45 మంది ‘ప్రజాస్వామ్య’ ఉద్యమకారులకు జైలు
తీవ్రంగా ఖండించిన ప్రపంచ దేశాలు
హాంకాంగ్: పార్లమెంట్‌లో తమకు అనుకూలంగా వ్యవహరించే నేతల ఎంపిక కోసం అనధికారికంగా ప్రైమరీ ఎలక్షన్స్ చేపట్టి సమాంతర పార్లమెంటరీ వ్యవస్థ నిర్వహణకు తెగించారంటూ 45 మంది ప్రజాస్వామ్య ఉద్యమకారులు, మాజీ చట్టసభసభ్యులకు హాంకాంగ్ హైకోర్టు కఠిన శిక్షలు విధించింది. వీరికి నాలుగేళ్ల నుంచి పదేళ్ల శిక్షలుపడ్డాయి. పార్లమెంట్‌లో మెజారిటీ సభ్యులను తమ వైపునకు తిప్పుకుని ప్రభుత్వాన్ని నిర్విర్యంచేయాలని కుట్ర పన్నారని హైకోర్టు తన తీర్పులో పేర్కొంది.
తదుపరి పార్లమెంట్ ఎన్నికల్లో గెలిస్తే విపక్షసభ్యులుగా ఉంటూ తర్వాత ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్‌లను తిరస్కరిస్తూ వీటో చేసేందుకు వీరంతా కుట్ర పన్నారని కోర్టు తీర్పులో ప్రస్తావించింది. 2020 జూలై 10, 11వ తేదీల్లో జరిగిన ఈ అనధికార ప్రైమరీ ఎన్నికల్లో 6,10,000 ఓట్లు పోలయ్యాయి. అయితే ఆనాడు అధికార ఎన్నికలను ప్రభుత్వం కోవిడ్ మహమ్మారి విజృంభణ కారణంగా వాయిదా వేయడం తెల్సిందే.
అయితే హాంకాంగ్ చరిత్రలోనే అతిపెద్ద జాతీయ భద్రతా కేసుగా పరిగణించబడిన ఈ కేసులో ఉద్యమకారులపై అన్యాయంగా శిక్షలు మోపారని ప్రపంచ దేశాలు ఖండించాయి. పరోక్షంగా చైనా ఏలుబడిలో ఉన్న హాంకాంగ్‌లో సమాంతర పాలనకు ప్రయత్నించారంటూ 2021 ఏడాదిలో 47 మంది ఉద్యమకారులను ప్రభుత్వం అరెస్ట్‌చేసింది. కఠిన జాతీయ భద్రతా చట్టం–2020 కింద కేసులు నమోదుచేసింది. ఈ చట్టం కింద దోషులుగా తేలితే గరిష్టంగా జీవితఖైదు పడే అవకాశముంది. 47 మందిలో గత ఏడాది ఇద్దరు నిందితులు నిర్దోషులుగా విడుదలయ్యారు.
ఈ ఉదంతంలో సూత్రధారిగా కోర్టు పేర్కొన్న బెన్నీ థాయ్‌కు గరిష్టంగా పదేళ్ల జైలుశిక్షపడింది. మాజీ విద్యార్థి నాయకుడు జోషువా వాంగ్, మాజీ చట్టసభ సభ్యులకూ వేర్వేరు శిక్షలు పడ్డాయి. అయితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర జరుగుతోందన్న విషయంపై తమకు కనీస అవగాహన కూడా లేదని కొందరు నిందితులు కోర్టులో చెప్పడంతో వారికి తక్కువ శిక్షలుపడ్డాయి. 2019లో ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాలు, మీడియాపై కఠిన ఆంక్షలు, ఎన్నికల్లో సాధారణ ప్రజల భాగస్వామ్యాన్ని తగ్గించడం వంటి పరిణామాల తర్వాత ప్రజాస్వామ్య ఉద్యమకారులు ఆనాడు ఇలా అనధికార ప్రైమరీ ఎన్నికలు నిర్వహించారు. దీంతో హాంకాంగ్ ప్రభుత్వం కన్నెర్రజేసింది.
బ్రిటిష్ వలసప్రాంతంగా అభివృద్ధిచెందిన హాంకాంగ్‌పై పాలనాపగ్గాలు 1997లో చైనాకు దఖలుపడ్డాక హాంకాంగ్‌లో నిరంకుశ చట్టాలను డ్రాగన్‌దేశం అమలుచేస్తోందని ప్రపంచదేశాలు తప్పుపట్టడం విదితమే. ‘‘హాంకాంగ్ ప్రాథమిక చట్టం ప్రకారం శాంతియుతంగా తమ నిరసన తెలుపుతున్న ఉద్యమకారులపై కక్షగట్టి ప్రభుత్వం కేసులు బనాయించి ఆగమేఘాల మీద తీర్పు వెలువరించి శిక్షించింది’’అని హాంకాంగ్‌లోని అమెరికా కాన్సులేట్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంది. ఆ్రస్టేలియా, బ్రిటన్, ఐరోపా సమాఖ్యతోపాటు ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్, హ్యూమన్ రైట్స్ వాచ్ వంటి మానవహక్కుల పరిరక్షణా సంస్థలు తీర్పును తీవ్రంగా తప్పుబట్టాయి. అయితే తీర్పును చైనా స్వాగతించింది.
Comments
Please login to add a commentAdd a comment