భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా, ప్రధాని నరేంద్ర మోదీ (ఫైల్ ఫోటో)
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలోని న్యాయ వ్యవస్థ స్వతంత్రపై ఆందోళన మొదలైంది. సుప్రీం కోర్టు కొలీజియం చేసిన రెండు సిఫార్సుల్లో ఒక సిఫార్సును ఆమోదించిన కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం మరో సిఫార్సును తిరస్కరించడమే అందుకు కారణం. సుప్రీం కోర్టు జడ్జీలుగా సీనియర్ అడ్వకేట్ ఇందు మల్హోత్ర, ఉత్తరాఖండ్ ప్రధాన న్యాయమూర్తి కేఎం జోసఫ్‌ల పేర్లను సుప్రీం కోర్టు కొలీజియం గురువారం ప్రతిపాదించగా వారిలో ఇందు మల్హోత్ర నామినేషన్‌ను అంగీకరించిన మోదీ ప్రభుత్వం జోసఫ్ నామినేషన్‌ను అంగీకరించని విషయం తెల్సిందే.
ఈ కొలీజియం వ్యవస్థకు రాజ్యాంగ భద్రతగానీ, పార్లమెంట్ చట్టం భద్రతగానీ లేదు. కేవలం సుప్రీం కోర్టు అభిప్రాయం మేరకు కేంద్రం ఈ కొలీజియం వ్యవస్థను ఏర్పాటు చేసింది. సుప్రీం కోర్టు కొలీజియంలో ప్రధాన న్యాయమూర్తితోపాటు మరో నలుగురు సీనియర్ సుప్రీం కోర్టు జడ్జీలు ఉంటారు. హైకోర్టు కొలీజియంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితోపాటు నలుగురు సీనియర్ హైకోర్టు జడ్జీలు ఉంటారు. ఈ కొలీజియంలు మెజారిటీ అభిప్రాయంతో దిగువ కోర్టుల నుంచి తమ కోర్టులకు పదోన్నతులతో పాటు జడ్జీల బదిలీ వ్యవహారాలను నిర్వర్తిస్తాయి. ఇందులో జోక్యం చేసుకునేందుకు ప్రభుత్వానికి ఎలాంటి అవకాశం లేదు. అయితే సదరు వ్యక్తుల ప్రవర్తన, గత జీవితాలను తెలుసుకునేందుకు ఇంటెలిజెన్సీ బ్యూరో ద్వారా సమాచారాన్ని సేకరించుకోవచ్చు.
నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ నాలుగేళ్ల నుంచి ఈ కొలీజియం వ్యవస్థ ఒత్తిడికి గురవుతూనే ఉంది. న్యాయవ్యవస్థ నియామకాలను తన పరిధిలోకి తీసుకోవడానికి వీలుగా 2014లోనే మోదీ ప్రభుత్వం ఓ చట్టాన్ని తీసుకొచ్చింది. అయితే ఆ చట్టాన్ని సుప్రీం కోర్టు కొట్టివేసింది. అప్పటి నుంచి మోదీ ప్రభుత్వం దొడ్డిదారిన, అంటే మౌఖికంగా న్యాయ వ్యవస్థ నియామకాలను ప్రభావితం చేస్తోంది. కర్ణాటక హైకోర్టులో అత్యంత సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ జయంతి పటేల్‌ను 2017లో అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేశారు. దాంతో కర్ణాటకకు ప్రధాన న్యాయమూర్తి అయ్యే అవకాశాన్ని ఆయన కోల్పోయారు. కక్షతోనే తనను బలి చేశారని నాడు ఆయన ఆరోపించారు. 2004లో ముంబైకి చెందిన ఇశ్రాత్ జహాన్‌ను గుజరాత్ పోలీసులు హత్య చేశారనే ఆరోపణలపై సీబిఐ దర్యాప్తునకు జయంతి పటేల్ ఆదేశించారు.
నాడు గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోదీ ఉన్నారు. హైకోర్టు కొలీజియం సిఫార్సులను పట్టించుకోకుండా కేంద్రంలోని మోదీ ప్రభుత్వం 2016లో గుజరాత్ హైకోర్టు నుంచి మధ్యప్రదేశ్ హైకోర్టుకు ఓ జడ్జీ బదిలీని అడ్డుకుంది. 2017లో కూడా ఢిల్లీ హైకోర్టు నుంచి వాల్మీకీ మెహతా బదిలీని కూడా మోదీ ప్రభుత్వం అడ్డుకుంది. ఇప్పుడు కేఎం జోసఫ్ నియమకాన్ని మోదీ ప్రభుత్వం అడ్డుకోవడానికి కూడా కారణం ఉంది. 2016లో ఉత్తరాఖండ్‌లో మోదీ ప్రభుత్వం విధించిన రాష్ట్రపతి పాలనను జోసఫ్ రద్దు చేశారు. జోసఫ్ తరహాలోనే 2014లో కొలీజియం సిఫార్సు చేసిన గోపాల్ సుబ్రమణియం నామినేషన్‌ను కేంద్ర ప్రభుత్వం తిరస్కరించి మరో ముగ్గురు నామినేషన్లను అంగీకరించినప్పుడు అప్పటి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆర్‌ఎం లోధా ఏకపక్షంగా గోపాల్ సుబ్రమణియం నామినేషన్‌ను ఎలా తిరస్కరిస్తారంటూ కేంద్రాన్ని విమర్శించారు. ఇప్పుడు జోసఫ్ విషయంలో అది జరగలేదు.
న్యాయ వ్యవస్థ స్వతంత్ర గురించి మాట్లాడే ప్రస్తుత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా ప్రభుత్వ నిర్ణయనికి తలొగ్గి జోసఫ్ నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. సుప్రీం కోర్టు బెంచీలను నిర్ణయించడంలో కేసులను కేటాయించడంలో తన ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారంటూ నలుగురు సుప్రీం కోర్టు సీనియర్ జడ్జీలు ప్రజల్లోకి వచ్చి పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడంతో సుప్రీం కోర్టు స్వతంత్రత గురించి చర్చ మొదలైంది. కేసుల కేటాయింపుల్లో దీపక్ మిశ్రాపై ప్రభుత్వ ప్రభావం ఉండొచ్చన్న ఆరోపణలను ఖండించిన ఆయన న్యాయ వ్యవస్థ స్వతంత్రతకే తాను ప్రాధాన్యం ఇస్తానన్నారు. అలాంటప్పుడు ఆయన ప్రభుత్వ నిర్ణయంతో విభేదించాల్సి ఉంది. న్యాయ వ్యవస్థకు సంబంధించిన నియామకాలను న్యాయవ్యవస్థనే జరుపుకునే విధానం భారత్‌లో తప్పా ప్రపంచంలో మరెక్కడా లేదు. అది వేరే విషయం.
Comments
Please login to add a commentAdd a comment