ఫ్రాన్సు మాజీ అధ్యక్షుడు కూడా అదే అన్నారు | Rahul Gandhi Critics Narendra Modi On Rafale Fighter Jet Deal | Sakshi
Sakshi News home page

ఫ్రాన్సు మాజీ అధ్యక్షుడు కూడా అదే అన్నారు

Published Fri, Feb 15 2019 3:22 AM | Last Updated on Fri, Feb 15 2019 3:27 AM

Rahul Gandhi Critics Narendra Modi On Rafale Fighter Jet Deal - Sakshi

అజ్మీర్‌/ధరంపూర్‌: ‘రఫేల్‌’ఒప్పందంపై ప్రధాని మోదీ తీరును కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ మరోసారి ఎండగట్టారు. అనిల్‌ అంబానీ కంపెనీకి రఫేల్‌ కాంట్రాక్టు అప్పగించడంలో ఫ్రాన్సు ప్రభుత్వం పాత్ర ఏమీ లేదన్న మాజీ అధ్యక్షుడు హొలాండే ప్రకటనను ఆయన పరోక్షంగా ప్రస్తావిస్తూ.. ‘కాపలాదారే దొంగ’అన్న విషయం ఫ్రాన్సు మాజీ అధ్యక్షుడికి కూడా తెలిసిపోయిందని ఎద్దేవా చేశారు. గురువారం గుజరాత్‌ రాష్ట్రం వల్సద్‌ జిల్లా ధరంపూర్‌లో జరిగిన కాంగ్రెస్‌ ర్యాలీతోపాటు అజ్మీర్‌లో కాంగ్రెస్‌ సేవా దళ్‌ సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ..తన మిత్రుడు అనిల్‌ అంబానీ కోసం ప్రధాని మోదీ దళారీగా మారి డసో ఏవియేషన్‌ సంస్థతో సమాంతర చర్చలు జరిపారంటూ రక్షణ శాఖ, వైమానిక దళాధికారులే పేర్కొన్నారన్న రాహుల్‌.. ‘చౌకీదారే దొంగ’అన్న నినాదం ఫ్రాన్స్‌కు కూడా చేరింది. ఆ దేశ మాజీ అధ్యక్షుడు కూడా ఈ మాట అన్నారు’అని ఎత్తిపొడిచారు.

ఈ సందర్భంగా‘చౌకీదార్‌ చోర్‌ ఛే(గుజరాతీ)’అంటూ ప్రజలతో నినాదం చేయించారు. ‘ఆయన(మోదీ) 15 మంది పారిశ్రామిక వేత్తల లాభం కోసమే దేశాన్ని పాలిస్తున్నారు’అని విమర్శించారు. పంట రుణాలను రద్దు చేయాలన్న రైతుల డిమాండ్‌ను పట్టించుకోకుండా 15 మంది బడా పారిశ్రామికవేత్తలకు చెందిన రూ.3.5 లక్షల కోట్ల అప్పును మాఫీ చేశారని విమర్శించారు. మోదీ ప్రభుత్వం అనిల్‌ అంబానికి రూ.30 వేల కోట్లు లబ్ధి చేకూర్చినట్లే తమ పార్టీ అధికారంలోకి వస్తే పేదల బ్యాంకు ఖాతాల్లో నేరుగా సొమ్ము జమ చేస్తుందని చెప్పారు.

బీజేపీ మాతృసంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌(ఆర్‌ఎస్‌ఎస్‌) కార్యకర్తలు లాఠీలు పట్టుకుని సమాజంలో విద్వేషాన్ని వ్యాపింపజేస్తున్నారని ఆరోపించారు. వారు పెంచుతున్న విద్వేషాన్ని ప్రేమతో ఎదుర్కోవాలని సేవాదళ్‌ కార్యకర్తలకు రాహుల్‌ పిలుపునిచ్చారు. ‘భయానికి మరో రూపమే విద్వేషం. భయం అనేది లేకుండా విద్వేషం పుట్టదు. ఇదే ప్రధాని మోదీకి నాకు తేడా. మన(కాంగ్రెస్‌)కు ద్వేషం లేదు ఎందుకంటే మనలో భయం లేదు. కానీ, వారి(బీజేపీ–ఆర్‌ఎస్‌ఎస్‌)కి ద్వేషం ఉంది. తమకున్న భయాన్ని దాచుకునేందుకే వారంతా విద్వేషాన్ని ప్రదర్శిస్తారు’అని వ్యాఖ్యానించారు. ‘వచ్చే ఎన్నికల్లో వారి(బీజేపీ)ని మనం అంతం చేయం. హత్య చేయం. వారిపై చేయిచేసుకోబోం. కానీ, ఓడిస్తాం. అదీ ప్రేమతోనే’అని అన్నారు.

రాహుల్‌కు ముద్దు..!
గుజరాత్‌ రాష్ట్రం ధరంపూర్‌లో ర్యాలీ సందర్భంగా కాంగ్రెస్‌ మహిళా విభాగం కార్యకర్తలు రాహుల్‌ను పూలదండలతో సన్మానించారు. ఆ సమయంలో సూరత్‌కు చెందిన కశ్మీరా బెన్‌(60) అనే మహిళా కార్యకర్త ఆయన్ను ముద్దు పెట్టుకున్నారు. దీంతో అక్కడున్న వారంతా ఆశ్చర్యానికి గురయ్యా రు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ..‘రాహుల్‌ మా ప్రాంతానికి రావడం చాలా సంతోషంగా ఉంది. నాకు సోదరుని వంటి వారు. రాహుల్‌ను ప్రధానిగా చూడాలన్నది నా ఆకాంక్ష’అని తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement