Euro Cup: ఆల్‌టైమ్‌ రికార్డు బద్దలు కొట్టిన స్పెయిన్‌.. తొలి జట్టుగా | Euro Cup 2024: Spain Breaks France Rare Record By Scoring 15 Goals | Sakshi
Sakshi News home page

Euro Cup 2024: ఫ్రాన్స్‌ ఆల్‌టైమ్‌ రికార్డు బద్దలు కొట్టిన స్పెయిన్‌

Published Tue, Jul 16 2024 12:47 PM | Last Updated on Tue, Jul 16 2024 1:31 PM

Euro Cup 2024: Spain Breaks France Rare Record By Scoring 15 Goals

పుష్కర కాలం తర్వాత స్పెయిన్‌ జట్టు అంతర్జాతీయ ఫుట్‌బాల్‌ వేదికపై మళ్లీ మెరిసింది. ప్రతిష్టాత్మక ‘యూరో’ టోర్నీలో స్పెయిన్‌ రికార్డుస్థాయిలో నాలుగోసారి చాంపియన్‌గా నిలిచింది. అంతేకాదు రెండు అత్యంత అరుదైన రికార్డులు తన పేరిట లిఖించుకుంది.

భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి తర్వాత జరిగిన ఫైనల్లో అల్వారో మొరాటో సారథ్యంలోని స్పెయిన్‌ 2–1 గోల్స్‌ తేడాతో ఇంగ్లండ్‌ జట్టును ఓడించింది. 

స్పెయిన్‌ తరఫున నికో విలియమ్స్‌ (47వ ని.లో), మికెల్‌ ఒయర్‌జబాల్‌ (86వ ని.లో) ఒక్కో గోల్‌ చేయగా... ఇంగ్లండ్‌ జట్టుకు పాల్మెర్‌ (73వ ని.లో) ఏకైక గోల్‌ అందించాడు.

ఆట 68వ నిమిషంలో కెప్టెన్‌ అల్వారో మొరాటో స్థానంలో సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన ఒయర్‌జబాల్‌ సహచరుడు మార్క్‌ కుకురెల్లా క్రాస్‌ పాస్‌ను లక్ష్యానికి చేర్చి స్పెయిన్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. 

90వ నిమిషంలో ఇంగ్లండ్‌ ప్లేయర్‌ మార్క్‌ గుయెహి హెడర్‌ షాట్‌ను గోల్‌ పోస్ట్‌ ముందు స్పెయిన్‌ డిఫెండర్‌ డాని ఓల్మో హెడర్‌ షాట్‌తో అడ్డుకోవడం కొసమెరుపు.

తొలి జట్టుగా చరిత్ర
ఈ గెలుపుతో స్పెయిన్‌ జట్టు 66 ఏళ్ల టోర్నీ చరిత్రలో అత్యధికంగా నాలుగుసార్లు విజేతగా నిలిచిన జట్టుగా గుర్తింపు పొందింది. గతంలో స్పెయిన్‌ 1964, 2008, 2012లలో యూరో టైటిల్‌ను సాధించింది.

జర్మనీ జట్టు మూడుసార్లు (1972, 1980, 1996) విజేతగా నిలిచింది. 1966లో ఏకైక ప్రపంచకప్‌ టైటిల్‌ నెగ్గిన తర్వాత మరో అంతర్జాతీయ టైటిల్‌ నెగ్గలేకపోయిన ఇంగ్లండ్‌ జట్టుకు వరుసగా రెండోసారి యూరో టోర్నీలో నిరాశ ఎదురైంది. 2021 యూరో ఫైనల్లో ఇటలీ చేతిలో ఓడిన ఇంగ్లండ్‌కు ఈసారి స్పెయిన్‌ షాక్‌ ఇచ్చింది.

బంతిని 63 శాతం తమ ఆధీనంలో ఉంచుకొని ఇంగ్లండ్‌ ఆటగాళ్లను కట్టడి చేసింది. ఏకంగా 60 సార్లు ఇంగ్లండ్‌ గోల్‌పోస్ట్‌ వైపునకు వెళ్లిన స్పెయిన్‌ 15 సార్లు గోల్‌ చేసేందుకు ప్రయత్నించింది. 

మరోవైపు హ్యారీ కేన్‌ కెప్టెన్సీలో ఇంగ్లండ్‌ జట్టు 31 సార్లు స్పెయిన్‌ గోల్‌పోస్ట్‌ వైపునకు వెళ్లి తొమ్మిదిసార్లు గోల్‌ లక్ష్యంగా షాట్‌లు సంధించింది.

విజేతకు రూ. 72 కోట్ల 89 లక్షలు
స్పెయిన్‌ టీనేజ్‌ స్టార్, 17 ఏళ్ల లమీన్‌ యమాల్‌ ‘యంగ్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ద టోర్నీ’... స్పెయిన్‌కే చెందిన రోడ్రి ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద టోర్నీ’ అవార్డులు గెల్చుకున్నారు. 

ఫైనల్‌ విజేత స్పెయిన్‌ జట్టుకు 80 లక్షల యూరోలు (రూ. 72 కోట్ల 89 లక్షలు), రన్నరప్‌ ఇంగ్లండ్‌ జట్టుకు 50 లక్షల యూరోలు (రూ. 45 కోట్ల 56 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి.  ఓవరాల్‌గా రూ. 253 కోట్ల ప్రైజ్‌ మనీ స్పెయిన్‌కు దక్కింది.

స్పెయిన్‌ అరుదైన రికార్డులు ఇవే
1. యూరో టోర్నీలో ఆడిన ఏడు మ్యాచ్‌ల్లోనూ గెలుపొంది విజేతగా నిలిచిన తొలి జట్టుగా స్పెయిన్‌ రికార్డు నెలకొల్పింది.  
2. ఒకే యూరో టోర్నీలో అత్యధిక గోల్స్‌ చేసిన జట్టుగా స్పెయిన్‌ గుర్తింపు పొందింది. ఫ్రాన్స్‌ (14 గోల్స్‌; 1984లో) పేరిట ఉన్న రికార్డును స్పెయిన్‌ తాజాగా తిరగరాసింది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement