జీన్ క్లాడ్ ఆర్నాల్ట్
కొపెన్‌హెగన్: ప్రఖ్యాత నోబెల్ సాహిత్య బహుమతిని అందించే స్వీడిష్ అకాడమీ ఖ్యాతి మసకబారింది. అకాడమీలో మాజీ సభ్యురాలి భర్తపై వచ్చిన అత్యాచార ఆరోపణలు రుజువు కావడంతో స్వీడన్ కోర్టు సోమవారం అతణ్ని దోషిగా తేల్చి రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ఫ్రెంచ్ పౌరుడు, స్వీడన్‌లో ప్రముఖ కళాకారుడిగా గుర్తింపు ఉన్న జీన్ క్లాడ్ ఆర్నాల్ట్.. కవయిత్రి, స్వీడిష్ అకాడమీ మాజీ సభ్యురాలైన కేథరీనా ఫ్రోస్టెన్సన్‌ను పెళ్లాడాడు.
ఆర్నాల్ట్ తమపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని అకాడమీ కార్యాలయంలో పనిచేసే 18 మంది యువతులు గతంలో ఓ వార్తా పత్రికకు వెల్లడించి సంచలనం సృష్టిం చారు. నోబెల్ విజేతల పేర్లను అనేకసార్లు ముందుగానే వెల్లడించేందుకు ఆర్నాల్ట్ లంచం తీసుకున్నాడనే ఆరోపణలు కూడా ఉన్నప్పటికీ వాటిపై విచారణ జరుగుతుందో లేదో కూడా సమాచారం తెలియరాలేదు. ఆర్నాల్ట్‌పై లైంగిక వేధింపులు, ఆర్థిక కుంభకోణాల ఆరోపణలు రావడంతో అకాడమీ శాశ్వత సభ్యుల్లో చీలిక ఏర్పడి ఈ ఏడాది ఏప్రిల్‌లో ఆర్నాల్ట్ భార్య సహా ఏడుగురు సభ్యులు అకాడమీ నుంచి వైదొలగడం తెలిసిందే. ఈ ఏడాది నోబెల్ సాహిత్య బహుమతి ఉండబోదని మే నెలలోనే అకాడమీ ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment