సాక్షి, తిరుమల : అయోధ్య కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై గోవర్థన పీఠాధిపతి నిశ్చలానంద సరస్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు. రామ మందిర నిర్మాణం కోసం స్థలం కేటాయింపు సబబేనంటూ.. ఇతర మతాల వారికి స్థలం కేటాయించే అధికారం సుప్రీంకోర్టుకు ఎక్కడిదని ప్రశ్నించారు. వివాదాస్పద స్థలం ఎవరిదో చెప్పాలి గానీ, మరో స్థలం కేటాయించాలని ఎలా చెబుతారంటూ మండిపడ్డారు. ఇలా అయితే రేపు మధుర, కాశీలలో కూడా ఇలానే తీర్పు ఇచ్చి ఆయా ప్రాంతాలను మినీ పాకిస్తాన్‌లా మార్చేస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు రామ జన్మభూమి కమిటీలో ప్రభుత్వానికి వత్తాసు పలికేవారికి చోటు కల్పిస్తున్నారని విమర్శించారు. వేల సంవత్సరాల చరిత్ర కలిగిన మఠాలను పక్కన పెట్టి రవిశంకర్ లాంటి వ్యక్తులకు ప్రాధాన్యతనివ్వడం సబబు కాదని పేర్కొన్నారు.
దివంగత, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు హయాంలో 2.7 ఎకరాల స్థలాన్ని చెరిసగం పంచాలన్న ప్రతిపాదనను అందరూ అంగీకరించినా తాను వ్యతిరేకించడంతో ఆ ప్రతిపాదన వెనక్కి వెళ్లిపోయిందని వెల్లడించారు. ధర్మాన్ని ధర్మాచార్యులు చెప్పాలి కానీ, ఈ మధ్య ప్రభుత్వాలు నిర్దేశిస్తున్నాయని ఎద్దేవా చేశారు. సెక్యులరిజం పేరుతో బెనారస్ యూనివర్సిటీ డీన్‌గా ఇతర మతస్థుడిని నియమించడం ఎంత వరకు న్యాయమని ప్రశ్నించారు. కమ్యూనిస్టులు రాసిన పుస్తకాలు చదవుతున్న వారు అధికమవడంతో వేదాలు మరుగున పడిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఫలితంగా 1133 శాఖలుగా ఉన్న వేదాలు ఇప్పుడు 7 శాఖలకు పడిపోయిందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment