ఇంగ్లండ్ సెకండ్ డివిజన్ ఫుట్‌బాల్ లీగ్ మ్యాచ్‌లో ఘటన
సస్పెండ్ చేసిన అసోసియేషన్
ప్రిస్టన్ (ఇంగ్లండ్): హోరాహోరీగా సాగుతున్న ఫుట్‌బాల్ మ్యాచ్‌లో ఒక ఆటగాడు తన ప్రత్యర్థి మెడ దగ్గర గట్టిగా కొరికేశాడు. అంతే ఇంగ్లండ్ ఫుట్‌బాల్ సంఘం (ఈఎఫ్‌ఏ) ఆగ్రహానికి గురయ్యాడు. నిషేధం, జరిమానా రెండు పడ్డాయి. ఇక వివరాల్లోకెళితే... ఇంగ్లండ్‌లో సెకండ్ డివిజన్ ఫుట్‌బాల్ పోటీలు జరుగుతున్నాయి. ప్రిస్టన్, బ్లాక్‌బర్న్‌ల మధ్య పోటాపోటీగా మ్యాచ్ జరుగుతోంది. ప్రిస్టన్ ఆటగాడు మిలుటిన్ ఉస్మాజిక్ ఉన్నపళంగా తనను నిలువరిస్తున్న బ్లాక్‌బర్న్ డిఫెండర్ ఒవెన్ బెక్ మెడ వెనుక కొరికేశాడు.
ఇంత జరిగినా... రిఫరీకి చెప్పినా ఉస్మాజిక్‌కు మాత్రం రెడ్‌కార్డ్ చూపలేదు. బయటికి పంపలేదు. గత నెల 22న ఈ మ్యాచ్ జరుగగా... అప్పీల్ తదుపరి విచారణ అనంతరం తాజాగా ఈఎఫ్‌ఏ ఉస్మాజిక్‌పై ఎనిమిది మ్యాచ్‌ల నిషేధం విధించడంతో పాటు 15 వేల పౌండ్లు (రూ.16.80 లక్షలు) జరిమానాగా విధించింది. ఇలా కొరకడంలో ఉరుగ్వే స్ట్రయికర్ లూయిస్ స్వారెజ్ ఫుట్‌బాల్ అభిమానులకు చిరపరిచితుడు.
2013లో జరిగిన ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్‌లో బార్సిలోనా స్ట్రయికర్ స్వారెజ్... చెల్సియా డిఫెండర్ బ్రానిస్లావ్ ఇవానోవిచ్‌ను కొరకడంతో ఏకంగా 10 మ్యాచ్‌ల నిషేధం విధించారు. అయినా అతని బుద్ధి మారలేదు. ఆ మరుసటి ఏడాది బ్రెజిల్‌లో జరిగిన ఫుట్‌బాల్ ప్రపంచకప్ (2014)లో స్వారెజ్ ఇటలీ డిఫెండర్ జియోర్జియో చిలినిని కొరికాడు. దీంతో మళ్లీ నాలుగు మ్యాచ్‌ల నిషేధం ఎదుర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment