‘అటల్-అద్వానీ కష్టంతో మోదీ ఎంజాయ్’
న్యూఢిల్లీ: బీజేపీ అగ్రనేతలు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి, ఎల్‌కే అద్వానీల కష్టంతో బీజేపీ వాళ్లంతా సుఖాలు అనుభవిస్తున్నారని కాంగ్రెస్‌పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ అన్నారు. వారి కష్టంతోనే ప్రధాని నరేంద్రమోదీ మెజార్టీ ప్రభుత్వాన్ని నడుపుతున్నారని ఆయన అన్నారు. మోదీ పనితీరు వల్లే అద్వానీ మనసు గాయపడిందని, నిర్ణయాలు తీసుకునే సమయంలో మోదీ ఎవర్నీ సంప్రదించని తీరు నచ్చలేదని చెప్పారు.
జన్ సంఘ్‌కి, జనతా పార్టీకి అద్వానీ చాలా సేవలు అందించారని, బీజేపీలో గొప్ప మార్పు కూడా ఆయనే తీసుకొచ్చారని, ఈ విషయాలను అంత తేలికగా మర్చిపోకూడదని తెలిపారు. ‘అటల్-అద్వానీ టీమ్ కృషే ఇప్పుడు చూస్తున్నదంతా. వారి కష్టం వల్లే మోదీ ప్రధాన మంత్రి అయ్యారు. మెజార్టీ ప్రభుత్వాన్ని నడుపుతున్నారు’ అని దిగ్విజయ్ చెప్పారు. పార్లమెంటులో అధికార పక్షం, విపక్షాల మధ్య పెద్ద నోట్ల రద్దు విషయంలో ప్రతిష్టంభన పరిస్థితులు నెలకొంది. గత కొద్ది రోజులుగా సభలు అస్సలు నడవడం లేదు. దీనిపై అద్వానీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.