sweeden
-
ఇంగ్లండ్ ఫుట్‌బాల్ జట్టు మాజీ మేనేజర్ కన్నుమూత
ఇంగ్లండ్ ఫుట్‌బాల్ జట్టు మాజీ మేనేజర్ స్వెన్ గొరాన్ ఎరిక్సన్ కన్నుమూశారు. కేన్సర్‌తో పోరాడుతున్న ఆయన 76 ఏళ్ల వయసులో మరణించారు. తన కుటుంబ సభ్యుల సమక్షంలో సోమవారం తుదిశ్వాస విడిచారు. ఎరిక్సన్ మరణ వార్తను ధ్రువీకరిస్తూ అతడి కుటుంబం ప్రకటన విడుదల చేసింది.స్వీడన్‌కు చెందిన ఎరిక్సన్ తొలినాళ్లలో ఫుట్‌బాలర్‌గా రాణించారు. ఆ తర్వాత మేనేజర్‌గా మారిన ఆయన.. 1977- 2001 మధ్యకాలంలో స్వీడన్, పోర్చుగల్, ఇటలీ క్లబ్ టోర్నీల్లో ఓవరాల్‌గా 18 ట్రోఫీలు తన ఖాతాలో వేసుకున్నారు. అంతేకాదు.. ఇంగ్లండ్ ఫుట్‌బాల్ జట్టుకు మేనేజర్‌గా నియమితుడైన తొలి విదేశీయుడిగా అరుదైన ఘనత సాధించారు.యూరోపియన్ చాంపియన్‌షిప్స్, వరల్డ్ కప్ ఈవెంట్లలో ఎరిక్సన్.. ఇంగ్లండ్‌కు చెప్పుకోదగ్గ విజయాలు అందించారు. ఆయన హయాంలో 2002- 2006 మధ్య ఇంగ్లండ్ మూడుసార్లు వరుసగా వరల్డ్‌కప్ క్వార్టర్ ఫైనల్ చేరింది. ఇక వీటితో పాటు మేనేజర్‌గా ఎన్నో విజయాలు సాధించిన ఎరిక్సన్.. తాను కేన్సర్ బారిన పడినట్లు ఈ ఏడాది జనవరిలో వెల్లడించారు. మహా అయితే, ఒక్క ఏడాది పాటు బతుకుతానేమోనంటూ ఉద్వేగానికి లోనయ్యారు. అయితే, టెర్మినల్ కేన్సర్‌తో పోరాటంలో ఓడి తాజాగా కన్నుమూశారు. కాగా ఎరిక్సన్ మృతి పట్ల ప్రిన్స్ విలియం సహా పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.కాగా.. ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ క్లబ్ మేనేజర్‌గా ఉన్న వ్యక్తి.. జట్టు ఎంపిక మొదలు.. జట్టులో ఆటగాళ్ల పాత్ర, మ్యాచ్‌లో అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రణాళికలు రచించడం.. అదే విధంగా మ్యాచ్ సమయంలో ఆటగాళ్లలో స్ఫూర్తి నింపేలా మార్గదర్శనం వంటివి చేస్తాడు. క్లబ్ ఆర్థిక వ్యవహరాల్లో నిర్ణయాలు తీసుకోవడం సహా క్లబ్ గెలిచినా.. ఓడినా జవాబుదారిగా ఉంటారు.చదవండి: టెర్మినల్ కేన్సర్ ఇంత ప్రమాదకరమా..? -
గడ్డకట్టిన మంచుతో భారీ రెస్టారెంట్.. ఎక్కడో తెలుసా?
గడ్డకట్టిన మంచుతో శిల్పాలు చెక్కి ప్రదర్శనకు పెట్టడం చలి ప్రదేశాల్లో మామూలే! స్వీడన్లోనైతే ఏకంగా గడ్డకట్టిన మంచుతో ఒక భారీ హోటల్‌నే నిర్మించారు. ఇందులోని మంచాలు, కుర్చీలు, బల్లలు వంటివన్నీ గడ్డకట్టిన మంచుతో తయారు చేసినవే కావడం విశేషం. జేమ్స్‌బాండ్ సినిమా ‘డై ఎనదర్ డే’లో కనిపించిన భవంతి నమూనా ఆధారంగా ఈ హోటల్‌ను నిర్మించడం విశేషం. టోర్నె నదిలో గడ్డ కట్టిన మంచును తవ్వి తెచ్చి, నదికి సమీపంలోనే దీనిని ఐదువందల టన్నుల మంచుతో నిర్మించారు. ఇందులో పన్నెండు ఆర్ట్ స్వీట్రూమ్స్, ఒక డీలక్స్ స్వీట్‌రూమ్, థీమ్డ్ రూమ్‌లు, బార్ సహా పలు వసతులు ఉన్నాయి. ఈ హోటల్లో పది ఒలింపిక్ స్విమింగ్ పూల్స్, ముప్పయిమూడు చిన్న స్విమింగ్‌పూల్స్ కూడా ఉన్నాయి. లూకా రోంకొరోని నేతృత్వంలో ఇరవై నాలుగు మంది హిమశిల్పులు దీనిని నిర్మించారు. దీని లోపలి భాగంలో ఉష్ణోగ్రత మైనస్ ఐదు డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా ఉంటుంది. ఇది ఏడాది పొడవునా అతిథులకు అందుబాటులో ఉంటుంది. -
మౌత్ స్ర్పేతో నిమిషాల్లో కరోనా ఖతం
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కోరలు చాస్తోంది. మరోవైపు ఈ మహమ్మారిని నిలువరించేందుకు వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చేలా దిగ్గజ ఫార్మా సంస్థలు తీవ్ర ప్రయత్నాల్లో మునిగి తేలుతున్నాయి. ఈ నేపథ్యంలో స్వీడన్ లైఫ్ సైన్స్ సంస్థ ఎంజైమాటికా కీలక విషయాన్ని ప్రకటించింది. తమ మౌత్ స్ప్రే ద్వారా కేవలం 20 నిమిషాల్లో కరోనా వైరస్‌ను నిరోధించవచ్చని ప్రకటించింది. మహమ్మారికి కారణమైన సార్స్-కోవ్2 వైరస్‌ను క్రియారహితం చేస్తుందని తమ ప్రాథమిక ఫలితాల్లో తేలిందని కంపెనీ సోమవారం ఒక రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. (9 కోట్ల మోతాదుల వ్యాక్సిన్ కొనుగోలు) ఎంజైమాటికాకు చెందిన మౌత్ స్ప్రే ‘కోల్డ్‌జైమ్’ కేవలం 20 నిమిషాల్లో కరోనా వైరస్‌ను 98.3 శాతం నాశనం చేస్తుందని కంపెనీ పేర్కొంది. ఇన్-విట్రో (ల్యాబ్ టెస్ట్) అధ్యయన ఫలితాల ప్రకారం కరోనా జాతికి చెందిన వివిధ రకాల వైరస్‌లను నిరోధించడంలో ప్రభావవంతంగా పనిచేసినట్టుగా ఫలితాలు సూచించాయని కంపెనీ తెలిపింది. అలాగే నోటి ద్వారా వ్యాపించే ఇతర వైరస్‌లను కూడా ఇది నిరోధిస్తుందని ప్రకటించింది. తాజా అధ్యయనంలో కోవిడ్-19 మహమ్మారిని పూర్తిగా నాశనం చేయడంలో దీని సామర్థ్యాన్ని అంచనా వేయనున్నామని పేర్కొంది. అమెరికాకు చెందిన మైక్రోబాక్ లాబొరేటరీస్ ద్వారా ఇంటర్నేషనల్ టెస్ట్ మెథడ్‌లో ఈ అధ్యయనం నిర్వహించామని వెల్లడించింది. ఇది స్వతంత్ర, గుర్తింపు పొందిన ధృవీకరించబడిన ల్యాబ్ అని ఎంజైమాటికా వివరించింది. కోల్డ్‌జైమ్ ఎలా పని చేస్తుంది? ప్రధానంగా గ్లిసరాల్, అట్లాంటిక్ కాడ్ ట్రిప్సిన్లతో కూడిన సొల్యూషన్‌తో నిండిన కోల్డ్‌జైమ్‌ను ఉపయోగించి వైరసిడల్ ఎఫికసీ సస్పెన్షన్ పరీక్ష జరిగిందని కంపెనీ వెల్లడించింది. కోల్డ్‌జైమ్‌ను నోరు, గొంతు లోపలికి స్ప్రే చేస్తే ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. దీంతో స్థానికంగా వైరల్ లోడ్ తగ్గుతుంది. ఫలితంగా వైరస్ వ్యాప్తిని కూడా బాగా తగ్గిస్తుందని కంపెనీ పేర్కొంది. ప్రస్తుత ఇన్ విట్రో ఫలితాల ద్వారా నేరుగా క్లినికల్ పరీక్షలకు వెళ్లే శక్తి లేనప్పటికీ సమర్థవంతంగా వైరస్‌ను ఎదుర్కొనే సామర్ధ్యం కలిగి ఉందని వెల్లడైందని ఎంజైమాటికా సీఈఓ క్లాజ్ ఎగ్‌స్ట్రాండ్ ప్రకటించారు. -
మరోసారి గర్జించిన గ్రెటా థన్‌బెర్గ్
వాతావరణ మార్పులపై గళమెత్తిన 16 ఏళ్ల స్వీడిష్ యువకెరటం గ్రెటా థన్‌బెర్గ్ మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారు. యూరోపియన్ పార్లమెంట్ పర్యావరణ కమిటీ ఆఖరి సమావేశ సభలో ఉద్వేగ పూరితంగా ప్రసంగించారు. పర్యాపరణ పరిరక్షణకోసం శరవేగంగా నడుం బిగించాలని ప్రపంచ నేతలకు పిలుపునిచ్చారు. అటవీ నిర్మూలన, జంతువుల నాశనం, మహాసముద్రాల ఆమ్లీకరణ లాంటి వాటితో మనషి పర్యావరణాన్ని నాశనం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మీ పిల్లలు, మనవలు భవిష్యత్తుకోసం తక్షణమే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ గ్రెటా కన్నీంటి పర్యంత మయ్యారు. మన ఇల్లు కూలిపోతోంది..సమయం లేదు..అమూల్యమైన సమయం వృధా అయిపోతోంది.. ఇకనైనా ప్రతీ వ్యక్తి స్పందించాలంటూ భావోద్వేగ ప్రసంగం చేశారు. బ్రెగ్జిట్‌పై మూడు అత్యవసర సదస్సులు నిర్వహించిన బ్రిటన్ పర్యావరణానికి పొంచి వున్న ముప్పుపై మాత్రం ఎలాంటి స్పందన చూపించ లేదని విమర్శించారు. రాజకీయ నాయకులు పర్యావరణం తప్ప అన్నీ మాట్లాడతారు. వారికి మాతో (పర్యావరణంకోసం ఉద్యమిస్తున్న బాలలు) మాట్లాటడం ఇష్టం ఉండదు..నో ప్రాబ్లమ్..మాకు కూడా వారితో మాట్లాడాలని లేదు. ఓటు హక్కులేని మా మాటలు విశ్వసించకండి..కానీ సైంటిస్టులు, సైన్సు చెపుతున్న మాటల్ని అయినా నమ్మండి. సమయం మించిపోతోంది. ఇకనైనా మేల్కోండి. యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోండి..లేదంటే అంతా శూన్యమే అంటూ నేతలకు చురకలంటించారు. వాతావరణ మార్పుల పరిణామాలను నిర్లక్ష్యం చేయొద్దంటూ కోరారు. మీ ఇల్లు కాలిపోతోంటే..ఎంత ఆందోళన చెందుతారో అలాంటి ఆందోళన, భయం ఇపుడు పర్యావరణం పట్ల ప్రపంచ నేతలకు ఉండాలని కోరారు. అలాగే కేథడ్రాల్ నోట్రడామ్ చర్చి అగ్ని ప్రమాదంపై విచారం వ్యక్తం చేసిన ఆమె యుద్ధ ప్రాతిపదికన దాని పునరుద్ధరణ ప్రక్రియ కొనసాగుతుందని ఆశా భావం వ్యక్తం చేశారు. పర్యావరణ రక్షణకు కూడా "కేథడ్రాల్-థింకింగ్" ఇపుడు అవసరమని గ్రెటా పేర్కొన్నారు. కాగా ఈ ఏడాది ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి పురస్కారానికి గ్రెటా థన్‌బెర్గ్ నామినేట్ అయిన సంగతి తెలిసిందే. గత ఏడాది ఆగస్టులో స్వీడిష్ పార్లమెంట్ ఎదుట జరిపిన సోలో నిరసనతో థన్‌బెర్గ్ ప్రపంచ వ్యాప్తంగా విద్యార్థులకు స్ఫూర్తి దాయకంగా నిలిచింది. అంతేకాదు ఆమె స్ఫూర్తితోనే ప్రపంచ వ్యాప్తంగా పలు నగరాలు, పట్టణాలలో ఫ్రైడే ఫర్ ఫ్యూచర్ పేరుతో ప్రతీ శుక్రవారం పర్యావరణ మార్పులకు వ్యతిరేకంగా భారీ ఎత్తున యువత ఉద్యమిస్తోంది. What a privilege to meet the formidable Greta Thunberg. I gave her first look at the @GUENGL Climate manifesto and then we had a quick chat about who has the best trains. Surprise Surprise it's not Ireland! #ClimateEmergency pic.twitter.com/ftIRWTy7mq — Lynn Boylan MEP (@LNBDublin) April 16, 2019 .@GretaThunberg gives a shout out to the right wing @EPPGroup @ALDEgroup @ecrgroup! "I have read that some parties do not want me standing here because they so desperately do not want to talk about climate breakdown." 👏👏👏👏 pic.twitter.com/9IXY9gLttc — The Left in the European Parliament (@GUENGL) April 16, 2019 -
సాహిత్య నోబెల్ ప్రతిష్టకు మచ్చ
కొపెన్‌హెగన్: ప్రఖ్యాత నోబెల్ సాహిత్య బహుమతిని అందించే స్వీడిష్ అకాడమీ ఖ్యాతి మసకబారింది. అకాడమీలో మాజీ సభ్యురాలి భర్తపై వచ్చిన అత్యాచార ఆరోపణలు రుజువు కావడంతో స్వీడన్ కోర్టు సోమవారం అతణ్ని దోషిగా తేల్చి రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ఫ్రెంచ్ పౌరుడు, స్వీడన్లో ప్రముఖ కళాకారుడిగా గుర్తింపు ఉన్న జీన్ క్లాడ్ ఆర్నాల్ట్.. కవయిత్రి, స్వీడిష్ అకాడమీ మాజీ సభ్యురాలైన కేథరీనా ఫ్రోస్టెన్సన్ను పెళ్లాడాడు. ఆర్నాల్ట్ తమపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని అకాడమీ కార్యాలయంలో పనిచేసే 18 మంది యువతులు గతంలో ఓ వార్తా పత్రికకు వెల్లడించి సంచలనం సృష్టిం చారు. నోబెల్ విజేతల పేర్లను అనేకసార్లు ముందుగానే వెల్లడించేందుకు ఆర్నాల్ట్ లంచం తీసుకున్నాడనే ఆరోపణలు కూడా ఉన్నప్పటికీ వాటిపై విచారణ జరుగుతుందో లేదో కూడా సమాచారం తెలియరాలేదు. ఆర్నాల్ట్‌పై లైంగిక వేధింపులు, ఆర్థిక కుంభకోణాల ఆరోపణలు రావడంతో అకాడమీ శాశ్వత సభ్యుల్లో చీలిక ఏర్పడి ఈ ఏడాది ఏప్రిల్‌లో ఆర్నాల్ట్ భార్య సహా ఏడుగురు సభ్యులు అకాడమీ నుంచి వైదొలగడం తెలిసిందే. ఈ ఏడాది నోబెల్ సాహిత్య బహుమతి ఉండబోదని మే నెలలోనే అకాడమీ ప్రకటించింది. -
మోదీ విదేశీ పర్యటన షురూ
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ మూడు దేశాల పర్యటన నిమిత్తం సోమవారం స్వీడన్ బయలుదేరి వెళ్లారు. ఏప్రిల్ 20 వరకు ఐదురోజుల పాటు జరిగే పర్యటనలో ఆయన తొలుత స్వీడన్, అనంతరం బ్రిటన్, జర్మనీ దేశాల్లో పర్యటించనున్నారు. స్వీడన్ పర్యటనలో భాగంగా మంగళవారం ఆ దేశ ప్రధాని స్టెఫాన్ లోఫెన్తో ద్వైపాక్షిక అంశాలపై విస్తృతమైన చర్చలు జరుపుతారు. ‘భారత్–స్వీడన్ మధ్య హృదయపూర్వక స్నేహ సంబంధాలున్నాయి. మా భాగస్వామ్యం ప్రజాస్వామ్య విలువల ఆధారంగా నిర్మించబడింది. ప్రపంచవ్యాప్తంగా ఓ సానుకూల వాతావరణం ఏర్పడాలనేది మా అభిమతం. మా అభివృద్ధి కార్యక్రమాల్లో స్వీడన్ విలువైన భాగస్వామి’ అని పర్యటనకు ముందు మోదీ పేర్కొన్నారు. కాగా, స్వీడన్ రాజధాని స్టాక్‌హోమ్‌లో స్టెఫాన్‌తో చర్చల తర్వాత ఆ దేశ రాజు కార్ల్ గుస్తాఫ్‌తోనూ మోదీ భేటీ కానున్నారు. అనంతరం భారత్, స్వీడన్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఇండియా–నోర్డిక్ (ఫిన్లాండ్, నార్వే, డెన్మార్క్, ఐస్లాండ్ దేశాల కలిపి) సదస్సును ఉద్దేశించి ప్రధాని ప్రసంగిస్తారు. లండన్‌లో రాణితోనూ భేటీ స్వీడన్ నుంచి మంగళవారం రాత్రి వరకు మోదీ చోగమ్ (కామన్వెల్త్ ప్రభుత్వాధినేతల) సదస్సులో పాల్గొనేందుకు బ్రిటన్ చేరుకుంటారు. బ్రిటన్ ప్రధాని థెరిసా మేతో మోదీ చర్చలు జరుపుతారు. బ్రిటన్ రాణి ఎలిజబెత్ 2తోనూ ప్రధాని ప్రత్యేకంగా భేటీ అవుతారు. లండన్‌లో ఆయుర్వేద సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ప్రారంభిస్తారు. కాగా, 53 కామన్వెల్త్ దేశాల సృజన్మాతక జాబితాలో భారత్ పదో స్థానంలో నిలిచింది. బ్రిటన్ మొదటి స్థానం లో, కెనడా, సింగపూర్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. -
మేఘాలయలో ఓటేయనున్న ఇటలీ, స్వీడన్, అర్జెంటీనా!
ఉమ్నియా: మేఘాలయ ఎన్నికల్లో ఓ వింత చోటుచేసుకోబోతోంది. ఇటలీ, స్వీడన్, అర్జెంటీనా, ఇండోనేసియాతోపాటు ప్రామిస్లాండ్, హోలీలాండ్, జెరూసలేం...తదితరాలన్నీ అక్కడి ఎన్నికల్లో ఓటేయబోతున్నాయి. అదేంటీ..ఈ దేశాలకు మేఘాలయ ఎన్నికలతో ఏంటీ సంబంధం అని ఆశ్చర్యపోతున్నారా? అయితే, ఇవన్నీ ఇక్కడ ఈ నెల 27న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోనున్న యువ ఓటర్ల పేర్లు..! ఇవే కాదు, వారాలు.. సండే, థర్స్డే, రాష్ట్రాలు గోవా, త్రిపుర లాంటి పేర్లు కూడా ఉన్నాయి. రాష్ట్రంలోని ఖాసీ తెగ ప్రజల్లో ఇలాంటి విచిత్రమైన పేర్లుండటం సహజం. ఎన్నికల జాబితాలో ఈ పేర్లను చూసిన అధికారులు పొట్టచెక్కలయ్యేలా నవ్వుకుంటున్నారట..! -
బరువు బాధ్యతల బండి
నో డౌట్.. రవాణా రంగంలో భవిష్యత్తు డ్రైవర్ల అవసరం లేని వాహనాలదే. విద్యుత్తుతో నడిచేవే. ఎందుకంటారా? ఫొటో చూసేయండి మరి. స్వీడన్‌కు చెందిన కంపెనీ ఎన్రైడ్ తయారు చేసిన వాహనమిది. డ్రైవర్ అవసరం లేదు.. పెట్రోలు, డీజిళ్లు అంతకంటే వద్దు. రవాణా చేయాల్సిన సరుకులను ఎక్కించడం.. ఎక్కడికెళ్లాలో ఫీడ్ చేయడం, మరచిపోవడం అంతే! ఇంకా వివరాలు కావాలా? పేరు.. టీ–పాడ్. దాదాపు 23 అడుగుల పొడవుంటుంది. ఒకసారి ఛార్జ్ చేస్తే 124 మైళ్లు అంటే 200 కిలోమీటర్ల దూరం ఆగకుండా వెళ్లిపోతుంది. విద్యుత్తు మోటార్‌ను ఉపయోగించడం వల్ల ఇంజిన్ బరువు కూడా గణనీయంగా తగ్గుతుంది. డ్రైవర్లు ఉండరు కాబట్టి దీంట్లో కిటికీలు, సీట్లు గట్రా కూడా ఏమీ ఉండవు. లగేజీ వేసుకునేందుకు ఓ పెద్ద డబ్బా ఉంటుంది అంతే. ఒకొక్క టీ–పాడ్ దాదాపు 20 టన్నుల బరువు మోసుకెళ్లగలదు. మన లారీలకు రెట్టింపు అన్నమాట. ఇంకో మూడేళ్లలో స్వీడన్‌లోని గోథెన్బర్గ్ నుంచి హెల్సిన్బర్గ్ వరకూ సరుకులు రవాణా చేసేందుకు ఎన్రైడ్ ఇప్పటికే వంద వరకూ టీ–పాడ్లను సిద్ధం చేసింది. దీంతోపాటే బ్యాటరీలను రీఛార్జ్ చేసుకునేందుకు అక్కడక్కడ కొన్ని స్టేషన్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. బ్యాటరీ తక్కువైందనుకున్న వెంటనే టీ–పాడ్ తన దగ్గరలోని ఛార్జింగ్ స్టేషన్‌కు వెళ్లిపోయి తనంతట తానే ఛార్జ్ చేసుకుంటుంది. అవసరమనుకుంటే.. కొన్ని టీ–పాడ్లను ఆఫీసు నుంచే నియంత్రించేందుకూ దీంట్లో ఏర్పాట్లు ఉన్నాయి. టీ–పాడ్లు పనిచేయడం మొదలుపెట్టిన తరువాత స్వీడన్లో దాదాపు నాలుగు లక్షల కార్లకు సరిపడా కార్బన్డయాక్సైడ్ వాతావరణంలోకి చేరకుండా అడ్డుకోవచ్చునని అంచనా. ప్రస్తుతానికి 200 టీ–పాడ్స్‌తో రవాణాను మొదలుపెట్టినా.. భవిష్యత్తులో డిమాండ్‌ను బట్టి ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి వాహనాలను ప్రవేశపెట్టేందుకు ఎన్రైడ్ సిద్ధమవుతోంది. – సాక్షి నాలెడ్జ్ సెంటర్