బీజేపీ కురువృద్ధుడు ఎల్ కే అద్వానీ పదునైన వ్యాఖ్యలు చేయడంలో సిద్ధహస్తులు. ఆ వ్యాఖ్యల్లో ఎవరి పేరూ ఉండదు. ఎవరి గురించీ ఫిర్యాదు ఉండదు. ఒక్కోసారి తన గురించి చెప్పుకున్నట్టు ఉంటుంది లేదా ఒక ధోరణి గురించో, కొంతమంది తీరు గురించో చెప్పినట్టు ఉంటుంది. కానీ వీటన్నిటికీ సందర్భశుద్ధి ఉంటుంది. పోల్చుకుని చూస్తే ఆ మాటలు ఎవరిని ఉద్దేశించి అన్నవో తెలిసిపోతుంది. అలా చెప్పడం చాలా అవసరమని అందరూ అనుకునేలా ఆ వ్యాఖ్యలుంటాయి.
దేశంలో ఎమర్జెన్సీ విధించి 40 ఏళ్లు అవుతున్న సందర్భంగా ఒక దినపత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ మళ్లీ అలాంటి పరిస్థితి రాదని చెప్పలేమని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యాన్ని అణచివేయగల శక్తులు బలంగా ఉండటమే అందుకు కారణమని చెప్పారు. ఇప్పుడు మళ్లీ అదే తరహాలో మాట్లాడారు. ఈసారి ఆయన ప్రజాజీవితంలో ఉండేవారికి విశ్వసనీయత ఉండటం ఎంత ముఖ్యమో చెప్పారు.
కోట్ల రూపాయల కుంభకోణంతో ప్రమేయం ఉండి చట్టానికి దొరక్కుండా విదేశాల్లో తలదాచుకున్న లలిత్ మోదీ వ్యవహారంలో విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే సింధియా పీకల్లోతు కూరుకుపోగా... కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ విద్యార్హతలకు సంబంధించిన వివాదంలో చిక్కుకున్నారు. వీరంతా బీజేపీకి చెందినవారు. ఇక ఆ పార్టీ మిత్రపక్షమైన తెలుగుదేశం అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ‘ఓటుకు కోట్లు’ కేసులో ఊపిరాడక ఉన్నారు.
ఇవన్నీ రోజూ పతాక శీర్షికలుగానో, మొదటి పేజీ కథనాలుగానో పత్రికల్లో అచ్చవుతున్నప్పుడు...చానెళ్లలో పదే పదే చర్చకొస్తున్నప్పుడు అద్వానీ ఆ వ్యాఖ్యలు ఎందుకు చేశారో, ఎవరిని ఉద్దేశించి అన్నారో ఎవరికైనా తెలిసిపోతుంది. ప్రధాని నరేంద్ర మోదీ ‘మన్ కీ బాత్’ బాటలో వెళ్తుంటే అద్వానీ ‘ఘర్ కీ బాత్’లో బిజీగా ఉన్నారని అందరికీ అర్ధమవుతూనే ఉంది. అద్వానీ లేవనెత్తిన అంశాలు చాలా ముఖ్యమైనవి.
జనం ఓట్లేసి గెలిపించినప్పుడు వారి ప్రతినిధులుగా బాధ్యతా యుతంగా, నిజాయితీగా మెలగాల్సిన బాధ్యత ప్రజా ప్రతినిధులపై ఉంటుందని ఆయన చెప్పిన మాటలు వర్తమాన స్థితిగతులకు సరిగ్గా సరిపోతాయి. హవాలా వ్యాపారి ఎస్.కె. జైన్ డైరీలో మిగిలిన రాజకీయ నేతలతోపాటు తన పేరు కూడా ఉన్నదని వెల్లడైన వెంటనే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఎంపీ పదవికి ఆయన రాజీనామా ఇచ్చారు. ఆ కేసులో నిర్దోషిగా బయటపడ్డాకే తిరిగి లోక్‌సభలోకి అడుగుపెట్టారు.
ఇప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటున్నవారిలో ఏ ఒక్కరూ ఆ పని చేయలేదు సరిగదా... వారిని అడగవలసిన స్థానాల్లో ఉన్నవారు కూడా మౌనం పాటిస్తున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ నిరుడు జరిగిన లోక్‌సభ ఎన్నికల ప్రచార సందర్భంలో గానీ, అధికార బాధ్యతలు చేపట్టాకగానీ అందరిలోనూ ఒక అంశాన్ని బలంగా నాటగలిగారు. ఆయన ఏ అంశంలోనైనా దృఢంగా వ్యవహరిస్తారని, అనుకున్నది చేయడంలో ఎలాంటి అడ్డంకులనైనా అధిగమిస్తారని అందరిలోనూ ఒక నమ్మకం ఏర్పడింది. అలా ఏర్పడబట్టే దేశ ప్రజలు బీజేపీకి మునుపెన్నడూ లేనంత భారీ మెజారిటీని కట్టబెట్టారు.
అందుకు తగినట్టే తొలి ఏడాదికాలంలో మోదీ అలాగే వ్యవహరించారు. ముఖ్యంగా భూసేకరణ చట్టం విషయంలో పలుమార్లు ఆర్డినెన్స్‌లు తీసుకురావడం... విపక్షాలన్నీ వ్యతిరేకిస్తున్నా ఆ చట్ట సవరణపై బిల్లు తీసుకొచ్చి లోక్‌సభలో ఆమోదింపజేసుకోవడం, రాజ్యసభలో సైతం అందుకోసం ఒక ప్రయత్నం చేయడంవంటివి మోదీ పట్టుదలను తెలియజేస్తాయి. ఆ పట్టుదలలోని గుణదోషాల సంగతలా ఉంచి...అనుకున్నది సాధించడానికి ఏటికి ఎదురీదడానికైనా సిద్ధంగా ఉన్నట్టు కనబడింది. కానీ, సుష్మా, వసుంధర, స్మృతి విషయంలో మాత్రం ఆయన దృఢంగా వ్యవహరించలేకపోతున్నారు.
వస్తున్న ఆరోపణలను ఖండించడానికి కేంద్రమంత్రులు, పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నా రోజులు గడిచేకొద్దీ ఆ ఆరోపణలు మరింత చిక్కనవుతున్నాయి. సరిగ్గా ఇలాంటి నేపథ్యంలోనే అద్వానీ వ్యాఖ్యానాలను అర్ధం చేసుకోవాలి. ‘నేను నా గురించి మాత్రమే చెబుతున్నాను... మిగిలినవారిపై నేనెలా మాట్లాడతాను’ అని ఆయన తప్పించుకున్నా... తన గురించి ఇప్పుడే ఎందుకు చెప్పుకోవాల్సివచ్చిందన్నది అందరికీ అర్ధమవుతుంది. నేతలు నిజాయితీగా ఉండాల్సిన అవసరాన్ని మాత్రమే కాదు...అంతరాత్మ గురించీ, రాజధర్మం గురించీ కూడా అద్వానీ చెప్పారు.
ఇప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీకి చెందినవారైనా, చంద్రబాబైనా ఈ రెండు అంశాలూ ఆలోచించాల్సిన విషయాలు. వెంటనే ఎన్నికలు లేవు గనుకా, ఎప్పటికప్పుడు వెల్లువలా వచ్చిపడే సమాచారం వల్ల జనం దేన్నయినా మర్చిపోతారన్న పేరాశతో ఈ నేతలందరూ ఉన్నట్టు కనబడుతోంది. తాము సులభంగా గట్టెక్కగలమని వీరంతా అనుకుంటున్న ట్టున్నారు. సంక్షోభం తలెత్తినప్పుడు నిర్ణయాత్మకంగా వ్యవహరించలేని నేతలు జనం దృష్టిలో పలచనవుతారని యూపీఏ దురవస్థను చూస్తే ఎవరికైనా అర్ధమవుతుంది.
2009 ఎన్నికల్లో రెండోసారి అధికారంలోకి రాగానే యూపీఏ ప్రభుత్వంపై ఆరోపణలొచ్చినప్పుడు ఆ సర్కారు వ్యవహరించిన తీరు అందరికీ తెలుసు. కామన్వెల్త్ క్రీడల కుంభకోణంలోనైనా, 2జీ స్కాంలోనైనా ఆ ప్రభుత్వం మొండి వైఖరి అవలంబించింది. ఎలాంటి అవకతవకలూ చోటుచేసుకోలేదని నదురుబెదురూ లేకుండా చెప్పింది. ఆ సంగతేదో సీబీఐ దర్యాప్తునకు ఆదేశించి నిగ్గు తేల్చండని కోరితే ససేమిరా అన్నది. చివరకు సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని దర్యాప్తునకు ఆదేశించాల్సి వచ్చింది. అద్వానీ రాజధర్మం ప్రసక్తి తీసుకొచ్చింది... విశ్వసనీయత గురించి మాట్లాడిందీ అందుకే.
ఇలాంటి ఆరోపణల్లో కూరుకుపోయి, నిజాయితీని నిరూపిం చుకోవడానికి సిద్ధపడనివారూ... పదవి పట్టుకుని వేళ్లాడేవారూ మానవబాంబుల వంటివారు. వారు తాము భ్రష్టులు కావడంతోపాటు చుట్టూ ఉన్నవారిని కూడా ముంచేస్తారు. ఒకపక్క పార్లమెంటు వర్షాకాల సమావేశాలు దగ్గరపడుతున్నాయి. నరేంద్ర మోదీ ఇప్పటివరకూ ఈ ఆరోపణల గురించి ఒక్క మాట కూడా మాట్లాడ కుండా కాలక్షేపం చేశారుగానీ ఇకపై అది సాధ్యంకాదు. తమ మంత్రుల విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోవడంతోపాటు ‘ఓటుకు కోట్ల’ వ్యవహారంలో మిత్రపక్ష నేత చంద్రబాబుకు కూడా తగిన సలహా ఇవ్వడం ఆయనకు తప్పనిసరవుతుంది.
అద్వానీ సంచలనం!
Published Mon, Jun 29 2015 11:44 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM
Advertisement
Advertisement