విప్లవాల పురిటిగడ్డ పారిస్ | Freedom of movement reform 'on the table' for Brexit talks | Sakshi
Sakshi News home page

విప్లవాల పురిటిగడ్డ పారిస్

Published Thu, Jul 7 2016 1:04 AM | Last Updated on Mon, Oct 8 2018 9:06 PM

విప్లవాల పురిటిగడ్డ పారిస్ - Sakshi

విప్లవాల పురిటిగడ్డ పారిస్

పారిస్ అపురూప సౌందర్యానికే కాదు, అరుదైన విప్లవాలకు, ఉద్యమాలకు కేంద్రం, విప్లవాలకు పురిటి గడ్డ. 1789 ఫ్రెంచి విప్లవంలో అది ప్రపంచానికి స్వేచ్ఛ, సమానత్వం, సోదరత్వాల సందేశాన్ని అందించింది. 1871 విప్లవంలో రెండు నెలలే ఉనికిలో ఉన్న పారిస్ కమ్యూన్ ప్రపంచవ్యాప్తంగా విప్లవోద్యమాలకు, ప్రజాస్వామిక వ్యవస్థలకు మార్గదర్శి అయ్యింది. ఇక 1969 పారిస్ విద్యార్థి ఉద్యమం లాటిన్ అమెరికా, ఆసియా, ఆఫ్రికా దేశాల విప్లవోద్యమాలకు సైద్ధాంతిక బలాన్నిచ్చింది. నేటి లాటిన్ అమెరికన్ తరహా నూతన కమ్యూనిస్టు, సోషలిస్టు, ప్రజాస్వామ్య ఉద్యమాలకు అది ఒక దిశను అందించింది.
 
 సుందర స్వప్నసీమ ఏదైనా నిజంగా ఉందంటే అది పారిస్ మాత్రమేనని ఆ నగరాన్ని సందర్శించిన వారెవ రికైనా అనిపిస్తుంది. పారిస్ ప్రపంచంలోనే అతి విశిష్ట నగరంగా నిలవడానికి ఆ నగర చారిత్రక వారసత్వ సంపద, అది సాధించిన సాహితీ సాంస్కృతిక పురోగతి కూడా కారణం. క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం నుంచి పారిస్ ఉనికిలో ఉన్నట్టు ఆధారాలున్నాయి. ‘పారిసీ’ అనే తెగ ప్రజల ఆవాసంగా, వారు నిర్మించిన నగరంగా దానికి పారిస్ పేరు వచ్చింది. సైన్ నది ఒడ్డునున్న ఆ నగరం వ్యాపార, వాణిజ్యాలకు ఎంతో అనుకూలమైనది కావడంతో వేగంగా వృద్ధి చెందింది. క్రీస్తు శకం 3వ శతాబ్దిలో అక్కడ క్రైస్తవం వ్యాప్తి చెందింది.
 
 క్రీస్తు శకం 12వ శతాబ్ది నుంచి ఆ నగరం ఆధునిక పోకడలను సంతరించుకున్నది. పారిస్ విశ్వవిద్యాల యాన్ని నెలకొల్పింది కూడా అప్పుడే. ఫ్రాన్స్ యుద్ధాల న్నిటిలో పారిస్ నగరం కీలక పాత్రను పోషించింది. 18వ శతాబ్దంలో అది పలు శాస్త్ర, సాంకేతిక ఆవిష్కరణలకు వేదికయ్యింది. 1783, నవంబర్ 21న మాంట్గోల్ ఫైర్ బ్రదర్స్ వేడి గాలి బుడగతో తొట్ట తొలి విమాన ప్రయోగం చేసినది అక్కడే. 1789 ఫ్రెంచ్ విప్లవంలో పారిస్... స్వేచ్ఛ, సమానత్వం, సోదరత్వాల సందేశాన్ని ప్రపంచానికి చాటింది.

1830లో మొట్టమొదటి రాజ్యాం గబద్ధ రాచరిక వ్యవస్థ పారిస్‌లోనే ఏర్పడింది. 1870- 71 ఫ్రాంకో-ప్రష్యన్ యుద్ధంలో పారిస్ నగరం బందీగా మారింది. ఆ క్రూరమైన అణచివేత నుంచే పారిస్ కార్మిక వర్గం తిరుగుబాటు చేసి మొట్టమొదటి కార్మికవర్గ ప్రభు త్వమైన పారిస్ కమ్యూన్‌ను ఏర్పాటు చేసుకుంది.  రెండు నెలలే మనగలిగినా కమ్యూన్ ప్రపంచ చరిత్రలోనే ఒక అరుదైన స్థానాన్ని దక్కించుకుంది. పారిస్ కమ్యూన్, ఒకరకంగా చెప్పాలంటే కమ్యూనిస్టు ప్రభు త్వాలకు తొలి నమూనాను అందించింది.
 
 పారిస్‌పై ఎర్ర  బావుటా
 1830, జూలై తిరుగుబాటు నుంచి 1871 నాటి శ్రామిక విప్లవం వరకు నలభై ఏళ్ళ పారిస్ పయనం ప్రపంచ ఆలోచనను సంపూర్ణంగా మార్చి వేసింది. 1848 జూన్ విప్లవంలోనే ‘‘బూర్జువా వర్గాన్ని కూలదోయండి, కార్మిక వర్గ ప్రభుత్వాన్ని స్థాపించండి’’ అనే నినాదాలు పారిస్ గోడలపైన వెలిశాయి. ఐదు రోజులపాటు జరిగిన ఈ పోరాటం రక్తపాతంతో, జైళ్ళు, చిత్రహింసలతో ఓటమి పాలైంది. యూరప్ మొత్తం ఆర్థిక సంక్షోభంలో కూరుకు పోగా, పరిశ్రమలు మూతపడ్డాయి. పంటల దిగుబడి తగ్గడంతో ఆహార ధాన్యాల ధరలు ఆకాశానికంటాయి. 1870 సెప్టెంబర్ 4న లూయీ బోనపార్టీ ప్రభుత్వాన్ని పారిస్ ప్రజలు కూలదోశారు. ఆ స్థానంలోకి కార్మికవర్గం వస్తుందని భయపడిన పెట్టుబడిదారీ వర్గం ఫ్రెంచి నేషనల్ అసెంబ్లీకి ఎన్నికలను జరిపి,  రాచరికవాదులను గెలిపించింది.
 
 దీంతో వ్యాపారస్తులు, ఇతర మధ్య తరగతి వర్గం ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. అదే సమయంలో జర్మనీ అధినేత బిస్మార్క్ పారిస్‌పై దాడికి సన్నాహాలు ప్రారంభించాడు. పారిస్ కార్మికవర్గ పోరాటాలకు బెంబేలెత్తిన నాటి ఫ్రెంచి పాలకుడు అడాల్ఫ్ థేర్స్ పారిస్‌ను జర్మనీకి అప్పగిం చాలనే కుట్రలో భాగం అయ్యాడు. అయితే అప్పటికే ఫ్రెంచ్ సేనలు  కార్మికవర్గం అండతో పారిస్‌ను రక్షించ డానికి సమాయత్తమయ్యాయి. కార్మికవర్గం మరింత చొరవను ప్రదర్శించి, ఆయుధాలను తమ స్వాధీనంలోకి తీసుకుంది. 1871 మార్చి 18న కార్మికులు ప్రభుత్వ ప్రధాన కార్యాలయమైన హోటల్ డి విల్లీని స్వాధీనం చేసుకుని, దానిపై ఎర్రజెండా ఎగురవేశారు.
 
 మొట్టమొదటి కార్మికవర్గ ప్రభుత్వం

 సర్వజనీన ఓటు హక్కు పద్ధతిలో పారిస్ కమ్యూన్  ఏర్పడింది. అది ఆ తదుపరి ప్రపంచ విప్లవోద్యమాలకు, ప్రజాస్వామిక వ్యవస్థలకు మార్గదర్శి అయింది. 92 మంది కౌన్సిలర్లున్న పారిస్ కమ్యూన్ ప్రభుత్వ శాఖ లన్నింటినీ తానే స్వయంగా సమర్థవంతంగా నిర్వ హించింది. ప్రజలను అణచివేయడానికి సాధనంగా ఉంటున్న పాత సైన్యాన్ని అదిరద్దు చేసింది. జడ్జీలు, ప్రభుత్వాధికారుల నియామకాలను తన చేతుల్లోకి తీసుకుంది. ఎవరైనా ప్రజల కోసం పనిచేయక పోతే, వారిని వెనక్కి పిలిపించే (రీకాల్)  అధికారాన్ని కమ్యూన్ తన అధీనంలో ఉంచుకుంది. ప్రభుత్వాధికారులకు ఉండే ప్రత్యేక సదుపాయాలను తొలగించారు. మున్సి పల్ పరిపాలన వ్యవహారాల దగ్గరి నుంచి యుద్ధం, సైన్యం, ఆర్థిక వ్యవహారాల నిర్వహణ అన్నిటినీ కార్మిక వర్గం కమ్యూన్‌కే అప్పగించింది. పెట్టుబడిదారీ వర్గ ప్రయోజనాలను కాపాడటానికి ఏర్పడ్డ న్యాయశాఖ స్వేచ్ఛను కమ్యూన్ రద్దు చేసింది.
 
 ప్రభుత్వాలు స్వల్ప వ్యయంతో పనిచేయాలని పారిస్ కమ్యూన్ చరిత్రాత్మ   కమైన తీసుకున్న నిర్ణయం తీసుకుంది. కమ్యూన్ ఏర్పా టుతో పెట్టుబడిదారులు వర్సెల్స్‌కు పారిపోయారు. శ్రామిక ప్రజాబాహుళ్యపు మొట్టమొదటి ప్రభుత్వమైన కమ్యూన్... ఫ్యాక్టరీలన్నింటినీ సహకార సంఘాల ద్వారా నిర్వహించింది. చర్చిలను కేవలం మత బోధ నలకు, ప్రార్థనలకు మాత్రమే పరిమితం చేయ కుండా వాటిని ప్రజల సమస్యలు, రాజకీయాలు చర్చించే వేదిక లుగా మార్చారు. కార్మికవర్గ విప్లవానికి ప్రతిబింబంగా ప్రపంచ విప్లవోద్యమానికి చిహ్నమైన ఎర్రజెండాను పారిస్ కమ్యూన్ తన పతాకంగా ప్రకటించుకున్నది. రెండు నెలలే ఉనికిలో ఉన్న పారిస్ కమ్యూన్ ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా విప్లవోద్యమాలకు, ప్రజాస్వామిక వ్యవస్థలకు మార్గదర్శి అయ్యింది.
 
 పారిస్ కమ్యూన్ సాధనలో, రక్షణలో స్త్రీలు సాగిం చిన పోరాటం, ప్రదర్శించిన చైతన్యం అపూర్వమైనది. కమ్యూన్ ఓటమి అనంతరం కోర్టు విచారణ తతంగంలో మహిళా నాయకురాలు తాసీ మైకేల్ ‘‘నేను నిస్సందే హంగా విప్లవోద్యమ కార్యకర్తనే. అందుకు నేను గర్వ పడుతున్నాను’’ అన్న మాటలే నాటి పారిస్ మహిళల పోరాట చైతన్యానికి అక్షర సాక్ష్యాలు. అయితే బిస్మార్క్ ప్రభుత్వం అండతో దేశాధ్యక్షునిగా మారిన థేర్స్ పారిస్ వీధుల్లో రక్తపుటేరులు పారించాడు. 1871 మే 28వ తేదీన పారిస్ కమ్యూన్ పూర్తిగా బూర్జువా ప్రభుత్వాల వశమైంది. లక్షా ముప్ఫయ్ వేల పారిస్ కమ్యూన్ సైన్యంలో వేలాది మందిని థేర్స్ ప్రభుత్వం నడి వీధు ల్లోనే కాల్చి చంపించింది. అయితేనేం పారిస్ కమ్యూన్ భావి కమ్యూనిస్టు విప్లవాలకు, ఉద్యమాలకు మార్గదర్శి అయింది.    
 
 అరవైల విద్యార్థి ఆగ్రహ కెరటం
 పారిస్ నగర పోరాట వారసత్వాల చరిత్రలోని రెండు మైలురాళ్లు ప్రపంచాన్ని ప్రభావితం చేసిన 1789, 1871 విప్లవాలు కాగా... మూడవది 1968 నాటి విద్యార్థి ఉద్యమం. నాటి పారిస్ విద్యార్థి ఉద్యమం మార్క్సిజం, లెనినిజంతో పాటూ మావోయిజాన్ని కూడా తన సైద్ధాంతిక భూమికగా ప్రకటించుకొన్నది. క్యూబాలో సోషలిస్టు ప్రభుత్వం ఏర్పాటు, చేగువేరా సాహసోపేత విప్లవ జీవితం పారిస్ విద్యార్థులను ఉత్తేజపరిచాయి. చైనా సాంస్కృతిక విప్లవం కూడా వారికి స్ఫూర్తినిచ్చింది. పారిస్ విద్యార్థి ఉద్యమంలో చేగువేరా ఒక ఉద్యమ నినాదంగా మారిపోయాడు. దేశ విదేశాల నుంచి వెళ్ళి చదువుకుంటున్న విద్యార్థులు పారిస్ విద్యార్థి ఉద్యమా నికి ఆకర్షితులై ఉద్యమంలో భాగస్వాములయ్యారు. పారిస్ కమ్యూన్ ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమానికి పునాదిగా నిలిస్తే, పారిస్ విద్యార్థి ఉద్యమం లాటిన్ అమెరికా, ఆసియా, ఆఫ్రికా దేశాల విప్లవోద్యమాలకు సైద్ధాంతిక బలాన్నిచ్చింది.
 
ముఖ్యంగా గత రెండు దశాబ్దాలుగా సాగుతోన్న లాటిన్ అమెరికన్ తరహా నూతన కమ్యూనిస్టు, సోషలిస్టు, ప్రజాస్వామ్య ఉద్య మాలకు అది ఒక దిశను అందించింది. పారిస్ విద్యార్థి ఉద్యమంలో పాల్గొన్న పలువురు నాయకులు లాటిన్ అమెరికా దేశాల్లో సాగిన, సాగుతున్న ఉద్యమాల్లో కీలక భూమికను పోషించడం ఇందుకు నిదర్శనం. వెనిజులా మాజీ అధ్యక్షుడు హుగో చావెజ్ ప్రభుత్వ సలహాదా రుగా పనిచేసిన ప్రముఖ మార్క్సిస్టు రచయిత్రి మార్తా హర్నేకర్ పారిస్ విద్యార్థి ఉద్యమంలో పాల్గొన్నవారే. పారిస్ ప్రపంచ చరిత్రలోని అపురూప సౌందర్యానికే కాదు, అరుదైన విప్లవాలకు, ఉద్యమాలకు కేంద్రం, విప్ల వాల పురిటిగడ్డ.
  జూలై 8 పారిస్ నగర సంస్థాపక దినోత్సవం సందర్భంగా
 వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు 97055 66213
 - మల్లెపల్లి లక్ష్మయ్య

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement