అరుణ మిల్లర్
వాషింగ్టన్: అమెరికా ప్రతినిధుల సభలో అడుగు పెట్టాలనుకుంటున్న భారత సంతతి అమెరికన్లకు ఎదురుదెబ్బ తగిలింది. మంగళవారం జరిగిన డెమొక్రటిక్ పార్టీ ప్రైమరీ ఎన్నికల్లో ఆరుగురు భారత సంతతి అభ్యర్థులు ఓడిపోయారు. మేరిల్యాండ్‌లోని ఆరవ కాంగ్రెషనల్ జిల్లాకు జరిగిన పార్టీ ప్రైమరీ ఎన్నికల్లో భారత సంతతి అమెరికన్, హైదరాబాద్‌లో పుట్టిన అరుణ మిల్లర్(53), వ్యాపారవేత్త డేవిడ్ ట్రోనే చేతిలో ఓడిపోయారు. న్యూయార్క్ 12వ కాంగ్రెషనల్ ఎన్నికల్లో ఇండో–అమెరికన్ సూరజ్ పటేల్ ఓటమి చవిచూశారు.
మేరిల్యాండ్ 8వ కాంగ్రెషనల్ జిల్లా ప్రైమరీ ఎన్నికల్లో ఉత్తమ్ పాల్ 3.7 శాతం ఓట్లతో ఘోర ఓటమిని చవిచూశారు. న్యూయార్క్ 11వ కాంగ్రెషనల్ జిల్లా ప్రైమరీలో ఇండో అమెరికన్లు ఒమర్ వైద్, రాధాకృష్ణ మోహన్‌లు 3,4 స్థానాల్లో నిలిచారు. కొలరెడోలో మొదటి కాంగ్రెషనల్ జిల్లా ప్రైమరీలో సైరారావు ఓడిపోయారు. నవంబర్ 6న అమెరికా ప్రతినిధుల సభలోని 435 సీట్లకు, సెనేట్‌లోని 100 స్థానాలకు గానూ 33 చోట్ల ఎన్నికలు జరగనున్నాయి. ప్రైమరీ విజేతలే ఈ ఎన్నికల్లో పోటీ చేస్తారు.
జో క్రౌలీ పరాజయం
అమెరికా ప్రతినిధుల సభలో భారత్‌కు మద్దతుదారుగా ఉన్న జో క్రౌలీ మంగళవారం జరిగిన ప్రైమరీ ఎన్నికల్లో ఓడిపోయారు. డెమొక్రటిక్ పార్టీకి గట్టిపట్టున్న న్యూయార్క్‌లో క్రౌలీని సోషలిస్ట్ నేత అలెగ్జాండ్రియా ఒకాసియో ఓడించారు. భారత్–అమెరికా సత్సంబంధాల కోసం క్రౌలీ కృషిచేశారు.
Comments
Please login to add a commentAdd a comment