అద్దం లాంటి కలప
గ్లాస్ ఉడ్
అద్దంలాంటి కలప అంటే నున్నగా పాలిష్ చేసిన కలప అనుకుంటే పొరబడ్డట్లే! ఎంత నున్నగా పాలిష్ చేసినా భౌతిక ధర్మాల రీత్యా కలప అపారదర్శకంగానే ఉంటుంది. అలాగే అద్దం తయారీకి ముడిపదార్థమైన గాజు పారదర్శకంగా ఉంటుంది. స్విస్ శాస్త్రవేత్తలు ఈ భౌతికధర్మాలను తోసిరాజని పారదర్శకమైన కలపకు విజయవంతంగా రూపకల్పన చేశారు. స్టాక్‌హోమ్‌లోని కె.టి.హెచ్.రాయల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన శాస్త్రవేత్తలు ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. తాము రూపొందించిన పారదర్శక కలపను సోలార్ బ్యాటరీల తయారీకి కూడా భేషుగ్గా వినియోగించుకోవచ్చని వారు చెబుతున్నారు.
కలపలో ఉండే ‘లినైన్’ అనే పదార్థాన్ని తొలగించి, దానికి యాక్రిలిక్‌ను జోడించి పారదర్శక కలపను తయారు చేసినట్లు కె.టి.హెచ్.రాయల్ ఇన్‌స్టిట్యూట్ ప్రొఫెసర్ లార్స్ బెర్గ్‌లండ్ వివరించారు. పారదర్శకమైన కలపను తక్కువ ఖర్చుతోనే తయారు చేయవచ్చని కూడా ఆయన చెప్పారు. ఇదే గనుక మార్కెట్‌లో అందుబాటులోకి వస్తే కిటికీలు, తలుపుల అద్దాల స్థానాన్ని పారదర్శక కలప ఆక్రమించగలదని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.