Primary elections
-
హాంకాంగ్ జాతీయ భద్రతా కేసులో సంచలన తీర్పు
హాంకాంగ్: పార్లమెంట్లో తమకు అనుకూలంగా వ్యవహరించే నేతల ఎంపిక కోసం అనధికారికంగా ప్రైమరీ ఎలక్షన్స్ చేపట్టి సమాంతర పార్లమెంటరీ వ్యవస్థ నిర్వహణకు తెగించారంటూ 45 మంది ప్రజాస్వామ్య ఉద్యమకారులు, మాజీ చట్టసభసభ్యులకు హాంకాంగ్ హైకోర్టు కఠిన శిక్షలు విధించింది. వీరికి నాలుగేళ్ల నుంచి పదేళ్ల శిక్షలుపడ్డాయి. పార్లమెంట్లో మెజారిటీ సభ్యులను తమ వైపునకు తిప్పుకుని ప్రభుత్వాన్ని నిర్విర్యంచేయాలని కుట్ర పన్నారని హైకోర్టు తన తీర్పులో పేర్కొంది. తదుపరి పార్లమెంట్ ఎన్నికల్లో గెలిస్తే విపక్షసభ్యులుగా ఉంటూ తర్వాత ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్లను తిరస్కరిస్తూ వీటో చేసేందుకు వీరంతా కుట్ర పన్నారని కోర్టు తీర్పులో ప్రస్తావించింది. 2020 జూలై 10, 11వ తేదీల్లో జరిగిన ఈ అనధికార ప్రైమరీ ఎన్నికల్లో 6,10,000 ఓట్లు పోలయ్యాయి. అయితే ఆనాడు అధికార ఎన్నికలను ప్రభుత్వం కోవిడ్ మహమ్మారి విజృంభణ కారణంగా వాయిదా వేయడం తెల్సిందే. అయితే హాంకాంగ్ చరిత్రలోనే అతిపెద్ద జాతీయ భద్రతా కేసుగా పరిగణించబడిన ఈ కేసులో ఉద్యమకారులపై అన్యాయంగా శిక్షలు మోపారని ప్రపంచ దేశాలు ఖండించాయి. పరోక్షంగా చైనా ఏలుబడిలో ఉన్న హాంకాంగ్‌లో సమాంతర పాలనకు ప్రయత్నించారంటూ 2021 ఏడాదిలో 47 మంది ఉద్యమకారులను ప్రభుత్వం అరెస్ట్‌చేసింది. కఠిన జాతీయ భద్రతా చట్టం–2020 కింద కేసులు నమోదుచేసింది. ఈ చట్టం కింద దోషులుగా తేలితే గరిష్టంగా జీవితఖైదు పడే అవకాశముంది. 47 మందిలో గత ఏడాది ఇద్దరు నిందితులు నిర్దోషులుగా విడుదలయ్యారు. ఈ ఉదంతంలో సూత్రధారిగా కోర్టు పేర్కొన్న బెన్నీ థాయ్‌కు గరిష్టంగా పదేళ్ల జైలుశిక్షపడింది. మాజీ విద్యార్థి నాయకుడు జోషువా వాంగ్, మాజీ చట్టసభ సభ్యులకూ వేర్వేరు శిక్షలు పడ్డాయి. అయితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర జరుగుతోందన్న విషయంపై తమకు కనీస అవగాహన కూడా లేదని కొందరు నిందితులు కోర్టులో చెప్పడంతో వారికి తక్కువ శిక్షలుపడ్డాయి. 2019లో ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాలు, మీడియాపై కఠిన ఆంక్షలు, ఎన్నికల్లో సాధారణ ప్రజల భాగస్వామ్యాన్ని తగ్గించడం వంటి పరిణామాల తర్వాత ప్రజాస్వామ్య ఉద్యమకారులు ఆనాడు ఇలా అనధికార ప్రైమరీ ఎన్నికలు నిర్వహించారు. దీంతో హాంకాంగ్ ప్రభుత్వం కన్నెర్రజేసింది. బ్రిటిష్ వలసప్రాంతంగా అభివృద్ధిచెందిన హాంకాంగ్‌పై పాలనాపగ్గాలు 1997లో చైనాకు దఖలుపడ్డాక హాంకాంగ్‌లో నిరంకుశ చట్టాలను డ్రాగన్‌దేశం అమలుచేస్తోందని ప్రపంచదేశాలు తప్పుపట్టడం విదితమే. ‘‘హాంకాంగ్ ప్రాథమిక చట్టం ప్రకారం శాంతియుతంగా తమ నిరసన తెలుపుతున్న ఉద్యమకారులపై కక్షగట్టి ప్రభుత్వం కేసులు బనాయించి ఆగమేఘాల మీద తీర్పు వెలువరించి శిక్షించింది’’అని హాంకాంగ్‌లోని అమెరికా కాన్సులేట్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంది. ఆ్రస్టేలియా, బ్రిటన్, ఐరోపా సమాఖ్యతోపాటు ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్, హ్యూమన్ రైట్స్ వాచ్ వంటి మానవహక్కుల పరిరక్షణా సంస్థలు తీర్పును తీవ్రంగా తప్పుబట్టాయి. అయితే తీర్పును చైనా స్వాగతించింది. -
USA presidential election 2024: రేసు నుంచి నిక్కీ హేలీ ఔట్
వాషింగ్టన్: మంగళవారం ఒకేసారి 15 రాష్ట్రాల్లో జరిగిన రిపబ్లికన్ పార్టీ ప్రైమరీ ఎన్నికల్లో ఓటమి చవిచూసిన నేపథ్యంలో పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిత్వం రేసు నుంచి తప్పుకుంటున్నట్లు భారతీయ మూలాలున్న నాయకురాలు నిక్కీ హేలీ బుధవారం ప్రకటించారు. వెర్మాంట్‌లో గెలుపు కాస్తంత ఊరటనిచి్చనా మిగతా అన్ని చోట్ల ఎదురైనా ప్రతికూల ఫలితాలను బేరేజు వేసుకుని ఆమె ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఫలితాల తర్వాత సౌత్ కరోలీనాలో ఆమె మాట్లాడారు. ‘‘నా ప్రచారానికి అర్ధంతరంగా ముగింపు పలకాల్సిన సమయం వచ్చేసింది. అమెరికన్ల గొంతుక గట్టిగా వినిపించాలని భావించా. నా శక్తిమేరకు నేను కృషి చేశా. అనుకున్న కార్యాన్ని పూర్తిచేయలేకపోయా. ఇందులో చింతించాల్సింది ఏమీ లేదు. రేసులో నేను ఉండకపోవచ్చుకానీ నేను నమ్మిన సిద్ధాంతాలను ఇకమీదటా బలంగా వినిపిస్తా’’ అని నిక్కీ హేలీ అన్నారు. -
US presidential election 2024: సొంత రాష్ట్రంలో నిక్కీ హేలీ ఓటమి
చార్లెస్టన్: సొంత రాష్ట్రం సౌత్ కరోలినాలో జరిగిన రిపబ్లికన్ పార్టీ ప్రైమరీలో భారత సంతతికి చెందిన నిక్కీ హేలీ ఓటమి పాలయ్యారు. ఆమెకు 39.4% ఓట్లు పడగా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 59.9% ఓట్లతో నెగ్గారు. అయినా వెనక్కి తగ్గేది లేదని, సూపర్ ట్యూస్ డేలో గట్టిపోటీ ఇస్తానని హేలీ అన్నారు. వరుసగా నాలుగో విజయంతో రిపబ్లికన్ అభ్యర్థిత్వానికి ట్రంప్ విజయా వకాశాలు మెరుగయ్యాయి. అందుకు 1,215 మంది డెలిగేట్ల మద్దతు కావాలి. ఇప్పటిదాకా హేలీ 17, ట్రంప్ 92 డెలిగేట్ల మద్దతు గెలుచుకున్నారు. ఓవైపు వరుస కోర్టు కేసులు వేధిస్తున్నా అయోవా, న్యూ హ్యాంప్‌షైర్, నెవడా రిపబ్లికన్ ప్రైమరీల్లో ట్రంప్ ఇప్పటికే విజయం సాధించడం తెలిసిందే. -
US presidential election 2024: ప్రైమరీలో ట్రంప్‌కు మరో గెలుపు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వం కోసం జరుగుతున్న ప్రైమరీల్లో డొనాల్డ్ ట్రంప్ మరో కీలక ముందడుగు వేశారు. ఇప్పటికే అయోవా ప్రైమరీలో గెల్చిన ఆయన బుధవారం న్యూ హ్యాంప్‌షైర్ ప్రైమరీలోనూ నెగ్గారు. అయితే భారతీయ అమెరికన్ నాయకురాలు నిక్కీ హేలీ ఆయనకు గట్టిపోటీ ఇచ్చారు. ట్రంప్‌కు 55 శాతానికి పైగా ఓట్లు రాగా ఆమె 44 శాతం సాధించారు. న్యూ హ్యాంప్‌షైర్ ప్రైమరీని మూడుసార్లు గెలిచిన తొలి రిపబ్లికన్ ప్రైమరీ అభ్యర్థిగా ట్రంప్ చరిత్ర సృష్టించారు. ట్రంప్కిస్తే గెలుపు బైడెన్‌దే: హేలీ తాజా ఫలితాలపై నిక్కీ హేలీ మాట్లాడారు. ‘హ్యాంప్‌షైర్‌లో గెల్చిన ట్రంప్‌కు శుభాకాంక్షలు. అయినా ఇంకా డజన్ల కొద్దీ రాష్ట్రాల ప్రైమరీ ఎన్నికలు జరగాల్సే ఉంది. పార్టీ ఓటర్ల అంతిమ తీర్పు వెలువడటానికి ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది. ఈ పోటీలో నేను చిట్టచివరిదాకా పోరా డతా. రేస్‌లో కొనసాగుతా. ఈ పోరు మొదలైనప్పుడు రేసులో మొత్తం 14 మంది ఉండేవాళ్లం. నాకు రెండు శాతం ఓట్లు వచ్చేవి. ఇప్పుడు ట్రంప్‌కు గట్టి పోటీ ఇస్తున్నది నేను మాత్రమే’ అని హేలీ ప్రసంగించారు. ‘‘ట్రంప్‌కు రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థిత్వం దక్కాలని డెమొక్రాట్లు కోరుకుంటున్నారు. ట్రంప్‌ను అయి తే తేలిగ్గా ఓడించవచ్చని వారి ఆశ. నిజంగా ట్రంప్‌కు అభ్యర్థిత్వం దక్కి తే బైడెన్, కమలా హ్యారిస్‌ల విజయం తథ్యం’’ అని హేలీ అన్నారు. మరోవైపు, ‘‘ఈ రోజు హేలీకి కాళరాత్రి. అయినా తానే గెల్చినట్లు ప్రసంగాలు దంచేస్తోంది’’ అని ట్రంప్ ఎద్దేవా చేశారు. సౌత్ కరోలినాలో డెమొక్రటిక్ పార్టీ ప్రైమరీలో అధ్యక్షుడు బైడెన్ నెగ్గారు. -
ప్రైమరీల్లో అరుణ మిల్లర్ ఓటమి
వాషింగ్టన్: అమెరికా ప్రతినిధుల సభలో అడుగు పెట్టాలనుకుంటున్న భారత సంతతి అమెరికన్లకు ఎదురుదెబ్బ తగిలింది. మంగళవారం జరిగిన డెమొక్రటిక్ పార్టీ ప్రైమరీ ఎన్నికల్లో ఆరుగురు భారత సంతతి అభ్యర్థులు ఓడిపోయారు. మేరిల్యాండ్లోని ఆరవ కాంగ్రెషనల్ జిల్లాకు జరిగిన పార్టీ ప్రైమరీ ఎన్నికల్లో భారత సంతతి అమెరికన్, హైదరాబాద్‌లో పుట్టిన అరుణ మిల్లర్(53), వ్యాపారవేత్త డేవిడ్ ట్రోనే చేతిలో ఓడిపోయారు. న్యూయార్క్ 12వ కాంగ్రెషనల్ ఎన్నికల్లో ఇండో–అమెరికన్ సూరజ్ పటేల్ ఓటమి చవిచూశారు. మేరిల్యాండ్ 8వ కాంగ్రెషనల్ జిల్లా ప్రైమరీ ఎన్నికల్లో ఉత్తమ్ పాల్ 3.7 శాతం ఓట్లతో ఘోర ఓటమిని చవిచూశారు. న్యూయార్క్ 11వ కాంగ్రెషనల్ జిల్లా ప్రైమరీలో ఇండో అమెరికన్లు ఒమర్ వైద్, రాధాకృష్ణ మోహన్‌లు 3,4 స్థానాల్లో నిలిచారు. కొలరెడోలో మొదటి కాంగ్రెషనల్ జిల్లా ప్రైమరీలో సైరారావు ఓడిపోయారు. నవంబర్ 6న అమెరికా ప్రతినిధుల సభలోని 435 సీట్లకు, సెనేట్‌లోని 100 స్థానాలకు గానూ 33 చోట్ల ఎన్నికలు జరగనున్నాయి. ప్రైమరీ విజేతలే ఈ ఎన్నికల్లో పోటీ చేస్తారు. జో క్రౌలీ పరాజయం అమెరికా ప్రతినిధుల సభలో భారత్‌కు మద్దతుదారుగా ఉన్న జో క్రౌలీ మంగళవారం జరిగిన ప్రైమరీ ఎన్నికల్లో ఓడిపోయారు. డెమొక్రటిక్ పార్టీకి గట్టిపట్టున్న న్యూయార్క్‌లో క్రౌలీని సోషలిస్ట్ నేత అలెగ్జాండ్రియా ఒకాసియో ఓడించారు. భారత్–అమెరికా సత్సంబంధాల కోసం క్రౌలీ కృషిచేశారు. -
అయోవా ‘ప్రాథమికం’లో ట్రంప్ ఓటమి
వాషింగ్టన్: ‘శ్వేతసౌధం’ బరిలో నిలిచే వ్యక్తులెవరో తేల్చే ప్రాథమిక ఎన్నికల పోరు ప్రారంభమైంది. అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వ ఎన్నికల రేసులో ముందంజలో ఉన్న వ్యాపారవేత్త, రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌కు అయోవా రాష్ట్రంలో సోమవారం జరిగిన ప్రాథమిక ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగిలింది. ట్రంప్‌పై రిపబ్లికన్ పార్టీకే చెందిన అభ్యర్థి, టెక్సాస్ సెనేటర్ టెడ్ క్రూజ్ అనూహ్య విజయం సాధించారు. ట్రంప్‌కు 24 శాతం, క్రూజ్‌కు 28 శాతం ఓట్లు లభించాయి. మొత్తంగా 6 వేలకుపైగా ఓట్ల మెజారిటీతో క్రూజ్ గెలుపొందారు. మరోవైపు అమెరికా తొలి మహిళా అధ్యక్షురాలిగా ఎన్నికయ్యేందుకు ఉవ్విళ్లూరుతున్నడెమోక్రాట్ అధ్యక్ష అభ్యర్థి హిల్లరీ క్లింటన్ అయోవా ప్రాథమిక ఎన్నికల్లో విజయం సాధించారు. తన పార్టీకి చెందిన వెర్మౌంట్ సెనేటర్ బెర్నీ శాండర్స్‌పై స్వల్ప తేడాతో విజయం సాధించారు. మొత్తం పోలైన ఓట్లలో 49 శాతం ఓట్లు శాండర్స్‌కు, హిల్లరీకి 50 శాతం ఓట్లు లభించాయి.