నాలుగు స్తంభాలు! | BJP Leaders Hand In Babri demolition case | Sakshi
Sakshi News home page

నాలుగు స్తంభాలు!

Published Sun, Nov 10 2019 3:12 AM | Last Updated on Sun, Nov 10 2019 11:07 AM

BJP Leaders Hand In Babri demolition case - Sakshi

అయోధ్యలో 1528లో మొఘల్‌ చక్రవర్తి బాబర్‌ హయాంలో బాబ్రీ మసీదు నిర్మాణం జరిగితే 1992 డిసెంబర్‌ 6న కరసేవకులు దాన్ని కూల్చేశారు. అప్పట్లో కీలక స్థానాల్లో ఉండి ఈ ఘటనలో ప్రమేయం ఉన్న నేతలు చాలామంది బీజేపీ నేతలు ఇపుడు అంతగా ప్రాధాన్యం లేని స్థితిలో ఉన్నారు. వారిలో సీనియర్‌ నాయకులు అద్వానీ, మురళీ మనోహర్‌జోషి, ఉమాభారతి క్రిమినల్‌ కేసులు ఎదుర్కొంటున్నారు. బాబ్రీ కూల్చివేత కేసులో వీరి ప్రమేయం, అప్పట్లో ఏం చేశారు? ఇప్పుడెలా ఉన్నారో చూద్దాం...

న్యూఢిల్లీ: ఎల్‌.కె.అద్వానీ 1989లో బీజేపీ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టాక పార్టీ బలోపేతానికి రథయాత్ర ప్రారంభించారు. ఈ యాత్ర రెండు ఘటనలకు దారితీసింది. ఒకటి... 1992 డిసెంబర్‌ 6న బాబ్రీ మసీదును కూల్చివేయటం. రెండోది బీజేపీని అధికార పీఠంపై కూర్చోబెట్టడం. గుజరాత్‌లోని సోమ్‌నాథ్‌లో మొదలైన అద్వానీ రథయాత్ర ఒక్కో రాష్ట్రం దాటుతూ యూపీలోని అయోధ్య చేరుకోవాలి. దారి పొడవునా జనం బ్రహ్మరథం పట్టారు. అంతా బాబ్రీ మసీదు వద్దకు చేరుకోవాలంటూ అద్వానీ ఉద్రిక్త పూరిత ప్రసంగాలు చేశారు. యాత్ర బిహార్‌లో ప్రవేశించినప్పుడు అప్పటి సీఎం లాలూప్రసాద్‌ యాదవ్‌ అడ్డుకుని సమస్తిపూర్‌లో అద్వానీని అరెస్ట్‌ చేయించారు. అదే బీజేపీకి కలిసొచ్చింది.

1991 ఎన్నికల్లో బీజేపీకి 100 సీట్లు దాటిపోయాయి. అద్వానీ లోక్‌సభలో ప్రతిపక్ష నేత అయ్యారు. 1992 డిసెంబర్‌ 6న దేశవ్యాప్తంగా తరలివచ్చిన కరసేవకులు బాబ్రీ మసీదుని కూల్చివేశారు. బీజేపీ 1996లో అతిపెద్ద పార్టీగా అవతరించినా వాజ్‌పేయి నేతృత్వంలో 13 రోజులే సాగింది. 1998లో మిత్రపక్షాలతో కలిసి ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటై అద్వానీ హోంమంత్రిగా.. తర్వాత ఉప ప్రధానిగా బాధ్యతలు చేపట్టినా 13 నెలలే కొనసాగారు. 2004, 2009 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ అధికారం కోల్పోవడంతో అద్వానీ ప్రభ తగ్గింది. 2014లో మోదీ ప్రధాని అయ్యాక ఆయన ప్రాధాన్యం మరింత తగ్గింది. బీజేపీ పార్లమెంటరీ బోర్డు నుంచి, మార్కదర్శక్‌ మండలి నుంచి తప్పించారు. చివరికి గాంధీ నగర్‌ సీటు కూడా దక్కలేదు. ప్రస్తుతం బీజేపీకి దూరంగా ఇంచుమించు విశ్రాంత జీవితాన్నే గడుపుతున్నారు. బాబ్రీ కూల్చివేతకు కుట్ర పన్నారంటూ ఆయనపై క్రిమినల్‌ అభియోగాలు నమోదైనా... వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావటంపై మాత్రం మినహాయింపునిచ్చారు. 

ఉమాభారతి  
ఫైర్‌ బ్రాండ్‌ ఉమాభారతి బాబ్రీ మసీదు కూల్చివేత సమయంలో బీజేపీ నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు. మసీదు కూల్చేయండి, మందిరం నిర్మించండి అంటూ రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారనే ఆరోపణలున్నాయి. అనంతరం రేగిన ఘర్షణలు, అల్లరిమూకల్ని రెచ్చగొట్టడంలో ఆమె ప్రమేయం ఉందంటూ జస్టిస్‌ లిబర్‌హాన్‌ కమిషన్‌ ఉమాభారతిని బోనులోకి లాగింది. ఆ ఘటనలో తన నైతిక బాధ్యత ఉందని అంగీకరించిన ఉమా... మసీదును కూలగొట్టంలో తన ప్రమేయం లేదని స్పష్టం చేశారు. దీనిపై న్యాయపోరాటం చేస్తున్నారు. తర్వాత ఆమె రాజకీయ జీవితం ఎన్నో కుదుపులకు లోనయింది. మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా 2003–04లో పనిచేసిన ఆమెను తర్వాత పార్టీ నుంచి బహిష్కరించారు. మళ్లీ  సొంత గూటికి చేరుకుని మోదీ తొలి ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా  పనిచేశారు. ఈ ఏడాది ఎన్నికల్లో పోటీకి విముఖత చూపటంతో పార్టీ ఉపాధ్యక్షురాలిని చేశారు. పార్టీలో ఆమె పాత్ర ఇప్పుడు నామమాత్రమేనన్న అభిప్రాయం ఉంది. మసీదు కూల్చివేత కేసులో వ్యక్తిగత హాజరు నుంచి ఆమెను కోర్టు మినహాయించింది. 

మురళీ మనోహర్‌ జోషి 
వాజ్‌పేయి ప్రధానిగా ఉన్నపుడు మురళీ మనోహర్‌ జోషి కేంద్ర మంత్రి. ఇప్పుడు మోదీ, అమిత్‌ షా మధ్య ఉన్నట్టుగా అప్పట్లో ఉప ప్రధానిగా ఉన్న అద్వానీ, కేంద్ర మంత్రిగా ఉన్న  జోషి మధ్య సన్నిహిత సంబంధాలుండేవి. యువకుడిగా ఉన్నప్పుడే ఆరెస్సెస్‌లో చేరిన జోషి  గోరక్షణ ఉద్యమంలో పాల్గొన్నారు. అద్వానీ రథయాత్రకు అండగా నిలిచారు. అద్వానీ లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడయ్యాక 1991లో జోషి బీజేపీ పగ్గాలు చేపట్టారు. మసీదు ప్రాంతం రాముడి జన్మభూమి అని ఆయన గట్టిగా వాదించేవారు. కూల్చివేత సమయంలో పార్టీ అధ్యక్ష హోదాలో ఆయన అయోధ్యకు వెళ్లారు. మందిర నిర్మాణాన్ని ఆపడం ఎవరి తరం కాదంటూ రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారన్న ఆరోపణలున్నాయి. క్రిమినల్‌ కేసుల్లోనూ ఉన్నారు. ఈ ఏడాది ఎన్నికల్లో వయోభారం ∙వల్ల పార్టీ ఆయనకు కాన్పూర్‌ టికెట్‌ ఇవ్వలేదు. పార్లమెంటరీ బోర్డు నుంచి, మార్గదర్శక మండలి నుంచి తొలగించింది. అప్పట్నుంచి ఆయన పార్టీకి దూరమైనా అడపాదడపా సమావేశాల్లో పాల్గొంటూ మోదీకి వ్యతిరేకంగా తన గళం వినిపిస్తూనే ఉన్నారు. 

కల్యాణ్‌ సింగ్‌
బాబ్రీ మసీదు కూల్చివేత సమయంలో యూపీ ముఖ్యమంత్రిగా ఉన్న కల్యాణ్‌ సింగ్‌ అదే రోజు సాయంత్రం నైతిక బాధ్యత వహిస్తూ పదవికి రాజీనామా చేశారు. గతంలో రాజస్తాన్‌ గవర్నర్‌గా ఉన్నారు. కానీ ఆయనపై క్రిమినల్‌ కేసుల్ని తిరగతోడడంతో రాజ్యాంగపరమైన పదవులు చేపట్టకూడదన్న నిబంధనలు అమల య్యాయి. గవర్నర్‌ పదవిని వదులుకున్నారు. ప్రస్తుతం క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నారు. 

సుదీర్ఘ పోరాటానికి ఫలితం: అద్వానీ
అయోధ్యలో రామమందిరం కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును బీజేపీ సీనియర్‌ నేత ఎల్‌కే అద్వానీ స్వాగతించారు. సుప్రీంకోర్టు తీర్పుపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు.రామ జన్మభూమి ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన అద్వానీ.. ఈ విషయంలో తాను నిర్దోషిగా నిలిచానని చెప్పారు. ‘దేశ స్వాతంత్య్ర పోరాటం తర్వాత సుదీర్ఘ కాలం సాగిన ఉద్యమం ఇదే. ఇందులో పాల్గొనే మహోన్నత అవకాశాన్ని దేవుడు నాకు కల్పించాడు. సుదీర్ఘ పోరాటానికి సుప్రీంకోర్టు తీర్పుతో ఫలితం దక్కింది. ఏళ్లుగా సాగుతున్న వివాదం కొలిక్కి వచ్చిన నేపథ్యంలో ఈ విషయంలో ఇప్పటివరకు జరిగిన హింస, వివాదా లు అన్నింటినీ వదిలేయండి. శాంతి, సమైక్యతతో ముందుకు సాగండి’అని ప్రజలకు సూచించారు.   

కరసేవకుల మాట..
సుప్రీంకోర్టు తీర్పుతో ఎట్టకేలకు న్యాయం గెలిచింది. వందల ఏళ్ల నుంచి ప్రజలు పెట్టుకున్న నమ్మకం, విశ్వాసం నిజమైంది. 1992 డిసెంబర్‌ 6న బాబ్రీ మసీదు కూల్చివేత ప్రజల విజయమే. కరసేవకు వెళ్లినపుడు నేను అక్కడి పరిస్థితులను స్వయంగా చూశా. రెండు రోజుల ముందే వెళ్లడంతో అయోధ్యలోని ముస్లింలతో మాట్లాడా. వారు సోదర భావంతో వ్యవహరించారు. కూల్చివేత సమయంలో నాతో పాటు వచ్చిన వారంతా సాధారణ భక్తులే. అప్పుడు కిలోమీటర్‌ దూరంలో అద్వానీ, ఉమాభారతి, అశోక్‌ సింఘాల్,  ధర్మేంద ప్రధాన్‌ వంటి నేతలు ఉన్నారు. వారి ప్రసంగాలను కూడా విన్నాం.
– డాక్టర్‌ సంగెం శ్రీనివాస్, వరంగల్‌

అయోధ్యలో ఉన్నది రామమందిరమే అన్న వాస్తవాన్ని సుప్రీంకోర్టు తేల్చింది. కరసేవ సమయంలో నేను అక్కడకు వెళ్లినప్పుడు చిన్న చిన్న విగ్రహాలు, దేవాలయానికి సంబంధించిన çస్తంభాలు బయటపడటం చూశాను. వాటిని ఇప్పుడు మీడియాలో చూపించారు. సాధువులు ఆ స్తంభాలను పక్కన పెట్టి డేరా వేశారు. 11 మెట్లు కట్టి విగ్రహాలను అందులో ప్రతిష్టించారు. ఆ రోజు కరసేవను ప్రజలు చేశారు. ఈ రోజు ప్రజల విశ్వాసం గెలిచింది. 
– రంగరాజు రుక్మారావు, సూర్యాపేట్‌

పీవీ మౌనం..ఎందుకని?
నాటి ప్రధాని పాత్రపై భిన్న వాదనలు
అయోధ్యలో బాబ్రీ మసీదును కరసేవకులు కూల్చేసిన రోజు నాటి ప్రధాని పీవీ నరసింçహారావు జీవితంలో మాత్రం మాయని మచ్చగానే మిగిలింది. అద్వానీ రథయాత్ర తర్వాత 1992 డిసెంబర్‌ 6న బాబ్రీ మసీదును కూల్చివేస్తుంటే పీవీ చేష్టలుడిగి ఎందుకున్నారు? అన్న ప్రశ్న ఆయన జీవితంపై చెరగని ముద్రను వేసింది. ఒక హిందువుగా పీవీకి సైతం బాబ్రీ మసీదు స్థానంలో రామాలయం నిర్మించాలని ఉందా? అన్న సంశయం ఇప్పటికీ చాలా మందిలో కొనసాగుతూనే ఉంది. హిందూత్వ వాదులైన బీజేపీని ఇరుకున పెట్టడానికే ఆయన మౌనం వహించారనే వాదనలూ ఉన్నాయి. 

ఇంటెలిజెన్స్‌ బ్యూరో హెచ్చరించినా
1992 నవంబర్‌ 19–22 తేదీల్లో జరిగిన పొలిటికల్‌ అఫైర్స్‌ క్యాబినెట్‌ కమిటీ సమావేశాల్లో... బాబ్రీని కూల్చివేసే పరిస్థితులున్నట్టు ఇంటెలిజెన్స్‌ బ్యూరో పీవీ దృష్టికి తెచ్చింది. కళ్యాణ్‌ సింగ్‌ని తొలగించాలని కూడా సూచించింది. అయినా పీవీ మిన్నకుండడంలో అంతరార్థం విమర్శలకు తావిచ్చింది. అంతేకాక మసీదు ధ్వంసం సమయంలో పీవీ నరసింహారావు పూజలో కూర్చున్నారని, కరసేవకులు పూర్తిగా కూల్చివేశాకే ఆయన పూజలో నుంచి లేచారని ఓ బుక్‌లో ఆరోపించారు. అయితే బాబ్రీ అంశంలో యూపీ ముఖ్యమంత్రి కళ్యాణ్‌ సింగ్‌పై పూర్తి విశ్వాసం ఉంచాననీ, ఆయన తన నమ్మకాన్ని వమ్ముచేశారని పీవీ వ్యాఖ్యానించారు. నిజానికి బాబ్రీ కూల్చివేత సమయంలో కాంగ్రెస్‌ అంతర్గత కుమ్ములాటలతో నిండి ఉంది. పీవీకీ సోనియాకు మధ్య అంతర్గత కలహాలు.. ఆ తరవాత పార్టీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితులకు దారితీశాయి. 

పీవీ గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వలేదు..!
విధ్వసం విషయంలో ఎస్‌బీ చవాన్‌ నేతృత్వంలోని హోం శాఖ ఏమీ చేయలేదన్న విమర్శలను నాటి హోం సెక్రటరీ మాధవ్‌ గాడ్బే ఆ తరవాత ఖండించారు. జరుగబోతోన్న విధ్వంసాన్ని ఆపటానికి ప్రణాళికను రూపొందించినప్పటికీ పీవీ గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వలేదని చెప్పారాయన. ఆ రోజు హోం శాఖకీ, ప్రధాని పీవీకీ మధ్య అయోధ్యలో చేపట్టాల్సిన రక్షణాంశాలపై వివాదం ఉన్నట్లు కూడా చెప్పారు. తాను స్వయంగా పీవీని అనేక సార్లు కలిశాననీ, ప్రతిసారీ ఆయన వేచి ఉండమనే చెప్పారనీ వెల్లడిం చారు. ఈ విషయాల్ని 1993 మార్చి 23న తన రిటైర్‌మెంట్‌ అనంతరం రాసిన ‘‘అన్‌ ఫినిష్డ్‌ ఇన్నింగ్స్‌’’ (1996లో పబ్లిష్‌ అయ్యింది)లో గాడ్బే రాసుకున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement