బెంగళూరు: రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంలో కుంభకోణం, అవినీతి ఏదీ లేదని ఆ విమానాల తయారీ కంపెనీ డసో ఏవియేషన్ సీఈవో పేర్కొన్నారు. భారత వాయుసేనకు మరో 110 విమానాలను సమకూర్చే ఒప్పందాన్ని దక్కించుకునేందుకు కూడా తాము రేసులో ఉన్నామని ఆయన బుధవారం చెప్పారు. ఫ్రాన్స్‌కు చెందిన సంస్థ అయిన డసో ఏవియేషన్ సీఈవో ఎరిక్ ట్రేపియర్ బెంగళూరులో విలేకరులతో మాట్లాడారు. ‘రఫేల్ ఒప్పందంలో కుంభకోణమేదీ లేదు. 36 రఫేల్ విమానాలను మేం సరఫరా చేయబోతున్నాం. భారత ప్రభుత్వానికి మరిన్ని విమానాలు కావాలంటే వాటిని కూడా అందించేందుకు మేం సంతోషంగా అంగీకరిస్తాం’ అని ఆయన తెలిపారు.
110 విమానాల కొనుగోలుకు సంబంధించి భారత వాయుసేన 2018 ఏప్రల్ 6న తొలిదశ టెండర్లను (రిక్వెస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్) ఆహ్వానించగా, ఆ బిడ్డింగ్‌లో డసో ఏవియేషన్ కూడా పాల్గొంటోంది. రక్షణ రంగం లో ఏ మాత్రం అనుభవం లేని రిలయన్స్ ను భారత్‌లో ఆఫ్‌సెట్ భాగస్వామిగా డసో ఏవియేషన్ ఎందుకు ఎంపిక చేసుకుందని ప్రశ్నించగా ‘వారికి అనుభవం లేదు నిజమే. కానీ మాకుందిగా. మా అనుభవాన్ని, సాంకేతికతను మేం భారత బృందానికి బదిలీ చేస్తు న్నాం. భారత బృందాన్ని మా కొత్త సంయుక్త సంస్థ ఎంపిక చేసింది. వారు భారత్‌కు, మా కొత్త కంపెనీకి ఉపయోగపడతారు. ఇంక సమస్యేముంది?’ అని ట్రేపియర్ అన్నారు. దివాళా తీసేందుకు సిద్ధంగా ఉన్న రిలయన్స్ గ్రూప్ అధినేత అనిల్ అంబానీకి లాభం చేకూర్చేందుకే డసోకు భాగస్వామిగా రిలయన్స్‌ను ఎంపిక చేశారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. రిలయన్స్ గ్రూప్ ఆర్థిక కష్టాల్లో ఉన్నప్పటికీ ఆ సంస్థతోనూ ఎందుకు జట్టుకట్టారన్న ప్రశ్నకు ‘అవి వాళ్ల అంతర్గత విషయం.. కానీ మేం కలసి పనిచేస్తున్నాం’ అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment