MP Sanjay Raut
-
సీఎం కేజ్రీవాల్ అరెస్ట్‌కు కారణం అదే : ఎంపీ రౌత్
సాక్షి, ముంబై: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్‌పై శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాక్రే- యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీ రాజకీయాలను.. రష్యా, చైనా రాజకీయాలతో పోల్చారు. ‘దేశంలో ఎవరూ సురక్షితంగా లేరు. ఎవరు ఎప్పుడైనా అరెస్ట్ కావొచ్చు. రష్యా , చైనా తరహాలోనే భారత్‌లోనూ జరుగుతోంది. ప్రజలే కేజ్రీవాల్‌ను సీఎంగా ఎన్నుకున్నారు. కాబట్టి ఆయన భవితవ్యాన్ని వారే నిర్ణయిస్తారు అని సంజయ్ రౌత్ చెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ గెలుపు కష్టం కావడంతో ప్రత్యర్ధుల్ని ఈ రకంగా దెబ్బతీసే కార్యక్రమం చేపట్టిందని అన్నారు. ఈడీ కస్టడీలోనే అరవింద్ కేజ్రీవాల్ ఎక్సైజ్ పాలసీ కేసులో అరెస్టైన కేజ్రీవాల్‌ను ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు మార్చి 28 వరకు ఈడీ కస్టడీకి పంపింది. అయితే, లిక్కర్ కేసులో ప్రధాన లబ్ధి దారులు ఆమ్ ఆద్మీ పార్టీయేనని ఈడీ ఆరోపిస్తోంది. 2022 గోవా అసెంబ్లీ ఎన్నికల్లో సుమారు రూ.45 కోట్లు వరకు ఖర్చు పెట్టినట్లు తెలిపింది. -
మోదీజీ.. దీదీ గెలిస్తే.. మీరు ఓడినట్లే: సంజయ్ రౌత్
ముంబై: మే 2 తర్వాత మహరాష్ట్రలో రాజకీయ పరిణామాలు మారతాయని వాదించిన వాళ్లు పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాల తర్వాత ఢిల్లీలో ప్రకంపనలు వస్తాయని గుర్తుంచుకోవాలంటూ శివసేన ఎంపీ సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ బెంగాల్లో 292 అసెంబ్లీ స్థానాల్లో ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రధాని మోదీ, హోమంత్రి అమిత్ షాలు ప్రచారం నిర్వహించారు. ఆ ఇద్దరు ఉద్దండుల ప్రచారంతో బెంగాల్ రాజకీయ ముఖ చిత్రం మారిపోనుందని రాజకీయ నిపుణులు భావించారు. ఇప్పటి వరకు దేశంలో జరిగిన అన్ని ఎన్నికల్లో బీజేపీ ఎలా అయితే విజయం సాధించిందో.. బెంగాల్లో సైతం అదే తరహాలో దీదీని మట్టికరిపిస్తూ బీజేపీ విజయ దుందుభి మోగిస్తోందని సొంత పార్టీల నేతలు, అభ్యర్ధులు ఊహించారు. కానీ నేటి ఓట్ల లెక్కిపు ప్రక్రియలో బీజేపీ నాయకుల అంచనాలన్నీ తల్లకిందులయ్యాయి. ఎన్నికల ప్రచారంలో గాయ పడ్డ మమత ఒంటికాలితో ప్రచారం నిర్వహించి విజయం సాధిస్తానని ప్రత్యర్ధులకు విసిరిన సవాల్ నిజమయ్యింది. ఈ క్రమంలో సంజయ్ రౌత్ శివసేన అధికార మీడియా 'సామ్నా' వేదికగా కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. మే 2 తర్వాత మహారాష్ట్రలో రాజకీయ మార్పులు జరుగుతాయని ప్రచారం చేసిన వారు.. పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాలు ఢిల్లీలో కూడా ప్రకంపనల సృష్టిస్తాయని గుర్తించుకోవాలన్నారు. ఓ వైపు దేశంలో కోవిడ్ విజృంభణ కొనసాగుతుంది. వ్యాక్సిన్లు, బెడ్ల కొరత, ఆక్సిజన్ లేకపోవడం వల్ల 5 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రజలు చనిపోతున్నా ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో రాజకీయం చేయడం ఎంతవరకు సమంజసం అని సంజయ్ రౌత్ ప్రశ్నించారు. ఒక్క రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో గెలిచేందుకు దేశ ప్రజల్ని ప్రమాదంలోకి నెట్టేశారు. సుప్రీంకోర్టు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసిందని, ఈసీ తీరుపై మద్రాస్ హైకోర్టు మండిపడిందని సంజయ్ రౌత్ గుర్తు చేశారు. అంతేకాదు వెస్ట్ బెంగాల్లో దీదీ గెలిస్తే అక్కడ ప్రచారం చేసిన మోదీ, అమిత్ షాలు సైతం ఓడినట్లేనని సంజయ్ రౌత్ సామ్నాలో పేర్కొన్నారు. -
రియల్ విన్నర్ కాంగ్రెస్: శివసేన ఎంపీ
సాక్షి, ముంబయి: గుజరాత్లో బీజేపీ గెలుపొందినా ఆ పార్టీ మిత్రపక్షం శివసేన మాత్రం విమర్శల దాడి ఆపలేదు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీనే నిజమైన విజేతని శివసేన అభివర్ణించింది. అధికారంలోకి రావడం గొప్పవిషయం కాదని ఆ పార్టీ నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. గుజరాత్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు పరాజయం ఎదురైనా బీజేపీని ఓడించిందని అన్నారు. గుజరాత్లో బీజేపీ 20 ఏళ్లకు పైగా అధికారంలో ఉన్నందున అధికారం నిలుపుకోవడం పెద్ద విషయమేమీ కాదని, ఆ పార్టీ గొప్పగా చెప్పుకునే గుజరాత్ మోడల్ విఫలమైందని విమర్శించారు. గుజరాత్‌పై బీజేపీ పెట్టుకున్న ఆశలు గల్లంతయ్యాయని అన్నారు.నోట్ల రద్దుతో బీజేపీ సామాన్యుల జేబులను ఖాళీ చేసిందని, దాని ఫలితం గుజరాత్లో కనిపించిందని వ్యాఖ్యానించారు. దేశ భద్రత, జమ్మూ కాశ్మీర్, పాకిస్తాన్, నిరుద్యోగం, నోట్ల రద్దు, రైతుల ఆత్మహత్యల వంటి అంశాల్లో ఏ ఒక్కదానిపైనా మోదీ ప్రభుత్వం విజయం సాధించలేదని ఆరోపించారు. కాగా, గుజరాత్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో రాహుల్ నాయకత్వాన్ని శివసేన ప్రశంసించిన విషయం తెలిసిందే. -
దురదృష్టకరం.. అవాంఛనీయం!
దాద్రి ఘటన, గులాం అలీ కచేరీ రద్దుపై నోరు విప్పిన మోదీ * ఆలస్యంగా, మొక్కుబడిగా స్పందించారన్న విపక్షాలు * ‘గోద్రా’ను గుర్తు చేసిన శివసేన కోల్‌కతా/న్యూఢిల్లీ: గోమాంసం తిన్నాడన్న కారణంగా ఇఖ్లాక్ అనే వ్యక్తి హత్యకు గురైన ‘దాద్రి’ ఘటనపై ఎట్టకేలకు ప్రధాని నరేంద్ర మోదీ నోరు విప్పారు. దాద్రి ఘటన, పాకిస్తాన్‌కు చెందిన ప్రముఖగజల్ గాయకుడు గులాం అలీ కచేరీ కార్యక్రమాన్ని అడ్డుకోవడం మొదలైన ఘటనలు దురదృష్టకరమని, అవాంఛనీయమని వ్యాఖ్యానించారు. అయితే, వాటికి, కేంద్రప్రభుత్వానికి సంబంధం ఏంటని ప్రశ్నిం చారు. ప్రతిపక్షాలు కుహనా లౌకికవాదంతో విభజన రాజకీయాలకు పాల్పడుతున్నాయం టూ విమర్శించారు. బెంగాలీ డైలీ ‘ఆనంద్ బజార్పత్రిక’కు బుధవారం ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయా ఘటనలపై ఆయన మొదటిసారి ప్రత్యక్షంగా స్పందించారు. బీజేపీపై వస్తున్న ఆరోపణలకు స్పందిస్తూ.. ‘బీజేపీ ఇలాంటివాటిని ఎన్నడూ సమర్ధించదు. ఈ ఘటనలను చూపుతూ ప్రతిపక్షాలు బీజేపీపై మతతత్వ ఆరోపణలు చేస్తున్నాయి. కానీ నిజానికి విభజన రాజకీయాలు చేస్తోంది విపక్షాలే. కుహనా లౌకికవాదాన్ని బీజేపీ ఎప్పుడూ వ్యతిరేకిస్తూనే ఉంది. గతంలోనూ ఈ చర్చ వచ్చింది. ఇప్పుడూ వస్తోంది. ఇలాంటి వివాదాలను చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలి. బీజేపీపై విష ప్రచారం చేస్తున్న పార్టీలు వాస్తవానికి మైనారిటీలు అభివృద్ది చెందాలని కోరుకోవడంలేదు. వారిని ఓటుబ్యాంకులుగానే చూస్తున్నాయి’ అని విపక్షాలపై ధ్వజమెత్తారు. కొట్టి, సారీ చెప్పినట్లుగా..! మోదీ తాజా స్పందనపై విపక్షాలు విరుచుకుపడ్డాయి. ‘ఇదేనా మౌనం వీడటమంటే? కొట్టి, సారీ చెప్పినట్లుగా ఉంది మోదీ తీరు.’ అంటూ ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ట్వీట్ చేశారు. క్రికెట్లో భారత్ గెలిస్తే తక్షణమే శుభాకాంక్షలు తెలిపే మోదీ, దాద్రి ఘటనపై చాలా ఆలస్యంగా స్పందించారని జేడీయు చీఫ్ శరద్‌యాదవ్ వ్యాఖ్యానించారు. దాద్రి విషయంలో కచ్చితమైన కార్యాచరణ అవసరమని కాంగ్రెస్ ప్రధానికి సూచించింది. ‘మొత్తం దేశానికి ప్రధానినని, దేశంలోని మొత్తం 125 కోట్ల ప్రజల రక్షణ తన బాధ్యత అని మోదీ మరచిపోయారు. గులాం అలీ కచేరీ రద్దైన, సుధీంద్రపై ఇంకుపోసిన మహారాష్ట్రలో బీజేపీనే అధికారంలో ఉన్న విషయాన్నీ ఆయన మరిచారు’ అని కాంగ్రెస్ ముఖ్యఅధికార ప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాలా వ్యాఖ్యానించారు. ‘గోద్రా’ వల్లే మీకీ గౌరవం..! పాక్ గాయకుడు గులాం అలీ సంగీత కచేరీని అడ్డుకోవడం దురదృష్టకరమన్న మోదీ వ్యాఖ్యలను సేన తప్పుబట్టింది. ‘గోద్రా, అహ్మదాబాద్‌ల వల్లనే మోదీకి గుర్తింపు, గౌరవం. అవే కారణాలతో మేమూ ఆయనను గౌరవిస్తాం. అలాంటి మోదీనే గులాం అలీ కార్యక్రమాన్ని అడ్డుకోవడం, పాక్ మాజీ మంత్రి కసూరి పుస్తకావిష్కరణను వ్యతిరేకించడం దురదృష్టకరమని వ్యాఖ్యానిస్తే.. ఆ వ్యాఖ్యలు మాకందరికి నిజంగానే దురదృష్టకరం’ అని సేన ఎంపీ సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. తెగతెంపుల దిశగా..! శివసేన జాతీయవాదం, దేశభక్తి విసుగెత్తిస్తే.. సంకీర్ణం నుంచి వైదొలగవచ్చంటూ మంగళవారం సేన చేసిన వ్యాఖ్యలు, సంజయ్ రౌత్ తాజా విమర్శలతో.. కేంద్రంలో, మహారాష్ట్రలో మిత్రపక్షాలైన బీజేపీ, సేనల మధ్య దూరం పెరుగుతోంది. గురువారం జరిగే బీజేపీ సమా వేశంలో దీనిపై చర్చ జరగవచ్చని భా విస్తు న్నారు. అయితే బీజేపీ-శివసేన పార్టీలు గిల్లికజ్జాలు పెట్టుకున్నా ఒకరిని వదిలి మరొకరు ఉండలేరని..అధికారం కోసం ఇద్దరూ కలిసే ఉంటారని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ తెలిపారు. -
భావ ప్రకటనపై దాడి
ముంబైలో పాక్ మాజీ మంత్రి కసూరి పుస్తకావిష్కరణకు వ్యతిరేకంగా శివసేన వీరంగం కార్యక్రమ నిర్వాహకుడు, బీజేపీ మాజీ సిద్ధాంతకర్త సుధీంద్ర కులకర్ణిపై సిరా దాడి ♦ పటిష్ట భద్రత నడుమ పుస్తకావిష్కరణ; పాల్గొన్న మొహమ్మద్ కసూరి ముంబై/న్యూఢిల్లీ: ముంబైలో శివ సైనికులు రెచ్చిపోయారు. భావ ప్రకటన స్వేచ్ఛపై దాడి చేశారు. నగరంలో పాక్ ప్రముఖుల కార్యక్రమాలపై తాము విధించిన అప్రకటిత నిషేధాన్ని ఎదిరించిన పాపానికి ఓ మేధావి ముఖంపై నల్లరంగు పులిమారు. ముంబైలో పాక్ మాజీ విదేశాంగ మంత్రి పుస్తకావిష్కరణ కార్యక్రమం వద్దని హెచ్చరించినా.. బేఖాతరు చేసినందుకు ఆయనను బూతులు తిడుతూ అవమానించారు.ప్రజాస్వామ్యంలో అది చిన్న నిరసన మాత్రమేనంటూ సేన ఎంపీ సంజయ్ రౌత్ వారిని సమర్థించడం కొసమెరుపు. పాకిస్తాన్ మాజీ విదేశాంగ మంత్రి ఖుర్షీద్ మొహమ్మద్ కసూరి రాసిన ‘నైదర్ ఎ హాక్.. నార్ ఏ డవ్-యాన్ ఇన్సైడర్స్ అకౌంట్ ఆఫ్ పాకిస్తాన్స్ ఫారిన్ పాలసీ’ పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని సోమవారం సాయంత్రం ముంబైలో నిర్వహించేందుకు నిర్ణయించారు. అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్(ఓఆర్ఎఫ్) సంస్థ ఆధ్వర్యంలో ఆ సంస్థ చైర్మన్, ఒకప్పటి బీజేపీ సిద్ధాంతకర్త సుధీంద్ర కులకర్ణి ఆ పనుల్లో ఉన్నారు. ఆ కార్యక్రమాన్ని విరమించుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని శివసేన నుంచి ఆయనకు హెచ్చరికలు వచ్చాయి. దాంతో ఆయన ఆదివారం రాత్రి శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్‌ఠాక్రేను ఆయన నివాసం మాతోశ్రీ లో కలసి, ఈ విషయంలో సహకరించాలని కోరారు. ‘శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు మీకున్నట్లే, పుస్తకావిష్కరణ హక్కు మాకుంద’ని ఠాక్రేతో వాదించారు. అయితే, ఠాక్రే నుంచి ఆయనకు ఎలాంటి హామీ లభించలేదు. దీంతో సోమవారం ఉదయం మాతుంగలోని తన నివాసం నుంచి కారులో బయటకు వచ్చిన సుధీంధ్రను శివసేన కార్యకర్తలు అడ్డుకున్నారు. ఆయన కార్లో నుంచి బయటకు వచ్చాక ఆయనపై నల్లరంగు గుప్పించారు. సుధీంధ్ర ముఖంపై, దుస్తులపై నల్లరంగు పులిమి, బూతులు తిడుతూ అవమానించారు. అనంతరం, పూర్తిగా నల్లరంగులో తడిచిపోయిన సుధీంధ్ర.. అదే ఆహార్యంలో కసూరితో కలసి విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ఇలాంటి బెదిరింపులకు లొంగబోనని తేల్చి చెప్పారు. ఇది ప్రజాస్వామ్యానికి జరిగిన అవమానమని అన్నారు. కసూరి మాట్లాడుతూ.. నిరసన తెలిపే విధానం ఇది కాదన్నారు. ఆ తర్వాత సాయంత్రం ముంబైలోని నెహ్రూ సెంటర్లో భారీ బందోబస్తు మధ్య పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. కులకర్ణిపై దాడిని బీజేపీ సహా అన్ని పార్టీల నేతలు, మేధావులు, కళాకారులు, సినీ ప్రముఖులు ఖండించారు. అద్వానీ, మాజీ ప్రధాని వాజ్‌పేయిలకు కులకర్ణి సన్నిహితుడు. వారికి గతంలో ప్రసంగ ప్రతులను రాసిచ్చేవారు. ఈ ఘటనపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ స్పందిస్తూ.. ‘ఇంకు పోయడంపై చాలామంది బాధపడుతున్నారు. సరిహద్దుల్లో మన సైనికులను చంపి, వారి రక్తాన్ని చిందించిన విషయాన్ని ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. అది ఇంక్ కాదు.. మన సైనికుల రక్తం’ అని పేర్కొన్నారు. కాగా, రాష్ట్రానికి వచ్చిన ప్రముఖులకు రక్షణ కల్పించాల్సిన ప్రభుత్వ బాధ్యతను నిర్వర్తిస్తామని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ స్పష్టంచేశారు. సానుకూల దృక్పథం కావాలి: కసూరి ప్రెస్మీట్లో మాట్లాడుతూ.. సానుకూల దృ క్పథం అలవర్చుకోవాలని కసూరి అన్నారు. కార్గిల్ సమయంలో కానీ, 26/11 ముంబై దాడుల సమయంలో కానీ, తాను మంత్రిని కానని స్పష్టం చేశారు. బీజేపీ హయాంలో పెరిగాయి: కాంగ్రెస్ ఈ అసహనాన్ని దేశం సహించబోదని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ హెచ్చరించారు. భారత్‌లో ‘దేశీ తాలిబాన్’ను అంగీకరించబోమన్నారు. ఇలాంటి చర్యలు భారత్, పాక్ సంబంధాలను మరింత దెబ్బతీస్తాయని సీపీఐ నేత రాజా పేర్కొన్నారు. కాగా, సుధీంద్రపై నల్లరంగు పోసిన ఘటనకు సంబంధించి ఆరుగురిని అరెస్టు చేసి కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అపోహలను తొలగించేందుకే.. పటిష్ట భద్రత నడుమ కసూరి రాసిన ‘నైదర్ ఎ హాక్, నార్ ఎ డవ్’ పుస్తకావిష్కరణ ప్రశాంతం గా ముగిసింది. కార్యక్రమంలో న్యాయవాది ఏజీ నూరానీ, జర్నలిస్ట్ దిలీప్ పద్గావంకర్, నటుడు నసీరుద్దీన్‌షా..పాల్గొన్నారు. ముంబై లో తనకు భద్రత కల్పించిన మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్‌కు కసూరి కృతజ్ఞతలు తెలిపారు. బాలీవుడ్ ప్రముఖుల ఖండన సుధీంద్ర కులకర్ణిపై దాడిని బాలీవుడ్ ప్రముఖులు తీవ్రంగా ఖండించారు. ‘శివసేన దాడి చాలా బాధాకరం. ఉద్ధవ్ ఠాక్రే, ఆదిత్య ఠాక్రేలతో మాట్లాడేందుకు చాలా ప్రయత్నించా. కానీ వారు నా కాల్స్‌కు స్పందించలేదు’ అని నటి షబానా ఆజ్మీ ట్వీట్ చేశారు. దాడిని ఖండిస్తూ మహేశ్ భట్, రిషీ కపూర్ తదితరులు కూడా ట్వీట్ చేశారు. సహనం ప్రజాస్వామ్య లక్షణం: అద్వానీ ఒకప్పటి తన అనుచరుడు సుధీంద్రపై దాడిని బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీ గర్హించారు. ఎవరైనా తమకు అనుకూలంగా లేనట్లయితే, వారిపై హింసకు దిగుతున్న ఘటనలు ఈ మధ్య ఎక్కువవుతున్నాయంటూ ఆందోళన వ్యక్తం చేశారు. సుధీంద్రపై దాడిని కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, నఖ్వీ, మహేశ్ శర్మ, కిరణ్ రిజిజు తదితరులు తీవ్రంగా ఖండించారు. -
భూసేకరణపై రైతుల్లో అవగాహనకు శివసేన పర్యటన
ముంబై: భూసేకరణ బిల్లుపై రైతుల్లో అవగాహన కల్పించేందుకు రాష్ట్రంలో పర్యటించాలని శివసేన కార్యకర్తలను ఆ పార్టీ అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే కోరారు. బుధవారం పార్టీ సీనియర్ నేతలు, శాసన సభ్యులు, పార్లమెంటు సభ్యులు, జిల్లా కార్యకర్తలతో ఠాక్రే సమావేశమయ్యారు. రైతులు భూసేకరణ బిల్లు పట్ల ఆందోళన చెందుతున్నారని వారికి ఈ విషయమై అవగాహన కల్పించాలన్నారు. బీజేపీకి ఓటేసిన రైతులను ప్రభుత్వం హింసించడం తగదని ఠాక్రే అన్నారు. తాము అభివృద్ధికి వ్యతిరేకం కాదని, అయితే రైతులకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోమన్నారు. చట్టంపై ప్రభుత్వం పునరాలోచించి, ప్రత్యామ్నాయాలు కనుగొనాలని సూచించారు. శివసేన ఎల్లప్పుడూ రైతుల పక్షమే అని ఠాక్రే పునరుద్ఘాటించారు. రైతులకు అన్యాయం చేసే ఏ చట్టానికి తాము మద్దతిచ్చేదిలేదని తేల్చి చెప్పారు. సేన ఎంపీ సంజయ్ రౌత్ మాట్లాడుతూ.. రైతుల, పేదలకు వ్యతిరేకమైన ఈ బిల్లును వ్యతిరేకించాలన్నారు. బిల్లుకు పార్టీ వ్యతిరేకం కాదని, అయితే అందులోని కొన్ని ముఖ్యమైన అంశాలపై చర్చ జరగాల్సి ఉందన్నారు. కాగా, బిల్లును పార్లమెంటులోని అన్ని ప్రతిపక్షాలు, ఎన్డీఏ మిత్రపక్షాలలో కొన్ని పార్టీలు వ్యతిరేకించాయి.