సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ బస్సు దిగిన భార్యాభర్తలు మరో బస్సు ఎక్కాలన్న ఆత్రుతలో దిగిన బస్సు ముందు నుంచే రోడ్డు దాటబోయారు. వారు రోడ్డు దాటుతున్నది కనిపించక బస్సు డ్రైవర్ ముందుకు పోనిచ్చాడు. బస్సు తగిలి ఇద్దరూ కింద పడిపోగా బస్సు చక్రాలు వారిని చిదిమేశాయి. కొద్దిరోజుల క్రితం సికింద్రాబాద్‌లో జరిగిన దుర్ఘటన అక్కడి వారిని కలిచివేసింది.
ఇందులో తప్పెవరిది..?
బస్సు డ్రైవర్‌కు కొన్ని కోణాల్లో ముందున్న ప్రాంతం కనిపించదు. అందులో ముఖ్యమైంది బస్సు ముందు దాదాపు మూడునాలుగు అడుగుల స్థలం. దాన్నే బ్లైండ్‌స్పాట్‌గా చెబుతారు. తక్కువ ఎత్తున్న వారు, బస్సు రేడియేటర్ ముందు నుంచి ద్విచక్రవాహనంపై వెళ్లేవాళ్లు ఆ ప్రాంతంలో బస్సును దాటుతున్నప్పుడు వారిని గుర్తించటం డ్రైవర్‌కు సాధ్యం కాదు. ఆ ప్రాంతంలో ఎవరూ బస్సు దాటకూడదని తరచూ ఆర్టీసీ అధికారులు ప్రకటనలు చేస్తున్నా చాలామంది అవగాహన లేక దాటుతూ బస్సు చక్రాల కింద నలిగిపోతున్నారు. దానికి విరుగుడుగా ఆర్టీసీ బస్సు ముందుభాగంలోని ‘కనపడని ప్రాంతం’డ్రైవర్‌కు కనిపించేలా ప్రత్యేకంగా మిర్రర్ ఏర్పాటు చేస్తోంది.
ప్రత్యేక ఏర్పాటు
కొంతకాలంగా ఆర్టీసీ బస్సులకు ముందు భాగంలో మూడు మిర్రర్లు కనిపిస్తున్నాయి. ఆయా డిపోల్లో ప్రత్యేకంగా వాటిని బిగిస్తున్నారు. బస్సు ముందు భాగంలో ఉండే రెండు అద్దాల మధ్య బయటి నుంచి ఈ మిర్రర్ ఏర్పాటై ఉంటోంది. ఇటీవల కొత్తగా కొనుగోలు చేసిన సూపర్ లగ్జరీ, డీలక్స్ బస్సులకు మాత్రం బస్సు ముందు రెండు వైపులా ఉండే సైడ్ మిర్రర్ రాడ్‌లకే ఈ ప్రత్యేక మిర్రర్ బిగించి ఉంది. బస్సు బాడీని నిర్మించేటప్పుడే వీటిని బిగిస్తుండటం విశేషం.
బస్సు ఆగినప్పుడు అందులోంచి దిగిన వారో, ఆ బస్సు ఎక్కాలన్న ఆత్రుతలో పక్క నుంచి వచ్చిన వారో బస్సు ముందు భాగం నుంచి దాటుతూ ప్రమాదాలకు గురవుతున్నారు. అలాంటి ప్రమాదాల్లో ఎక్కువ మంది మృత్యువాతపడుతున్నారు. చనిపోయిన వారి కుటుంబాలకు ఆర్టీసీ పెద్దమొత్తంలో నష్టపరిహారం ఇవ్వాల్సి వస్తోంది. దీంతో ఈ సమస్యకు పరిష్కారంగా ఆర్టీసీ అధికారులే ఈ ఆలోచన చేశారు. ఆ మిర్రర్ లో బస్సు ముందు భాగం డ్రైవర్‌కు స్పష్టంగా కనిపిస్తుంది. బస్సును ముందుకు కదిలించేప్పుడు ఆ మిర్రర్‌ను చూసి ముందు భాగంలో ఎవరూ లేరని నిర్ధారించుకున్నాకే కదిలించాలని డిపో మేనేజర్లు డ్రైవర్లకు సూచిస్తున్నారు. ఇప్పటికే కొన్ని బస్సులకు వీటిని బిగించారు. కొద్ది రోజుల్లో అన్ని బస్సులకు ఏర్పాటు చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment