ఇంగ్లండ్ ఫుట్‌బాల్ జట్టు మాజీ మేనేజర్ స్వెన్ గొరాన్ ఎరిక్‌సన్ కన్నుమూశారు. కేన్సర్‌తో పోరాడుతున్న ఆయన 76 ఏళ్ల వయసులో మరణించారు. తన కుటుంబ సభ్యుల సమక్షంలో సోమవారం తుదిశ్వాస విడిచారు. ఎరిక్‌సన్ మరణ వార్తను ధ్రువీకరిస్తూ అతడి కుటుంబం ప్రకటన విడుదల చేసింది.
స్వీడన్‌కు చెందిన ఎరిక్‌సన్ తొలినాళ్లలో ఫుట్‌బాలర్‌గా రాణించారు. ఆ తర్వాత మేనేజర్‌గా మారిన ఆయన.. 1977- 2001 మధ్యకాలంలో స్వీడన్, పోర్చుగల్, ఇటలీ క్లబ్ టోర్నీల్లో ఓవరాల్‌గా 18 ట్రోఫీలు తన ఖాతాలో వేసుకున్నారు. అంతేకాదు.. ఇంగ్లండ్ ఫుట్‌బాల్ జట్టుకు మేనేజర్‌గా నియమితుడైన తొలి విదేశీయుడిగా అరుదైన ఘనత సాధించారు.
యూరోపియన్ చాంపియన్‌షిప్స్, వరల్డ్ కప్ ఈవెంట్లలో ఎరిక్‌సన్.. ఇంగ్లండ్‌కు చెప్పుకోదగ్గ విజయాలు అందించారు. ఆయన హయాంలో 2002- 2006 మధ్య ఇంగ్లండ్ మూడుసార్లు వరుసగా వరల్డ్‌కప్ క్వార్టర్ ఫైనల్ చేరింది. ఇక వీటితో పాటు మేనేజర్‌గా ఎన్నో విజయాలు సాధించిన ఎరిక్‌సన్.. తాను కేన్సర్ బారిన పడినట్లు ఈ ఏడాది జనవరిలో వెల్లడించారు.
మహా అయితే, ఒక్క ఏడాది పాటు బతుకుతానేమోనంటూ ఉద్వేగానికి లోనయ్యారు. అయితే, టెర్మినల్ కేన్సర్‌తో పోరాటంలో ఓడి తాజాగా కన్నుమూశారు. కాగా ఎరిక్‌సన్ మృతి పట్ల ప్రిన్స్ విలియం సహా పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
కాగా.. ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ క్లబ్ మేనేజర్‌గా ఉన్న వ్యక్తి.. జట్టు ఎంపిక మొదలు.. జట్టులో ఆటగాళ్ల పాత్ర, మ్యాచ్‌లో అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రణాళికలు రచించడం.. అదే విధంగా మ్యాచ్ సమయంలో ఆటగాళ్లలో స్ఫూర్తి నింపేలా మార్గదర్శనం వంటివి చేస్తాడు. క్లబ్ ఆర్థిక వ్యవహరాల్లో నిర్ణయాలు తీసుకోవడం సహా క్లబ్ గెలిచినా.. ఓడినా జవాబుదారిగా ఉంటారు.
Comments
Please login to add a commentAdd a comment