సాక్షి, న్యూఢిల్లీ : వేలాది కోట్ల రూపాయలను వెచ్చించి ఫ్రాన్స్ నుంచి ‘రఫేల్’ యుద్ధ విమానాలను కొనుగోలు చేయడం సమంజసమా, కాదా? అన్న విషయాన్ని తాము విచారించదల్చుకోలేదని, అది ప్రభుత్వానికి సంబంధించిన పాలనాపరమైన విషయమంటూ సుప్రీంకోర్టు శుక్రవారం 36 పిటిషన్లను కొట్టివేస్తూ కొత్త అనుమానాలను ముందుకు తెచ్చింది. ఒప్పందంలోని ‘అధిక ధర’ అంశాన్ని కాగ్ క్షుణ్నంగా పరిశీలించి నివేదికను రూపొందించడం, ఆ నివేదికను పార్లమెంట్ ప్రజాపద్దుల కమిటీ ఆమోదించినందున దాన్నీ తాము పరిశీలించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ తీర్పును చూసి ముందుగా నోరెళ్లబెట్టిన పార్లమెంట్ ప్రజాపద్దుల కమిటీ చైర్మన్ మల్లిఖార్జున ఖర్గే, వెంటనే తేరుకొని కాగ్‌కు ఫోన్ చేసి ‘మీరు రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంపై నివేదికను పంపించారా?’ అంటూ ప్రశ్నించారు. ఇంకా నివేదిక పూర్తి కాలేదని, పూర్తయ్యాక సమర్పిస్తామంటూ కాగ్ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటరల్ జనరల్) నుంచి సమాధానం వచ్చింది. ఇప్పవరకు ఉన్నతాధికారులు 60 సార్లు కాగ్‌ను కోరిన ఇప్పటికీ నివేదిక తయారు కాకపోవడం గమనార్హం.
యాభై వేల కోట్ల రూపాయల లోపే 126 రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలుకు 2014లో దాదాపు ఒప్పందం కుదరగా అది 2016 నాటికి కేవలం 36 యుద్ధ విమానాల కొనుగోలుకే దాదాపు 59 వేల కోట్ల రూపాయలకు ఎలా పెరిగింది? ఈ యుద్ధ విమానాలను సరఫరా చేసే డసౌ సంస్థ, ఒప్పందానికి కొన్ని రోజుల ముందే ఆవిర్భవించిన తన భారత భాగస్వామిగా రిలయన్స్ డిఫెన్స్ సంస్థను ఎలా ఎంపిక చేసుకొంది? యుద్ధ విమానాలను పక్కనపెట్టి మామూలు పౌర విమానాల తయారీలో కూడా ఎలాంటి అనుభవం లేని రిలయన్స్ అంబానీ కంపెనీకి ఏకంగా 30 వేల కోట్ల రూపాయల పెట్టుబడులను తరలించేందుకు ఎందుకు ముందుకు వచ్చింది? భారత ప్రభుత్వం ఒత్తిడి మేరకే రిలయన్స్ కంపెనీని చేర్చుకోక తప్పలేదని నాటి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయీస్ మిలాండ్ మీడియా ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించడంలో నిజం లేదా? అంటూ ఆ మంది 36 పిటిషనర్లు సుప్రీంకోర్టును ప్రశ్నించారు. వారిలో మాజీ బీజేపీ నాయకులు అరుణ్ శైరీ, యశ్వంత్ సిన్వాలతోపాటు సామాజిక కార్యకర్త, న్యాయవాది ప్రశాంత్ భూషణ్ కూడా ఉన్నారు.
ఈ సందేహాల్లో ఏ ఒక్కటి సుప్రీంకోర్టు తీర్చకపోగా కొత్త సందేహాలను లేవనెత్తింది. యుద్ధ విమానాల ధరల పట్ల కాగ్ సంతృప్తి పడిందని, ఆ నివేదికను పార్లమెంట్ ప్రజాపద్దుల కమిటీ ఆమోదించినాక ఇంకా సందేహాలు ఎందుకని? సుప్రీంకోర్టు ప్రశ్నించింది. తయారుకానీ నివేదిక పట్ల కాగ్ సంతృప్తి వ్యక్తం చేసినట్లు, అందని నివేదికను పార్లమెంట్ పద్దుల కమిటీ ఆమోదించినట్లు సుప్రీంకోర్టుకు ఎవరు చెప్పారు? ఈ ప్రశ్నలకు సమాధానాన్ని సులభంగానే ఊహించవచ్చు. ఒప్పందం విషయంలో సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం సమర్పించిన రహస్య నివేదికలో ఈ విషయాలను కేంద్రమే పొందుపరిచి ఉంటుంది. ఆ విషయం తెలియక సుప్రీంకోర్టు తప్పులో కాలేసింది. రహస్య నివేదికలో కూడా కేంద్రం విమానాల బేసిక్ ధరనే పేర్కొందని, పూర్తి వివరాలు ఇవ్వడం దేశ సార్వభౌమాధికార భద్రతకు భంగం కలిగించడమే కాకుండా ఇలాంటి వివరాలను వెల్లడించకూడదంటూ ఫ్రాన్స్‌తో చేసుకున్న ఉప్పందాన్ని ఉల్లంఘించినట్లేనంటూ ప్రభుత్వం చేసిన వాదనతో ఏకభవించిన సుప్రీంకోర్టు రోడ్డు, వంతెన నిర్మాణానికి సంబంధించిన టెండర్ అంశాలు కావని వ్యాఖ్యానించింది.
అంత చిన్న విషయం కాదు కనుకనే వివరాలు కావాలని పిటిషనర్లు డిమాండ్ చేశారు. ‘మా దగ్గర ఇంతటి శక్తి సామర్థ్యాలు కలిగిన క్షిపణలు, ఉన్నాయి. అంతటి శక్తివంతమైన అణు క్షిపణులను ప్రయోగించే యుద్ధ విమానాలు ఎన్నో ఉన్నాయి’ అంటూ అమెరికా, చైనాలు బహిరంగంగా ప్రకటిస్తున్న నేటిరోజుల్లో, లేని ఆయుధాలు ఉన్నట్టు మన దాయాది దేశం పాకిస్థాన్ చెప్పుకుంటున్నప్పుడు, ఎలాంటి సామర్థ్యం, సాంకేతిక సౌకర్యాలు తమ రఫేల్ యుద్ధ విమానాల్లో ఉన్నాయో డసౌ సంస్థనే వాణిజ్య ప్రకటన చేసుకుంటున్నప్పుడు మన విమానాల గుట్టు విప్పితే తప్పేమిటీ?
అసలు యుద్ధ విమానాల ఒప్పందమనేది రెండు దేశాల మధ్య జరిగిన డిఫెన్స్ ఒప్పందమని, అందులో కోర్టులు జోక్యం చేసుకోవడం తగదని, మొదటినుంచి ఈ ఒప్పందాన్ని విచారించేందుకు విముఖత చూపుతున్న సుప్రీంకోర్టు శుక్రవారం పిటిషన్లు కొట్టి వేయగానే బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా స్పందిస్తూ ఒప్పందం విషయంలో కోర్టు ప్రభుత్వానికి క్లీన్‌చిట్ ఇచ్చిందని, అనుమానించిన, ఆరోపణలు చేసిన కాంగ్రెస్ నేతలతోపాటు పిటిషనర్లు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అసలు ఒప్పందంలోని అంశాలుగానీ, ధర విషయాలుగానీ విచారించడానికి సుప్రీంకోర్టు నిరాకరించినప్పుడు క్లీన్‌చిట్ ఇవ్వడం ఎందుకు అవుతుంది ? ఒప్పందంలో రిలయన్స్ అంబానీ కంపెనీని చేర్చడంలో ప్రత్యేక ప్రయోజనాలు ఉన్నట్లు ఆధారాలేవీ లేవని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఆ వ్యాఖ్యలను ప్రాతిపదికగా తీసుకుంటే రిలయన్స్‌ను ఎంపిక చేయడంలో కేంద్రానికి దురుద్దేశం లేదని చెప్పుకోవచ్చు. కానీ మొత్తం ఒప్పందానికి క్లీన్‌చిట్ ఇచ్చినట్లు కాదు.
అంబానీ డిఫెన్స్ విభాగంలోని ఎయిరోస్ట్రక్చర్ కొత్తగా ఏర్పడిన సంస్థే కావచ్చుగానీ, దాని మాతృసంస్థ 2012 నుంచే ఒప్పందం గురించి జరిగిన చర్చల్లో పాల్గొందికదా! అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈ ఎయిరోస్ట్రక్చర్ నష్టాల్లో ఉన్న అనిల్ అంబానీ రిలయన్స్‌కు సంబంధించినది కాగా, 2012 నుంచి ప్రాథమిక చర్చల్లో పాల్గొని ఆ తర్వాత చర్చల నుంచే పూర్తిగా తప్పుకున్నది ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్, దీన్ని మాతృసంస్థగా పేర్కొనడమే ఇక్కడ గమనార్హం. పైగా ఒప్పందంపై ఫ్రాన్స్ అధ్యక్షుడుగా సంతకం చేసిన ఫ్రాంకోయీస్ మిలాండ్ ఇచ్చిన ఇంటర్వ్యూను పరిగణనలోకి తీసుకోలేమని సుప్రీంకోర్టు చెప్పడం మరింత గమనార్హం. ఏదేమైనా పలు సందేహాలను తీర్చాల్సిన సుప్రీంకోర్టు కొత్త సందేహాలను ముందుకు తెచ్చింది. సుప్రీంకోర్టు తీర్పు ప్రజలకు స్పష్టంగా అర్థం కావాలంటే కేంద్ర ప్రభుత్వం సమర్పించిన రహస్య నివేదికలోని అంశాలు బహిర్గతం కావాల్సిందే!
Published Sat, Dec 15 2018 6:24 PM | Last Updated on Sat, Dec 15 2018 6:29 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment