అమెరికా ద్వయానికి ఆర్థిక నోబెల్‌ | William Nordhaus, Paul Romer win Nobel Prize in Economics | Sakshi
Sakshi News home page

అమెరికా ద్వయానికి ఆర్థిక నోబెల్‌

Published Tue, Oct 9 2018 3:03 AM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM

William Nordhaus, Paul Romer win Nobel Prize in Economics - Sakshi

విలియం నోర్ధాస్, పాల్‌ రోమర్‌

స్టాక్‌హోం: 2018 ఏడాదికి నోబెల్‌ ఆర్థిక శాస్త్ర బహుమతి అమెరికా ఆర్థిక వేత్తలు విలియం నోర్ధాస్, పాల్‌ రోమర్‌లకు దక్కింది. సృజనాత్మకత, వాతావరణాలను ఆర్థిక వృద్ధితో జోడించినందుకు వారిని ఈ గౌరవానికి ఎంపిక చేసినట్లు రాయల్‌ స్వీడిష్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. ‘దీర్ఘకాలిక సుస్థిర వృద్ధి వంటి ప్రస్తుత కాలపు పలు ప్రాథమిక సవాళ్లకు వీరిద్దరూ పరిష్కారం చూపారు. ప్రకృతి కారణంగా మార్కెట్‌ ఆర్థిక వ్యవస్థ ఎలా ప్రభావితమవుతుందో నిర్మాణాత్మక నమూనాల ద్వారా వివరించి ఆర్థిక విశ్లేషణల విస్తృతిని బాగా పెంచారు’ అని అకాడమీ ప్రకటనలో వివరించింది.

నోబెల్‌ బహుమతి విలువ 1.01 మిలియన్‌ డాలర్లు కాగా, నోర్ధాస్, రోమర్‌లు ఆ మొత్తాన్ని చెరిసగం పంచుకుంటారు. నోర్ధాస్‌ (77) యేల్‌ విశ్వవిద్యాలయంలో అధ్యాపకుడిగా ఉండగా, రోమర్‌ (62) న్యూయార్క్‌ విశ్వవిద్యాలయ అనుబంధ స్టెర్న్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌లో పనిచేస్తున్నారు. రోమర్‌ గతంలో ప్రపంచ బ్యాంకు ప్రధాన ఆర్థికవేత్తగా కూడా పనిచేశారు. దీర్ఘకాలిక స్థూల ఆర్థిక విశ్లేషణలకు వాతావరణ మార్పులను జోడించినందుకు నోర్ధాస్‌కు, సాంకేతిక సృజనాత్మకతను జోడించినందుకు రోమర్‌కు ఈ బహుమతులు ప్రదానం చేశామని అకాడమీ తెలిపింది.

వాతావరణ కల్లోల పరిస్థితులను ప్రపంచం ఎదుర్కొనేందుకు సమాజంలో గొప్ప పరివర్తనం రావాల్సి ఉందని ఇటీవల ఐక్యరాజ్యసమితి ఓ నివేదికలో పేర్కొన్న అనంతరం నోర్ధాస్, రోమర్‌లకు అవార్డు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. నోబెల్‌ బహుమతి ప్రకటన అనంతరం రోమర్‌ అకాడమీతో ఫోన్‌లో మాట్లాడుతూ ప్రపంచం కర్బన ఉద్గారాలను తగ్గించుకుని, జీవన ప్రమాణాలను మెరుగుపరుచుకుంటుందనే నమ్మకం తనకు ఉందన్నారు. ప్రపంచ దేశాలపై కర్బన పన్నులను విధించడం ద్వారా కర్బన ఉద్గారాలను తగ్గించవచ్చని నోర్ధాస్‌ తన పరిశోధనలతో రుజువు చేశారు.



ముగిసిన నోబెల్‌ బహుమతుల ప్రకటన
ఆర్థిక శాస్త్ర బహుమతి ప్రకటనతో ఈ ఏడాది అన్ని నోబెల్‌ పురస్కారాల విజేతల పేర్లు ప్రకటించడం పూర్తయినట్లయింది. ఇప్పటికే భౌతిక, రసాయన, వైద్య, శాంతి బహుమతులను ప్రకటించగా, సాహిత్య బహుమతిని వచ్చే ఏడాదికి వాయిదా వేయడం తెలిసిందే. అకా డమీ మాజీ సభ్యురాలి భర్తపై వచ్చిన అత్యాచారం ఆరోపణలు రుజువుకావడంతో ఈ ఏడాది సాహిత్య బహుమతిని వచ్చే ఏడాదికి వాయిదా వేశారు. నోబెల్‌ శాంతి బహుమతికి నదియా మురాద్, డెనిస్‌ ముక్వెగె, భౌతిక శాస్త్ర బహుమతికి ఆర్థర్‌ ఆష్కిన్, జెరార్డ్‌ మౌరూ, డొనా స్ట్రిక్‌లాండ్, వైద్య శాస్త్ర బహుమతికి జేమ్స్‌ అలిసన్, తసుకు హొంజో, రసాయన శాస్త్ర బహుమతికి ఫ్రాన్సెస్‌ ఆర్నాల్డ్, జార్జ్‌ స్మిత్, గ్రెగ్‌ వింటర్‌లను విజేతలుగా ఇప్పటికే ప్రకటించారు. డిసెంబర్‌ 10న స్టాక్‌హోంలో స్వీడన్‌ రాజు నోబెల్‌ బహుమతులను అందజేస్తారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement