కొత్తపేట: రోడ్డు ప్రమాదాలు రెప్పపాటులో జరిగిపోతున్నాయి. అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. మరింత మంది క్షతగాత్రులవుతున్నారు. అటువంటి ప్రమాదాల సమయంలో ప్రాణనష్టం నివారణకు ‘ఎమర్జెన్సీ సైరన్ అండ్ టైమర్’ను డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం గ్రామానికి చెందిన వీవీవీ సత్యనారాయణరాజు తయారు చేశారు. రావులపాలెం ఆర్టీసీ డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తున్న ఆయన తన ఆలోచనతో దీనిని రూపొందించారు. ప్రమాదాలు జరగకుండా వాహన డ్రైవర్‌తో పాటు ప్రయాణికులను అప్రమత్తం చేసే ఈ ‘ఎమర్జెన్సీ సైరన్ అండ్ టైమర్’ గురించి ఆయన ‘సాక్షి’కి వివరించారు.
తయారు చేసే విధానం
ఎలక్ట్రానిక్ పరికరాలతో ఎమర్జెన్సీ సైరన్ అండ్ టైమర్‌ను తయారు చేశారు. దానికి పైన బ్లాక్ బటన్ అమర్చారు. అది టైమర్. ఎడమవైపు కింద రెడ్ స్విచ్ ఉంటుంది. అది సైరన్ మోగడానికి ఉపయోగించారు. కుడివైపున కింద ప్రెస్ బటన్. అది ప్రెస్ చేశాక సైరన్‌కు పవర్ వెళ్లకుండా నిలిపివేస్తుంది. పరికరానికి బ్యాటరీ ద్వారా సప్లయి ఇచ్చారు.
మూడు రకాలుగా ఉపయోగం
ఈ పరికరానికి బ్యాటరీ సప్లయి ఇచ్చిన తరువాత పవర్ సైరన్ ఆఫ్, ఆన్ స్విచ్‌కు వెళుతుంది. ఈ స్విచ్ ఆన్ చేయగానే సైరన్ మోగుతుంది. బస్సులో వైర్లు, షార్ట్ సర్క్యూట్ జరిగి పొగ గాని మంటలు గాని వచ్చినప్పుడు ఈ స్విచ్ ద్వారా డ్రైవర్ సైరన్ మోగించి ప్రయాణికులను అప్రమత్తం చేయవచ్చు. బస్ లేదా ఇతర వాహనం నుంచి కిందకు దించి వారి ప్రాణాలు కాపాడవచ్చు.
డ్రైవర్‌కు అనారోగ్యం కారణంగా లేదా గుండెపోటు వంటివి వస్తే బస్‌ను కంట్రోల్ చేయలేని పరిస్థితుల్లో ఈ స్విచ్ ఉపయోగించి ఎమర్జెన్సీ సైరన్ మోగించడం ద్వారా ప్రయాణికులను అలర్ట్ చేయవచ్చు.
దూర ప్రాంత సర్వీసు బస్సులలో డ్రైవర్‌కు తెల్లవారు జామున నిద్రవచ్చి అదుపు తప్పడం, బ్రిడ్జిలపై నుంచి నదులలో, లోయల్లో పడి ప్రాణనష్టం జరుగుతుంది. అటువంటి ప్రమాదాలు జరగకుండా పవర్‌నాబ్ (స్విచ్) ఆన్ చేసి ఉంచగా దానిలో గల టైమర్ నిమిషానికి 6 సెకన్ల చొప్పున బల్బు వెలుగుతూ, ఆరుతూ డ్రైవర్‌ను అప్రమత్తం చేస్తుంది. దానితో డ్రైవర్ దానిని గమనించి ప్రెస్ బటన్ నొక్కుతాడు. బల్బు నిమిషం పాటు ఆఫ్ అవుతుంది. ఒకవేళ డ్రైవర్ ఆ బల్బును గమనించకపోతే (నిద్రపోతే) సైరన్ మోగి డ్రైవర్‌ను అలెర్ట్ చేస్తుంది. ప్రయాణికులు కూడా గమనించి డ్రైవర్ వద్దకు వచ్చి అప్రమత్తం చేయవచ్చు. ఈ విధంగా ‘ఎమర్జెన్సీ సైరన్ అండ్ టైమర్’ ప్రమాదాల నివారణకు దోహదపడుతుంది.
ప్రమాదాలు చూసి.. ఆలోచించి..
తాను ఆర్టీసీ డ్రైవర్‌గా అనేక రోడ్డు ప్రమాదాలు చూశాను. వీటిని ఏదో రకంగా అరికట్టాలనే ఉద్దేశంతో డ్రైవర్, ప్రయాణికులను అప్రమత్తం చేసే ‘ఎమర్జెన్సీ సైరన్ అండ్ టైమర్’ను రూపొందించాను. దీనికి సంబంధించిన ఎలక్ట్రానిక్ పరికరాలకు రూ.3 వేలు అయ్యింది. ఆర్టీసీ, ప్రైవేట్ బస్సుల్లో ప్రమాదాలు జరిగినప్పుడు డ్రైవర్లపై చర్యలు తీసుకుంటున్నారు. కానీ ప్రమాదాల నివారణకు పైవిధంగా ప్రయత్నాలు మాత్రం చేయడం లేదు. ప్రమాదాలు అరికట్టేందుకు చిన్న పరికరాలతో సైరన్ అండ్ టైమర్ వంటివి ఏర్పాటు చేయడంపై దృష్టి సారించాలి.
–వీవీవీ సత్యనారాయణరాజు, ఆర్టీసీ డ్రైవర్, రావులపాలెం డిపో
Comments
Please login to add a commentAdd a comment