జైపూర్: వ్యాపారవేత్త, మిత్రుడు అయిన అనిల్ అంబానీకి మేలు చేసేందుకే ఆయనకు రాఫెల్ యుద్ధ విమానాల తయారీ కాంట్రాక్టును ప్రధాని మోదీ ఇప్పించారని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ ఆరోపించారు. ఈ ఏడాది చివర్లో జరగనున్న రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని శనివారం జైపూర్‌లో ప్రారంభించిన రాహుల్.. కేంద్రంపై, ప్రధానిపై విమర్శలు గుప్పించారు. విదేశీ తయారీదారు.. రక్షణ ఒప్పందంలో ఓ భారతసంస్థతో డీల్ కుదుర్చుకోవడం వెనక మతలబేంటని ప్రశ్నించారు.
యుద్ధ విమానం ధరను మోదీ సర్కారు మూడురెట్లు పెంచిందని ప్రభుత్వ అవినీతి త్వరలో బయటపడుతుందన్నారు. రైతుల కోసం రుణమాఫీ చేయని సర్కారు 15–20 మంది బడా వ్యాపారవేత్తలకు రూ.2.3లక్షల కోట్ల రుణాలు రద్దుచేసిందన్నారు. దేశంలో దళితులపై అత్యాచారాలు పెరుగుతున్నాయని, బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే ఎస్సీలపై దాడుల కేసులు ఎక్కువగా ఉన్నాయని ఆరోపించారు. మోదీ దళిత వ్యతిరేక విధానాల వల్లే దేశంలో సమస్యలు పెరుగుతున్నాయని అన్నారు. కాగా, రాఫెల్ ఒప్పందం విషయంలో రాహుల్ ఆరోపణలను అనిల్ అంబానీ ఖండించారు. ఇందులో కేంద్రం పాత్రేమీ లేదన్నారు.
పారాచ్యూట్ అభ్యర్థులకు టికెట్లివ్వం
రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిని నిర్ణయించే విషయంలో పార్టీ కార్యకర్తలకు అవకాశం ఉంటుందని రాహుల్ భరోసా ఇచ్చారు. చివరి నిమిషంలో ఇతర పార్టీల నుంచి వచ్చే (పారాచ్యూట్) అభ్యర్థులకు ఎట్టిపరిస్థితుల్లోనూ పోటీకి అవకాశం ఇవ్వబోమన్నారు. ‘బయటినుంచి వచ్చే ఏ ఒక్కరిటీ టికెట్ ఇవ్వం. కార్యకర్తలు చెప్పేది వింటాం’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment