ఇపుడైనా వింటారా?! | editorial on Treason | Sakshi
Sakshi News home page

ఇపుడైనా వింటారా?!

Published Thu, Sep 8 2016 1:27 AM | Last Updated on Mon, Sep 4 2017 12:33 PM

editorial on Treason

సాధారణ ప్రజానీకానికి వినియోగపడటం మాట అటుంచి ఎడాపెడా దుర్వినియోగం అవుతున్న చట్టాల జాబితా రూపొందిస్తే రాజద్రోహ చట్టం అందులో అగ్ర భాగాన ఉంటుంది. ఈ నేపథ్యంలో దీనికి అడ్డుకట్ట వేయాలని సర్వోన్నత న్యాయ స్థానం సంకల్పించడం ప్రజాస్వామ్యవాదులకు ఊరటనిస్తుంది. అంతక్రితం నిలదీ సేవారూ, నిలదీయమని ప్రజలను ప్రోత్సహించేవారూ ప్రభుత్వాలకు కంట్లో నలుసులా కనబడేవారు. అలాంటివారంతా ‘రాజద్రోహుల’ ఖాతాకు ఎక్కేవారు.

 కేసులు, జైళ్లు, కోర్టు విచారణలతో నానా యాతనలూ పడేవారు. కాలం మారింది... ఈమధ్య దేశం గురించి తపన పడేవారు పెరిగిపోయారు. ఫలితంగా ఈ రాజద్రోహ చట్టం మంచినీళ్ల ప్రాయమైంది. తమ విశ్వాసాలకు భిన్నంగా, తాము సరైందను కున్నదానికి విరుద్ధంగా ఏం చేసినా...అది రాత కావొచ్చు, గీత కావొచ్చు, మాట కావొచ్చు- ఈ చట్టం కింద ఫిర్యాదు చేయడం ఒక్కసారిగా పెరిగిపోయింది. సాధా రణ ఆదివాసీ ప్రజలపై ఈ మాదిరి కేసులు పెట్టి జార్ఖండ్ రాష్ట్రం రికార్డు సష్టించింది.

 రాజద్రోహం కేసుల్లో 72 శాతం వాటా ఆ రాష్ట్రానిదే. బీహార్ 20 కేసులతో రెండో స్థానంలో ఉంది. యూపీఏ పాలనాకాలంలో చిన్నగా మొదలైన ఈ ధోరణి ఇప్పుడు వికతరూపం దాల్చింది. అవినీతిపై కార్టూన్లు వేశాడని కాన్పూర్‌కు చెందిన ఆసిమ్ త్రివేదీని ముంబై పోలీసులు నాలుగేళ్లక్రితం అరెస్టుచేశారు. రచయిత్రి అరుంధతీరాయ్, వైద్యుడు బినాయక్ సేన్, జేఎన్‌యూ విద్యార్థి నేతలు, పటేల్ సామాజిక వర్గానికి రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేసిన హార్దిక్‌పటేల్ తదితరులపై ఇందుకు సంబంధించిన కేసులున్నాయి.

 ఆసియా కప్ ఫైనల్లో పాకిస్తాన్ క్రికెట్ టీం పరుగులు చేసినందుకు సంతోషపడ్డారని రెండేళ్లక్రితం మీరట్‌లో ఉన్న స్వామి వివేకానంద సుభారతి యూనివర్సిటీ హాస్టల్‌లోని 67మంది కశ్మీరీ యువకులపై రాజద్రోహం కేసు పెట్టారు. యావజ్జీవ శిక్ష పడటానికి ఆస్కారం ఉన్నంతటి తీవ్రమైన చట్టాన్ని ఇంత అలవోకగా, విచక్షణారహితంగా ప్రయోగించడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈ క్రమంలో మన దేశం, సమాజం నవ్వులపాలవుతుందన్న స్పహ లేకపోవడం మరింత వింతగా అనిపిస్తుంది. ఈమధ్యే కర్ణాటకకు చెందిన మాజీ కాంగ్రెస్ ఎంపీ రమ్యపై కూడా రాజద్రోహానికి పాల్పడ్డారంటూ ఫిర్యాదు నమోదైంది.

 రక్షణమంత్రి మనోహర్ పరీకర్ చెప్పినట్టు పాకిస్తాన్ నరకం కాదని అనడమే ఆమె చేసిన నేరం. ఇలాంటి కేసుల్లో ఇరుక్కున్న వారు ఏళ్లతరబడి కోర్టుల చుట్టూ తిరిగాక కేసులు తరచుగా వీగిపోతున్నాయి. కానీ ఈలోగా ఆ కేసుల్లో నిందితులైనవారు జీవితంలో విలువైన సమయాన్ని కోల్పోతు న్నారు. వారి కుటుంబాలుపడే మానసిక వేదన మాట అటుంచి, ఆర్థికంగా ఆ కేసులు కుంగదీస్తున్నాయి. అవి కొనసాగినంతకాలమూ సమాజంలో వారికెదురవు తున్న నిరాదరణ, అవమానాలు తక్కువేమీ కాదు.

  ఏ పౌరుడైనా తెలియక తప్పు చేశానంటే చట్టం ఊరుకోదు. చట్టం గురించిన అజ్ఞానం ఎంతటివారినైనా కాపాడలేదు. చట్టంలో ఏముందో, సర్వోన్నత న్యాయ స్థానం ఏం చెప్పిందో తెలుసుకోకుండా రాజద్రోహం లాంటి కేసులు పెట్టేవారి పైనా, వాటిని శిరసావహించి దర్యాప్తు పేరిట, విచారణల పేరిట ఇబ్బందులు సష్టించేవారిపైనా సరిగ్గా ఇదేవిధంగా చర్య తీసుకునే అవకాశం ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది. అది లేకపోబట్టి రాజద్రోహం కేసులు నానాటికీ పెరుగుతూ పోతున్నాయి.

 ఈ పరిస్థితిని సమీక్షించి ప్రభుత్వాలకూ, కింది స్థాయి కోర్టులకూ తగిన సూచనలివ్వాలన్న పిటిషన్‌ను విచారించిన సందర్భంగా సుప్రీంకోర్టు చేసిన తాజా వ్యాఖ్యలు ఎన్నదగినవి. 1962లో కేదార్‌నాథ్ కేసులో రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును గుర్తు చేస్తూ ఇప్పటికీ అందులోని మార్గదర్శకాలే వర్తిస్తాయని చెప్పింది. ఆ కేసులో రాజద్రోహం చట్టం రాజ్యాంగబద్ధమైనదని చెబుతూనే దాని ప్రయోగంపై అనేక పరిమితులను విధించింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినంత మాత్రాన అది రాజద్రోహం కిందకు రాదని... హింసకు ప్రేరేపించ నంతవరకూ ఏ పౌరుడైనా తన అభిప్రాయాన్ని లేదా విమర్శను స్వేచ్ఛగా వ్యక్తం చేయొచ్చునని చెప్పింది.

 తాజాగా సుప్రీంకోర్టు దాన్నే పునరుద్ఘాటించింది. ప్రభుత్వంపై తీవ్ర విమర్శ చేస్తే పరువు నష్టంగా పరిగణించడం, రాజద్రోహంగా భావించడం సరైంది కాదని స్పష్టం చేసింది. కేదార్‌నాథ్ కేసులో ఇచ్చిన మార్గ దర్శకాలు పోలీసులూ, న్యాయస్థానాలూ కూడా దష్టిలో పెట్టుకోవలసి ఉంటుం దని తెలిపింది. ఏదైనా కేసులో ఆ మార్గదర్శకాలు ఉల్లంఘించారన్న అభిప్రాయం ఏర్పడితే తగిన చర్య తీసుకోవడం సాధ్యమవుతుందని వివరించింది.

 రాజద్రోహం చట్టం ప్రయోగించిన ప్రతిసారీ ఇలాంటి ఉల్లంఘనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఆ ధోరణి మరిన్ని కేసులకు ఊతం ఇస్తున్నది. కేదార్‌నాథ్ కేసు వరకూ అవసరం లేదు...1995లో పంజాబ్‌లో ఇద్దరు ప్రభుత్వోద్యోగులపై పెట్టిన రాజద్రోహం కేసు విషయంలో సైతం సుప్రీంకోర్టు తీర్పు స్పష్టంగానే ఉంది. ‘ఖలిస్తాన్ జిందాబాద్’ అని వీరిద్దరూ ఇచ్చిన నినాదాలు రాజద్రోహం కేసు పెట్టడానికి అర్హమైనవి కాదని తెలిపింది.

 వారి నినాదాల కారణంగా హింస జరిగిం దని రుజువు చేస్తే వేరుగానీ కేవలం నినాదాలివ్వడమే నేరమంటే కుదరదని చెప్పింది. కానీ ఇప్పుడు మన కళ్లముందు జరుగుతున్నదంతా దానికి విరుద్ధం.  ప్రభుత్వాలు తామే స్వయంగా సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ఉల్లంఘిస్తూ తప్పుడు కేసులు పెడుతుండగా ప్రై వేటు వ్యక్తులను అవి అదుపు చేస్తాయని ఎవరూ విశ్వసించలేరు. నిజానికి ఇలాంటి చట్టాలకు ప్రజాస్వామ్యంలో తావులేదు. ఈ చట్టాన్ని 1870లో మన దేశంపై రుద్దిన బ్రిటిష్ పాలకులు తమ దేశంలో దీన్ని రద్దు చేసుకున్నారు.

 ఇండొనేసియా, స్కాట్లాండ్, దక్షిణ కొరియా వంటి దేశాల న్యాయ స్థానాలు ఈ మాదిరి చట్టాలు రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించి కొట్టేశాయి. అమెరికాలో 218 ఏళ్లనాటి రాజద్రోహ చట్టం ఇంకా కొనసాగుతున్నా అందులో చాలా క్లాజులను న్యాయస్థానాలు రద్దు చేశాయి. మన సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా ఆదేశాలు ఆహ్వానించదగ్గవనడంలో సందేహం లేదు. అయితే వీటి పర్యవసానంగా పరిస్థితి ఎంతవరకూ చక్కబడుతుందో వేచిచూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement