
సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ సీనియర్ నేత లాల్‌కృష్ణా అద్వానీని చెప్పుతో కొట్టి.. స్టేజీ నుంచి దింపేశారంటూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘రాహుల్.. అద్వానీ మాకు తండ్రి లాంటి వారు. మీ మాటలు మమ్మల్ని ఎంతగానో బాధించాయి. మీరు మాట్లాడేటప్పుడు కొంచెం విజ్ఞత పాటిస్తే బాగుంటుంది’ అని సుష్మా ట్వీట్ చేశారు.
శుక్రవారం నాగపూర్‌లో జరిగిన బహిరంగ సభలో రాహుల్ మాట్లాడుతూ.. ‘ బీజేపీ హిందుత్వం గురించి మాట్లాడుతుంది. హిందుత్వంలో గురు-శిష్య పరంపరకు ప్రత్యేక స్థానం ఉంది. హిందూమతంలో గురువును గొప్పగా చూస్తారు. మోదీ గురువు ఎవరు? అద్వానీ. ఆయనను చెప్పుతో కొట్టి స్టేజీ నుంచి దింపేశారు’ అంటూ తీవ్రంగా మండిపడ్డారు. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో అద్వానీకి టికెట్ నిరాకరించి.. ఆయన స్థానంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను గుజరాత్‌లోని గాంధీనగర్ పార్లమెంట్ స్థానం నుంచి నిలబెట్టిన సంగతి తెలిసిందే. అద్వానీని బలవంతంగా రాజకీయాల నుంచి మోదీ తప్పించారని, గురువుకు గౌరవం ఇవ్వకపోవడం హిందూ సంప్రదాయం కాదని రాహుల్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment