Democracy movements
-
హాంకాంగ్ జాతీయ భద్రతా కేసులో సంచలన తీర్పు
హాంకాంగ్: పార్లమెంట్లో తమకు అనుకూలంగా వ్యవహరించే నేతల ఎంపిక కోసం అనధికారికంగా ప్రైమరీ ఎలక్షన్స్ చేపట్టి సమాంతర పార్లమెంటరీ వ్యవస్థ నిర్వహణకు తెగించారంటూ 45 మంది ప్రజాస్వామ్య ఉద్యమకారులు, మాజీ చట్టసభసభ్యులకు హాంకాంగ్ హైకోర్టు కఠిన శిక్షలు విధించింది. వీరికి నాలుగేళ్ల నుంచి పదేళ్ల శిక్షలుపడ్డాయి. పార్లమెంట్లో మెజారిటీ సభ్యులను తమ వైపునకు తిప్పుకుని ప్రభుత్వాన్ని నిర్విర్యంచేయాలని కుట్ర పన్నారని హైకోర్టు తన తీర్పులో పేర్కొంది. తదుపరి పార్లమెంట్ ఎన్నికల్లో గెలిస్తే విపక్షసభ్యులుగా ఉంటూ తర్వాత ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్లను తిరస్కరిస్తూ వీటో చేసేందుకు వీరంతా కుట్ర పన్నారని కోర్టు తీర్పులో ప్రస్తావించింది. 2020 జూలై 10, 11వ తేదీల్లో జరిగిన ఈ అనధికార ప్రైమరీ ఎన్నికల్లో 6,10,000 ఓట్లు పోలయ్యాయి. అయితే ఆనాడు అధికార ఎన్నికలను ప్రభుత్వం కోవిడ్ మహమ్మారి విజృంభణ కారణంగా వాయిదా వేయడం తెల్సిందే. అయితే హాంకాంగ్ చరిత్రలోనే అతిపెద్ద జాతీయ భద్రతా కేసుగా పరిగణించబడిన ఈ కేసులో ఉద్యమకారులపై అన్యాయంగా శిక్షలు మోపారని ప్రపంచ దేశాలు ఖండించాయి. పరోక్షంగా చైనా ఏలుబడిలో ఉన్న హాంకాంగ్‌లో సమాంతర పాలనకు ప్రయత్నించారంటూ 2021 ఏడాదిలో 47 మంది ఉద్యమకారులను ప్రభుత్వం అరెస్ట్‌చేసింది. కఠిన జాతీయ భద్రతా చట్టం–2020 కింద కేసులు నమోదుచేసింది. ఈ చట్టం కింద దోషులుగా తేలితే గరిష్టంగా జీవితఖైదు పడే అవకాశముంది. 47 మందిలో గత ఏడాది ఇద్దరు నిందితులు నిర్దోషులుగా విడుదలయ్యారు. ఈ ఉదంతంలో సూత్రధారిగా కోర్టు పేర్కొన్న బెన్నీ థాయ్‌కు గరిష్టంగా పదేళ్ల జైలుశిక్షపడింది. మాజీ విద్యార్థి నాయకుడు జోషువా వాంగ్, మాజీ చట్టసభ సభ్యులకూ వేర్వేరు శిక్షలు పడ్డాయి. అయితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర జరుగుతోందన్న విషయంపై తమకు కనీస అవగాహన కూడా లేదని కొందరు నిందితులు కోర్టులో చెప్పడంతో వారికి తక్కువ శిక్షలుపడ్డాయి. 2019లో ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాలు, మీడియాపై కఠిన ఆంక్షలు, ఎన్నికల్లో సాధారణ ప్రజల భాగస్వామ్యాన్ని తగ్గించడం వంటి పరిణామాల తర్వాత ప్రజాస్వామ్య ఉద్యమకారులు ఆనాడు ఇలా అనధికార ప్రైమరీ ఎన్నికలు నిర్వహించారు. దీంతో హాంకాంగ్ ప్రభుత్వం కన్నెర్రజేసింది. బ్రిటిష్ వలసప్రాంతంగా అభివృద్ధిచెందిన హాంకాంగ్‌పై పాలనాపగ్గాలు 1997లో చైనాకు దఖలుపడ్డాక హాంకాంగ్‌లో నిరంకుశ చట్టాలను డ్రాగన్‌దేశం అమలుచేస్తోందని ప్రపంచదేశాలు తప్పుపట్టడం విదితమే. ‘‘హాంకాంగ్ ప్రాథమిక చట్టం ప్రకారం శాంతియుతంగా తమ నిరసన తెలుపుతున్న ఉద్యమకారులపై కక్షగట్టి ప్రభుత్వం కేసులు బనాయించి ఆగమేఘాల మీద తీర్పు వెలువరించి శిక్షించింది’’అని హాంకాంగ్‌లోని అమెరికా కాన్సులేట్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంది. ఆ్రస్టేలియా, బ్రిటన్, ఐరోపా సమాఖ్యతోపాటు ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్, హ్యూమన్ రైట్స్ వాచ్ వంటి మానవహక్కుల పరిరక్షణా సంస్థలు తీర్పును తీవ్రంగా తప్పుబట్టాయి. అయితే తీర్పును చైనా స్వాగతించింది. -
బాహుబలి 3
మహేంద్ర బాహుబలి పాలనలో మాహిష్మతి రాజ్య ప్రజలు సుఖశాంతులతో జీవిస్తున్నారు. కొంతకాలం గడిచాక మాత్రం రాజ్యంలో దోపిడీలు, దొమ్మీలు ఎక్కువయ్యాయి. ఇదంతా ఒక ఎత్తయితే ప్రజలు ప్రజాస్వామ్యం కోసం ఉద్యమించడం మరో ఎత్తు. ‘డెమోక్రసీ మూమెంట్’లో ప్రజలు చురుగ్గా పాల్గొంటున్నారు. సకల జనుల సమ్మెతో మాహిష్మతి పాలనా యంత్రాంగం స్తంభించిపోయింది. ఈ ఉద్యమాలకు సింగమలై అనే వ్యక్తి నాయకత్వం వహిస్తున్నట్లు ఇంటెలీజెన్స్ డిపార్ట్మెంట్ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ‘‘ఎన్నాళ్లీ రాజుల పాలన? అమరేంద్ర బాహుబలి పోతే మహేంద్ర బాహుబలి, అతడు పోతే సురేంద్ర బహుబలి అతడు పోతే వీరేంద్ర బాహుబలి...ఇదేనా వరుస? కామన్ మెన్ కామన్ మెన్‌గానే ఉండాలా? మన ఎల్లయ్యో, పుల్లయ్యో ఈ మాహిష్మతికి ఎందుకు రాజు కాకూడదు? సిక్స్‌ప్యాక్ ఉన్నవాళ్లు మాత్రమే సీటు మీద కూర్చోవాలని ఏ శాసనం చెబుతుంది?’’ అంటూ నిప్పులు చెరుగుతున్నాడు సింగమలై. ‘రాజుల పాలన అంతరించాలి. ప్రజాస్వామ్యం వర్థిల్లాలి’ అంటూ ప్రజలు పెద్ద పెట్టున నినాదాలు ఇస్తున్నారు. ‘‘ఈ సింగమలై ఎవడు? అసలు ఈ పేరు మన రాజ్యప్రజలు పెట్టుకునే పేరులా లేదే? అతను ఎవరో, అతని పుట్టుపూర్వోత్తారాలు ఏమిటో నాకు తక్షణం తెలియాలి’’ అని ఇంటెలీజెన్స్ డిపార్ట్మెంట్ను ఆదేశించాడు మహేంద్రబాహుబలి. కానీ నెలరోజులు గడిచినా ఈ ‘సింగమలై’ గురించి సింగిల్ వర్డ్ కూడా కనిపెట్టలేకపోయింది ఇంటెలీజెన్స్ డిపార్ట్మెంట్. ఒకరోజు... ‘‘మీ దర్శనం కోసం ఎవరో యువకుడు వేచి చూస్తున్నాడు. లోనికి రమ్మంటారా?’’ మహేంద్ర బాహుబలిని అనుమతి కోరాడు భటుడు.‘‘నా మూడ్ ఏమీ బాగలేదు. అయినా సరే రమ్మను. ఎవడి బుర్రలో ఏ ఐడియా ఉందో’’ ఆదేశించాడు రాజు. ఆ యువకుడు వచ్చి మహేంద్ర బాహుబలి ముందు నిలుచున్నాడు.‘‘ఎవరు నువ్వు?’’ ఉక్కు స్వరంతో అడిగాడు మహేంద్ర బాహుబలి.‘‘రాజా...బాహుబలి–1 ఏ ప్రశ్నతో ముగిసింది?’’ రాజును సూటిగా అడిగాడు ఆ యువకుడు.‘‘ప్రశ్నకు ప్రశ్న సమాధానం కాదు. అయినా సరే నీ ప్రశ్నకు జవాబు ఇస్తున్నాను... బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు? అనే ప్రశ్నతో ‘బాహుబలి–1’ ముగుస్తుంది. ఇప్పుడు చెప్పు నువ్వు ఎవరు?’’ అడిగాడు రాజు. అప్పుడు స్వరం పెంచిన ఆ యువకుడు ఇలా అన్నాడు... ‘‘బాహుబలి–2 మాత్రం ఏ ప్రశ్నతోనూ ముగియలేదు. పైగా కన్‌క్లూజన్ అని కూడా చెబుతుంది. కానీ అది నిజం కాదు మహారాజా...ఒక సంచలన రహస్యం చెప్పకుండానే బాహుబలి–2 ముగిసింది. ఇది రాజమౌళి కుట్ర అని నేను అనుకోవడం లేదు. కచ్చితంగా కరణ్ జోహార్ కుట్రే’’ ‘‘సరే, ఆ కుట్ర గురించి సుత్తి లేకుండా సూటిగా చెప్పు’’ ఆదేశించాడు మహేంద్ర బాహుబలి.‘‘అలాగే చెబుతాను మహారాజా... ముందు నన్ను నేను పరిచయం చేసుకుంటాను. నా పేరు మట్టప్ప’’ అన్నాడు యువకుడు.‘‘కొంపదీసి మా కట్టప్పకు దూరపు చుట్టం కాదు కదా?’’ ఆశ్చర్యంగా ఆరా తీశాడు మహేంద్ర బాహుబలి.‘‘దూరపు బంధువుని కాదు... దగ్గరి బంధువుని కాదు... స్వయానా కట్టప్ప కన్న కొడుకును. నాకు మట్టప్ప అని ఆయనే పేరు పెట్టారు. నా బుర్రలో ఉందంతా మట్టేనని ఈ పేరు పెట్టలేదు మహారాజా... ఎదురొచ్చిన శత్రువులను ధైర్యంగా మట్టుపెట్టాలని మట్టప్ప అని పేరు పెట్టారు’’ వివరించాడు మట్టప్ప. ‘‘నీ బ్రెయిన్ దొబ్బినట్లుంది. కట్టప్పకు మ్యారేజ్ కాలేదన్న విషయం మాహిష్మతికే కాదు...యావత్ ప్రపంచానికి తెలుసు’’ విసుగ్గా అన్నాడు రాజు.‘‘అదే పొరపాటు. కట్టప్పగారు సుట్టమ్మ అనే యువతిని ప్రేమించాడు. ఈ విషయం రమ్యకృష్ణకు తెలిస్తే బాగుండదని రహస్య వివాహం చేసుకున్నాడు. కట్టప్ప–సుట్టమ్మలకు పుట్టిన సంతానమే నేను. మీకు డౌటు ఉంటే డీఎన్ఏ టెస్ట్ కూడా చేసుకోవచ్చు మహారాజా’’ సవాలు విసిరాడు మట్టప్ప.‘‘హండ్రెడ్ పర్సంట్ నమ్ముతున్నాను. అది సరే, ఇలా సడన్‌గా ఊడిపడ్డావేమిటి?’’ అడిగాడు బాహుబలి.‘‘ ఇంట్లో ఖాళీగా కూర్చునే బదులు ఏదైనా ఉద్యోగం చూసుకోవచ్చు కదా! అని అమ్మ తిడుతుంటే ఉద్యోగం వెదుక్కోవడానికి ఇలా వచ్చాను. ఏదైనా ఉద్యోగం ఇప్పించండి మహారాజా’’ దీనంగా వేడుకున్నాడు మట్టప్ప. ‘‘నీకు ‘ప్ర.ర.అ’ అనే పదవి ఇస్తున్నాను’’ అన్నాడు బాహుబలి.‘‘అదేం పోస్ట్ మహారాజా... ప్ర.ర.అ అంటే పాగల్‌గా అన్నట్లుగా వినిపిస్తోంది’’ సందేహంగా అడిగాడు మట్టప్ప. ‘‘ప్ర.ర.అ అంటే ప్రజా రక్షణ అధికారి అని. ఇది క్యాబినెట్ ర్యాంక్ పోస్ట్. పండుగచేస్కో’’ అని మట్టప్ప భుజం తట్టాడు బాహుబలి. ఆనందభాష్పాలతో రాజుకు కృతజ్ఞతలు తెలిపాడు మట్టప్ప.‘‘నువ్వు అర్జంటుగా చేయాల్సిన పని ఆ సింగమలై ఎవడో కనిపెట్టడం. ఆ పనిలోనే ఉండు. వెళ్లు’’ అని ఆదేశించాడు మహేంద్ర బాహుబలి. రెండో రోజు బాహుబలి దగ్గరకు వచ్చిన మట్టప్ప ‘‘ఆ సింగమలై ఎవడో కనిపెట్టేశా మహారాజా’’ అన్నాడు ఆనందంగా. ‘‘తండ్రికి తగ్గ కొడుకువు అనిపించావు మట్టప్పా. ఇంతకీ ఆ సింగమలై ఎవరు?’’ ఆసక్తిగా అడిగాడు బాహుబలి.‘‘బాహుబలి–2 గురించి తెలుసుకదా మీకు. అందులో భల్లాలదేవకు పెళ్లికాకుండానే భద్ర అనే కొడుకు ఉంటాడు. ఇదేలా సాధ్యం? అని అప్పట్లో పెద్ద చర్చ కూడా జరిగింది. భద్ర అనేవాడు ఫేక్ సన్. అనగా నకిలీ కుమారుడు. నిజానికి భల్లాలదేవకు పెళ్లి అయింది. అది కూడా మా నాన్నలాగే సీక్రెట్ మ్యారేజ్. ఎమీ జాక్సనీ అనే యువతిని భల్లాలదేవ రహస్యంగా పెళ్లి చేసుకున్నాడు. వారికి పుట్టిన సంతానమే ఈ సింగమలై. వీడి అసలు పేరు...ప్రభుదేవా! యుద్ధంలో ఎలాగు మీతో గెలవలేడు కాబట్టి, ప్రజలను ఆయుధంగా మలుచుకొని సింగమలై పేరుతో ముందుకు వచ్చాడు. వీడిని చంపడం మాట అలా ఉంచండి... చిన్న మాట అన్నాసరే... మనోభావాలు దెబ్బతింటాయి. ప్రజలు ఆగ్రహోదగ్రులవుతారు. రాజ్యం అల్లకల్లోలం అవుతుంది. ముందు నుయ్యి వెనుక గొయ్యి అంటే ఇదే మహారాజా’’ తాను చెప్పాల్సింది చెప్పాడు మట్టప్ప.మహేంద్ర బాహుబలి కళ్లు అగ్నిగుండాల య్యాయి. పిడికిళ్లు గట్టిగా బిగుసుకున్నాయి. ‘అశుభం’ అనే కార్డు తెర మీద పడడంతో ‘బాహుబలి–3’ సినిమా ముగిసింది. – యాకూబ్ పాషా -
విప్లవాల పురిటిగడ్డ పారిస్
పారిస్ అపురూప సౌందర్యానికే కాదు, అరుదైన విప్లవాలకు, ఉద్యమాలకు కేంద్రం, విప్లవాలకు పురిటి గడ్డ. 1789 ఫ్రెంచి విప్లవంలో అది ప్రపంచానికి స్వేచ్ఛ, సమానత్వం, సోదరత్వాల సందేశాన్ని అందించింది. 1871 విప్లవంలో రెండు నెలలే ఉనికిలో ఉన్న పారిస్ కమ్యూన్ ప్రపంచవ్యాప్తంగా విప్లవోద్యమాలకు, ప్రజాస్వామిక వ్యవస్థలకు మార్గదర్శి అయ్యింది. ఇక 1969 పారిస్ విద్యార్థి ఉద్యమం లాటిన్ అమెరికా, ఆసియా, ఆఫ్రికా దేశాల విప్లవోద్యమాలకు సైద్ధాంతిక బలాన్నిచ్చింది. నేటి లాటిన్ అమెరికన్ తరహా నూతన కమ్యూనిస్టు, సోషలిస్టు, ప్రజాస్వామ్య ఉద్యమాలకు అది ఒక దిశను అందించింది. సుందర స్వప్నసీమ ఏదైనా నిజంగా ఉందంటే అది పారిస్ మాత్రమేనని ఆ నగరాన్ని సందర్శించిన వారెవ రికైనా అనిపిస్తుంది. పారిస్ ప్రపంచంలోనే అతి విశిష్ట నగరంగా నిలవడానికి ఆ నగర చారిత్రక వారసత్వ సంపద, అది సాధించిన సాహితీ సాంస్కృతిక పురోగతి కూడా కారణం. క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం నుంచి పారిస్ ఉనికిలో ఉన్నట్టు ఆధారాలున్నాయి. ‘పారిసీ’ అనే తెగ ప్రజల ఆవాసంగా, వారు నిర్మించిన నగరంగా దానికి పారిస్ పేరు వచ్చింది. సైన్ నది ఒడ్డునున్న ఆ నగరం వ్యాపార, వాణిజ్యాలకు ఎంతో అనుకూలమైనది కావడంతో వేగంగా వృద్ధి చెందింది. క్రీస్తు శకం 3వ శతాబ్దిలో అక్కడ క్రైస్తవం వ్యాప్తి చెందింది. క్రీస్తు శకం 12వ శతాబ్ది నుంచి ఆ నగరం ఆధునిక పోకడలను సంతరించుకున్నది. పారిస్ విశ్వవిద్యాల యాన్ని నెలకొల్పింది కూడా అప్పుడే. ఫ్రాన్స్ యుద్ధాల న్నిటిలో పారిస్ నగరం కీలక పాత్రను పోషించింది. 18వ శతాబ్దంలో అది పలు శాస్త్ర, సాంకేతిక ఆవిష్కరణలకు వేదికయ్యింది. 1783, నవంబర్ 21న మాంట్గోల్ ఫైర్ బ్రదర్స్ వేడి గాలి బుడగతో తొట్ట తొలి విమాన ప్రయోగం చేసినది అక్కడే. 1789 ఫ్రెంచ్ విప్లవంలో పారిస్... స్వేచ్ఛ, సమానత్వం, సోదరత్వాల సందేశాన్ని ప్రపంచానికి చాటింది. 1830లో మొట్టమొదటి రాజ్యాం గబద్ధ రాచరిక వ్యవస్థ పారిస్‌లోనే ఏర్పడింది. 1870- 71 ఫ్రాంకో-ప్రష్యన్ యుద్ధంలో పారిస్ నగరం బందీగా మారింది. ఆ క్రూరమైన అణచివేత నుంచే పారిస్ కార్మిక వర్గం తిరుగుబాటు చేసి మొట్టమొదటి కార్మికవర్గ ప్రభు త్వమైన పారిస్ కమ్యూన్ను ఏర్పాటు చేసుకుంది. రెండు నెలలే మనగలిగినా కమ్యూన్ ప్రపంచ చరిత్రలోనే ఒక అరుదైన స్థానాన్ని దక్కించుకుంది. పారిస్ కమ్యూన్, ఒకరకంగా చెప్పాలంటే కమ్యూనిస్టు ప్రభు త్వాలకు తొలి నమూనాను అందించింది. పారిస్‌పై ఎర్ర బావుటా 1830, జూలై తిరుగుబాటు నుంచి 1871 నాటి శ్రామిక విప్లవం వరకు నలభై ఏళ్ళ పారిస్ పయనం ప్రపంచ ఆలోచనను సంపూర్ణంగా మార్చి వేసింది. 1848 జూన్ విప్లవంలోనే ‘‘బూర్జువా వర్గాన్ని కూలదోయండి, కార్మిక వర్గ ప్రభుత్వాన్ని స్థాపించండి’’ అనే నినాదాలు పారిస్ గోడలపైన వెలిశాయి. ఐదు రోజులపాటు జరిగిన ఈ పోరాటం రక్తపాతంతో, జైళ్ళు, చిత్రహింసలతో ఓటమి పాలైంది. యూరప్ మొత్తం ఆర్థిక సంక్షోభంలో కూరుకు పోగా, పరిశ్రమలు మూతపడ్డాయి. పంటల దిగుబడి తగ్గడంతో ఆహార ధాన్యాల ధరలు ఆకాశానికంటాయి. 1870 సెప్టెంబర్ 4న లూయీ బోనపార్టీ ప్రభుత్వాన్ని పారిస్ ప్రజలు కూలదోశారు. ఆ స్థానంలోకి కార్మికవర్గం వస్తుందని భయపడిన పెట్టుబడిదారీ వర్గం ఫ్రెంచి నేషనల్ అసెంబ్లీకి ఎన్నికలను జరిపి, రాచరికవాదులను గెలిపించింది. దీంతో వ్యాపారస్తులు, ఇతర మధ్య తరగతి వర్గం ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. అదే సమయంలో జర్మనీ అధినేత బిస్మార్క్ పారిస్‌పై దాడికి సన్నాహాలు ప్రారంభించాడు. పారిస్ కార్మికవర్గ పోరాటాలకు బెంబేలెత్తిన నాటి ఫ్రెంచి పాలకుడు అడాల్ఫ్ థేర్స్ పారిస్‌ను జర్మనీకి అప్పగిం చాలనే కుట్రలో భాగం అయ్యాడు. అయితే అప్పటికే ఫ్రెంచ్ సేనలు కార్మికవర్గం అండతో పారిస్‌ను రక్షించ డానికి సమాయత్తమయ్యాయి. కార్మికవర్గం మరింత చొరవను ప్రదర్శించి, ఆయుధాలను తమ స్వాధీనంలోకి తీసుకుంది. 1871 మార్చి 18న కార్మికులు ప్రభుత్వ ప్రధాన కార్యాలయమైన హోటల్ డి విల్లీని స్వాధీనం చేసుకుని, దానిపై ఎర్రజెండా ఎగురవేశారు. మొట్టమొదటి కార్మికవర్గ ప్రభుత్వం సర్వజనీన ఓటు హక్కు పద్ధతిలో పారిస్ కమ్యూన్ ఏర్పడింది. అది ఆ తదుపరి ప్రపంచ విప్లవోద్యమాలకు, ప్రజాస్వామిక వ్యవస్థలకు మార్గదర్శి అయింది. 92 మంది కౌన్సిలర్లున్న పారిస్ కమ్యూన్ ప్రభుత్వ శాఖ లన్నింటినీ తానే స్వయంగా సమర్థవంతంగా నిర్వ హించింది. ప్రజలను అణచివేయడానికి సాధనంగా ఉంటున్న పాత సైన్యాన్ని అదిరద్దు చేసింది. జడ్జీలు, ప్రభుత్వాధికారుల నియామకాలను తన చేతుల్లోకి తీసుకుంది. ఎవరైనా ప్రజల కోసం పనిచేయక పోతే, వారిని వెనక్కి పిలిపించే (రీకాల్) అధికారాన్ని కమ్యూన్ తన అధీనంలో ఉంచుకుంది. ప్రభుత్వాధికారులకు ఉండే ప్రత్యేక సదుపాయాలను తొలగించారు. మున్సి పల్ పరిపాలన వ్యవహారాల దగ్గరి నుంచి యుద్ధం, సైన్యం, ఆర్థిక వ్యవహారాల నిర్వహణ అన్నిటినీ కార్మిక వర్గం కమ్యూన్కే అప్పగించింది. పెట్టుబడిదారీ వర్గ ప్రయోజనాలను కాపాడటానికి ఏర్పడ్డ న్యాయశాఖ స్వేచ్ఛను కమ్యూన్ రద్దు చేసింది. ప్రభుత్వాలు స్వల్ప వ్యయంతో పనిచేయాలని పారిస్ కమ్యూన్ చరిత్రాత్మ కమైన తీసుకున్న నిర్ణయం తీసుకుంది. కమ్యూన్ ఏర్పా టుతో పెట్టుబడిదారులు వర్సెల్స్కు పారిపోయారు. శ్రామిక ప్రజాబాహుళ్యపు మొట్టమొదటి ప్రభుత్వమైన కమ్యూన్... ఫ్యాక్టరీలన్నింటినీ సహకార సంఘాల ద్వారా నిర్వహించింది. చర్చిలను కేవలం మత బోధ నలకు, ప్రార్థనలకు మాత్రమే పరిమితం చేయ కుండా వాటిని ప్రజల సమస్యలు, రాజకీయాలు చర్చించే వేదిక లుగా మార్చారు. కార్మికవర్గ విప్లవానికి ప్రతిబింబంగా ప్రపంచ విప్లవోద్యమానికి చిహ్నమైన ఎర్రజెండాను పారిస్ కమ్యూన్ తన పతాకంగా ప్రకటించుకున్నది. రెండు నెలలే ఉనికిలో ఉన్న పారిస్ కమ్యూన్ ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా విప్లవోద్యమాలకు, ప్రజాస్వామిక వ్యవస్థలకు మార్గదర్శి అయ్యింది. పారిస్ కమ్యూన్ సాధనలో, రక్షణలో స్త్రీలు సాగిం చిన పోరాటం, ప్రదర్శించిన చైతన్యం అపూర్వమైనది. కమ్యూన్ ఓటమి అనంతరం కోర్టు విచారణ తతంగంలో మహిళా నాయకురాలు తాసీ మైకేల్ ‘‘నేను నిస్సందే హంగా విప్లవోద్యమ కార్యకర్తనే. అందుకు నేను గర్వ పడుతున్నాను’’ అన్న మాటలే నాటి పారిస్ మహిళల పోరాట చైతన్యానికి అక్షర సాక్ష్యాలు. అయితే బిస్మార్క్ ప్రభుత్వం అండతో దేశాధ్యక్షునిగా మారిన థేర్స్ పారిస్ వీధుల్లో రక్తపుటేరులు పారించాడు. 1871 మే 28వ తేదీన పారిస్ కమ్యూన్ పూర్తిగా బూర్జువా ప్రభుత్వాల వశమైంది. లక్షా ముప్ఫయ్ వేల పారిస్ కమ్యూన్ సైన్యంలో వేలాది మందిని థేర్స్ ప్రభుత్వం నడి వీధు ల్లోనే కాల్చి చంపించింది. అయితేనేం పారిస్ కమ్యూన్ భావి కమ్యూనిస్టు విప్లవాలకు, ఉద్యమాలకు మార్గదర్శి అయింది. అరవైల విద్యార్థి ఆగ్రహ కెరటం పారిస్ నగర పోరాట వారసత్వాల చరిత్రలోని రెండు మైలురాళ్లు ప్రపంచాన్ని ప్రభావితం చేసిన 1789, 1871 విప్లవాలు కాగా... మూడవది 1968 నాటి విద్యార్థి ఉద్యమం. నాటి పారిస్ విద్యార్థి ఉద్యమం మార్క్సిజం, లెనినిజంతో పాటూ మావోయిజాన్ని కూడా తన సైద్ధాంతిక భూమికగా ప్రకటించుకొన్నది. క్యూబాలో సోషలిస్టు ప్రభుత్వం ఏర్పాటు, చేగువేరా సాహసోపేత విప్లవ జీవితం పారిస్ విద్యార్థులను ఉత్తేజపరిచాయి. చైనా సాంస్కృతిక విప్లవం కూడా వారికి స్ఫూర్తినిచ్చింది. పారిస్ విద్యార్థి ఉద్యమంలో చేగువేరా ఒక ఉద్యమ నినాదంగా మారిపోయాడు. దేశ విదేశాల నుంచి వెళ్ళి చదువుకుంటున్న విద్యార్థులు పారిస్ విద్యార్థి ఉద్యమా నికి ఆకర్షితులై ఉద్యమంలో భాగస్వాములయ్యారు. పారిస్ కమ్యూన్ ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమానికి పునాదిగా నిలిస్తే, పారిస్ విద్యార్థి ఉద్యమం లాటిన్ అమెరికా, ఆసియా, ఆఫ్రికా దేశాల విప్లవోద్యమాలకు సైద్ధాంతిక బలాన్నిచ్చింది. ముఖ్యంగా గత రెండు దశాబ్దాలుగా సాగుతోన్న లాటిన్ అమెరికన్ తరహా నూతన కమ్యూనిస్టు, సోషలిస్టు, ప్రజాస్వామ్య ఉద్య మాలకు అది ఒక దిశను అందించింది. పారిస్ విద్యార్థి ఉద్యమంలో పాల్గొన్న పలువురు నాయకులు లాటిన్ అమెరికా దేశాల్లో సాగిన, సాగుతున్న ఉద్యమాల్లో కీలక భూమికను పోషించడం ఇందుకు నిదర్శనం. వెనిజులా మాజీ అధ్యక్షుడు హుగో చావెజ్ ప్రభుత్వ సలహాదా రుగా పనిచేసిన ప్రముఖ మార్క్సిస్టు రచయిత్రి మార్తా హర్నేకర్ పారిస్ విద్యార్థి ఉద్యమంలో పాల్గొన్నవారే. పారిస్ ప్రపంచ చరిత్రలోని అపురూప సౌందర్యానికే కాదు, అరుదైన విప్లవాలకు, ఉద్యమాలకు కేంద్రం, విప్ల వాల పురిటిగడ్డ. జూలై 8 పారిస్ నగర సంస్థాపక దినోత్సవం సందర్భంగా వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు 97055 66213 - మల్లెపల్లి లక్ష్మయ్య