Middleman
-
‘రఫేల్’లో కమీషన్ల బాగోతం
పారిస్/న్యూఢిల్లీ: భారత్–ఫ్రాన్స్ మధ్య కుదిరిన రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంలో భారీగా డబ్బు చేతులు మారినట్లు ఫ్రెంచ్ ఆన్లైన్ ఇన్వెస్టిగేటివ్ జర్నల్ ‘మీడియాపార్ట్’ సంచలనాత్మక కథనాన్ని ప్రచురించింది. ఫ్రాన్స్‌కు చెందిన దసాల్ట్ కంపెనీ రఫేల్ ఫైటర్ జెట్లను తయారుచేస్తోంది. వీటిని కొనేందుకు భారత్ 2016లో ఫ్రాన్స్‌తో ఒప్పందంచేసుకుంది. ఈ డీల్ కుదరడానికి సహకరించినందుకు భారత్‌లోని మధ్యవర్తులకు(సుశేన్ గుప్తా) దసాల్ట్ 1.1 మిలియన్ యూరోలు(రూ.9.5 కోట్లకుపైగా) కమీషన్లుగా చెల్లించినట్లు ‘మీడియాపార్ట్’ ప్రచురించింది. ఫ్రాన్స్ అవినీతి నిరోధక శాఖ ఏజెన్సీ ఫ్రాంకాయిస్ యాంటీ కరప్షన్(ఏఎఫ్ఏ) ఆడిటింగ్‌లో ఈ విషయం తేలిందని వెల్లడించింది. 2017 నాటికి దసాల్ట్ ఖాతాలను ఏఎఫ్ఏ పరిశీలించగా అవకతవకలు బయటపడ్డాయంది. ‘గిఫ్ట్ టు క్లయింట్స్’ కింద భారీగా ఖర్చును దసాల్ట్ చూపించినట్లు వివరించింది. ‘మీడియాపార్ట్’ కథనాన్ని దసాల్ట్ ఖండించింది. తాము ఎవరికీ ముడుపులు చెల్లించలేదని, 50 రఫేల్ ఫైటర్జెట్ల ప్రతిరూపాలను(రెప్లికా) తయారు చేయించడానికి ఈ సొమ్మును వెచ్చించినట్లు తేల్చిచెప్పింది. సుశేన్ గుప్తా నేతృత్వంలోని డిఫెన్స్ కంపెనీ ‘డెఫ్సిస్ సొల్యూషన్స్’కు ఆర్డర్ ఇచ్చి, ఈ నమూనాలను తయారు చేయించామని తెలిపింది. అగస్టా–వెస్ట్‌ల్యాండ్ హెలికాప్టర్ల కుంభకోణంలో సుశేన్ గుప్తా సీబీఐ, ఈడీ దర్యాప్తును ఎదుర్కొంటున్నాడు. డెఫ్సిస్ సొల్యూషన్స్ సంస్థ దసాల్ట్ సంస్థకు భారత్‌లో సబ్ కాంట్రాక్టర్. 50 రఫేల్ నమూనాలను తయారీకి 1.1 మిలియన్ యూరోలను భారతీయ కంపెనీకి చెల్లించినట్లు దసాల్ట్ చెబుతున్నప్పటికీ, అందుకు ఆధారాలు చూపలేదని ఏఎఫ్ఏ నివేదించిందని ‘మీడియాపార్ట్’ తెలిపింది. ఒక్కో రఫేల్ నమూనా తయారీకి 20,357 యూరోలు ఖర్చయిందని దసాల్ట్ చెబుతోంది. సొంత ఎయిర్‌క్రాఫ్ట్ మోడల్‌ను తయారు చేయడానికి ఒక భారతీయ కంపెనీకి ఆర్డర్ ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? ఈ ఖర్చును ‘గిఫ్ట్ టు క్లయింట్’ కింద ఎందుకు చూపారు? అయినా నమూనాల తయారీకి అంత సొమ్ము ఎందుకు? ఒక్కొక్కటి ఒక కారు పరిమాణంలో తయారు చేశారా? ఏఎఫ్ఏ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించగా, దసాల్ట్ సంస్థ సమాధానం చెప్పలేకపోయిందని, కనీసం ఒక్క డాక్యుమెంట్ చూపించలేకపోయిందని ఏఎఫ్ఏ నివేదికను ఉటంకిస్తూ ‘మీడియాపార్ట్’ వెల్లడించింది. ప్రధాని సమాధానం చెప్పాలి: కాంగ్రెస్ మీడియాపార్ట్ కథనం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. డీల్‌పై దర్యాప్తు జరపాలని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై ప్రధాని మోదీ దేశ ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయొద్దు: బీజేపీ రఫేల్ డీల్‌పై మీడియాపార్ట్ కథనాన్ని బీజేపీ తోసిపుచ్చింది. అవి ఆధారాల్లేని ఆరోపణలని పేర్కొంది. రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలుపై దర్యాప్తు అవసరం లేదని సుప్రీంకోర్టు గతంలోనే తేల్చిచెప్పిందని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ గుర్తుచేశారు. తప్పుడు ఆరోపణలపై మన సైనిక బలగాల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయొద్దని కాంగ్రెస్‌కు రవిశంకర్ హితవు పలికారు. -
‘అగస్టా’ మైకేల్‌ను విచారించనున్న సీబీఐ
న్యూఢిల్లీ: అగస్టా వెస్ట్‌ల్యాండ్ హెలికాప్టర్ కుంభకోణంలో మధ్యవర్తిగా భావిస్తున్న క్రిస్టియన్ మైకేల్(58)ను విచారించేందుకు సీబీఐకి ఢిల్లీ కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ నెల 24 నుంచి 26 వరకు విచారించవచ్చని పేర్కొంది. ప్రస్తుతం మైకేల్ ఉంటున్న తీహార్ సెంట్రల్ జైల్లోనే ఈ విచారణ జరగనుంది. జైల్ సూపరింటెండెంట్ పర్యవేక్షణలోగానీ, లేదా ఆయన అనుమతించిన వారి పర్యవేక్షణలోగానీ ఈ విచారణ జరగనుంది. గతేడాది డిసెంబర్లో దుబాయ్ ప్రభుత్వం ఆయనను భారత్‌కు అప్పగించింది. బ్రిటన్ జాతీయుడైన మైకేల్ అగస్టా వెస్ట్‌ల్యాండ్ కంపెనీ నుంచి రూ.225 కోట్ల ముడుపులు పుచ్చుకున్నట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) 2016లో చార్జిషీటు దాఖలు చేసింది. ఈ కుంభకోణంలో మైకేల్‌తో పాటు గైడో హాష్కే, కార్లో గెరోసా అనే మధ్యర్తులపైనా ఈడీ, సీబీఐలు దర్యాప్తు జరుపుతున్నాయి. ఏమిటీ కుంభకోణం? రూ.3600 కోట్లతో 12 వీవీఐపీ హెలికాప్టర్లు కొనేందుకు 2010, ఫిబ్రవరిలో నాటి యూపీఏ ప్రభుత్వం అగస్టా వెస్ట్‌ల్యాండ్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. కాంట్రాక్టు నిబంధనలు ఉల్లంఘనకు గురవడంతో పాటు రూ.423 కోట్ల ముడుపులు చేతులు మారాయని, కేంద్ర ఖజానాకు సుమారు రూ.2666 కోట్ల నష్టం వాటిల్లినట్లు ఆరోపణలు రావడంతో 2014 జనవరి 1న ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. హెలి కాప్టర్లు ఎగిరే ఎత్తు పరిమితిని 6 వేల మీటర్ల నుంచి 4500 మీటర్లకు తగ్గించి కొందరు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని సీబీఐ ఆరోపించింది. ఎత్తు తగ్గించడం ద్వారానే అగస్టా వెస్ట్‌ల్యాండ్ ఒప్పందం చేసుకోవడానికి అర్హత సాధించిందని తెలిపింది. -
మైకేల్‌ను అప్పగించిన యూఏఈ
న్యూఢిల్లీ: సంచలనం సృష్టించిన అగస్టా వెస్ట్‌ల్యాండ్ హెలికాప్టర్ల కొనుగోలు కుంభకోణంలో మధ్యవర్తి క్రిస్టియన్ జేమ్స్ మైకేల్(57)ను యూఏఈ భారత్‌కు అప్పగించింది. మంగళవారం రాత్రే ఆయన్ని దుబాయ్ నుంచి ఢిల్లీకి తీసుకొచ్చినట్లు అధికారులు తెలిపారు. బ్రిటన్ జాతీయుడైన మైకేల్ అగస్టా వెస్ట్‌ల్యాండ్ కంపెనీ నుంచి రూ.225 కోట్ల ముడుపులు పుచ్చుకున్నట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) 2016లో చార్జిషీటు దాఖలు చేసింది. ఈ కుంభకోణంలో మైకేల్‌తో పాటు గైడో హాష్కే, కార్లో గెరోసా అనే మధ్యర్తులపైనా ఈడీ, సీబీఐలు దర్యాప్తు జరుపుతున్నాయి. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పర్యవేక్షణలో చేపట్టిన ఆపరేషన్ మూలంగానే మైకేల్‌ను భారత్‌కు అప్పగించేందుకు యూఏఈ అంగీకరించిందని సీబీఐ తెలిపింది. సీబీఐ డైరెక్టర్ ఎం.నాగేశ్వర రావు ఈ ఆపరేషన్‌ను సమన్వయపరచగా, జాయింట్ డైరెక్టర్ సాయి మనోహర్ నేతృత్వంలోని బృందం..మైకేల్‌ను తెచ్చేందుకు దుబాయ్ వెళ్లిందని వెల్లడించింది. వైమానిక దళ మాజీ చీఫ్‌తో కుమ్మక్కు.. హెలికాప్టర్ల కుంభకోణంలో మైకేల్ పాత్ర 2012లో వెలుగుచూసింది. ఒప్పందాన్ని ఆ కంపెనీకే కట్టబెట్టేలా భారత అధికారులకు అతడు అక్రమంగా చెల్లింపులు జరిపినట్లు సీబీఐ ఆరోపించింది. సహనిందితులైన నాటి వైమానిక దళ చీఫ్ ఎస్పీ త్యాగి, ఆయన కుటుంబీకులతో కలసి నేరపూరిత కుట్రకు పాల్పడినట్లు తెలిపింది. విచారణ నుంచి తప్పించుకోవడానికి అతడు విదేశాలకు పారిపోయాడని సీబీఐ వెల్లడించింది. దీంతో మైకేల్‌పై 2015లో నాన్–బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ అయింది. ఈ వారెంట్ ఆధారంగా ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసు జారీచేయడంతో 2017 ఫిబ్రవరిలో దుబాయ్‌లో అరెస్టయ్యాడు. అప్పటి నుంచి అక్కడే జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. తనను భారత్‌కు అప్పగించొద్దని అతను పెట్టుకున్న అభ్యర్థనను అక్కడి కోర్టు కొట్టివేయడంతో భారత అధికారుల శ్రమ ఫలించినట్లయింది. ‘గాంధీ’లకు కష్టాలు తప్పవు: బీజేపీ మైకేల్ అప్పగింతతో గాంధీ కుటుంబానికి చిక్కులు తప్పవని బీజేపీ హెచ్చరించింది. అవినీతిపై మోదీ ప్రభుత్వం సాగిస్తున్న తిరుగులేని పోరాటానికి తాజా పరిణామమే ఉదాహరణ అని బీజేపీ పేర్కొంది.మైకేల్‌ను సీబీఐ కస్టడీలోకి తీసుకున్న తరువాత ఈ కుంభకోణంలో అసలు దోషులెవరో తెలుస్తుందని పేర్కొంది. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్, సోనియాకు మైకేల్ విశ్వాసపాత్రుడనే పేరుంది. ఏమిటీ కుంభకోణం? రూ.3600 కోట్లతో 12 వీవీఐపీ హెలికాప్టర్లు కొనేందుకు 2010, ఫిబ్రవరిలో నాటి యూపీఏ ప్రభుత్వం అగస్టా వెస్ట్‌ల్యాండ్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. కాంట్రాక్టు నిబంధనలు ఉల్లంఘనకు గురవడంతో పాటు రూ.423 కోట్ల ముడుపులు చేతులు మారాయని, కేంద్ర ఖజానాకు సుమారు రూ.2666 కోట్ల నష్టం వాటిల్లినట్లు ఆరోపణలు రావడంతో 2014 జనవరి 1న ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. హెలి కాప్టర్లు ఎగిరే ఎత్తు పరిమితిని 6 వేల మీటర్ల నుంచి 4500 మీటర్లకు తగ్గించి కొందరు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని సీబీఐ ఆరోపించింది. ఎత్తు తగ్గించడం ద్వారానే అగస్టా వెస్ట్‌ల్యాండ్ ఒప్పందం చేసుకోవడానికి అర్హత సాధించిందని తెలిపింది. -
మధ్యవర్తి 180 సార్లు ఇండియాకు వచ్చాడు!
న్యూఢిల్లీః అగస్టా వెస్ట్ ల్యాండ్ హెలికాప్టర్ల కొనుగోలు కుంభకోణంలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఆసక్తికర సమాచారాన్ని సాధించింది. ఎనిమిదేళ్ళలో ఓ మధ్యవర్తి ఇటలీనుంచి భారత్ కు తరచుగా 180 సార్లు ప్రయాణించిన విషయం ఇప్పుడు పరిశోధక బృందాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఫారెన్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ (ఎఫ్ఆర్ఆర్ఓ) రికార్డులు పరిశీలించిన అధికారులకు వీవీఐపీ కుంభకోణంలో సదరు వ్యక్తి కీలక మధ్యవర్తిగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. అగస్టా కుంభకోణంలో ఓ మధ్యవర్తి కీలకంగా వ్యవహరించినట్లు తాజాగా సేకరించిన ఆధారాలను బట్టి తెలుస్తోంది. బ్రిటన్ జాతీయుడు క్రిస్టియన్ మిచెల్ కుంభకోణంలో అత్యంత కీలకమైన వ్యక్తిగా ఉన్నసంగతి తెలిసిందే. ప్రస్తుతం మిచెల్ 2005 నుంచి 2013 సంవత్సరాలమధ్య దాదాపు 180 సార్లు ఇండియాను సందర్శించడం అనుమానాలకు బలం చేకూరుస్తోంది. ఛాపెర్ కుంభకోణంలో అతడు మధ్యవర్తిత్వాన్ని జరిపి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. మిచెల్ భారత్ సందర్శనల్లో ఎక్కువ శాతం ఢిల్లీలోనే ఉండటమే కాక మధ్యవర్తిగా అభినవ్ త్యాగి, అతడి సహచరుడు, షెల్ సంస్థ డైరెక్టర్ జెబి. సుబ్రమణ్యం కూడ ఉన్నట్లు ఎఫ్ఆర్ఆర్ఓ కార్యాలయంలో మిచెల్ ఇచ్చిన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. అయితే ఈ అభినవ్ త్యాగికి, ముడుపులు అందుకున్న త్యాగి కుటుంబానికి ఎటువంటి సంబంధాలు ఉన్నాయో తెలుసుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా సీబీఐ, ఈడీ అధికారులు 2012 నుంచి 2013 మధ్య ఢిల్లీకి జరిగిన సందర్శనలపై అన్వేషణ ప్రారంభించారు. అయితే కుంభకోణంపై భారత్ లో దర్యాప్తు ప్రారంభమైన తర్వాత మిచెల్ ఇండియాలో ఒక్కసారి కూడ పర్యటించకపోవడమే కాక, అరబ్బు దేశాలకు పారిపోయి, అక్కడే నివసిస్తున్నట్లు తెలియడంతో ఈడీ ఇప్పటికే అతడి అరెస్టుకోసం అభ్యర్తన పంపింది. ఎనిమిది, తొమ్మిదేళ్ళలో 180 సార్లు దేశానికి పర్యటించడం అంటే ఆశ్చర్యకరమైన, అనుమానించదగ్గ విషయమేనని, అతడు ఇండియాలో సంజీవ్ త్యాగి సహా ఇతరులను కలసిన సమాచారాన్ని కూడ తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని అధికారులు చెప్తున్నారు. భారత్ సందర్శించిన సమయంలో మిచెల్ ఎక్కువగా ఫైవ్ స్టార్ హోటళ్ళతోపాటు, అతడి 1.2 కోట్ల విలువైన, ఇప్పటికే అటాచ్ చేసిన, సఫ్దర్ జంగ్ ఎన్ క్లేవ్ లోని ఆయన నివాసంలో ఉండేవాడని ఓ సీనియర్ అధికారి చెప్తున్నారు. -
హెలికాప్టర్ల అవినీతికి మధ్యవర్తి ఈయనే
న్యూఢిల్లీ: అగస్టా వెస్ట్ ల్యాండ్ హెలికాప్టర్ల డీల్‌లో అవినీతి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. వెస్ట్ ల్యాండ్‌తో డీల్ వ్యవహారం అనంతరం భారతీయ మీడియాతో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా అగస్టా వెస్ట్ ల్యాండ్ మధ్యవర్తికి ఆరు మిలియన్ పౌండ్లను ఇచ్చినట్లు తెలిసింది. 2010-2012 మధ్య కాలంలో హెలికాప్టర్ల కొనుగోలు గురించి ఎటువంటి దుష్ర్ఫచారం లేకుండా చేయడానికి అగస్టా కంపెనీ క్రిష్టియన్ మైఖేల్ అనే వ్యక్తి డబ్బును సమకూర్చింది. మొత్తం 3,546 వేల కోట్ల రూపాయల ఈ డీల్‌లో 12 అగస్టా వెస్ట్‌ల్యాండ్ 101 హెలికాప్టర్లను ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు అందించేందుకు 2010లో ఒప్పందం జరిగింది. స్కామ్‌తో సంబంధం ఉన్న మైఖేల్‌ను పట్టుకోవడానికి ఈడీ ఇంటర్‌పోల్‌కు ఫిబ్రవరి 4న లేఖను రాసింది. ప్రస్తుతం మైఖేల్ దుబాయ్‌లో ఉన్నట్లు కనుగొన్న ఈడీ, సీబీఐలు అతని మీద రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయించాయి. 2013లో బయటపడిన ఈ స్కామ్‌లో దేశ కీలక రాజకీయ నేతలతో పాటు మిలటరీ అధికారులు అగస్టా వెస్ట్ ల్యాండ్‌కి 610మిలియన్ డాలర్లకు బిడ్ దక్కేలా చేసేందుకు లంచాలు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మైఖేల్‌పై కుట్ర, మోసం, అవినీతికి మధ్యవర్తిత్వం నిర్వర్తించడం తదితర చట్టాలపై కేసులు నమోదు చేశారు.