సాక్షి, ముంబయి: గుజరాత్‌లో బీజేపీ గెలుపొందినా ఆ పార్టీ మిత్రపక్షం శివసేన మాత్రం విమర్శల దాడి ఆపలేదు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీనే నిజమైన విజేతని శివసేన అభివర్ణించింది. అధికారంలోకి రావడం గొప్పవిషయం కాదని ఆ పార్టీ నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. గుజరాత్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు పరాజయం ఎదురైనా బీజేపీని ఓడించిందని అన్నారు.
గుజరాత్‌లో బీజేపీ 20 ఏళ్లకు పైగా అధికారంలో ఉన్నందున అధికారం నిలుపుకోవడం పెద్ద విషయమేమీ కాదని, ఆ పార్టీ గొప్పగా చెప్పుకునే గుజరాత్ మోడల్ విఫలమైందని విమర్శించారు. గుజరాత్‌పై బీజేపీ పెట్టుకున్న ఆశలు గల్లంతయ్యాయని అన్నారు.నోట్ల రద్దుతో బీజేపీ సామాన్యుల జేబులను ఖాళీ చేసిందని, దాని ఫలితం గుజరాత్‌లో కనిపించిందని వ్యాఖ్యానించారు.
దేశ భద్రత, జమ్మూ కాశ్మీర్, పాకిస్తాన్, నిరుద్యోగం, నోట్ల రద్దు, రైతుల ఆత్మహత్యల వంటి అంశాల్లో ఏ ఒక్కదానిపైనా మోదీ ప్రభుత్వం విజయం సాధించలేదని ఆరోపించారు. కాగా, గుజరాత్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో రాహుల్ నాయకత్వాన్ని శివసేన ప్రశంసించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment