భావ ప్రకటనపై దాడి
ముంబైలో పాక్ మాజీ మంత్రి కసూరి పుస్తకావిష్కరణకు వ్యతిరేకంగా శివసేన వీరంగం
కార్యక్రమ నిర్వాహకుడు, బీజేపీ మాజీ సిద్ధాంతకర్త సుధీంద్ర కులకర్ణిపై సిరా దాడి
♦ పటిష్ట భద్రత నడుమ పుస్తకావిష్కరణ; పాల్గొన్న మొహమ్మద్ కసూరి
ముంబై/న్యూఢిల్లీ: ముంబైలో శివ సైనికులు రెచ్చిపోయారు. భావ ప్రకటన స్వేచ్ఛపై దాడి చేశారు. నగరంలో పాక్ ప్రముఖుల కార్యక్రమాలపై తాము విధించిన అప్రకటిత నిషేధాన్ని ఎదిరించిన పాపానికి ఓ మేధావి ముఖంపై నల్లరంగు పులిమారు. ముంబైలో పాక్ మాజీ విదేశాంగ మంత్రి పుస్తకావిష్కరణ కార్యక్రమం వద్దని హెచ్చరించినా.. బేఖాతరు చేసినందుకు ఆయనను బూతులు తిడుతూ అవమానించారు.ప్రజాస్వామ్యంలో అది చిన్న నిరసన మాత్రమేనంటూ సేన ఎంపీ సంజయ్ రౌత్ వారిని సమర్థించడం కొసమెరుపు.
పాకిస్తాన్ మాజీ విదేశాంగ మంత్రి ఖుర్షీద్ మొహమ్మద్ కసూరి రాసిన ‘నైదర్ ఎ హాక్.. నార్ ఏ డవ్-యాన్ ఇన్‌సైడర్స్ అకౌంట్ ఆఫ్ పాకిస్తాన్స్ ఫారిన్ పాలసీ’ పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని సోమవారం సాయంత్రం ముంబైలో నిర్వహించేందుకు నిర్ణయించారు. అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్(ఓఆర్‌ఎఫ్) సంస్థ ఆధ్వర్యంలో ఆ సంస్థ చైర్మన్, ఒకప్పటి బీజేపీ సిద్ధాంతకర్త సుధీంద్ర కులకర్ణి ఆ పనుల్లో ఉన్నారు. ఆ కార్యక్రమాన్ని విరమించుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని శివసేన నుంచి ఆయనకు హెచ్చరికలు వచ్చాయి. దాంతో ఆయన ఆదివారం రాత్రి శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్‌ఠాక్రేను ఆయన నివాసం మాతోశ్రీ లో కలసి, ఈ విషయంలో సహకరించాలని కోరారు.
‘శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు మీకున్నట్లే, పుస్తకావిష్కరణ హక్కు మాకుంద’ని ఠాక్రేతో వాదించారు. అయితే, ఠాక్రే నుంచి ఆయనకు ఎలాంటి హామీ లభించలేదు. దీంతో సోమవారం ఉదయం మాతుంగలోని తన నివాసం నుంచి కారులో బయటకు వచ్చిన సుధీంధ్రను శివసేన కార్యకర్తలు అడ్డుకున్నారు. ఆయన కార్లో నుంచి బయటకు వచ్చాక ఆయనపై నల్లరంగు గుప్పించారు. సుధీంధ్ర ముఖంపై, దుస్తులపై నల్లరంగు పులిమి, బూతులు తిడుతూ అవమానించారు. అనంతరం, పూర్తిగా నల్లరంగులో తడిచిపోయిన సుధీంధ్ర.. అదే ఆహార్యంలో కసూరితో కలసి విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ఇలాంటి బెదిరింపులకు లొంగబోనని తేల్చి చెప్పారు.
ఇది ప్రజాస్వామ్యానికి జరిగిన అవమానమని అన్నారు. కసూరి మాట్లాడుతూ.. నిరసన తెలిపే విధానం ఇది కాదన్నారు. ఆ తర్వాత సాయంత్రం ముంబైలోని నెహ్రూ సెంటర్‌లో భారీ బందోబస్తు మధ్య పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. కులకర్ణిపై దాడిని బీజేపీ సహా అన్ని పార్టీల నేతలు, మేధావులు, కళాకారులు, సినీ ప్రముఖులు ఖండించారు. అద్వానీ, మాజీ ప్రధాని వాజ్‌పేయిలకు కులకర్ణి సన్నిహితుడు. వారికి గతంలో ప్రసంగ ప్రతులను రాసిచ్చేవారు. ఈ ఘటనపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ స్పందిస్తూ.. ‘ఇంకు పోయడంపై చాలామంది బాధపడుతున్నారు.
సరిహద్దుల్లో మన సైనికులను చంపి, వారి రక్తాన్ని చిందించిన విషయాన్ని ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. అది ఇంక్ కాదు.. మన సైనికుల రక్తం’ అని పేర్కొన్నారు. కాగా, రాష్ట్రానికి వచ్చిన ప్రముఖులకు రక్షణ కల్పించాల్సిన ప్రభుత్వ బాధ్యతను నిర్వర్తిస్తామని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ స్పష్టంచేశారు.
సానుకూల దృక్పథం కావాలి: కసూరి
ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతూ.. సానుకూల దృ క్పథం అలవర్చుకోవాలని కసూరి అన్నారు. కార్గిల్ సమయంలో కానీ, 26/11 ముంబై దాడుల సమయంలో కానీ, తాను మంత్రిని కానని స్పష్టం చేశారు.
బీజేపీ హయాంలో పెరిగాయి: కాంగ్రెస్
ఈ అసహనాన్ని దేశం సహించబోదని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ హెచ్చరించారు. భారత్‌లో ‘దేశీ తాలిబాన్’ను అంగీకరించబోమన్నారు. ఇలాంటి చర్యలు భారత్, పాక్ సంబంధాలను మరింత దెబ్బతీస్తాయని సీపీఐ నేత రాజా పేర్కొన్నారు. కాగా, సుధీంద్రపై నల్లరంగు పోసిన ఘటనకు సంబంధించి ఆరుగురిని అరెస్టు చేసి కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
అపోహలను తొలగించేందుకే..
పటిష్ట భద్రత నడుమ కసూరి రాసిన ‘నైదర్ ఎ హాక్, నార్ ఎ డవ్’ పుస్తకావిష్కరణ ప్రశాంతం గా ముగిసింది. కార్యక్రమంలో న్యాయవాది ఏజీ నూరానీ, జర్నలిస్ట్ దిలీప్ పద్గావంకర్, నటుడు నసీరుద్దీన్‌షా..పాల్గొన్నారు. ముంబై లో తనకు భద్రత కల్పించిన మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్‌కు కసూరి కృతజ్ఞతలు తెలిపారు.
బాలీవుడ్ ప్రముఖుల ఖండన
సుధీంద్ర కులకర్ణిపై దాడిని బాలీవుడ్ ప్రముఖులు తీవ్రంగా ఖండించారు. ‘శివసేన దాడి చాలా బాధాకరం. ఉద్ధవ్ ఠాక్రే, ఆదిత్య ఠాక్రేలతో మాట్లాడేందుకు చాలా ప్రయత్నించా. కానీ వారు నా కాల్స్‌కు స్పందించలేదు’ అని నటి షబానా ఆజ్మీ ట్వీట్ చేశారు. దాడిని ఖండిస్తూ మహేశ్ భట్, రిషీ కపూర్ తదితరులు కూడా ట్వీట్ చేశారు.
సహనం ప్రజాస్వామ్య లక్షణం: అద్వానీ
ఒకప్పటి తన అనుచరుడు సుధీంద్రపై దాడిని బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీ గర్హించారు. ఎవరైనా తమకు అనుకూలంగా లేనట్లయితే, వారిపై హింసకు దిగుతున్న ఘటనలు ఈ మధ్య ఎక్కువవుతున్నాయంటూ ఆందోళన వ్యక్తం చేశారు. సుధీంద్రపై దాడిని కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, నఖ్వీ, మహేశ్ శర్మ, కిరణ్ రిజిజు తదితరులు తీవ్రంగా ఖండించారు.