శతాబ్దాలుగా భారత నాగరికత నిలదొక్కుకోవడానికి కారణమైన వైవిధ్యత, సహనం, బహుళత్వం వంటి విలువలను కాపాడుకోవాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పిలుపునిచ్చి నాలుగురోజులైంది. ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఆయన చూపిన మార్గాన్ని అనుసరించాలని అందరినీ కోరారు. కానీ సోమవారం శివసేన కార్యకర్తలు అందుకు భిన్నంగా ప్రవర్తించి ఆ విలువలకు అపచారం చేయడమే కాదు...దేశం పరువు ప్రతిష్టలను మంటగలిపారు. భావ ప్రకటనా స్వేచ్ఛకు విఘాతం కలిగించడానికి ప్రయత్నించారు.
పాకిస్థాన్ మాజీ మంత్రి ఖుర్షీద్ మహ్మద్ కసూరీ రచించిన గ్రంథాన్ని ఆవిష్కరించే కార్యక్రమాన్ని అడుకోవాలని చూసి, అది సాధ్యంకాదని అర్థమయ్యాక ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్(ఓఆర్‌ఎఫ్) వ్యవస్థాపకుడు సుధీంద్ర కులకర్ణిపై నల్లరంగు కుమ్మరించి ఆయనను దుర్భాషలాడారు. సుధీంద్ర కులకర్ణి ఎన్‌డీఏ తొలి దశ పాలనా కాలంలో బీజేపీలో కీలక పాత్ర పోషించారు. అప్పటి ఉప ప్రధాని ఎల్.కె. అద్వానీకి సహాయకుడిగా పనిచేశారు. అనంతర పరిణామాల నేపథ్యంలో ఆ పార్టీనుంచి బయటికొచ్చినా మౌలికంగా బీజేపీ సిద్ధాంతాలతో ఆయన విభేదించలేదు. సుధీంద్ర కులకర్ణి విశ్వాసాలేమైనా...వాటితో ఏకీభావం ఉన్నా లేకున్నా ఆయన్ను ఈ దేశంలో అందరూ మేథావిగా గుర్తిస్తారు. గౌరవిస్తారు. అలాంటి వ్యక్తిపై కేవలం తమ ఆదేశాలను ధిక్కరించారన్న ఏకైక కారణంతో శివసేన దాడికి దిగడం అందరినీ విస్మయపరిచింది. న్యూఢిల్లీలో రెండు రోజులక్రితం ఇదే గ్రంథాన్ని ఆవిష్కరించినప్పుడు ఆ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్‌సిన్హా మాట్లాడారు. అద్వానీ, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు. అదే గ్రంథాన్ని ముంబైలో ఆవిష్కరించాలని నిర్ణయించినప్పుడు దాన్ని జరగనివ్వబోమని శివసేన ప్రకటించింది. దాన్ని దృష్టిలో పెట్టుకునే సుధీంద్ర ఆదివారం ఆ పార్టీ అధినేత ఉధవ్ ఠాక్రేను కలిశారు. కార్యక్రమాన్ని అడ్డుకోవద్దని అభ్యర్థించారు. కావాలంటే ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలుపవచ్చునన్నారు. ఇదే శివసేన ఆగ్రహానికి కారణమైంది. తమ హుకుంను ధిక్కరించారన్న అక్కసుతో ఆయనపై నల్లరంగు పోశారు.
ముంబై మహానగరానికి ఘనమైన చరిత్ర ఉంది. భిన్న భాషలు, సంస్కృతులు, మతాలు, సంప్రదాయాలతో ఎంతో వైవిధ్యభరితంగా ఉన్న మన దేశానికి అది అచ్చమైన ప్రతీక. దేశంలోని భిన్న ప్రాంతాలనుంచి మాత్రమే కాదు...ప్రపంచంలోని వివిధ దేశాలనుంచి వచ్చి అక్కడ పనిచేస్తుంటారు. సుధీంద్ర కులకర్ణిపై దాడి చేసినవారు ఈ దేశ రాజ్యాంగానికి అపచారం కలిగించడంతోపాటు ముంబై నగర చరిత్రకు కూడా మచ్చ తెచ్చారు. తమ కార్యకర్తల చర్యను సమర్థించుకుంటూ శివసేన నేతలు మాట్లాడిన మాటలు ఆశ్చర్యం కలిగిస్తాయి. మన దేశంలో ఉగ్రవాద దాడులను ప్రోత్సహిస్తూ, సరిహద్దుల్లో మన సైనికులను చంపుతున్న పాకిస్థాన్‌కు చెందినవారు ఈ నగరంలో సభ పెట్టడానికి వీల్లేదని వారు వాదిస్తున్నారు. ఈ కారణాన్ని చూపే ఈమధ్య ముంబైలో జరగాల్సిన సుప్రసిద్ధ పాక్ గజల్ గాయకుడు గులాం అలీ కార్యక్రమానికి శివసేన అడ్డు తగిలింది. ఆ విషయంలో విజయం సాధించిన తాము కసూరీ పుస్తకావిష్కరణను మాత్రం అడ్డుకోలేకపోతున్నామన్న బాధ శివసేనకు ఉండొచ్చు. ఇంతకూ కసూరీ ఇప్పుడు పాకిస్థాన్ పాలక వ్యవస్థలో భాగస్వామి కాదు. భారత్‌తో సత్సంబంధాలకు అడ్డు తగులుతున్న శక్తులపై ఆయనకు ఆగ్రహం ఉంది. ఆయన రచించిన పుస్తకం పాక్ ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తున్నదని అక్కడి మతతత్వవాదులు విమర్శించారు. అలాంటి వ్యక్తిని పాకిస్థాన్ ప్రతినిధిగా పరిగణించడం...పాక్ చర్యలకు బాధ్యుడిగా భావించడం సరైంది అనిపించుకోదు.
ఒకవేళ కసూరీ ఆ బాపతు వ్యక్తేనని నమ్మితే...అలాంటి వ్యక్తికి వీసా ఇచ్చి భారత్ రావడానికి దోహదపడినందుకు కేంద్రంలోని ఎన్‌డీఏ సర్కారును శివసేన విమర్శించాలి. ఆ కూటమినుంచి తప్పుకోవాలి. కేంద్రంలోనూ, మహారాష్ట్ర సర్కారులోనూ మంత్రి పదవులనుంచి తప్పుకోవాలి. సరిహద్దుల్లో ప్రాణాలర్పిస్తున్న సైనికుల స్మృతికి కసూరీ రాకవల్ల అపచారం జరిగిందనుకుంటే శివసేన చేయాల్సిన పని అది. అంత పెద్ద నిర్ణయం తీసుకోలేకనో ఏమో అది సుధీంద్ర కులకర్ణిని లక్ష్యంగా ఎంచుకుంది. ఈ దాడికి మరో కోణం కూడా ఉంది. మహారాష్ట్రలో బీజేపీ-శివసేన కూటమి పైకి కనిపిస్తున్నంత సజావుగా లేదు. నిరుడు జరిగిన మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ స్వతంత్రంగా పోటీచేసి అధిక స్థానాలు కైవసం చేసుకుని ప్రభుత్వాన్ని ఏర్పర్చడం...తప్పనిసరై అందులో తాము కొనసాగాల్సిరావడం శివసేనకు నామర్దాగానే ఉంది. అందుకే అవకాశం చిక్కినప్పుడల్లా బీజేపీని మించిన జాతీయవాదులమని నిరూపించుకోవడానికి అది ప్రయత్నిస్తున్నది. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ను ఇరకాటంలో పెట్టాలని చూస్తున్నది.
సోమవారం నాటి దాడి కూడా అందులో భాగమే. అయితే ఈ దాడిని ఖండించడంలో అద్వానీ మినహా ఇతర బీజేపీ నేతలు పెద్దగా ఆసక్తి కనబర్చక పోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇలాంటి ఉదంతాలను చూసీచూడనట్టు ఊరుకోవడం వల్లనే వీటి సంఖ్య పెరుగుతోంది. ఎవరిపై ఎలాంటి దాడులకు పాల్పడ్డా తమకేమీ కాదన్న ధోరణిలో కొందరు ప్రవర్తిస్తున్నారు. కసూరీ అభిప్రాయాలతోగానీ, ముంబైలో ఆ కార్యక్రమాన్ని నిర్వహించిన సుధీంద్ర కులకర్ణితోగానీ ఎవరికీ ఏకీభావం లేకపోవచ్చు. అంతమాత్రాన దాడులకు దిగడం అప్రజాస్వామికం. ఇలాంటి పోకడలను సహిస్తే దేశంలో ప్రజాస్వామిక వాతావరణం దెబ్బతింటుంది. మంద బలంతో ఏమైనా చేయొచ్చుననుకునే మూకలది పైచేయి అవుతుంది. ఈ సంగతిని ప్రభుత్వాధినేతలు గుర్తించి సక్రమంగా వ్యవహరించాలి.