న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ మూడు దేశాల పర్యటన నిమిత్తం సోమవారం స్వీడన్ బయలుదేరి వెళ్లారు. ఏప్రిల్ 20 వరకు ఐదురోజుల పాటు జరిగే పర్యటనలో ఆయన తొలుత స్వీడన్, అనంతరం బ్రిటన్, జర్మనీ దేశాల్లో పర్యటించనున్నారు. స్వీడన్ పర్యటనలో భాగంగా మంగళవారం ఆ దేశ ప్రధాని స్టెఫాన్ లోఫెన్‌తో ద్వైపాక్షిక అంశాలపై విస్తృతమైన చర్చలు జరుపుతారు. ‘భారత్–స్వీడన్ మధ్య హృదయపూర్వక స్నేహ సంబంధాలున్నాయి. మా భాగస్వామ్యం ప్రజాస్వామ్య విలువల ఆధారంగా నిర్మించబడింది.
ప్రపంచవ్యాప్తంగా ఓ సానుకూల వాతావరణం ఏర్పడాలనేది మా అభిమతం. మా అభివృద్ధి కార్యక్రమాల్లో స్వీడన్ విలువైన భాగస్వామి’ అని పర్యటనకు ముందు మోదీ పేర్కొన్నారు. కాగా, స్వీడన్ రాజధాని స్టాక్‌హోమ్‌లో స్టెఫాన్‌తో చర్చల తర్వాత ఆ దేశ రాజు కార్ల్ గుస్తాఫ్‌తోనూ మోదీ భేటీ కానున్నారు. అనంతరం భారత్, స్వీడన్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఇండియా–నోర్డిక్ (ఫిన్‌లాండ్, నార్వే, డెన్మార్క్, ఐస్‌లాండ్ దేశాల కలిపి) సదస్సును ఉద్దేశించి ప్రధాని ప్రసంగిస్తారు.
లండన్‌లో రాణితోనూ భేటీ
స్వీడన్ నుంచి మంగళవారం రాత్రి వరకు మోదీ చోగమ్ (కామన్వెల్త్ ప్రభుత్వాధినేతల) సదస్సులో పాల్గొనేందుకు బ్రిటన్ చేరుకుంటారు. బ్రిటన్ ప్రధాని థెరిసా మేతో మోదీ చర్చలు జరుపుతారు. బ్రిటన్ రాణి ఎలిజబెత్ 2తోనూ ప్రధాని ప్రత్యేకంగా భేటీ అవుతారు. లండన్‌లో ఆయుర్వేద సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ప్రారంభిస్తారు. కాగా, 53 కామన్వెల్త్ దేశాల సృజన్మాతక జాబితాలో భారత్ పదో స్థానంలో నిలిచింది. బ్రిటన్ మొదటి స్థానం లో, కెనడా, సింగపూర్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment