Swedish Academy
-
Nobel Prize in Economics 2024: అర్థశాస్త్రంలో ముగ్గురికి నోబెల్
స్టాక్‌హోమ్: దేశంలోని సంస్థలు, వ్యవస్థల అసమర్థత కారణంగా ఆ దేశం ఎలా పేదరికంలోనే మగ్గిపోతుందనే అంశాలపై విస్తృత పరిశోధనలు చేసిన ముగ్గురు ఆర్థికవేత్తలకు అర్థశాస్త్రంలో ఈ ఏడాది నోబెల్ పురస్కారం దక్కింది. ఆయా సమాజాల్లో నిబంధనలను తుంగలో తొక్కడం, సంస్థలు, వ్యవస్థల్లో లోపాలు ఆ దేశాభివృద్ధికి ఎలా పెనుశాపాలుగా మారతాయనే అంశాలను డరేన్ ఎసిమోగ్లూ, సైమన్ జాన్సన్, జేమ్స్ ఏ రాబిన్సన్లు చక్కగా విడమర్చి చెప్పారని రాయల్ స్వీడిష్ అకాడమీ సైన్స్ విభాగ నోబెల్ కమిటీ కొనియాడింది. ఈ మేరకు ముగ్గురికీ నోబెల్‌ను ప్రకటిస్తూ సోమవారం కమిటీ ఒక ప్రకటన విడుదలచేసింది. ఎసిమోగ్లూ, జాన్సన్‌లు అమెరికాలోని ప్రతిష్టాత్మక మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో సేవలందిస్తుండగా షికాగో విశ్వవిద్యాలయంలో రాబిన్సన్ పనిచేస్తున్నారు. ‘‘ దేశాల మధ్య ఆర్థిక అసమానతలను తగ్గించడం అనేది శతాబ్దాలుగా ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాళ్లలో ఒకటి. ఆదాయ, ఆర్థికాభివృద్ధి అసమానతలను రూపుమాపడంలో అక్కడి వ్యవస్థల కీలకపాత్రను ఆర్థికవేత్తలు స్పష్టంగా పేర్కొన్నారు’’ అని ఆర్థికశాస్త్ర కమిటీ చైర్మన్ జాకబ్ సెవెన్సన్ వ్యాఖ్యానించారు. తనకు నోబెల్ రావడంపై 57 ఏళ్ల ఎసిమోగ్లూ ఆశ్చర్యం వ్యక్తంచేశారు. దేశాలు ఎందుకు సక్సెస్ కాలేవు? అవార్డ్ విషయం తెలిశాక తుర్కియే దేశస్థుడైన ఎసిమోగ్లూ మాట్లాడారు. ‘‘ప్రజాస్వామ్యయుత వ్యవస్థల గొప్పతనాన్ని ఈ అవార్డ్ గుర్తించింది. అభివృద్ధిలో దేశాలు ఎందుకు వెనుకబడతాయని రాబిన్సన్, నేను కలిసి పరిశోధించాం. ప్రజాస్వామ్యం అనేది సర్వరోగ నివారిణి కాదు. ఒక్కోసారి ఎన్నికలు వచి్చనప్పుడే సంక్షోభాలు ముంచుకొస్తాయి’’ అని అన్నారు. ఒకే పార్టీ ఏలుబడిలో ఉన్న చైనా ఎలా అభివృద్ధి పథంలో దూసుకుపోగల్గుతోందని విలేఖరులు ప్రశ్నించగా.. ‘‘ శక్తివంతమైన అధికారయంత్రాంగం ఉన్న చైనా లాంటి దేశాల్లో సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు, వినూత్న ఆవిష్కరణల కోసం ఎన్నో అవరోధాలను దాటుతున్నారు’’ అని అన్నారు. 12 ఏళ్ల క్రితం ఎసిమోగ్లూ, రాబిన్సన్ రాసిన ‘ వై నేషన్స్ ఫెయిల్: ది ఆరిజన్స్ ఆఫ్ పవర్, ప్రాస్పారిటీ, పూర్’ పుస్తకం అత్యధిక కాపీలు అమ్ముడుపోయింది. వ్యక్తుల తప్పిదాలే ఆయా దేశాలను పేదదేశాలుగా మిగిలిపోవడానికి కారణమని రచయితలు ఆ పుస్తకంలో వివరించారు. సరిగ్గా అమెరికా–మెక్సికో సరిహద్దులో ఉన్న ఆరిజోనా రాష్ట్ర నోగేల్స్ సిటీ భిన్న పరిస్థితులను ఆర్థికవేత్తలు చక్కటి ఉదాహరణగా తీసుకున్నారు. అమెరికా వైపు ఉన్న నోగేల్స్ సిటీ ఉత్తరప్రాంత వాసులు ప్రశాంతంగా జీవిస్తున్నారు. ఆయుర్దాయం ఎక్కువ. ఎక్కువ మంది విద్యార్థులు హైసూ్కల్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేస్తున్నారు. అదే దక్షిణవైపు ప్రాంత ప్రజలు పేదరికంలో మగ్గిపోతున్నారు. అక్కడ వ్యవస్థీకృత నేరాలు ఎక్కువ. ఆ ప్రాంతంలో వ్యాపారాలు చేయడం కూడా రిస్క్‌తో కూడిన వ్యవహారం. అవినీతి రాజకీయనేతలను అధికారం నుంచి కిందకు దింపడం కూడా చాలా కష్టం. అమెరికాలో అయితే పౌరుల ఆస్తిహక్కుల పరిరక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తుంది. ఇలాంటి విధానాలే ఒకరకంగా దేశం బాగుపడటానికి బాటలువేస్తాయి ’’ అని ఎసిమోగ్లూ వివరించారు. వ్యవస్థలకు తగ్గుతున్న ఆదరణ దురదృష్టవశాత్తు ఇటీవలి కాలంలో అమెరికా, యూరప్‌లలో ప్రజాస్వామ్యయుత వ్యవస్థలకు ఆదరణ తగ్గుతోంది. తమకు అన్యాయం జరిగిందని ప్రజలు భావించిన సందర్భాల్లో ప్రజాస్వామ్యదేశాలు ఓడిపోయినట్లే లెక్క. ఇలాంటి ఉదంతాలు ప్రజాస్వామ్యదేశాలు మేల్కొనాల్సిన తరుణం వచి్చందని గుర్తుచేస్తాయి. సుపరిపాలన అందించేందుకు దేశాలు మళ్లీ ప్రయత్నించాలి’’ అని ఎసిమోగ్లూ అన్నారు. -
బలహీనతను బలంగా వినిపించే కవిత్వం
కవికీ కవిత్వానికీ ఏవో ఉన్నత లక్ష్యాలు ఉండాలన్నదానికి భిన్నంగా తన అస్తిత్వపు వేదననే కవిత్వంలోకి తెస్తున్నారు 77 ఏళ్ల అమెరికన్ కవయిత్రి లూవీస్ గ్లోక్. వ్యక్తి అస్తిత్వాన్ని సార్వజనీనం చేస్తున్నందుకుగానూ ఈ సంవత్సరపు నోబెల్ పురస్కారం ఆమెను వరించింది. -లూవీస్ గ్లోక్ కవి అనే వాడు దేనినైనా ఎదుర్కొనే ధైర్యవంతుడు కావాలా? దేనికైనా రొమ్ము ఎదురొడ్డి నిలిచే సాహసి కావాలా? ఏం, కవి భయస్తుడు కాకూడదా? కవి బలహీనుడు కాకూడదా? ఆకాశం కిందిది ఏదైనా కవిత్వానికి అర్హమైనదే అయినప్పుడు, భయ బలహీనతలు మాత్రం కవితా వస్తువులు కావా? ఈ సంవత్సరపు నోబెల్ పురస్కారం వరించిన అమెరికన్ కవయిత్రి లూవీస్ గ్లో్లక్ కవిత్వమంతా ఇలాంటి వ్యక్తిగత కలవరింతలే, పశ్చాత్తాపపు తలపోతలే. అయితే వ్యక్తి అస్తిత్వాన్ని సార్వజనీనం చేస్తున్నందుకుగానూ ఆమెకు ఈ సర్వోన్నత గౌరవం దక్కింది. సంప్రదాయంగా డిసెంబర్ 10న ఈ పురస్కారాన్ని స్వీడన్ రాజధాని స్టాక్‌హోమ్‌లో స్వీకరించాల్సి ఉండగా కరోనా మహమ్మారి కారణంగా అదే రోజు తన ఇంటిలోనే దీన్ని అందుకుంటారు. ఆత్మకథాత్మక కవయిత్రి ఆమె తల్లిదండ్రులు హంగెరీ నుంచి అమెరికాకు బతుకుదెరువు కోసం వచ్చిన యూదులు. 1943లో ఆమె పుట్టకముందే ఒక అక్క చనిపోయింది. తన కంటే ముందు పుట్టిన ఒక ప్రాణి మరణించిన వాస్తవం రక్తంలో ఇంకించుకుని పెరిగింది. దీనికితోడు కౌమారంలో ఎక్కువ బరువు పెరుగుతున్నానేమో అనే అసాధారణ భయం వెంటాడింది (అనరెక్సియా నెర్వోసా). సహజంగానే ఇది చదువుకు ఆటంకం కలిగించింది. ఏడేళ్ళ పాటు వైద్యం తీసుకున్నాక గానీ సాధారణం కాలేకపోయింది. ‘‘జీవితంలో ఒక దశలో నేను చచ్చిపోతున్నాను అని అర్థమైంది. కానీ అంతకంటే స్పష్టంగా, అంతకంటే బలంగా నేను చావాలని అనుకోవడం లేదు అని కూడా అనిపించింది’’ అంటారామె. ఈ జబ్బు కారణంగానే ఎలా ఆలోచించాలో నేర్చుకున్నానంటారు. రచన కూడా ఒక జబ్బు లాంటిదే. కాకపోతే మన వేదనని ఇతరులకు పంపిణీ చేయడం ద్వారా స్వస్థత పొందుతాం. ప్రపంచం మాత్రం ఇలా చేయదా? మరి కవికి మాత్రం ఎందుకు మినహాయింపు? అందుకే గ్లో్లక్ ఎనిమిదో ఏట నుంచే కవిత్వాన్ని తన శోకానికి విరుగుడుగా భావించింది. ఆత్మకథాత్మకంగా రాస్తూ, తీవ్రమైన ఉద్వేగాలను పలి కిస్తూ ఆధునిక జీవితాన్ని చిత్రించింది. పాతికేళ్ల వయసులో 1968లో తన తొలి కవితా సంపుటి ఫస్ట్‌బర్న్ వెలువరిం చింది. దీనికి సానుకూల స్పందన వచ్చినప్పటికీ , అనంతరం సుదీర్ఘమైన రైటర్స్ బ్లాక్ వెంటాడింది. కవిత్వం రాయడం ద్వారా తన వేదన నుంచి బయటపడ్డట్టుగానే, కళాశాలలో చేరి కవిత్వాన్ని బోధించడం ద్వారా రైటర్స్ బ్లాక్ నుంచి బయటపడింది. (చదవండి: అమెరికా కవయిత్రికి నోబెల్) తిరిగి తిరిగి నిలబెట్టుకోవడం 1975లో వచ్చిన తన రెండో కవితా సంపుటి ద హౌజ్ ఆన్ మార్‡్షలాండ్స్ ద్వారా తనదైన ప్రత్యేకమైన గొంతును సాధించింది. ఇక 1980లో వచ్చిన డిసెండెంట్ ఫిగర్ ఆమెను విస్మరించలేని కవయిత్రిగా నిలబెట్టింది. ఇల్లు తగలబడి తన సర్వస్వం కోల్పోయినప్పుడు రాసిన కవిత్వం ద ట్రయంప్ ఆఫ్ ఎకిలీస్ (1985). ఈ సంపుటంలోని మాక్ ఆరెంజ్ కవిత స్త్రీవాద గీతమై నిలిచింది. అయినా తనను స్త్రీవాదిగా, యూదు కవిగా, ప్రకృతిగా కవిగా లేబుల్స్ వేసుకోవడానికి ఆమె ఇష్టపడలేదు. వాటన్నింటికి అతీతమైనదేదో మనిషి అస్తిత్వం అని ఆమె నమ్మకం. తన మరణపు వాస్తవాన్ని గుర్తించడం వల్లే ఎకిలీస్ మరింత మనిషి అయినట్టుగా, ఆమె కూడా జీవితపు క్షణభంగురతను ఈ కాలంలో గుర్తిం చింది. తండ్రి మరణించిన దుఃఖంలోంచి పుట్టిన కవిత్వం అరారత్(1990). 1992లో వచ్చిన వైల్డ్ ఐరిస్, తరువాయి సంపుటం మీడోలాండ్స్(1996), వీటా నోవా(1999), ద సెవెన్ ఏజెస్(2001) అన్నీ తన జీవిత వైఫల్య సాఫల్య క్షణాల పట్టుపురుగులే. వైవాహిక జీవితం విచ్ఛిన్నం కావడం, ఉద్యోగాలు కోల్పోవడం, తిరస్కారాలు పొందడం, ఓటములు ఎదుర్కోవడం, నిలుపుకోలేని బంధాల్లో చిక్కుకోవడం, తనను తాను తిరిగి తిరిగి నిలబెట్టుకోవడమే ఈ కవిత్వం నిండా. (చదవండి: నోబెల్ ఉమెన్) నిశ్శబ్దపు ఉనికి మార్పు కోసం తపన పడుతూ, మళ్లీ అదే మార్పు ఎదురైనప్పుడు విలవిల్లాడుతూ అచ్చం సగటు మనిషిలాగే ఆమె కవిత్వం ఉంటుంది. గ్రీకు పురాణాలన్నా, మొత్తంగా ధార్మిక గాథలన్నా ప్రత్యేకమైన ఇష్టం. కాగితం మీద కలం కదపడంలోనే ఏదో తెలియని ఆనందం ఉందనే 77 ఏళ్ల గ్లోక్ అవిరామంగా రాస్తూనే ఉన్నారు. అవెర్నో(2006), ఎ విలేజ్ లైఫ్(2009), ఫెయిత్ఫుల్ అండ్ విర్చువస్ నైట్(2014)– కవితా సంపుటాలను వరుసగా తెస్తూనేవున్నా దీర్ఘ కాలావధులు తాను ఏమిరాయకుండా ఉండిపోతానని చెబుతారు. విస్తృతంగా రాస్తున్నప్పుడు పునరుక్తి దోషం అంటుకోవచ్చు, తాజాదనం కోల్పోవచ్చు. రోజూ పొద్దున లేచేసరికి అదే మనిషిగా ఉండటంలోని సానుకూలతను గుర్తిస్తూనే, నాది నేనులాగే కవిత్వంలో వినిపించడం ఒక శాపంగానే భావిస్తానంటారు. అందుకే ప్రతీ సంపుటికి గొంతు మార్చి ఆశ్చర్యపరుస్తుంటారు. కవిత్వంలో ఆమె తోటలోని పువ్వులకు కూడా ప్రత్యేక వ్యక్తిత్వం ఉంటుంది. ఆవి వివేకంతో భాషిస్తాయి, సందర్భోచితంగా కవయిత్రి శోకంతో గొంతు కూడా కలుపుతాయి. ప్రపంచపు సంగీ తాన్ని, దైవిక నిశ్శబ్దాన్ని కూడా ఆమె కవితలు వినిపిస్తాయి. పెద్ద పాఠకవర్గానికి చేరడంలో ఆమెకు ఉత్సాహం లేదు. కవిత్వం నోటి నుంచి చెవికి జరిగే సున్నితమైన మార్పిడి అని నమ్ముతారు. కానీ, కవిత్వం స్టేజీ మీద చదవడానికి కూడా ఇష్టపడదు. నోరు, చెవి అనేవి నిజార్థంలో కాకుండా ఒక మనసులో పుట్టిన భావాన్ని స్వీకరించేం దుకు సిద్ధంగా ఉన్న ఇంకో మనసుగా చూస్తారు. వినబడినప్పుడే ఉనికిలో ఉన్నట్టు కాకుండా, నిశ్శబ్దంలో కూడా అస్తిత్వంలో ఉండాలంటారు. – పి.శివకుమార్ -
అమెరికా కవయిత్రికి నోబెల్
స్టాక్‌హోమ్: ఈ ఏడాది సాహిత్యంలో నోబెల్ బహుమతి అమెరికా కవయిత్రి లూయిసీ గ్లుక్(77)కు దక్కింది. ‘ఎటువంటి దాపరికాలు, రాజీలేని గ్లుక్ తన కవితల్లో.. కుటుంబ జీవితంలోని కష్టానష్టాలను సైతం హాస్యం, చమత్కారం కలగలిపి చెప్పారు’అందుకే 2020 సంవత్సరానికి గాను సాహిత్యంలో నోబెల్ పురస్కారానికి ఎంపిక చేస్తున్నట్లు స్టాక్‌హోమ్‌లోని నోబెల్ అవార్డు కమిటీ గురువారం ప్రకటించింది. ‘హృద్యమైన, స్పష్టమైన ఆమె కవితా స్వరం వ్యక్తి ఉనికిని విశ్వవ్యాప్తం చేస్తుంది’అని స్వీడిష్ అకాడమీ శాశ్వత కార్యదర్శి మాట్స్ మామ్ పేర్కొన్నారు. 2006లో గ్లుక్ రచించిన ‘అవెర్నో’కవితా సంకలనం అత్యుత్తమమైందని నోబెల్ సాహిత్య కమిటీ చైర్మన్ ఆండెర్స్ ఒల్సన్ పేర్కొన్నారు. 1901 నుంచి సాహిత్యంలో ఇస్తున్న నోబెల్ బహుమతి ఎక్కువ మంది నవలా రచయితలనే వరించింది.. కాగా, గ్లుక్‌తో కలిపి ఇప్పటి వరకు 16 మంది మహిళలకు మాత్రమే ఈ గౌరవం దక్కింది. స్వీడిష్ అకాడమీ ఈ బహుమానం కింద గ్లుక్‌కు రూ.8.25 కోట్ల (10 మిలియన్ క్రోనార్లు)తోపాటు ప్రశంసా పత్రం అందజేయనుంది. చివరిసారిగా సాహిత్యంలో నోబెల్ గెలుచుకున్న అమెరికన్ బాబ్ డైలాన్(2016). హంగేరియన్–యూదు మూలాలున్న లూయిసీ గ్లుక్ 1943లో న్యూయార్క్‌లో జన్మించారు. కనెక్టికట్‌లోని యేల్ యూనివర్సిటీ ఫ్యాకల్టీగా గ్లుక్ పనిచేస్తున్నారు. ఆమె 1968లో ‘ఫస్ట్‌బోర్న్’ పేరుతో మొట్టమొదటి కవిత రాశారు. అతి తక్కువ కాలంలోనే సమకాలీన అమెరికా సాహిత్యంలో ప్రముఖ కవయిత్రిగా పేరు సంపాదించుకున్నారు. ఆరు దశాబ్దాల్లో డిసెండింగ్ ఫిగర్స్, ది ట్రయంఫ్ ఆఫ్ అచిల్స్, అరారట్ వంటి 12 కవితా సంకలనాలను, రెండు వ్యాస సంకలనాలను ఆమె రచించారు. వివాదాల్లో నోబెల్ ‘సాహిత్యం’ సాహిత్యంలో నోబెల్ బహుమతిని ఈసారి యూరప్, ఉత్తర అమెరికా వెలుపల ఆఫ్రికా, ఆసియా లేదా కరేబియన్ రచయితకు స్వీడిష్ అకాడమీ ప్రకటిస్తుందని చాలా మంది భావించినా అమెరికన్‌కే ప్రకటించింది. సాహిత్యంలో నోబెల్ బహుమతులపై ఇటీవల వివాదాలు, కుంభకోణాలు అలుముకోవడంతో పాటు పాశ్చాత్య దేశాలకే ప్రాధాన్యం ఇస్తున్నారనే విమర్శలు సైతం వెల్లువెత్తాయి. నోబెల్ ఎంపిక కమిటీపై 2018లో లైంగిక వేధింపుల ఆరోపణలు వెల్లువెత్తాయి. కొందరు సభ్యులు కమిటీ నుంచి వైదొలిగారు. దీంతో ఆ ఏడాది నోబెల్ సాహిత్యం పురస్కారాన్ని ప్రకటించలేదు. గత ఏడాది సాహిత్య నోబెల్ అవార్డుల ప్రకటన జరిగింది. 2018వ సంవత్సరానికి గాను పోలండ్‌కు చెందిన ఓల్గా టోకార్జక్‌కు, 2019కి ఆస్ట్రియా రచయిత్రి పీటర్ హాండ్కేకు అవార్డులు అందజేస్తున్నట్లు కమిటీ ప్రకటించింది. కానీ, హాండ్కే ఎంపికపై వివాదం తలెత్తింది. 1990లలో జరిగిన బాల్కన్ యుద్ధాల్లో హాండ్కే సెర్బుల మద్దతుదారుగా ఉన్నారని, సెర్బియా యుద్ధ నేరాలను హాడ్కే సమర్థించారని ఆరోపణలు ఉండటం ఇందుకు కారణం. అల్బేనియా, బోస్నియా, టర్కీ తదితర దేశాలు హాండ్కేకు బహుమతి ఇవ్వడాన్ని నిరసిస్తూ అవార్డుల కార్యక్రమాన్ని బహిష్కరించగా కమిటీ సభ్యుడు ఒకరు తన పదవికి రాజీనామా చేశారు. ఈ వివాదాల నేపథ్యంలో 2020 సాహిత్య నోబెల్ అవార్డు ప్రకటన కొంత ప్రాధాన్యం సంతరించుకుంది. లూయిసీకి దక్కిన పురస్కారాలు ► నేషనల్ హ్యుమానిటీ మెడల్(2015) ► అమెరికన్ అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ లెటర్స్ గోల్డ్ మెడల్ ► ‘ది వైల్డ్ ఐరిస్’కవితకు పులిట్జర్ ప్రైజ్(1993) ► ‘ఫెయిత్ఫుల్ అండ్ విర్చువస్ నైట్’ కవితకు నేషనల్ బుక్ అవార్డు(2014) ► 2003, 2004 సంవత్సరాల్లో ‘యూఎస్ పోయెట్ లారియేట్’ -
విశ్వ రహస్యాలు.. వినూత్న బ్యాటరీ
స్టాక్‌హోమ్: ముగ్గురు అంతరిక్ష పరిశోధకులు.. కెనడియెన్ అమెరికన్ జేమ్స్ పీబుల్స్, స్విట్జర్లాండ్‌కు చెందిన మైఖేల్ మేయర్, డిడియర్ క్యులోజ్‌లకు 2019 సంవత్సరానికి భౌతిక శాస్త్ర నోబెల్ బహుమతి లభించింది. వీరిలో పీబుల్స్‌కు ప్రైజ్ మనీ(9.14 లక్షల అమెరికన్ డాలర్లు – రూ. 6.5 కోట్లు)లో సగం, మిగతా ఇద్దరికి తలా 25 శాతం అందుతుందని రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ మంగళవారం ప్రకటించింది. బిగ్ బ్యాంగ్ అనంతరం విశ్వం ఎలా రూపాంతీకరణ చెందినదనే విషయంపై జేమ్స్ పీబుల్స్ చేసిన పరిశోధనలకు గాను ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లు అకాడెమీ పేర్కొంది. 1995 అక్టోబర్‌లో తొలిసారి మన గ్రహ వ్యవస్థకు ఆవల, సూర్యుని తరహా నక్షత్రం చుట్టూ పరిభ్రమిస్తున్న ఓ గ్రహాన్ని గుర్తించినందుకు స్విస్ పరిశోధకులు మేయర్, క్యులోజ్‌లకు ఈ అవార్డ్ అందజేయనున్నట్లు తెలిపింది. ఈ ముగ్గురి పరిశోధనలు విశ్వంపై మన అవగాహనను మరింత పెంచాయని రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ సెక్రటరీ జనరల్ గోరన్ హాన్సన్ ప్రశంసించారు. విశ్వంలో మనకు తెలిసిన గ్రహాలు, నక్షత్రాలు, ఇతర వివరాలు కేవలం 5 శాతమేనని, మిగతా 95 శాతం మనకు తెలియని కృష్ణ పదార్థం(డార్క్ మాటర్), దాని శక్తేనని పీబుల్స్ పరిశోధనల ద్వారా వెల్లడైనట్లు చెప్పారాయన. డార్క్ మాటర్, డార్క్ ఎనర్జీలపై ఇంకా పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉందని, అవార్డ్ ప్రకటన అనంతరం ఒక ఇంటర్వ్యూలో 84 ఏళ్ల పీబుల్స్ స్పష్టం చేశారు. ప్రిన్స్టన్ యూనివర్సిటీలో సైన్స్ బోధిస్తున్న పీబుల్.. ఎంతో ఆసక్తి ఉంటే తప్ప సైన్స్ వైపు రావద్దని విద్యార్థులకు సూచించారు. యూనివర్సిటీ ఆఫ్ జెనీవాలో ప్రొఫెసర్లుగా ఉన్న మేయర్(77), క్యులోజ్(53)లు 1995లో ఫ్రాన్స్‌లోని తమ అబ్జర్వేటరీ నుంచి సూర్యుడి నుంచి 50 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న మరో సూర్యుడి తరహా నక్షత్రం చుట్టూ తిరుగుతున్న ఒక గ్రహాన్ని గుర్తించారు. అది మన గ్రహవ్యవస్థకు ఆవల గురు గ్రహ పరిమాణంలో ఉంది. ఆ గ్రహానికి ‘51 పెగాసస్ బీ’ అని నామకరణం చేశారు. 97 ఏళ్ల వయస్సులో... నోబెల్ వరించింది లిథియం–అయాన్ బ్యాటరీ రూపకర్తలైన ముగ్గురు శాస్త్రవేత్తలకు రసాయన శాస్త్రంలో నోబెల్ పురస్కారాన్ని బుధవారం ప్రకటించారు. అమెరికాకు చెందిన జాన్ గుడినఫ్, బ్రిటన్ శాస్త్రవేత్త స్టాన్లీ విటింగ్‌హమ్, జపాన్‌కు చెందిన అకిరా యోషినొలు 9,14,000(రూ. 6.5 కోట్లు) అమెరికా డాలర్ల ప్రైజ్‌మనీని సమంగా పంచుకుంటారు. వీరిలో 97 ఏళ్ల వయసులో ఈ పురస్కారం అందుకోనున్న గుడినఫ్.. నోబెల్ పురస్కార గ్రహీతల్లో అత్యంత పెద్ద వయస్కుడు కావడం విశేషం. ‘వీరు రూపొందించిన తక్కువ బరువుండే రీచార్జ్ చేయగల లిథియం బ్యాటరీలు ఎలక్ట్రానిక్ రంగంలో చరిత్ర సృష్టించాయి. మొబైల్ ఫోన్స్, ల్యాప్టాప్స్, ఎలక్ట్రిక్ వాహనాల్లో వీటినే వినియోగిస్తున్నారు. ఇవి సౌర, పవన శక్తిని సైతం స్టోర్ చేసుకోగలవు. శిలాజేతర ఇంధన రహిత సమాజం సాధ్యమయ్యేలా వీరి పరిశోధనలు ఉపకరించాయి’ అని నోబెల్ కమిటీ ప్రశంసించింది. 1991లో మార్కెట్లోకి ప్రవేశించినప్పటి నుంచి ఈ లిథియం బ్యాటరీలు మన జీవితాల్లో పెద్ద మార్పును తీసుకువచ్చాయని పేర్కొంది. స్టాన్లీ విటింగ్‌హమ్, జాన్ గుడినఫ్, అకిరా యోషినొ కనిపించేది 5 శాతమే బిగ్‌బ్యాంగ్ తర్వాత ఏం జరిగిందంటే... జేమ్స్ ఆవిష్కరించిన విశ్వ రహస్యాలేమిటి? సుమారు 24 ఏళ్ల క్రితమే సౌరకుటుంబానికి ఆవల తొలి ఎక్సోప్లానెట్‌ను గుర్తించిన మేయర్, డిడీర్ల పరిశోధన ఏమిటి? సుమారు 1470 కోట్ల ఏళ్ల క్రితం ఓ భారీ విస్ఫోటనం (బిగ్ బ్యాంగ్) కారణంగా ఈ విశ్వం పుట్టిందని మనం విన్నాం. అణువంత ప్రాంతంలోనే పదార్థమంతా అత్యధిక వేడి, సాంద్రతతో ఉన్నప్పుడు జరిగిన విస్ఫోటనం తరువాత ఏర్పడ్డ విశ్వం క్రమేపీ చల్లబడటంతోపాటు విస్తరించడమూ మొదలైంది. సుమారు నాలుగు లక్షల సంవత్సరాల తరువాతి నుంచి విశ్వం మొత్తం పారదర్శకంగా మారిపోవడంతో బిగ్‌బ్యాంగ్ కాలం నాటి కాంతి సుదూర ప్రాంతాలకు ప్రయాణించడం మొదలైంది. కాస్మిక్ బ్యాక్‌గ్రౌండ్ రేడియేషన్ అని పిలిచే ఈ కాంతి ద్వారా విశ్వం తాలూకూ ఆనుపానులు అనేకం తెలుసుకోవచ్చునని జేమ్స్ పీబుల్స్ చెబుతారు. 1960లలోనే ఈయన విశ్వం నిర్మాణం, విస్తృతి వంటి అంశాలపై పలు ఆవిష్కరణలు చేశారు. పీబుల్స్ చెప్పేది ఏమిటంటే... విశ్వంలో మొత్తం కిలో గ్రాము పదార్థం ఉందనుకుంటే.. మన చుట్టూ ఉన్న చెట్టూ చేమ, కంటికి కనిపించే గ్రహాలు, నక్షత్రాలు, కనిపించని ఇతర పదార్థమూ కలుపుకుని ఉన్నది 50 గ్రాములే. మిగిలిన 950 గ్రాముల పదార్థం కృష్ణశక్తి, కృష్ణ పదార్థం. ఈ రెండింటి వివరాలు తెలుసుకోవడం ఈనాటికీ భౌతిక శాస్త్రవేత్తలకు ఓ సవాలే. మరో ప్రపంచం, నవలోకం! 1995లో మైకేల్ మేయర్, డిడీర్ క్వెలోజ్‌లు తొలిసారి సౌరకుటుంబానికి ఆవల మన పాలపుంతలోనే ఇంకో గ్రహం ఉన్నట్లు గుర్తించారు. ఫ్రాన్స్‌లోని హాట్ ప్రావిన్స్ ్ఞఅబ్జర్వేటరీలో పరిశోధనలు చేసిన వీరు గుర్తించిన తొలి ఎక్సోప్లానెట్ పేరు పెగాసీ 51బి. ఇది మన గురుగ్రహాన్ని పోలి ఉంటుంది. అప్పటివరకూ సౌర కుటుంబానికి ఆవల గ్రహాలుండవన్న అంచనాతో ఉన్న భౌతిక శాస్త్రవేత్తలు ఆ తరువాత బోలెడన్ని పెద్ద గ్రహాలను గుర్తించారు. నాసా ప్రయోగించిన హబుల్, కెప్లర్ టెలిస్కోపులు పంపిన సమాచారం ఆధారంగా చూస్తే ఇప్పటివరకూ సుమారు 4000 ఎక్సో ప్లానెట్లను గుర్తించినట్లు తెలుస్తుంది. ఇదంతా ఆకాశంలో ఒక దిక్కున చిన్న ప్రాంతానికి సంబంధించినదే. ఆకాశం మొత్తాన్ని జల్లెడ పడితే వేల, లక్షల సంఖ్యలో ఎక్సోప్లానెట్లు గుర్తించవచ్చనేది అంచనా. గ్రహాల రూపురేఖలు, నిర్మాణాలపై శాస్త్రవేత్తలకు ఉన్న అవగాహన మొత్తాన్ని వీరిద్దరూ మార్చేశారనడంలో ఏమాత్రం సందేహం లేదు. చుట్టూ ఉన్న గ్రహాల గురుత్వాకర్షణ ప్రభావానికి గురయ్యే నక్షత్రాల కాంతిలో మార్పులొస్తుంటాయి. ఈ మార్పుల ఆధారంగానే మేయర్స్, డీడీర్లు పెగాసీ 51బీని గుర్తించారు. ఎలక్ట్రానిక్ శకానికి నాంది స్మార్ట్ఫోన్లు మొదలుకొని... విద్యుత్తు బస్సుల వరకూ అన్నింటినీ నడిపే అత్యంత శక్తిమంతమైన బ్యాటరీని తయారు చేసిన శాస్త్రవేత్తల త్రయమే స్టాన్లీ విటింగ్‌హ్యామ్, జాన్ గుడ్ఇనఫ్, అకిర యోషినో. తేలికగా ఉంటూ... పలుమార్లు రీచార్జ్ చేసుకునేందుకు అవకాశం కల్పించే లిథియం అయాన్ బ్యాటరీతో దైనందిన జీవితంలో వచ్చిన మార్పులు అన్నీ ఇన్నీ కావు. సౌర, పవన విద్యుత్తును సమర్థంగా తనలో నిక్షిప్తం చేసుకోగల ఈ బ్యాటరీలు.. పెట్రోలు, డీజిళ్లపై ఆధారపడటాన్ని తగ్గించి పర్యావరణానికి ఎంతో మేలు చేశాయి. పెట్రో పొగలతో మార్పు.. 1970ల్లో పెట్రోలు, డీజిళ్ల వినియోగం పెరిగాక నగరాలు నల్లటి పొగలో కూరుకుపోయాయి. పైగా ఈ శిలాజ ఇంధనాలు ఏనాటికైనా కరిగిపోక తప్పదన్న అంచనాలు బలపడటంతో ప్రత్యామ్నాయాల కోసం ప్రయత్నాలు మొదలయ్యాయి. ఈ సమయంలోనే స్టాన్లీ విటింగ్‌హ్యామ్ కాథోడ్ తయారీ కోసం ఓ వినూత్నమైన పదార్థాన్ని గుర్తించారు. టైటానియం డైసల్ఫైడ్ అతితక్కువ స్థలంలో ఎక్కువ మోతాదులో విద్యుత్తును నిల్వ చేసుకోగలదని గుర్తించారు. మెటాలిక్ లిథియంతో తయారైన ఆనోడ్‌ను ఉపయోగించినప్పుడు రెండు వోల్టుల సామర్థ్యమున్న తొలి లిథియం అయాన్ బ్యాటరీ తయారైంది. మరోవైపు స్టాన్లీ విటింగ్‌హ్యామ్ ఆవిష్కరణ గురించి తెలుసుకన్న జాన్ గుడ్ ఇనఫ్... అందులోని కాథోడ్ను మెటల్ సల్ఫైడ్‌తో కాకుండా మెటల్ ఆక్సైడ్తో తయారు చేస్తే సామర్థ్యాన్ని మరింత పెంచవచ్చునని కనుగొన్నారు. కోబాల్ట్ ఆక్సైడ్‌ను వాటం ద్వారా సామర్థ్యాన్ని నాలుగు వోల్టులకు పెంచగలిగారు. అంతేకాదు.. బ్యాటరీలను ఫ్యాక్టరీల్లోనే చార్జ్ చేయాల్సిన అవసరం లేదని కూడా చెప్పారు. 1980లో గుడ్ ఇనఫ్ ఈ అంశాలపై ప్రచురించిన పరిశోధన వ్యాసాలు వైర్లెస్ రీచార్జబుల్ బ్యాటరీల శకానికి నాంది పలికాయి. చిన్న సైజు బ్యాటరీల కోసం యోషినో ప్రయత్నాలు... ఎలక్ట్రానిక్ పరికరాల్లో చిన్న బ్యాటరీల తయారీ అవసరమని గుర్తించిన అకిర యోషినోతో ఆ దిశగా పరిశోధనలు చేపట్టారు. ఆసాహీ కాసై కార్పొరేషన్లో పనిచేస్తున్న ఆయన గుడ్ ఇనఫ్ బ్యాటరీల్లో కార్బన్ ఆధారిత ఆనోడ్‌ను చేర్చేందుకు ప్రయత్నించారు. పెట్రోలియం కోక్‌ను వాడినప్పుడు వచ్చిన ఫలితాలు ఆశాజనకంగా ఉండటంతో ప్రస్తుతం మనం వాడుతున్న లిథియం అయాన్ బ్యాటరీ రూపుదిద్దుకుంది. తేలికగా ఉండటం, అత్యధిక సామర్థ్యం కలిగి ఉండటం యోషినో బ్యాటరీల ప్రత్యేకత. పైగా ఎక్కువసార్లు చార్జింగ్ చేసుకునేందుకూ వీలూ ఉంది. 1991లో వాణిజ్యస్థాయిలో లిథియం అయాన్ బ్యాటరీల తయారీ మొదలు కావడంతో మొబైల్ఫోన్ల సైజు తగ్గడంతోపాటు అరచేతిలో ఇమిడిపోయే ల్యాప్‌టాప్, ట్యాబ్లెట్లూ, ఎంపీ3 ప్లేయర్లు అందుబాటులోకి వచ్చేశాయి. అప్పటి నుంచి ఇప్పటివరకూ మరింత శక్తిమంతమైన బ్యాటరీ కోసం శాస్త్రవేత్తలు ప్రయత్నాలు చేస్తున్నా సాధించింది కొంతే. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
అమెరికా ద్వయానికి ఆర్థిక నోబెల్
స్టాక్‌హోం: 2018 ఏడాదికి నోబెల్ ఆర్థిక శాస్త్ర బహుమతి అమెరికా ఆర్థిక వేత్తలు విలియం నోర్ధాస్, పాల్ రోమర్లకు దక్కింది. సృజనాత్మకత, వాతావరణాలను ఆర్థిక వృద్ధితో జోడించినందుకు వారిని ఈ గౌరవానికి ఎంపిక చేసినట్లు రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. ‘దీర్ఘకాలిక సుస్థిర వృద్ధి వంటి ప్రస్తుత కాలపు పలు ప్రాథమిక సవాళ్లకు వీరిద్దరూ పరిష్కారం చూపారు. ప్రకృతి కారణంగా మార్కెట్ ఆర్థిక వ్యవస్థ ఎలా ప్రభావితమవుతుందో నిర్మాణాత్మక నమూనాల ద్వారా వివరించి ఆర్థిక విశ్లేషణల విస్తృతిని బాగా పెంచారు’ అని అకాడమీ ప్రకటనలో వివరించింది. నోబెల్ బహుమతి విలువ 1.01 మిలియన్ డాలర్లు కాగా, నోర్ధాస్, రోమర్లు ఆ మొత్తాన్ని చెరిసగం పంచుకుంటారు. నోర్ధాస్ (77) యేల్ విశ్వవిద్యాలయంలో అధ్యాపకుడిగా ఉండగా, రోమర్ (62) న్యూయార్క్ విశ్వవిద్యాలయ అనుబంధ స్టెర్న్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో పనిచేస్తున్నారు. రోమర్ గతంలో ప్రపంచ బ్యాంకు ప్రధాన ఆర్థికవేత్తగా కూడా పనిచేశారు. దీర్ఘకాలిక స్థూల ఆర్థిక విశ్లేషణలకు వాతావరణ మార్పులను జోడించినందుకు నోర్ధాస్కు, సాంకేతిక సృజనాత్మకతను జోడించినందుకు రోమర్‌కు ఈ బహుమతులు ప్రదానం చేశామని అకాడమీ తెలిపింది. వాతావరణ కల్లోల పరిస్థితులను ప్రపంచం ఎదుర్కొనేందుకు సమాజంలో గొప్ప పరివర్తనం రావాల్సి ఉందని ఇటీవల ఐక్యరాజ్యసమితి ఓ నివేదికలో పేర్కొన్న అనంతరం నోర్ధాస్, రోమర్లకు అవార్డు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. నోబెల్ బహుమతి ప్రకటన అనంతరం రోమర్ అకాడమీతో ఫోన్లో మాట్లాడుతూ ప్రపంచం కర్బన ఉద్గారాలను తగ్గించుకుని, జీవన ప్రమాణాలను మెరుగుపరుచుకుంటుందనే నమ్మకం తనకు ఉందన్నారు. ప్రపంచ దేశాలపై కర్బన పన్నులను విధించడం ద్వారా కర్బన ఉద్గారాలను తగ్గించవచ్చని నోర్ధాస్ తన పరిశోధనలతో రుజువు చేశారు. ముగిసిన నోబెల్ బహుమతుల ప్రకటన ఆర్థిక శాస్త్ర బహుమతి ప్రకటనతో ఈ ఏడాది అన్ని నోబెల్ పురస్కారాల విజేతల పేర్లు ప్రకటించడం పూర్తయినట్లయింది. ఇప్పటికే భౌతిక, రసాయన, వైద్య, శాంతి బహుమతులను ప్రకటించగా, సాహిత్య బహుమతిని వచ్చే ఏడాదికి వాయిదా వేయడం తెలిసిందే. అకా డమీ మాజీ సభ్యురాలి భర్తపై వచ్చిన అత్యాచారం ఆరోపణలు రుజువుకావడంతో ఈ ఏడాది సాహిత్య బహుమతిని వచ్చే ఏడాదికి వాయిదా వేశారు. నోబెల్ శాంతి బహుమతికి నదియా మురాద్, డెనిస్ ముక్వెగె, భౌతిక శాస్త్ర బహుమతికి ఆర్థర్ ఆష్కిన్, జెరార్డ్ మౌరూ, డొనా స్ట్రిక్లాండ్, వైద్య శాస్త్ర బహుమతికి జేమ్స్ అలిసన్, తసుకు హొంజో, రసాయన శాస్త్ర బహుమతికి ఫ్రాన్సెస్ ఆర్నాల్డ్, జార్జ్ స్మిత్, గ్రెగ్ వింటర్‌లను విజేతలుగా ఇప్పటికే ప్రకటించారు. డిసెంబర్ 10న స్టాక్‌హోంలో స్వీడన్ రాజు నోబెల్ బహుమతులను అందజేస్తారు. -
సాహిత్య నోబెల్ ప్రతిష్టకు మచ్చ
కొపెన్‌హెగన్: ప్రఖ్యాత నోబెల్ సాహిత్య బహుమతిని అందించే స్వీడిష్ అకాడమీ ఖ్యాతి మసకబారింది. అకాడమీలో మాజీ సభ్యురాలి భర్తపై వచ్చిన అత్యాచార ఆరోపణలు రుజువు కావడంతో స్వీడన్ కోర్టు సోమవారం అతణ్ని దోషిగా తేల్చి రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ఫ్రెంచ్ పౌరుడు, స్వీడన్లో ప్రముఖ కళాకారుడిగా గుర్తింపు ఉన్న జీన్ క్లాడ్ ఆర్నాల్ట్.. కవయిత్రి, స్వీడిష్ అకాడమీ మాజీ సభ్యురాలైన కేథరీనా ఫ్రోస్టెన్సన్ను పెళ్లాడాడు. ఆర్నాల్ట్ తమపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని అకాడమీ కార్యాలయంలో పనిచేసే 18 మంది యువతులు గతంలో ఓ వార్తా పత్రికకు వెల్లడించి సంచలనం సృష్టిం చారు. నోబెల్ విజేతల పేర్లను అనేకసార్లు ముందుగానే వెల్లడించేందుకు ఆర్నాల్ట్ లంచం తీసుకున్నాడనే ఆరోపణలు కూడా ఉన్నప్పటికీ వాటిపై విచారణ జరుగుతుందో లేదో కూడా సమాచారం తెలియరాలేదు. ఆర్నాల్ట్‌పై లైంగిక వేధింపులు, ఆర్థిక కుంభకోణాల ఆరోపణలు రావడంతో అకాడమీ శాశ్వత సభ్యుల్లో చీలిక ఏర్పడి ఈ ఏడాది ఏప్రిల్‌లో ఆర్నాల్ట్ భార్య సహా ఏడుగురు సభ్యులు అకాడమీ నుంచి వైదొలగడం తెలిసిందే. ఈ ఏడాది నోబెల్ సాహిత్య బహుమతి ఉండబోదని మే నెలలోనే అకాడమీ ప్రకటించింది. -
ఈ ఏడాది నోబెల్ ‘సాహిత్యం’ ఉండదు!
స్టాక్‌హోమ్: ‘మీ టూ’ ప్రకంపనల నేపథ్యంలో ఈ ఏడాది నోబెల్ సాహితీ పురస్కారాన్ని స్వీడిష్ అకాడెమీ వాయిదావేసింది. అకాడెమీ సభ్యురాలి భర్తపై లైంగిక ఆరోపణలతోపాటు వివిధ వివాదాలూ దీనికి కారణం. అకాడెమీలోని శాశ్వత సభ్యురాలు, కవయిత్రి కటరినా ఫ్రోస్టెన్సన్, తన భర్త ఫ్రెంచి జాతీయుడైన జీన్ క్లౌడ్ అర్నాల్ట్‌తో కలిసి ఓ సాహితీ సంస్థను నిర్వహిస్తున్నారు. ఈ సంస్థకు స్వీడిష్ అకాడెమీ భారీగా నిధులను అందజేస్తోంది. అయితే, ‘మీ టూ’ ప్రచారోద్యమంలో భాగంగా పలువురు మహిళలు జీన్ క్లౌడ్ అర్నాల్ట్ తమపై అత్యాచారం, లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ ఆరోపించారు. దీంతోపాటు అకాడెమీ ఆస్తులను ఆర్నాల్ట్ దుర్వినియోగం చేశాడనీ, సాహితీ పురస్కారంపై లీకులిచ్చారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ వివాదం నేపథ్యంలో 18 మంది శాశ్వత సభ్యులుండే స్వీడిష్ అకాడెమీలో లుకలుకలు మొదలయ్యాయి. -
నోబెల్ స్వీకరిస్తా: డిలన్
స్టాక్‌హోం: నోబెల్ సాహిత్య బహుమతి ప్రకటించినా మౌనంగా ఉన్న అమెరికా గేయరచయిత, గాయకుడు బాబ్ డిలన్ ఎట్టకేలకు పెదవి విప్పారు. స్టాక్‌హోంలో డిసెంబరు 10న ఈ అవార్డు అందుకోవాలని అనుకుంటున్నట్లు శుక్రవారం చెప్పారు. మరోవైపు డిలన్ నోబెల్ పురస్కారాల ప్రదానోత్సవానికి రాకపోయినా ఇబ్బందేమీ లేదనీ, ఆయన తరఫున ఏదైనా ఉపన్యాసం, ప్రదర్శన, పాటను ఉత్సవం సమయంలో అందించినా చాలని స్వీడిష్ అకాడమీ పేర్కొంది. అక్టోబరు 13న సాహిత్య నోబెల్ బహుమతి ప్రకటించాక, పలుమార్లు ఫోన్లో బాబ్డిలన్ను సంప్రదించేందుకు ప్రయత్నించగా ఆయన స్పందించలేదని స్వీడిష్ అకాడమీ సభ్యుడు గతంలో ఫిర్యాదు చేశారు. బాబ్‌డిలన్ బహుమతిని అందుకునే ఉద్దేశంతో ఉన్నారో లేదో కూడా తెలియజేయలేదనీ, ఇది ఆయన అహంకారానికి ప్రతీక అని ఆ సభ్యుడు ఆరోపించారు. -
బాబ్ డిలాన్ 'నోబెల్'ను అంగీకరించినట్లేనా?
కాలిఫోర్నియా: ప్రముఖ గాయకుడు, కవి బాబ్ డిలాన్‌కు ప్రతిష్టాత్మక నోబెల్ పురస్కారం ప్రకటించి వారం గడుస్తున్నా దానిపై ఆయన పెదవి విప్పలేదు. దీంతో స్విడిష్ అకాడమీ తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగుతున్నాయి. 'కనీసం గ్రహీతకు కూడా అవార్డు ఇచ్చిన సంగతి చెప్పరా?' అని పలువురు ప్రశ్నిస్తున్నారు. మరికొందరు మాత్రం బాబ్ డిలాన్ నోబెల్‌ను తిరస్కరిస్తారని అంటున్నారు. ఈ నేపథ్యంలో బాబ్ డిలాన్ అధికారిక వెబ్సైట్లో చోటుచేసుకున్న మార్పులు స్విడిష్ అకాడమీకి ఊరటనిచ్చాయి. కెరీర్ ప్రారంభం నుంచి 2012 వరకు బాబ్ డిలాన్ రచించి, పాడిన పాటల సమాహరం 'ది లిరిక్స్ 1961-2012' పుస్తకానికి గానూ ఆయనకు నోబెల్ సాహిత్య పురస్కారం లభించిన సంగతి తెలిసిందే. కాగా, సోమవారం నుంచి ఆ పుస్తకానికి సంబంధించిన ప్రచార వాక్యాల్లో 'నోబెల్ లిటరేచర్ అవార్డు పొందిన పుస్తకం'అని బాబ్ అధికారిక వెబ్సైట్లో పేర్కొన్నారు. పురస్కారంపై ఇప్పటి వరకు పెదవి విప్పని బాబ్.. ఈ చర్యతో నోబెల్ ను అంగీకరించినట్లు ప్రకటించారని స్విడిష్ అకాడమీ వర్గాలు సంబరపడుతున్నాయి. (తప్పక చదవండి: ‘నోబెల్’కు నగుబాటు!) అవార్డు ప్రకటించిన విషయాన్ని బాబ్ డిలాన్‌కు నేరుగా చేరవేసే ప్రక్రియకు మంగళవారంతో మంగళంపాడినట్లు స్విడిష్ అకాడమీ శాశ్వత ప్రతినిధులు సారా డేనియస్ ప్రకటించారు. అయితే డిసెంబర్ 10న స్టాక్ హోంలో జరగబోయే నోబెల్ పురస్కార ప్రదాన కార్యక్రమానికి బాబ్ డిలాన్ వస్తారా? రారా? అన్న విషయంపై ఇంకా స్పష్టత రాలేదని ఆమె చెప్పారు. గతంలోనూ కొందరు నోబెల్ సాహితీ గ్రహీతలు.. పురస్కార ప్రదాన కార్యక్రమానికి గౌర్హాజరయ్యారని, ఇద్దరు కవులు మాత్రం ఏకంగా అవార్డునే తిరస్కరించారని గుర్తుచేశారు.