దక్షిణం: అవీ.. ఇవీ.. మగాడివే! | Difference between male and female | Sakshi
Sakshi News home page

దక్షిణం: అవీ.. ఇవీ.. మగాడివే!

Published Sun, Aug 18 2013 2:30 AM | Last Updated on Fri, Jul 12 2019 3:37 PM

దక్షిణం: అవీ.. ఇవీ.. మగాడివే! - Sakshi

దక్షిణం: అవీ.. ఇవీ.. మగాడివే!

  ఇంటర్నెట్లో అమ్మాయిల మీద వచ్చే జోకులతో పోల్చుకుంటే అబ్బాయిలపై ఉన్న జోక్స్ చాలా తక్కువ.
     పురుషుడు మాట్లాడేటపుడు దానిని విశ్లేషించడానికి మన మెదడు అనుభవించే ఒత్తిడి కంటే స్త్రీలు మాట్లాడినపుడు దాన్ని అర్థం చేసుకోవడానికి పురుషుడి బ్రెయిన్ చాలా ఎక్కువ కష్టపడుతుందన్నది ఓ పరిశోధన ఫలితం.
     పురుషుడు రోజుకు సగటున 8 సార్లు నవ్వితే, స్త్రీ 62 సార్లు నవ్వుతుందట.
     దంపతుల్లో వాగ్వాదాలకు ప్రధాన కారణం... అమ్మాయి తన తండ్రి లక్షణాలను, మంచితనాన్ని భర్తలో ఆశించి నిరాశకు గురికావడమేనట.
     స్త్రీ - పురుషుల మెదళ్ల పనితీరు ఒకే అంశంపై వేరువేరుగా ఉంటుంది చాలా విషయాల్లో!
     1900 ముందు అంతా మగ నర్సులే ఉండేవారట. ఇపుడు వారి శాతం ఆరు లోపే!
     కండర శక్తి స్త్రీ కంటే పురుషుడికి యాభై శాతం ఎక్కువట.
     కాంప్లిమెంట్స్ ఇష్టపడేది స్త్రీలే అయినా... వాటిని పద్ధతి ప్రకారం స్వీకరించేది మాత్రం మగాళ్లే.
 
 ప్రజాస్వామ్యం- వరుడు !
 ప్రజాస్వామ్య రాజ్యమైన భారతదేశంలో అన్ని చోట్లా ప్రజాస్వామ్యం వర్ధిల్లడం లేదు. ఇది రాజకీయ విమర్శ కాదు, వధువులను వెతుకుతున్న వరుల విమర్శ! అవును, ప్రజాస్వామ్య ప్రాథమిక లక్షణం... మెజారిటీ ప్రజల అభిప్రాయాలు చెల్లడమే కదా. కానీ, మన దేశంలో పరిస్థితి భిన్నంగా ఉంది. పులుల కంటే వేగంగా అమ్మాయిల సంఖ్య తగ్గిపోతోంది. దీంతో వారిపుడు దేశంలో సంఖ్యాపరంగా మైనారిటీలు. కానీ వారు మైనారిటీలోకి వెళ్లేకొద్దీ వారి చెల్లుబాటు పెరుగుతోంది. అధిక సంఖ్యలో ఉన్న అబ్బాయిల మాట చెల్లకపోగా అమ్మాయిల మాటే చెల్లుతోంది. పెళ్లి చూపులకు వెళ్లిన ప్రతి అబ్బాయికి ఈ దిమ్మతిరిగే నిజం తెలుస్తోంది. అప్పట్లో పెళ్లి చూపులంటే అమ్మాయి తలవంచుకుని ఉంటే అబ్బాయి ఆమెను గమనిస్తూ ఉండేవాడు. ఇపుడు ఏ అబ్బాయీ టీ తెచ్చిన అమ్మాయి చేతినే తప్ప మొహం చూసే సాహసం చేయట్లేదు.
 
 యువతి మాత్రం కలర్ నుంచి గ్లామర్ వరకు అన్నీ  స్కానింగ్ చేసేస్తోంది. నీకు పాటలు పాడటం వచ్చా అని అడిగే లోపు ‘నీ శాలరీ ఎంత, ఆన్‌సైట్ ఆప్షన్ (విదేశీ అవకాశం) ఉంటుందా?’ అనే ప్రశ్న బాణంలా వస్తోంది. ఉందంటే బుక్కయిపోతాం, లేదంటే చూపులు క్యాన్సిల్. పెళ్లయ్యాక కూడా అబ్బాయి శాలరీ ఎంతో తెలుసుకునే ధైర్యం చేసే వారు కాదపుడు. ఇపుడు అమ్మాయిని ఒప్పించడానికి పెళ్లి చూపుల బయోడేటాలో దాన్ని హైలైట్ చేయాల్సి వస్తోంది. ‘ఆ కుటుంబానికి కోడలుగా వెళ్లడం మన పిల్ల అదృష్టం’ అనే డైలాగును ‘అలాంటి పిల్ల దొరకడం నీ అదృష్టం’ అనే డైలాగు రీప్లేస్ చేసింది. ఇది అమ్మ చెప్పే నిజం కాదు, ధైర్య వచనం!! పెళ్లి చూపులకెళ్లి రిజల్టు కోసం ఎదురుచూస్తున్న కాబోయే వరులారా... ఈ ఆర్టికల్ మీకే అంకితం.
 
 వధువు తల్లిదండ్రుల మాటలు: అప్పుడు, ఇప్పుడు!
 
 1993 :     అబ్బాయి మంచివాడు గవర్నమెంట్ ఉద్యోగి మంచి రాబడి..
     సిగరెట్ అలవాటు లేదు    మందు అలవాటు లేదు
     వాళ్ల నాన్నకు ఎదురుచెప్పడు అందరితోనూ కలుపుగోలుగా ఉంటాడు
     అక్కాచెల్లెళ్లను బాగా చూసుకుంటాడు
 
 2013:     అబ్బాయి మంచివాడు సాఫ్ట్‌వేర్ జాబ్
     లక్ష రూపాయల శాలరీ ఆన్‌సైట్ ఆప్షన్ ఎక్కువ
     అమ్మాయిను తనతో పాటు తీసుకెళ్తాడు
     హైదరాబాదులో సొంత ఫ్లాటు
     ఈ మధ్యనే పెద్ద కారు కూడా కొన్నాడు
     అమ్మాయి బీటెక్ చేసుంటే చాలట
 - ప్రకాష్ చిమ్మల

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement