సరస్సు మీద ఎగురుతున్న శాంతి కపోతాలు | Buddiga Jamindar Article On Indo China Relations | Sakshi
Sakshi News home page

సరస్సు మీద ఎగురుతున్న శాంతి కపోతాలు

Published Thu, Feb 18 2021 12:59 AM | Last Updated on Thu, Feb 18 2021 1:02 AM

Buddiga Jamindar Article On Indo China Relations - Sakshi

పాంగాంగ్‌ సరస్సు వద్ద బలగాల ఉపసంహరణ 

తూర్పు లద్దాఖ్‌ ప్రాంతం లోని పాంగాంగ్‌  సరస్సు దగ్గర భారత్, చైనా తమ సైన్యాన్ని ఉపసంహరించుకొనే ప్రక్రియ ప్రారంభించడం శుభసూచకం. ఇందుకు కారణమైన ఇరు దేశాల ప్రభుత్వాధినేతలను, దౌత్యవేత్తలను, మిలిటరీ అధి కారులను ప్రత్యేకంగా అభినం దించాలి. గడచిన తొమ్మిది నెలల్లో, తొమ్మిది రౌండ్ల సుదీర్ఘ చర్చల అనంతరం తూర్పు లద్దాఖ్‌ ప్రాంతంలో యథాస్థితికి (2020 ఏప్రిల్‌కు పూర్వం స్థితి) తిరిగి రావాలని నిర్ణయించుకొన్నట్లు పార్లమెంటు ఉభయ సభల్లో రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్రకటించారు. సరిహద్దు ఉద్రిక్తతలను తగ్గించే ఈ ఒప్పందం శాంతి, సుస్థిరతలకు ఆశాజనకంగా ఉంటుందని చైనా విదే శాంగ నిపుణుడు వూ కియాన్‌ వ్యాఖ్యానించారు.

ఆగస్టు 29–30 తేదీల్లో భారత సైనికులు కైలాశ్‌ పర్వత శ్రేణుల వరకూ చొచ్చుకొని పోవటంతో  ఇంచు మించు యుద్ధపరిస్థితులకు దారితీసినట్లు కనబడినా ఈ పరిణామం చైనాను చర్చలకు ఉసిగొల్పిందని విశ్లేష కులు భావిస్తున్నారు. మీరు ముందు అంటే, కాదు మీరే ముందు అంటూ, ఉపసంహరణ ప్రక్రియను జాప్యం చేయటం కన్నా ఉభయులు ఒకేసారి ఇరువైపుల నుంచి సైన్యాన్ని, యుద్ధసామగ్రిని వెనక్కి రప్పించుకోవటా నికి ఒప్పందం కుదుర్చుకోవటం ఇరుదేశాల దౌత్య నీతికి నిదర్శనం. మొదటగా చైనా యుద్ధ ట్యాంకులు పాంగాంగ్‌ సరస్సు ఉత్తర భాగం నుంచి వెనక్కి పయన మవటాన్ని గమనించిన వెంటనే భారత యుద్ధ ట్యాంకులు కూడా వెనక్కి మరలాయి. 

వాస్తవాధీనరేఖను గౌరవించటం, దానిపై ఇరు పక్షాలు లోగడ చేసుకొన్న ఒప్పందాలకు కట్టుబడి ఉండటం ప్రధాన ఆశయమని రాజ్‌నాథ్‌ సింగ్‌ అన్నారు. మొత్తం ఉపసంహరణ ప్రక్రియ పూర్తయిన 48 గంటల్లోపే ఇరు పక్షాల కమాండర్‌ స్థాయి అధి కారులు మరలా సమావేశమై మిగతా వివాదాస్పద కేంద్రాల పరిష్కార మార్గాల గురించి చర్చిస్తారని ఆయన చెప్పారు. గోగ్రా, హాట్‌స్ప్రింగ్స్, డేప్‌సాంగ్, గల్వాన్‌ ప్రాంతాలు ఈ చర్చల ఎజెండాలో ఉంటాయి. ఫింగర్‌ 8, ఫింగర్‌ 4లకు ఇకపై ఇరువైపుల నుంచీ పెట్రోలింగ్‌ ఉండదు. ఇరు పక్షాల మధ్య కొన్ని మౌలిక  ఒప్పందాలు కుదిరిన తర్వాతనే తిరిగి పెట్రోలింగ్‌ ప్రారంభమవుతుంది. లోగడ భారత్‌ ఫింగర్‌ 8 వరకు, చైనా పాంగాంగ్‌ సరస్సు ఉత్తరం వైపునకూ ప్రవేశిం చాయి.

ఇరుదేశాలు ఇదివరలో ఉన్న శాశ్వత కట్టడా లవైపు (భారత్‌–ధన్‌సింహ్‌ థాపా పోస్టు, చైనా– ఫింగర్‌ 8కు తూర్పువైపునున్న సిరిజాప్‌ పోస్టు) వెళ్లి పోయి, ఇటీవల కాలంలో నిర్మించిన నూతన క్యాంపులు, కట్టడాలు తొలగించుకొంటాయి. మనదేశ సరిహద్దు ప్రాంతాన్ని చైనా వశపర్చు కోలేదనీ, 1962 యుద్ధంలోనే 43 వేల చదరపు కిలో మీటర్లు చైనా అధీనంలోకి వెళ్లిందని రాజ్‌నాథ్‌సింగ్‌ పేర్కొన్నారు. వాస్తవాధీన రేఖ  వాస్తవానికి ఫింగర్‌ 8 వరకే ఉందని, ఫింగర్‌ 4 వరకూ లేదని అన్నారు. సరి హద్దు సమస్యలు ఒకేసారి పరిష్కారం కాకపోవచ్చు. ఒకరిపై ఒకరు విశ్వాసాన్ని కోల్పోయి యుద్ధ సన్నా హాలు చేయడం కంటే, అంచెలవారీగా శాంతి సన్నా హాలు చేయడమే ఉత్తమం. ఇరు దేశాల కోట్లాది డాలర్ల ప్రజాధనాన్ని ఇకపై తగ్గించుకోవచ్చు.

కారాకోరవ్‌ు పర్వతశ్రేణుల దగ్గర ప్రారంభమయ్యే ఈ పాంగాంగ్‌ సరస్సు అనగానే గుర్తొచ్చేది ఆమీర్‌ఖాన్‌ ‘త్రీ ఈడియట్స్‌’ చిత్రం. రంగులు మారే ఈ సరిహద్దు సరస్సు రమ్యంగా ఉంటుంది. తూర్పు లద్దాఖ్‌లో ప్రారంభమై, అక్సాయ్‌చిన్‌ గుండా టిబెట్‌ వరకూ బూమరాంగ్‌ ఆకారంలో వ్యాపించి ఉంటుంది. 135 కిలోమీటర్ల పొడవున్న ఈ ఉప్పునీటి సరస్సు ఒక ప్రాంతంలో 5 కిలోమీటర్ల వెడల్పు ఉంటుంది. సముద్ర మట్టానికి 4,225 మీటర్ల ఎత్తులో ఉండి, ప్రపంచంలో ఎత్తయిన ప్రాంతంలో ఉన్న రెండవ అతిపెద్ద సరస్సుగా ప్రఖ్యాతి గాంచింది. చలికాలంలో ఐస్‌గడ్డగా మారుతుంది. అప్పుడు పోలో, ఐస్‌హాకీ దీనిపై ఆడతారు. 40 శాతం సరస్సు మనదేశంలో ఉండగా, మిగిలిన 60 శాతం చైనాలో ఉంటుంది. పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తే యాత్రికులతో నిత్యం కళకళలాడుతూ ఆకర్షణగా నిలవగలదు.

బుడ్డిగ జమిందార్‌ 
వ్యాసకర్త, ఆల్‌ ఇండియా ప్రోగ్రెసివ్‌ ఫోరం
మొబైల్‌ : 98494 91969

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement