యూరో కప్-2024 ఫైనల్లో ఇంగ్లండ్ అడుగుపెట్టింది. డార్ట్మండ్ వేదికగా జరిగిన నెదర్లాండ్స్‌తో జరిగిన రెండో సెమీఫైనల్లో 2-1 తేడాతో విజయం సాధించిన ఇంగ్లీష్ జట్టు.. రెండో సారి ఫైనల్ బెర్త్‌ను ఖారారు చేసుకుంది. ఆద్యంతం తీవ్ర ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్‌లో ఆఖరి నిమిషం గోల్ సాధించిన ఇంగ్లండ్ ప్లేయర్ ఓలీ వాట్కిన్స్.. తన జట్టుకు సంచలన విజయాన్ని అందించాడు.
ఈ సెమీస్ పోరులో ఫస్ట్‌హాఫ్ తొలి 10 నిమిషాల్లో ఇంగ్లండ్‌పై నెదర్లాండ్స్ ఆధిపత్యం చెలాయించింది. తొలి ఆర్ధబాగం 7వ నిమిషంలో డచ్ మిడ్ ఫీల్డర్ క్జేవీ సైమన్స్ తమ జట్టుకు మొదటి గోల్‌ను అందించాడు.
దీంతో ఆరంభంలోనే డచ్ జట్టు 1-0 ఆధిక్యంలో దూసుకెళ్లింది. అయితే కొద్దిసేపటికే ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ కేన్ పెనాల్టీ గోల్‌తో స్కోర్‌ను సమం చేశాడు. ఫస్ట్ హాఫ్ ముగిసే సమయానికి ఇరు జట్లు చెరో గోల్‌తో సమంగా నిలిచాయి.
ఇక సెకెండ్ హాఫ్ ప్రారంభమైన తర్వాత ఇరు జట్లు కొన్ని వ్యూహాత్మక మార్పులు చేశాయి. డచ్ తరుపున డోనియెల్ మాలెన్ స్ధానంలో వుత్ వెఘోర్స్ట్ సబ్‌స్ట్యూట్‌గా రాగా.. మరోవైపు త్రీ లయన్స్ జట్టుకు కీరన్ ట్రిప్పియర్ స్థానంలో ల్యూక్ షా వచ్చాడు. అయినప్పటికీ ఫలితం మాత్రం శూన్యం. ఈ క్రమంలో ఇంగ్లండ్ ఆఖరి 20 నిమిషాలకు ముందు తమ జట్టులో మరో రెండు మార్పులు చేసింది.
స్టార్ ప్లేయర్‌లు హ్యారీ కేన్, ఫిల్ ఫోడెన్‌లు బయటకు వెళ్లగా.. వారిస్ధానాల్లో ఒల్లీ వాట్కిన్స్ , కోల్ పామర్ మైదానంలో వచ్చారు. అయితే సెకెండ్ హాఫ్ సమయం ముగుస్తున్నప్పటికి గోల్ మాత్రం ఇరు జట్లు సాధించలేకపోయాయి.
దీంతో పెనాల్టీ షుటౌట్ తప్పదని అంతా భావించారు. కానీ మ్యాచ్ ఆఖరి నిమిషం(90వ మినిట్)లో సబ్‌స్ట్యూట్‌గా వచ్చిన వాట్కిన్స్ అద్భుతం చేశాడు. సంచలన గోల్‌తో వాట్కిన్స్ తన జట్టును రెండో సారి ఫైనల్‌కు చేర్చాడు. ఇక జూలై 15న జరగనున్న ఫైనల్లో స్పెయిన్‌తో ఇంగ్లండ్ తలపడనుంది.
Comments
Please login to add a commentAdd a comment