‘రఫేల్‌’లో కమీషన్ల బాగోతం | Dassault paid 1 million euros to Indian middleman Sushen Gupta as gift | Sakshi
Sakshi News home page

‘రఫేల్‌’లో కమీషన్ల బాగోతం

Published Tue, Apr 6 2021 4:29 AM | Last Updated on Tue, Apr 6 2021 8:38 AM

Dassault paid 1 million euros to Indian middleman Sushen Gupta as gift - Sakshi

పారిస్‌/న్యూఢిల్లీ: భారత్‌–ఫ్రాన్స్‌ మధ్య కుదిరిన రఫేల్‌ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంలో భారీగా డబ్బు చేతులు మారినట్లు ఫ్రెంచ్‌ ఆన్‌లైన్‌ ఇన్వెస్టిగేటివ్‌ జర్నల్‌ ‘మీడియాపార్ట్‌’ సంచలనాత్మక కథనాన్ని ప్రచురించింది. ఫ్రాన్స్‌కు చెందిన దసాల్ట్‌ కంపెనీ రఫేల్‌ ఫైటర్‌ జెట్లను తయారుచేస్తోంది. వీటిని కొనేందుకు భారత్‌ 2016లో ఫ్రాన్స్‌తో ఒప్పందంచేసుకుంది. ఈ డీల్‌ కుదరడానికి సహకరించినందుకు భారత్‌లోని మధ్యవర్తులకు(సుశేన్‌ గుప్తా) దసాల్ట్‌ 1.1 మిలియన్‌ యూరోలు(రూ.9.5 కోట్లకుపైగా) కమీషన్లుగా చెల్లించినట్లు ‘మీడియాపార్ట్‌’ ప్రచురించింది.

ఫ్రాన్స్‌ అవినీతి నిరోధక శాఖ ఏజెన్సీ ఫ్రాంకాయిస్‌ యాంటీ కరప్షన్‌(ఏఎఫ్‌ఏ) ఆడిటింగ్‌లో ఈ విషయం తేలిందని వెల్లడించింది. 2017 నాటికి దసాల్ట్‌ ఖాతాలను ఏఎఫ్‌ఏ పరిశీలించగా అవకతవకలు బయటపడ్డాయంది. ‘గిఫ్ట్‌ టు క్లయింట్స్‌’ కింద భారీగా ఖర్చును దసాల్ట్‌ చూపించినట్లు వివరించింది. ‘మీడియాపార్ట్‌’ కథనాన్ని దసాల్ట్‌ ఖండించింది. తాము ఎవరికీ ముడుపులు చెల్లించలేదని, 50 రఫేల్‌ ఫైటర్‌జెట్ల ప్రతిరూపాలను(రెప్లికా) తయారు చేయించడానికి ఈ సొమ్మును వెచ్చించినట్లు తేల్చిచెప్పింది. సుశేన్‌ గుప్తా నేతృత్వంలోని డిఫెన్స్‌ కంపెనీ ‘డెఫ్సిస్‌ సొల్యూషన్స్‌’కు ఆర్డర్‌ ఇచ్చి, ఈ నమూనాలను తయారు చేయించామని తెలిపింది. అగస్టా–వెస్ట్‌ల్యాండ్‌ హెలికాప్టర్ల కుంభకోణంలో సుశేన్‌ గుప్తా సీబీఐ, ఈడీ దర్యాప్తును ఎదుర్కొంటున్నాడు.

డెఫ్సిస్‌ సొల్యూషన్స్‌ సంస్థ దసాల్ట్‌ సంస్థకు భారత్‌లో సబ్‌ కాంట్రాక్టర్‌. 50 రఫేల్‌ నమూనాలను తయారీకి  1.1 మిలియన్‌ యూరోలను భారతీయ కంపెనీకి చెల్లించినట్లు దసాల్ట్‌ చెబుతున్నప్పటికీ, అందుకు ఆధారాలు చూపలేదని ఏఎఫ్‌ఏ నివేదించిందని ‘మీడియాపార్ట్‌’ తెలిపింది. ఒక్కో రఫేల్‌ నమూనా తయారీకి 20,357 యూరోలు ఖర్చయిందని దసాల్ట్‌ చెబుతోంది. సొంత ఎయిర్‌క్రాఫ్ట్‌ మోడల్‌ను తయారు చేయడానికి ఒక భారతీయ కంపెనీకి ఆర్డర్‌ ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? ఈ ఖర్చును ‘గిఫ్ట్‌ టు క్లయింట్‌’ కింద ఎందుకు చూపారు? అయినా నమూనాల తయారీకి అంత సొమ్ము ఎందుకు? ఒక్కొక్కటి ఒక కారు పరిమాణంలో తయారు చేశారా? ఏఎఫ్‌ఏ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించగా, దసాల్ట్‌ సంస్థ సమాధానం చెప్పలేకపోయిందని, కనీసం ఒక్క డాక్యుమెంట్‌ చూపించలేకపోయిందని ఏఎఫ్‌ఏ నివేదికను ఉటంకిస్తూ ‘మీడియాపార్ట్‌’ వెల్లడించింది.

ప్రధాని సమాధానం చెప్పాలి: కాంగ్రెస్‌
మీడియాపార్ట్‌ కథనం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. డీల్‌పై దర్యాప్తు జరపాలని కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్‌ సూర్జేవాలా డిమాండ్‌ చేశారు. ఈ వ్యవహారంపై ప్రధాని మోదీ దేశ ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు.

నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయొద్దు: బీజేపీ
రఫేల్‌ డీల్‌పై మీడియాపార్ట్‌ కథనాన్ని బీజేపీ తోసిపుచ్చింది. అవి ఆధారాల్లేని ఆరోపణలని పేర్కొంది. రఫేల్‌ యుద్ధ విమానాల కొనుగోలుపై దర్యాప్తు అవసరం లేదని సుప్రీంకోర్టు గతంలోనే  తేల్చిచెప్పిందని కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ గుర్తుచేశారు. తప్పుడు ఆరోపణలపై మన సైనిక బలగాల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయొద్దని కాంగ్రెస్‌కు రవిశంకర్‌ హితవు పలికారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement