పాక్‌లో ఉంటున్న భారతీయులు పలు ఆంక్షల మధ్య దుర్భర జీవితం సాగిస్తున్నారనే వార్తలను మనం తరచూ వింటుంటాం. అనుకోని రీతిలో పాక్‌లో చిక్కుకుపోయిన ఒక భారతీయ మహిళ అక్కడ పలు అవస్థలను ఎదుర్కొంది. ఎప్పుడెప్పడు తన స్వదేశానికి వెళదామా అని ఎదురు చూసింది. ఎట్టకేలకు ఆమె ఆశ నెరవేరింది.
ముంబైలోని కుర్లా నివాసి హమీదా బానో(70) 22 ఏళ్లక్రితం తనకు తెలియకుండా పాకిస్తాన్‌లోకి అడుగుపెట్టింది. అయితే ఎప్పటికైనా భారత్ తిరిగి వెళ్లాలనే ఆమె ఆశ నిరంతరం సజీవంగానే ఉంది. తాజాగా ఆమె పంజాబ్‌లోని అట్టారీ సరిహద్దు మీదుగా భారత్‌కు చేరుకున్నారు. ఆ సమయంలో ఆమె కళ్లలో నీళ్లు తిరిగాయి. సరిహద్దుల్లో ఆమెకు అమృత్‌సర్‌లోని ఫోక్‌లోర్ రీసెర్చ్ అకాడమీ అధ్యక్షుడు రమేష్ యాదవ్ ఆమెకు స్వాగతం పలికారు. 2002లో హమీదా బానో దుబాయ్‌లో వంటమనిషిగా ఉద్యోగం చేసేందుకు ఒక ముంబై ఏజెంట్‌ను సంప్రదించింది. అయితే ఆ ఏజెంట్ ఆమెను దుబాయ్‌కి బదులుగా పాకిస్తాన్‌కు పంపాడు. హమీదా బానో తాను పాకిస్తాన్‌కు చేరుకున్నానని తెలియగానే కంగారుపడిపోయింది. భయం కారణంగా ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు. పోలీసులకు కూడా తెలియజేయలేదు.
ముంబైలో ఉంటున్న హమీదా బానో కుటుంబ సభ్యులు ఆమె ఎక్కడికి వెళ్లిందో తెలియక ఆందోళనకు గురయ్యారు. హమీదా పాకిస్తాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లోని హైదరాబాద్‌లో ఉంటూ తినుబండారాలు అమ్ముతూ జీవిస్తూ వచ్చింది. తదనంతరకాలంలో ఆమెకు కరాచీలోని ఓ వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అతను పెళ్లికి ప్రపోజ్ చేయడంతో అందుకు అంగీకరించింది. వీరి వైవాహిక జీవితం సవ్యంగానే సాగింది. అయితే హమీదా బానో భర్త కరోనా సమయంలో మృతిచెందాడు.
పాకిస్తాన్‌లో హమీదా బానో ఒక మదర్సా బయట కూర్చుని తినుబండారాలు అమ్ముతుండేది. ఆమె దగ్గరకి చాక్లెట్లు కొనుక్కునేందుకు వచ్చిన ఒక బాలుడు తన చదువు పూర్తయ్యాక ఒక టీవీ ఛానల్‌లో ఉద్యోగం సంపాదించాడు. ఒక రోజు అతను హమీదాను ఇంటర్యూ చేశాడు. ఇది అతను పనిచేస్తున్న టీవీలో టెలికాస్ట్ అయ్యింది. అది వైరల్‌గా మారింది.
ముంబైలో ఉంటున్న హమీదా పిల్లలు యాస్మీన్, ప్రవీణ్ ఈ వీడియో చూశారు. ఇదేసమయంలో ఈ వీడియో పాకిస్తాన్ అధికారుల దృష్టికి కూడా వచ్చింది. దీంతో వారు ప్రభుత్వాన్ని సంప్రదించి హమీదాను భారత్‌కు పంపేందుకు ప్రయత్నించారు. ఈ వార్త పాకిస్తాన్‌లోని పలు టెలివిజన్ చానళ్లలో ప్రసారమయ్యింది. దాదాపు 22 ఏళ్ల తర్వాత హమీదా బానో తన స్వస్థలమైన ముంబైకి చేరుకున్నారు. ఆమెను చూసిన కుటుంబసభ్యులు ఈ సమయంలో భావోద్వేగానికి గురయ్యారు.
ఇది కూడా చదవండి: Year Ender 2024: ప్రధాని మోదీ పర్యటించిన దేశాలివే.. మీరూ ట్రిప్‌కు ప్లాన్ చేసుకోవచ్చు
Comments
Please login to add a commentAdd a comment