బరువు బాధ్యతల బండి
నో డౌట్.. రవాణా రంగంలో భవిష్యత్తు డ్రైవర్ల అవసరం లేని వాహనాలదే. విద్యుత్తుతో నడిచేవే. ఎందుకంటారా? ఫొటో చూసేయండి మరి. స్వీడన్‌కు చెందిన కంపెనీ ఎన్‌రైడ్ తయారు చేసిన వాహనమిది. డ్రైవర్ అవసరం లేదు.. పెట్రోలు, డీజిళ్లు అంతకంటే వద్దు. రవాణా చేయాల్సిన సరుకులను ఎక్కించడం.. ఎక్కడికెళ్లాలో ఫీడ్ చేయడం, మరచిపోవడం అంతే! ఇంకా వివరాలు కావాలా? పేరు.. టీ–పాడ్. దాదాపు 23 అడుగుల పొడవుంటుంది. ఒకసారి ఛార్జ్ చేస్తే 124 మైళ్లు అంటే 200 కిలోమీటర్ల దూరం ఆగకుండా వెళ్లిపోతుంది. విద్యుత్తు మోటార్‌ను ఉపయోగించడం వల్ల ఇంజిన్ బరువు కూడా గణనీయంగా తగ్గుతుంది.
డ్రైవర్లు ఉండరు కాబట్టి దీంట్లో కిటికీలు, సీట్లు గట్రా కూడా ఏమీ ఉండవు. లగేజీ వేసుకునేందుకు ఓ పెద్ద డబ్బా ఉంటుంది అంతే. ఒకొక్క టీ–పాడ్ దాదాపు 20 టన్నుల బరువు మోసుకెళ్లగలదు. మన లారీలకు రెట్టింపు అన్నమాట. ఇంకో మూడేళ్లలో స్వీడన్‌లోని గోథెన్‌బర్గ్ నుంచి హెల్సిన్‌బర్గ్ వరకూ సరుకులు రవాణా చేసేందుకు ఎన్‌రైడ్ ఇప్పటికే వంద వరకూ టీ–పాడ్‌లను సిద్ధం చేసింది. దీంతోపాటే బ్యాటరీలను రీఛార్జ్ చేసుకునేందుకు అక్కడక్కడ కొన్ని స్టేషన్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. బ్యాటరీ తక్కువైందనుకున్న వెంటనే టీ–పాడ్ తన దగ్గరలోని ఛార్జింగ్ స్టేషన్‌కు వెళ్లిపోయి తనంతట తానే ఛార్జ్ చేసుకుంటుంది. అవసరమనుకుంటే.. కొన్ని టీ–పాడ్‌లను ఆఫీసు నుంచే నియంత్రించేందుకూ దీంట్లో ఏర్పాట్లు ఉన్నాయి. టీ–పాడ్‌లు పనిచేయడం మొదలుపెట్టిన తరువాత స్వీడన్‌లో దాదాపు నాలుగు లక్షల కార్లకు సరిపడా కార్బన్‌డయాక్సైడ్ వాతావరణంలోకి చేరకుండా అడ్డుకోవచ్చునని అంచనా. ప్రస్తుతానికి 200 టీ–పాడ్స్‌తో రవాణాను మొదలుపెట్టినా.. భవిష్యత్తులో డిమాండ్‌ను బట్టి ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి వాహనాలను ప్రవేశపెట్టేందుకు ఎన్‌రైడ్ సిద్ధమవుతోంది.
– సాక్షి నాలెడ్జ్ సెంటర్