పోరు నష్టం... పొందు లాభం | sudheendra kulkarni Article On India China Relations | Sakshi
Sakshi News home page

పోరు నష్టం... పొందు లాభం

Published Thu, Mar 24 2022 12:11 AM | Last Updated on Thu, Mar 24 2022 12:11 AM

sudheendra kulkarni Article On India China Relations - Sakshi

గల్వాన్‌ లోయ ఘటన తర్వాత దిగజారిన భారత్, చైనా సంబంధాలు మెరుగుపడటానికి ఇదే సమయం. రెండు దేశాలూ బలప్రదర్శనతో ప్రయోజనం లేదని గుర్తించాయి. ప్రపంచంలోనే రెండు అతిపెద్ద దేశాలుగా... విస్తృత ప్రయోజనాలపై దృష్టి పెట్టాల్సి ఉందన్న అవగాహన కూడా పెరిగింది. దీనికితోడు, ప్రస్తుత యుద్ధ వాతావరణంలో అమెరికా ఒత్తిళ్లను తట్టుకుని మరీ రష్యాపై భారత్‌ ఎలాంటి వ్యతిరేక వ్యాఖ్యలూ చేయక పోవడాన్ని ‘డ్రాగన్‌’ గమనించకుండా ఉండదు. ఒకరిని ఒకరు గౌరవించుకుంటూ, ప్రయోజనాలను గుర్తిస్తూ సాగడం అవసరం. పాశ్చాత్యుల మాదిరిగా స్వీయ ప్రయోజనాలు మాత్రమే చూసుకోకుండా, ఐదు వేల ఏళ్ల పురాతన సంస్కృతి నేర్పిన జ్ఞానాన్ని భారత్, చైనా ఆచరణలో పెట్టాల్సిన తరుణం ఇది.

రష్యా–ఉక్రెయిన్‌ మధ్య యుద్ధం జోరుగా సాగుతున్న పరిస్థితులు... భారత్‌–చైనా సంబంధాలు మెరుగు పడేందుకు కారణం అవుతున్నాయి. వ్యూహాత్మక విషయాల్లో స్వయం ప్రతిపత్తి, స్వతంత్ర విదేశాంగ విధానం కలిగి ఉన్న భారత్‌... రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధంలో ఒక పక్షం వైపు నిలబడేందుకు నిరాకరిస్తున్న విషయం... అగ్రరాజ్యం అమెరికా ఒత్తిళ్లకు లొంగని తత్వం... డ్రాగన్‌ దృష్టిని మీరి ఉండే అవకాశమే లేదు. కాబట్టి గల్వాన్‌ ఘటనను గతకాలపు జ్ఞాపకంగా వదిలేసి, ఇరు దేశాలూ తమ సంబంధాలను మళ్లీ దృఢతరం చేసుకునేందుకు ఇదే మంచి తరుణం. అలాగే భారత్‌ –చైనా రెండూ కలిసికట్టుగా రష్యా– ఉక్రెయిన్‌ యుద్ధానికి తెరదింపగలిగితే యూరప్‌లో శాంతికి ఆసియా దేశాలు కృషి చేసే అపురూప ఘట్టం ఒకటి ఆవిష్కృతమవుతుంది. 

రెండేళ్లుగా భారత్‌–చైనా సంబంధాలు బాగా దెబ్బ తిన్నాయన డంలో ఎలాంటి సందేహమూ లేదు. లదాఖ్‌లో వాస్తవాధీన రేఖ వెంబడి గల్వాన్‌ లోయలో ఇరు దేశాల సైనికుల ఘర్షణతో మొదలైన పతనం ఇప్పుడు పుంజుకునే అవకాశాలు ఏర్పడ్డాయి. సంబంధాలు పూర్వస్థితికి లేదా ఉచ్ఛస్థితికి చేరుకునేందుకు కొంత సమయం పట్టవచ్చు కానీ... కొత్త పరిణామాలు మాత్రం వైషమ్యం తగ్గుముఖం పట్టే ఆశను కల్పిస్తున్నాయి. చైనా విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి వాంగ్‌ యీ నేడు భారత్‌ రానున్నారు. ఇదే విధంగా భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్‌.జైశంకర్‌ బీజింగ్‌ వెళ్లే అవకాశమూ ఉంది.

ఇరు దేశాల మంత్రుల పర్యటన... వచ్చే ఏడాది జరిగే ‘బ్రిక్స్‌’  సమావేశాల్లో పాల్గొనేందుకుగానూ ప్రధాని నరేంద్ర మోదీ చైనా పర్యటనకు రంగం సిద్ధం చేయడం అనేది నిస్సందేహం. భారత ప్రధాని హాజరీ లేకుండా బ్రిక్స్‌ సమావేశం జరగడం ఊహించలేము. అదే సమయంలో వాస్తవాధీన రేఖ వెంబడి పరిస్థితి ఎంతో కొంత చక్కబడకుండా భారత ప్రధాని చైనా అధ్యక్షుడు జింగ్‌పింగ్‌తో ముఖాముఖి మాట్లాడే పరిస్థితీ ఉత్పన్నం కాదు. 

ఇరుదేశాల మధ్య మళ్లీ స్నేహపూరిత వాతావరణం ఏర్పడేందుకు కారణాలేమిటి? బలప్రదర్శనతో ప్రయోజనం లేదని ఇరు దేశాలూ గుర్తించడం మొట్టమొదటి కారణం. ఆశ్చర్యకరమైన విషయం ఏమి టంటే... బల ప్రదర్శన నిష్ప్రయోజనమన్న విషయం ముందుగా చైనా వైపు నుంచే వ్యక్తం కావడం. ఈ నెల ఏడవ తేదీన చైనా విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి మాట్లాడుతూ, ‘‘లక్ష్యాల సాధనకు ఒకరి కొకరు సహకరించుకోవాలేగానీ... ఒకరి శక్తిని ఇంకొకరు పీల్చేసు కుంటూ ఉండటం సరికాదు’’ అని వ్యాఖ్యానించారు.

సరిహద్దుల్లో యాభై వేలమంది సైనికులను మోహరించడం (శక్తి), ఆయుధ వ్యవస్థలను సిద్ధంగా ఉంచుకోవడం పైనే ఈ వ్యాఖ్య అన్నది అర్థం చేసుకోవాలి. కమాండర్ల స్థాయిలో పదిహేనుసార్లు చర్చలు జరిపినా ఉద్రిక్తతల తగ్గింపు అందని మానిపండులాగే మిగిలింది మరి. రాజ కీయంగానూ పరిష్కారం కానరాని నేపథ్యంలో బల ప్రదర్శన చేయడం తర్కానికి నిలిచేది కాదు. ఆ పరిస్థితి తాలూకూ విపరిణా మాలను ఇరుదేశాలూ అనుభవించాల్సి ఉంటుంది. 

రెండో కారణం... ఒక చిన్న ఘటనతో ద్వైపాక్షిక సంబంధాలు ఇంత దిగజారిపోవాల్సిన అవసరం లేదని ఇరుదేశాలూ గుర్తించడం. ప్రపంచంలోనే రెండు అతిపెద్ద దేశాలుగా... విస్తృత ప్రయోజనాలపై దృష్టి పెట్టాల్సి ఉందన్న అవగాహన పెరగడం. ఆర్థిక, వాణిజ్య రంగాలతోపాటు వాతావరణ మార్పులపై పోరు, డిజిటల్‌ టెక్నా లజీలు, ప్రాంతీయంగా శాంతి వంటి అనేకానేక ప్రయోజనాలు ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగ్గా ఉంటేనే సాధ్యమనీ, తద్వారా ప్రపంచస్థాయిలో సరికొత్త భిన్న ధ్రువాత్మక రాజకీయాలకు రూప కల్పన చేయవచ్చుననీ భావించడం. 

కొన్ని అంశాల్లో ఇరు దేశాల ప్రయోజనాలూ, దృక్కోణాలూ వేరుగా ఉన్నప్పటికీ... చాలా అంశాల్లో సారూప్యతా ఉంది. సారూ ప్యతతో వచ్చే ప్రయోజనాలు పొందాలన్నా... భిన్నాభిప్రాయాల పరిణామాలను నియంత్రించాలన్నా రాజకీయంగా అత్యున్నత స్థాయి చర్చలు అత్యవసరం. గల్వాన్‌ ఘటన కారణంగా ఈ చర్చల ప్రక్రియ ఆగిపోవడం దురదృష్టకరం. ఈ ఘటనకు ముందు మోదీ, జింగ్‌పింగ్‌ దాదాపు 18 సార్లు కలిసినా... ఆ తరువాత మాత్రం ఒక్క సారి కనీసం కలుసుకోలేదు. ఈ స్తబ్ధత ఇరువురికీ మేలు చేసేదేమీ కాదు. 

భారత్‌–చైనా మధ్య సంబంధాలు మెరుగుపడాల్సిన అవసరాన్ని చెప్పే ఇంకో కారణం... ప్రాంతీయంగానూ, అంతర్జాతీయంగానూ జరుగుతున్న పరిణామాలు. శాంతి, సుస్థిరతల స్థాపనలో ఇరు దేశా లకూ బాధ్యత, భాగస్వామ్యం ఉంది. అమెరికా బలగాలు వెళ్లిపోయిన తరువాత తాలిబాన్ల చేతిలో చిక్కిన అఫ్గానిస్థాన్‌ పునర్నిర్మాణంపై కూడా ఇరు దేశాలూ పనిచేయాల్సిన పరిస్థితి ఉంది. దక్షిణాసియా ప్రాంతంలో ఉగ్రవాదానికీ, మతపరమైన తీవ్రవాదానికీ, వేర్పాటు వాద శక్తులకూ చోటులేకుండా చూడటం కూడా అత్యవసరం. ఈ మూడు లక్ష్యాల సాధనకు పాకిస్తాన్‌తోపాటు ఈ ప్రాంతంలోని అన్ని దేశాల మ«ధ్యా చర్చలు కచ్చితంగా జరగాలి. చైనా ప్రభావం పాకిస్తాన్‌పై కూడా ఉన్న విషయం ఇక్కడ చెప్పుకోవాలి. 

ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం కూడా భారత్, చైనా తమ ఆలో చనలను మార్చుకోవాల్సిన పరిస్థితి కల్పించింది. రష్యాతో ఇరుదేశా లకూ మంచి సంబంధాలే ఉండటం దీనికి కారణం. ప్రస్తుత యుద్ధ వాతావరణంలో అమెరికా ఒత్తిళ్లను తట్టుకుని మరీ రష్యాపై భారత్‌ ఎలాంటి వ్యతిరేక వ్యాఖ్యలూ చేయకపోవడాన్ని చైనా కచ్చితంగా గమనించే ఉంటుంది. ‘‘కొన్ని శక్తులు రెండు ఆసియా దేశాల మధ్య విభజనను సృష్టించేందుకు ప్రయత్నించాయి’’ అన్న బీజింగ్‌ వ్యాఖ్య ఇక్కడ ప్రస్తావనార్హం.

ప్రపంచస్థాయిలో భారత్‌ అవసరాన్నీ, ప్రాము ఖ్యతనూ చైనా కూడా పరోక్షంగా గుర్తు చేస్తూనే ఉంది. ‘‘భారత్‌– చైనా భాగస్వా ములూ, మిత్రులూ కావాల్సిన అవసరం ఉంది. ఒకరికి ఒకరు ముప్పుగా పరిణమించకుండా పరస్పర అభివృద్ధికి అవకా శంగా మారాలి’’ అంటూ వాంగ్‌ యీ ఇటీవల చేసిన వ్యాఖ్య ఇందుకు ఒక ఉదాహరణ. ‘‘భారత్, చైనా దేశాలు అతిపురాతన నాగరికతలకు ఆనవాళ్లు. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు మాత్రమే కాకుండా... వేరు చేయలేని ఇరుగూ పొరుగూ కూడా. ఒకరిపై ఒకరికి విశ్వాసం కలిగితే ఆ మైత్రికి హిమాలయాలూ అడ్డు కాబోవు’’ అని కూడా వాంగ్‌  వ్యాఖ్యానించారు. 

రెండేళ్ల స్తబ్ధతను ఛేదించేందుకు ఈ ఏడాది గట్టి ప్రయత్నమే జరిగింది. ఇరు దేశాల్లోనూ భారత – చైనా నాగరికతలపై చర్చలు చేపట్టాలని చైనా ప్రతిపాదించడం వీటిల్లో ముఖ్యమైనది. 2019 మే నెలలో జింగ్‌పింగ్‌ ఆసియా నాగరికతలపై ఓ చర్చా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సాధారణ ఎన్నికల నేపథ్యంలో భారత్‌ ఆ చర్చల్లో అధికారికంగా పాల్గొనలేకపోయింది. కానీ.. వీటిల్లో నేను పాల్గొ న్నాను. ఆ కార్యక్రమంలో జింగ్‌పింగ్‌ ఆసియా నాగరికతలు రూపు దిద్దుకోవడంలో భారత భాగస్వామ్యంపై ప్రశంసల వర్షం కురిపిం చారు. రుగ్వేదం, గంగ, సింధు నదులతోపాటు అమూల్యమైన బౌద్ధం గురించి కూడా ప్రస్తావించారు. ‘‘పరాజితులు లేని... ఇరు పక్షాలూ విజితులుగా నిలిచేదే మేలైన వివాద పరిష్కారం’’ అన్న గౌతమ బుద్ధుడి వ్యాఖ్యను ఇక్కడ మనం గుర్తు చేసుకోవాలి. భారత్, చైనా కూడా ఈ మాటలకు చెవి ఒగ్గడం ఎంతైనా అవసరం. 

ఇరు దేశాల సరిహద్దుల్లో ఏర్పడ్డ వివాదం పరస్పరం రాజీ పడటం ద్వారా మాత్రమే పరిష్కారమవుతుంది. ఇందుకు ఇరు పక్షాలూ ముందడుగు వేయాలి. ఒకరిని ఒకరు గౌరవించుకుంటూ, ప్రయోజనాలను గుర్తిస్తూ, పునఃసమీక్ష చేసుకుంటూ సాగడం అవసరం. పాశ్చాత్యుల మాదిరిగా స్వీయ ప్రయోజనాలు మాత్రమే చూసుకోకుండా, హింసను ప్రేరేపించకుండా... భారత్, చైనా ఐదు వేల ఏళ్ల పురాతన సంస్కృతి నేర్పిన జ్ఞానాన్ని ఆచరణలో పెట్టాల్సిన సమయం ఇది. అలా చేయని పక్షంలో గల్వాన్‌ లోయ తరహా ఘర్షణలు మరింత తీవ్రరూపం దాల్చడం తప్పదు!


సుధీంద్ర కులకర్ణి 
వ్యాసకర్త ఫోరమ్‌ ఫర్‌ ఎ న్యూ ఆసియా వ్యవస్థాపకులు
(‘ట్రిబ్యూన్‌’ సౌజన్యంతో)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement