర్పై కాలువేయటంతో వేగం పుంజుకుంది. దీంతో ఆ కారు హెల్త్ సెంటర్ లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఓ వృద్ధురాలు చనిపోగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి. స్వీడన్ రాజధాని స్టాక్హోంమ్లో ఈ ఘటన చోటుచేసుకుంది. వార్డ్సెంట్రల్ హొగ్దాలెన్ హెల్త్ సెంటర్ వద్దకు కారులో వచ్చిన మహిళ(80) బ్రేక్ వేయాలనుకుని ఎక్సిలేటర్పై కాలు వేసింది.
లోపల ఉన్న 90 ఏళ్ల వృద్ధురాలు తీవ్రంగా గాయపడింది. ఈ ఘటనలో భవనం అద్దాలు ధ్వంసమయ్యాయి. క్షతగాత్రురాలిని వెంటనే హెలికాప్టర్లో ఆస్పత్రికి తరలించారు. అయితే, ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. మిగతా ఇద్దరు కూడా చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన వెనుక ఎలాంటి కుట్రా లేదని పోలీసులు వివరించారు. ఏప్రిల్ 7 వ తేదీన ఓ వ్యక్తి తన ట్రక్ను జనాలపైకి నడపటంతో ఐదుగురు చనిపోగా 14 మంది గాయపడ్డారు. ఈ ప్రమాదం వెనుక ముస్లిం తీవ్రవాదుల హస్తం ఉందని తేలింది. అప్పటి నుంచి ఎలాంటి ప్రమాదం జరిగినా తీవ్రవాద హస్తం ఉంటుందని ప్రజలు భయపడుతున్నారు.