సాక్షి, న్యూఢిల్లీ : సుప్రీం కోర్టులో న్యాయప్రక్రియ ముగిసిన తర్వాతే అయోధ్యలో మందిర నిర్మాణంపై ఆర్డినెన్స్ తీసుకువస్తామని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై ఎన్డీఏ మిత్రపక్షం శివసేన అభ్యంతరం వ్యక్తం చేసింది. మందిర వ్యవహారం కోర్టులో ఉన్నందున ప్రభుత్వం ఏమీ చేయలేదని ప్రధాని చెప్పడాన్ని శివసేన నేత సంజయ్ రౌత్ ఆక్షేపించారు. మందిర్ అంశం న్యాయస్ధాన పరిధిలో ఉందని ప్రధాని తమకు చెప్పాల్సిన అవసరం లేదన్నారు.
అయోధ్యలో రామమందిరం కోసం వందలాది కరసేవకులు మరణించారని, ముంబైలో బాంబు పేలుళ్లు జరిగాయని చెప్పుకొచ్చారు. మందిర్ పేరుతో ఊచకోతకు బాధ్యులెవరని ప్రశ్నించారు. ఈ అంశంతోనే మీరు (బీజేపీ) అధికారంలోకి వచ్చిన సంగతి మరువరాదని సంజయ్ రౌత్ మండిపడ్డారు. కోర్టుతో పాటు ప్రధాని ప్రకటన చూస్తుంటే చట్టం కంటే శ్రీరాముడు గొప్పవాడు కాదనే అర్ధం స్ఫురిస్తోందన్నారు. కాగా అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేయాలని శివసేన డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment