‘రామాలయం నిర్మించేది అయోధ్యలో.. హైదరాబాద్‌లో కాదు’ | Ram Mandir Built In Ayodhya Not In Hyderabad Says Shiv Sena | Sakshi
Sakshi News home page

‘రామాలయం నిర్మించేది అయోధ్యలో.. హైదరాబాద్‌లో కాదు’

Published Sat, Oct 20 2018 2:26 PM | Last Updated on Sat, Oct 20 2018 2:36 PM

Ram Mandir Built In Ayodhya Not In Hyderabad Says Shiv Sena - Sakshi

సాక్షి, ముంబై : రామ మందిర నిర్మాణంపై ఎమ్ఐఎమ్‌ చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యలను శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ తీవ్రంగా ఖండించారు. రామ మందిరం నిర్మిస్తున్నది అయోధ్యలో అని.. హైదరాబాద్‌, పాకిస్తాన్‌లో కాదని రౌత్‌ వ్యంగ్యంగా వివరించారు. రామ మందిరం నిర్మిస్తే ఓవైసీకి ఎందుకంత ఉలిక్కిపాటని ప్రశ్నించారు. ప్రజల మధ్య విద్వేశాలు రెచ్చగొట్టడానికి ఓవైసీ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. రామాలయం కొరకు బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్‌లో చట్టం తీసుకురావాలని.. దాని కోసం అవసరైన మెజార్టీ ఎన్డీయే ప్రభుత్వానికి ఉందని రౌత్‌ తెలిపారు. ప్రస్తుతమున్న కోర్టులు అయోధ్య వివాదాన్ని పరిష్కరించలేవని, ప్రధాని మోదీ మాత్రమే పరిష్కరిస్తారని వ్యాఖ్యానించారు. 2019 ఎన్నికల అనంతరం పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేమని, కేంద్రంలో బలమున్నందున ఇప్పుడే రామమందిరంపై నిర్ణయం తీసుకోవాలని సూచించారు. 

అయోధ్యలో రామాలయ నిర్మాణం కోసం ప్రత్యేక చట్టం చేయాలని రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌(ఆరెస్సెస్‌) చీఫ్‌ మోహన్‌ భాగవత్‌ డిమాండ్‌ చేసిన విషయం తెలిసిందే. శ్రీరాముని జన్మస్థలంలో అద్భుతమైన రామాలయాన్ని నిర్మించాలన్నది కోట్లాది ప్రజల ఆకాంక్ష అన్నారు. ‘ఆత్మగౌరవ దృష్టితో చూసినా లేదా దేశంలో  సౌభ్రాతృత్వ వాతావరణం నెలకొనాలంటే ఆలయ నిర్మాణం అవశ్యం’ అని పేర్కొన్నారు. జన్మభూమి ప్రదేశంలో గతంలో దేవాలయం ఉందనడానికి సంబంధించి అన్ని ఆధారాలు సమర్పించినా ఇంకా ఆ స్థలాన్ని ఆలయ నిర్మాణం కోసం అప్పగించలేదని భాగవత్‌ అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement