ఇటీవల కాలంలో దంపతుల మధ్య సయోధ్య లేకపోవడం వల్లనో లేక ఇతరత్ర కారణాల వల్లనో విడాకులకు దారితీస్తున్నాయి. ఫ్యామిలీ కోర్టుల్లో అందుకు సంబంధించిన కేసులు సంఖ్య కూడా ఎక్కువగానే ఉన్నాయి. ఇద్దరి సమ్మతంతో విడిపోయినప్పటికీ స్త్రీకి ఎంతో కొంత భరణం ఇవ్వాల్సి ఉంటుంది. దాన్ని క్లైయిమ్ చేసుకోవాల్సింది సదరు మహిళే. ఒకవేళ ఆమె క్లైయిమ్ చేసుకున్నప్పటికీ కొందరూ ప్రబుద్ధులు తనకు ఆదాయం లేదని, లేదా కుటుంబాన్ని చూసుకోవాల్సి ఉందంటూ భరణం ఇవ్వకుండా తప్పించుకునే ప్లాన్‌లు వేస్తుంటారు. దీంతో సదరు మహిళలు ఇబ్బందులు పడుతుంటారు. అయితే అలాంటి ఎత్తుగడలకు చెక్‌పెడుతూ అలహాబాద్ ధర్మాసనం సంచలన తీర్పు ఇచ్చింది.
అసలేం జరిగిందంటే..అలహాబాద్‌కు చెందిన ఓ జంటకు 2015లో వివాహం అయ్యింది. అదనపు కట్నం డిమాండ్ చేస్తున్నారని సదరు మహిళ అత్తమామలపై ఎఫ్‌ఐఆర్ కేసు నమోదు చేసింది. ఆ తర్వాత ఆమె 2016 నుంచి తల్లిదండ్రులతోనే జీవిస్తుంది. అయితే ఫామిలీ కోర్టు ఆమెకు నెలకు రూ. 2000 భరణం ఇవ్వాలని తీర్పు ఇచ్చింది. దీన్ని సవాలు చేస్తూ సదరు వ్యక్తి హైకోర్టుని ఆశ్రయించాడు. తనకు ఆదాయం లేదని, తన తల్లిదండ్రులను, అక్కచెల్లెళ్లను చూసుకోవాల్సి ఉండటంతో తాను భరణం చెల్లించలేనంటూ పిటీషన్ వేశాడు. అంతేగాదు తన భార్య టీచింగ్ ద్వారా నెలకు రూ. 10 వేలకు సంపాదిస్తున్నారని కాబట్టి తాను ఇవ్వలేనని పిటిషన్‌లో పేర్కొన్నాడు.
అయితే ధర్మాసనం ఆదాయం లేకపోయినా లేదా ఉద్యోగం లేకపోయినా రోజూ కూలిగా రూ. 300 నుంచి రూ. 400 వరకు సంపాదించొచ్చు అంటూ ఆ వ్యక్తికి మొట్టికాయలు వేసింది. ఉద్యోగం ఉన్నా, లేకపోయినా విడిపోయిన భార్యకు మెయింటెనెన్స్ చెల్లించాల్సిందేనని పేర్కొంది ధర్మాసనం. ఆ వ్యక్తి పిటిషన్‌ను జస్టిస్ రేణూ అగర్వాల్ సారధ్యంలోని అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ తోసి పుచ్చింది. సదరు వ్యక్తి ఆయన భార్యకు చెల్లించాల్సిన మొత్తం భరణం రికవరీ బాధ్యతలు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ప్రిన్సిపల్ జడ్జిని ఆదేశించారు జస్టిస్ రేణు అగర్వాల్.
అలాగే సదరు వ్యక్తి తన భార్య ఉద్యోగం చేస్తుందనేందుకు ఆధారాలు సమర్పించడంలో కూడా విఫలమయ్యారని హైకోర్టు పేర్కొంది. అదీగాక ఆ వ్యక్తి ఆరోగ్యంగానే ఉన్నందున కార్మికుడిగా పని చేసైనా భార్యకు భరణం ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశించింది. కాగా, ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సదరు వ్యక్తి గతేడాది ఫిబ్రవరి 21న రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే, సీఆర్పీసీ 125 సెక్షన్ కింద భార్యకు భరణం చెల్లించాలని ఫ్యామిలీ కోర్టు ఆదేశించడం జరిగింది. ఇలాంటి సమస్యలనే ఫేస్ చేస్తుంటే..భయపడొద్దు. ధైర్యంగా మహిళలకు అనుకూలమైన చట్టాల గురించి సవివరంగా తెలుసుకుని కోర్టులో పోరాడండి. అదే సమయంలో మహిళలు కూడా తమ వైవాహిక బంధాన్ని చిన్న చిన్న విషయాలకు తెంచుకునే యత్నం చేయకుండా పెద్దలతో సయోధ్య చేసుకునేలా ప్రయత్నించి, మను వివాహ వ్యవస్థను కాపాడుకునే యత్నం చేద్దాం.
Comments
Please login to add a commentAdd a comment