బాబుపై ఉన్నవి తీవ్ర ఆరోపణలు.. పదేళ్ల జైలు ఖాయం! | IT Notices On Chandrababu Naidu Serious Allegations - Sakshi
Sakshi News home page

బాబుపై ఉన్నవి తీవ్ర ఆరోపణలు.. పదేళ్ల జైలు ఖాయం!

Published Sat, Sep 9 2023 8:37 AM | Last Updated on Sat, Sep 9 2023 9:03 AM

 IT Notices On Chandrababu Naidu Serious Allegations - Sakshi

ప్రజాధనాన్ని కాజేసి పేదల ఇళ్ల నిర్మాణ కాంట్రాక్టుల్లో రూ.వందల కోట్ల కుంభకోణానికి పాల్పడిన మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అరెస్టు ఖాయమని, ఈ కేసు నుంచి ఆయన బయటపడడం అసాధ్యమని ఆర్థిక, రాజకీయ విశ్లేషకుడు బీఎస్‌ రాంబాబు స్పష్టం చేశారు. తీవ్ర ఆర్థిక నేరానికి పాల్పడినందుకు చట్ట ప్రకారం 10 ఏళ్ల వరకు జైలు శిక్ష లేదా జీవిత ఖైదు విధించే అవకాశం ఉందని వెల్లడించారు. దీనికిసంబంధించి ఐటీ శాఖ దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని, సాంకేతికంగా మాత్రమే నేరం రుజువు కావాల్సి ఉందని వివరించారు.

 ‘ఈ కేసును రాజకీయ కక్ష సాధింపు కోణంలో చూడలేం. ఆదాయపు పన్ను (ఐటీ) అధికారులు నమోదు చేసిన సెక్షన్లు ఎంతో తీవ్రమైన ఆరోపణలు. అందుకు వారి వద్ద ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలు, డాక్యుమెంటరీ ఆధారాలున్నాయి. ఇందులో భారీ అవినీతి దాగి ఉంది. ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం భవిష్యత్తులో ఏదైనా పదవిని పొందేందుకు సైతం చంద్రబాబు అనర్హుడు అవుతారు. ఈ కేసులో వెయ్యి శాతం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్, సీబీఐ దర్యాప్తు చేపట్టడం తప్పదు’ అని ఆయన పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా తీవ్రచర్చ జరుగు తున్న చంద్రబాబు అవినీతి వ్యవహారాలు, ఐటీ నోటీసుల్లో ప్రధానాంశాలు, సాంకేతిక విషయాలపై మంగళవారం ‘సాక్షి’ ప్రతినిధికి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన విశ్లేషించారు. 

మాజీ సీఎం చంద్రబాబుకు ఐటీ శాఖ ఇచ్చిన నోటీసుల్లో కీలక అంశాలేమిటి? 
ఇది చాలా తీవ్రమైన ఆర్థిక నేరం. చంద్రబాబు నాయుడు రూ.118 కోట్ల ఆదాయాన్ని బహిర్గతం చేయకుండా దాచిపెట్టారన్న ఆరోపణ ఉంది. ఈ నేరానికి చట్ట ప్రకారం 10 ఏళ్ల వరకు జైలు శిక్ష లేదా జీవిత ఖైదు పడవచ్చు. ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం భవిష్యత్తులో ఆయన ఎలాంటి పదవులు పొందకుండా అనర్హుడు అవుతారని చట్టం చెబుతుంది. ఈ కేసులో కీలక వ్యక్తుల స్టేట్‌మెంట్లు ఉన్నాయి. డాక్యుమెంటరీ ఎవిడెన్స్‌ పక్కాగా ఉంది. సాంకేతికంగా మాత్రమే నేరం నిరూపణ కావాల్సి ఉంది. ఇప్పటికే ఐటీ శాఖ దగ్గర ఉన్న ఆధారాలను చూస్తే ఈ కేసులో ఆయనకు శిక్ష తప్పదని తెలుస్తోంది.

ఈ కుంభకోణంలో ప్రధాన ఉల్లంఘనలు ఏమిటి? ఐటీ అధికారులు నోటీసుల్లో ఏ అంశాలు పేర్కొన్నారు? 
ఈ కేసును మూడు రకాల ఉల్లంఘనలుగా చూడవచ్చు. ఈ మూడు కూడా తీవ్రమైన నేరాలే. ఆదాయాన్ని దాచిపెట్టి ఇన్‌కమ్‌ట్యాక్స్‌ చట్టాన్ని మొదట ఉల్లంఘించారు. రెండోది.. ఈ డబ్బును విదేశాలకు పంపడం. అక్కడి నుంచి ఆ సొమ్ము విరాళాల రూపంలో మళ్లీ చంద్రబాబు ఖాతాలో,  టీడీపీ ఖాతాలోకో వచ్చింది. అంటే మనీ లాండరింగ్‌ చట్టాన్ని ఉల్లంఘించినట్టు అయింది. ఇక ప్రజా ప్రతినిధిగా ఉంటూ తన ప్రతిజ్ఞకు భిన్నంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు కాబట్టి యాంటీ కరప్షన్‌ యాక్ట్‌ కింద చంద్రబాబు శిక్షార్హుడు అవుతారు. దీన్ని క్విడ్‌ ప్రోకోగా చూడవచ్చు. 

ఈ కేసులో ఇప్పటివరకు ఐటీ అధికారులు రూ.118 కోట్ల అక్రమాలను నిగ్గు తేల్చారు. దర్యాప్తులో ఇంకా కొత్త కుంభకోణాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందా..?
ఇది రూ.118 కోట్లతో ఆగేది కాదు. తవ్వి తీస్తే ఇంకా చాలా కుంభకోణాలు బయటికి వస్తాయి. ఇందులో ఐటీ చట్టాలతోపాటు మనీ లాండరింగ్‌ జరిగింది. ప్రభుత్వ అధికారిక హోదాలో ఉంటూ అవినీతికి పాల్పడిన అంశం ఉంది. ఇలా భిన్న కోణాల్లో దర్యాప్తు జరగాల్సి ఉంది. తీగ లాగితే డొంక కదిలినట్టుగా మరిన్ని కుంభకోణాలు వెలుగులోకి రావచ్చు. 

ఈ కేసులో నారా లోకేశ్‌ పాత్ర కూడా ఉన్నట్లు ఐటీ అధికారులు కీలక ఆధారాలను సేకరించారు. లోకేశ్‌ను విచారించే అవకాశం ఉందా?
ఐటీ అధికారులు తమ నోటీసులలో వెల్లడించిన ప్రకారం చూస్తే నారా లోకేశ్‌కు ఇందులో కీలకపాత్ర ఉన్నట్లు అన్ని ఆధారాలున్నాయి. చంద్రబాబు పీఎస్‌ శ్రీనివాస్‌కు సైతం లోకేశ్‌ అనేక విషయాల్లో ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి లోకేశ్‌ సైతం భవిష్యత్తులో ఈ కేసులో విచారణ ఎదుర్కోక తప్పదు. 

ఈ మొత్తం వ్యవహారంలో అధికార దుర్వినియోగం స్పష్టంగా ఉంది. ఆ కోణంలో దర్యాప్తునకు అవకాశం ఉందా?
చంద్రబాబునాయుడు సీఎంగా ఉంటూ తన అధికారాన్ని దుర్వినియోగం చేశారనేందుకు డాక్యుమెంటరీ ఎవిడెన్స్‌ ఉంది. గతంలో లాలూ ప్రసాద్‌ యాదవ్, జయలలితపైన నమోదైన కేసులను చూస్తే.. అధికారంలో ఉండగా వారు తీసుకున్న నిర్ణయాల మేరకు పెట్టిన కేసులే అవి. అదే మాదిరిగా చంద్రబాబు సైతం అధికారాన్ని దుర్వినియోగం చేసి డబ్బులు సంపాదించారని ఐటీ అధికారుల నోటీసులలో స్పష్టంగా ఉంది. బోగస్‌ ఇన్‌వాయిస్‌లను సీఎం హోదాలో చంద్ర బాబు అంగీకరించి ప్రభుత్వం నుంచి చెల్లింపులు జరిపారు. ఆ డబ్బులు రూపం మార్చుకుని తిరిగి చంద్రబాబు పార్టీ ఖాతాలోకే వచ్చాయి. అంటే ఎవరైతే నిర్ణయం తీసుకున్నారో వాళ్లకే తిరిగి లబ్ధి చేకూరింది. కాబట్టి అవినీతి నిరోధక చట్టాల కింద కూడా దర్యాప్తునకు అవకాశం ఉంది. 

ఈ కుంభకోణంలో చంద్రబాబుఅరెస్టుకు అవకాశం ఉందా..?
ఐటీ అధికారులు తమ దర్యాప్తులో భాగంగా ట్రిబ్యునల్‌లో చార్జిషీట్‌ ఫైల్‌ చేస్తారు. ఆ తర్వాత చంద్రబాబును రిమాండ్‌కు అడగడం తప్పదు. ఆయన్ను కస్టడీలోకి తీసుకుని విచారించకుండా నిజాలు బయటికి రావు కాబట్టి ఇప్పుడు షోకాజ్‌ నోటీసులు మాత్రమే ఇచ్చారు. చార్జిషీట్‌ దాఖలైన తర్వాత ట్రిబ్యునల్‌ ఆదేశం మేరకు అరెస్టుకు అవకాశం ఉంది. మనీలాండరింగ్,ఇతర అంశాలున్నందున ఈడీ అరెస్టు చేస్తుందా? లేదంటే సీబీఐ అరెస్టు చేస్తుందా? అన్నది పక్కన పెడితే ఈ మొత్తం వ్యవహారంలో చంద్రబాబు అరెస్టు ఖాయంగానే కనిపిస్తోంది. ఐటీ అధికారులు సైతం ఈ వ్యవహారంపై ఈడీకి సమాచారం ఇవ్వొచ్చు.

ఐటీ శాఖ ఇచ్చిన నోటీసుల్లో తన పేరు లేదని చంద్రబాబు వాదిస్తున్నారు కదా?

గతంలో ఇచ్చిన సమాధానాల్లో ఇదే ప్రధానంగా ప్రస్తావించారు..ఈ వ్యవహారంలో తన పేరు లేదని చంద్రబాబు నాయుడు చెబుతున్నారు. కానీ ఇక్కడ వాస్తవం ఏమిటంటే ఏ నేరంలోనైనా ఒక వ్యక్తి పేరు లేనంత మాత్రాన అతడు నేరం చేయనట్టు కాదు. ఈ మొత్తం కుంభకోణంలో చంద్రబాబు పాత్రపై ప్రత్యక్ష సాక్షులు ఇచ్చిన వాంగ్మూలాలున్నాయి. డాక్యుమెంటరీ ఎవిడెన్స్‌ ఉంది. ఈ సర్కమ్‌స్టాన్సియల్‌ ఎవిడెన్స్‌ (ప్రాసంగిక సాక్ష్యాలు) సైతం నిందితుడి పాత్రను నిరూపిస్తాయి కాబట్టి నా పేరు లేదు కదా.. అనే దానికి మినహాయింపులు ఉండవు.

తన పేరు లేదని చంద్రబాబు స్టేట్మెంట్లు ఇచ్చినంత మాత్రాన కుదరదు. చట్ట ప్రకారం సర్కమ్‌స్టాన్సియల్‌ ఎవిడెన్స్, డాక్యుమెంటరీ ఎవిడెన్స్, ప్రత్యక్ష సాక్షులు చెప్పే సాక్ష్యాల ఆధారంగా ఎన్నో కేసులు నిరూపితమయ్యాయి. ఇవన్నీ ఐటీ అధికారుల దగ్గర పక్కాగా ఉన్నట్టు నోటీసుల ఆధారంగా తెలుస్తోంది. కాబట్టి చంద్రబాబునాయుడు తన పేరు లేదంటూ తప్పించుకోలేరు. ఐటీ సెక్షన్‌ 153 సీ, సెక్షన్‌ 142(1), 143(2) ప్రకారం మీకు జ్యూరిస్‌డిక్షన్‌ లేదని ఆయన అభ్యంతరం వ్యక్తం చేస్తే తమకు ఆ అధికారం ఉందని ఐటీ అధికారులు ఇప్పటికే తేల్చి చెప్పారు. 

గతంలో తనపై దాఖలైన కేసుల్లోస్టేలు తెచ్చుకున్నట్లుగా చంద్రబాబు ఈ కేసులోనూ స్టే తెచ్చుకునే అవకాశం ఉందా..?
గతంలో మాదిరిగా చంద్రబాబు నాయుడు ఐటీ కేసులో స్టే తెచ్చుకోవడం సాధ్యం కాదు. ఐటీ కేసులకు ప్రత్యేకంగా ట్రిబ్యునల్‌ ఉంటుంది. ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ అనేది హైకోర్టు, సుప్రీంకోర్టుల పరిధిలోకి ఇమీడియెట్‌గా రాదు. అక్కడ జ్యుడీషియల్‌ పవర్స్‌ ఉండే జ్యుడీషియల్‌ అధికారి ఉంటారు. ఆయన ట్రిబ్యునల్‌లో విచారిస్తారు. కాబట్టి మొదట ప్రొసీడింగ్స్‌ పూర్తి చేయాల్సిందే. జ్యుడీషియల్‌ పవర్స్‌ అన్నీ ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ డిపార్ట్‌మెంట్‌కు ఉన్నాయి. ఈ కేసులో ఎంతో  సీరియస్‌ అభియోగాలున్నాయి. నకిలీ ఇన్‌వాయిస్‌లతో ప్రజాధనాన్ని కొట్టేశారు. ప్రత్యక్ష సాక్షుల స్టేట్‌మెంట్లు ఉంది, డాక్యుమెంటరీ ఎవిడెన్స్‌ కూడా ఉంది. సర్కమ్‌స్టాన్షియల్‌ ఎవిడెన్స్‌ కూడా ఉంది. అందువల్ల స్టేలు ఇచ్చే ఆస్కారం ఏమాత్రం లేదు. గతంలో జయలలిత, లాలూ ప్రసాద్‌ యాదవ్‌లపైనా ఈ తరహా కేసులు నమోదయ్యాయి.

ఐటీ అధికారుల దర్యాప్తులో భారీ అక్రమాలు వెలుగు చూశాయి. విదేశాల్లోనూ చెల్లింపులు జరిగినట్లుఆధారాలున్నాయి. ఐటీతోపాటు ఈడీ, సీబీఐ ఈ కేసును దర్యాప్తు చేసే అవకాశం ఉందా..? 
ఈ కేసులో కీలక నిందితుడు మనోజ్‌ వాసుదేవ్‌ పార్థసాని తన వాంగ్మూలంలో పలు కీలక విషయాలను వెల్లడించాడు. ‘ఏం చేయాలో నా పీఎస్‌కు ఇన్‌స్ట్రక్షన్స్‌ ఇచ్చా.. నా పీఎస్‌ను కలవండి..’ అని చంద్రబాబు స్వయంగా తనకు చెప్పినట్లు పార్థసాని ఐటీ అధికారులకు ఇచ్చిన వాంగ్మూలంలో వెల్లడించారు. అంటే అది ప్రత్యక్ష సాక్ష్యం అవుతుంది. చంద్రబాబు ఆయన పీఎస్‌ శ్రీనివాస్‌ ద్వారా తమను వేధించడంతోనే  డబ్బులు చెల్లించినట్లు పార్థసానితో పాటు ఇద్దరు చార్టెడ్‌ అకౌంటెంట్లు వారి వాంగ్మూలాల్లో అంగీకరించారు. ఇవన్నీ కీలక విషయాలే అవుతాయి.

డబ్బులు చంద్రబాబుకు సంబంధించిన వ్యక్తులకు చేరడం.. తిరిగి అవి ఏ రూపంలో ఎవరెవరికి చెల్లించారు? చంద్రబాబుకు దుబాయ్‌లో పేమెంట్‌ చేయడం గురించి కూడా వారు చెప్పారు. అంటే ఇండియన్‌ కరెన్సీని బయటి దేశాలకు తరలించారు.. తిరిగి దాన్ని విరాళాల రూపంలో టీడీపీ ఖాతాల్లోకి చేర్చారు. ఈ మొత్తం వ్యవహారంలో మనీ లాండరింగ్‌ కోణం ఉంది కాబట్టి ఈ కేసులో వెయ్యి శాతం ఈడీ అధికారులు దర్యాప్తు చేపడతారు. సీబీఐ సైతం వంద శాతం దర్యాప్తు చేపడుతుంది. ఈ రెండు దర్యాప్తు సంస్థలు సుమోటోగా కేసును తీసుకోకపోయినా కేసు దర్యాప్తు సవ్యంగా జరిగేందుకు ఈడీ, సీబీఐని ఆదేశించాలని ఎవరైనా కోర్టులను కోరే అవకాశం ఉంది.
-ఆర్థిక, రాజకీయ విశ్లేషకులు బీఎస్‌ రాంబాబు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement