'మోదీజీ.. పనికిమాలిన యుద్ధ విమానాలు కొనొద్దు'
రఫల్ యుద్ధ విమానాల కొనుగోలు వ్యవహారంలో ప్రధాని నరేంద్రమోదీ అహేతుకంగా వ్యవహరిస్తున్నారని బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి ఫైర్ అయ్యారు. ప్రస్తుతం ఫ్రాన్స్లో పర్యటిస్తున్న మోదీ.. 36 రఫల్ యుద్ధవిమానాల కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. డస్సాల్ట్ ఏవియేషన్ సంస్థ రూపొందించే రఫల్ యుద్ధవిమానాలు అత్యంత పనికిమాలినవని, ప్రపంచంలోని మిగతా దేశాలేవీ ఆ విమానాలని కొనుగోలు చేసేందుకు ముందుకురాలేదని స్వామి చెప్పారు.
'రఫల్ ఫైటర్ల ఇంధన సామర్థ్యం చాలా తక్కువ. ఇక పనితీరు గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. పైగా మొదట ఆ డీల్ కుదుర్చుకుంది గత యూపీయే ప్రభుత్వం! వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని ఆ యుద్ధవిమానాల్ని కొనొద్దని మోదీకి విన్నవిస్తున్నా' అని అన్నారు. శనివారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఒకవేళ ఈ విషయంలో ప్రభుత్వ మొండిగా వ్యవహరిస్తే కోర్టును ఆశ్రయిస్తానన్నారు. ఒప్పంద పత్రాలు పరిశీలించిన అనంతరం ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేస్తానని చెప్పారు.