
శిక్ష నిరవధిక వాయిదా
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన రిపబ్లికన్ పార్టీ నాయకుడు డొనాల్డ్ ట్రంప్‌కు కేసుల నుంచి భారీ ఉపశమనం లభిస్తోంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హష్ మనీ కేసులో దోషిగా తేలిన ట్రంప్‌కు శిక్షను న్యాయస్థానం నిరవధికంగా వాయిదా వేసింది. వాస్తవానికి ఈ కేసులో న్యూయార్క్ కోర్టు ఆయనకు నవంబర్ నెలలోనే శిక్ష ఖరారు చేయాల్సి ఉంది.
అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధించడంతో కేసుల విషయంలో విచారణ ఎదుర్కోకుండా ఆయనకు రక్షణ ఉంటుందని సుప్రీంకోర్టు ఇప్పటికే స్పష్టంచేసింది. ఈ నేపథ్యంలోనే హష్ మనీ కేసును కొట్టివేయాలని కోరుతూ ఆయన తరపు న్యాయవాదులు న్యూయార్క్ కోర్టును ఆశ్రయించారు. దీంతో శిక్షపై స్టే కోసం దరఖాస్తు చేయాలని న్యాయస్థానం సూచించింది. ట్రంప్‌కు ఇది భారీ విజయమని ఆయన తరఫు ప్రతినిధులు చెప్పారు.
శృంగార తార స్టార్మీ డేనియల్స్‌తో ట్రంప్ ఏకాంతంగా గడిపినట్లు ఆరోపణలు వచ్చాయి. 2016లో జరిగిన అధ్యక్ష ఎన్నికల సమయంలో ఆమె నోరువిప్పకుండా చేయడానికి రిపబ్లికన్ పార్టికి విరాళంగా అందిన సొమ్ము నుంచి డబ్బులు చెల్లించారని బయటపడింది. ట్రంప్ తన లాయర్ ద్వారా 1.30 లక్షల డాలర్లు ఇచ్చినట్లు రుజువైంది. అంతేకాదు స్టార్మీ డేనియల్స్‌కి చెల్లించిన డబ్బుల వివరాలను ట్రంప్ లెక్కల్లో చూపలేదు.

Comments
Please login to add a commentAdd a comment