కేంద్రమంత్రి రవిశంకర ప్రసాద్
సాక్షి, న్యూఢిల్లీ: రాఫెల్ డీల్ తాజా వివాదంపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై కేంద్ర న్యాయశాఖమంత్రి రవిశంకర్ ప్రసాద్ ఘాటుగా స్పందించారు. స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఒక పార్టీ ప్రెసిడెంట్ దేశ ప్రధానమంత్రిపై ఇలాంటి పదాలను ఉపయోగించడం ఇంతకుముందెన్నడూ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు కాంగ్రెస్ కుటుంబ చరిత్ర తప్ప రాహుల్‌గాంధీకి ఎలాంటి అర్హత లేదని మండిపడ్డారు. రాహుల్ నుంచి ఇంతకంటే మనం ఏమీ ఆశించలేమంటూ ఎద్దేవా చేశారు. ఈ భాగస్వామ‍్యం డసాల్ట్ ఏవియేషన్‌కు, రిలయన్స్‌కు మధ్య జరిగిన డీల్ అని తేల్చి చెప్పారు. అలాగే ఒప్పందానికి సంబంధించి డసాల్ట్, రిలయన్స్ డిఫెన్స్ మధ్య స్పష్టమైన ఎంవోయూ ఉందని చెప్పారు. ఈ సందర్భంగా రాఫెల్ డీల్‌కు సంబంధించిన వివరాలను మీడియాకు వివరించారు.
రాహుల్ గాంధీ టీంకు పెద్ద భయం పట్టుకుందని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అవినీతికి పాల్పడ్డారన్న రాహుల్ వ్యాఖ్యలను ఆయన తిప్పికొట్టారు. అసలు కాంగ్రెస్ పార్టీనే అవినీతికి పుట్టిల్లు లాంటిదని మండిపడ్డారు. అనేక స్కాంల కారణంగా పలు కాంగ్రెస్ ముఖ్యమంత్రులు రాజీనామాలు చేశారని, మాజీ ప్రధాని మన‍్మోహన్ విచారణను ఎదుర్కోవాల్సి వచ్చిందన్నారు. దేశ ఆయుధ వ్యవస్థ గురించి సమాచారాన్ని వెల్లడించడం ద్వారా శత్రువులను అప్రమత్తం చేయాలని ఆయన కోరుకుంటున్నారంటూ దుయ్యబట్టారు. ఈ వివరాలను బహిర్గతం చేయడం ద్వారా పాకిస్తాన్‌తో చేతులు కలుపుతున్నారంటూ రాహుల్ గాంధీపై తీవ్ర విమర్శలు చేశారు.
మరోవైపు రాఫెల్ డీల్ పై వివాదం చెలరేగిన నేపథ్యంలో కేంద్రం స్పందించింది. రిలయన్స్ డిఫెన్స్ కంపెనీని భాగస్వామిగా ఎంపికచేయడంతో ప్రభుత్వ పాత్ర ఏదీ లేదని భారత రక్షణ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. మాజీ ఫ్రాన్స్ అధ్యక్షుడి మాటలపై అనవసర వివాదాలు సృష్టిస్తున్నారని వ్యాఖ్యానించింది. ఇది డసాల్ట్‌కు రిలయన్స్ డిఫెన్స్‌కు మధ్య జరిగిన వాణిజ్య ఒప్పందమని రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment